సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశ ప్రసార రంగం సంరక్షణ కోసం కృషి చేస్తున్న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ -- కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్

" సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పని చేస్తూ, సాంకేతికత అందిపుచ్చుకోవడానికి కృషి చేస్తున్న ప్రసారభారతి డిజిటల్ యుగంలో ప్రభావవంత ప్రసార మాధ్యమంగా కొనసాగుతోంది" -- కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్
"సమగ్ర డిజిటల్ వ్యవస్థ అభివృద్ధిలో కీలకమైన సమాచార గోప్యత, సున్నితమైన సమాచార భద్రత అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి -- శ్రీ ఠాకూర్
“అధిక-నాణ్యత, వ్యక్తిగతీకరించిన వివరాలకోసం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తదుపరి తరం ప్రసార రంగాలపై దృష్టి సారించాలి" -- కేంద్ర మంత్రి
పరిజ్ఞానం జ్ఞాన మార్పిడి, ఆలోచనలను ఇచ్చిపుచ్చుకోవడం, ప్రసార పరిశ్రమ భవిష్యత్తును రూపొందించే భాగస్వామ్యాలను పెంపొందించడం వంటి కీలక సహకారం కోసం బీఈఎస్ ఎక్స్‌పో సరైన వేదికగా పనిచేస్తుంది

Posted On: 15 FEB 2024 5:02PM by PIB Hyderabad

బ్రాడ్ కాస్ట్ అండ్ మీడియా టెక్నాలజీపై ఏర్పాటైన 28వ అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్ ను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించిన శ్రీ అనురాగ్ ఠాకూర్ భారతదేశ ప్రసార రంగం సంరక్షణ కోసం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందన్నారు. మార్పులకు అనుగుణంగా ప్రసార రంగంలో మార్పులు తీసుకు వస్తున్న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ విజ్ఞత, దూరదృష్టితో ముందుకు నడిపిస్తోందని అన్నారు. పబ్లిక్ సర్వీస్ బ్రాడ్ కాస్టింగ్ ను ప్రోత్సహించడంలో, సమ్మిళిత విధానాలను రూపొందించడంలో, అమలు చేయడం, మీడియా శిక్షణ కార్యక్రమాలు, ప్రసార, మీడియా రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం లాంటి కార్యక్రమాలు అమలు చేస్తున్న సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వైవిధ్య, సమాచారాత్మక, బాధ్యతాయుత విధానాలతో అచంచల నిబద్ధతతో భారతదేశంలో శక్తివంతమైన, సమ్మిళిత, స్థితిస్థాపక ప్రసార, మీడియా వ్యవస్థకు పునాది వేసిందన్నారు.

దేశ విభిన్న అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన ప్రసారాలు అందించడానికి పబ్లిక్ సర్వీస్ బ్రాడ్ కాస్టింగ్ ను బలోపేతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు, సాంస్కృతిక వారసత్వ విధానాలను గౌరవిస్తూ ప్రసార రంగంలో భారతదేశం ప్రత్యేకమైన పంధా అనుసరించాలని ఆయన సూచించారు. దేశ భవిష్యత్తును రూపొందించడంలో ప్రసార భారతి కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. "ఒకప్పుడు దూరదర్శన్ లో బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ మీద ప్రసారం అయిన కార్యక్రమాలు, ప్రస్తుతం అనలాగ్ నుంచి అభివృద్ధి చెంది 4కె డిజిటల్ హెచ్ డి లో ప్రసారం అవుతున్న కార్యక్రమాలు, మీడియం వేవ్ నుండి డిఆర్ఎం వరకు, ఆకాశవాణి యొక్క ఎఫ్ఎం, దూరదర్శన్, ఆకాశవాణి ప్రసారం చేసిన, చేస్తున్న వైవిధ్యమైన కార్యక్రమాలు తరతరాల భారతీయులకు సమాచారం అందించాయి, విద్యావంతులను చేశాయి, వినోదాన్ని అందించాయి. అనలాగ్ యుగం నుంచి నేటి డైనమిక్ డిజిటల్ విధానం వరకు ప్రసారకర్తలు స్థితిస్థాపకత, సృజనాత్మకత, నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చి అచంచలమైన నిబద్ధతతో గుర్తించిన మార్గంలో నడిచారు" అని శ్రీ ఠాకూర్ అన్నారు.

సాంకేతిక పురోగతి అవకాశాలు, సవాళ్లు రెండింటినీ అందిస్తుందని శ్రీ ఠాకూర్ తెలిపారు. అనేక ప్రసార మాధ్యమాలు అందుబాటులోకి రావడంతో అధిక-నాణ్యత, వ్యక్తిగతీకరించిన ప్రసారాలకు డిమాండ్ పెరిగిందని శ్రీ ఠాకూర్ అన్నారు. దీనికి అనుగుణంగా ఆధునిక తదుపరి తరం ప్రసార పరికరాల అభివృద్ధి అత్యంత అత్యవసరంగా మారిందన్నారు. స్వదేశీ పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసిన శ్రీ ఠాకూర్ శాస్త్రీయ ప్రతిభను పెంపొందించడానికి పరిశ్రమ, విద్యా రంగం కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రసార రంగంలో స్వావలంబన సాధించడానికి సరైన దిశలో ప్రయత్నాలు ప్రారంభించడానికి ఇదే సరైన సమయం అని మంత్రి పేర్కొన్నారు.

నూతన డైరెక్ట్ టు మొబైల్ (డీ2ఎం) సాంకేతిక పరిజ్ఞానం వల్ల టెలివిజన్ కు మాత్రమే కాకుండా హ్యాండ్ హెల్డ్ డివైజ్ లు- మొబైల్ ఫోన్లు, ప్యాడ్స్ మొదలైన వాటిపై ఎక్కడైనా, ఎప్పుడైనా, అది కూడా ఇంటర్నెట్ అవసరం లేకుండా అద్భుతమైన కార్యక్రమాలు చూడటానికి అవకాశం కలుగుతుందని మంత్రి వివరించారు.. నెక్ట్స్ జనరేషన్ బ్రాడ్ కాస్టింగ్ వంటి వినూత్నమైన బ్రాడ్ కాస్టింగ్ ఎంపికలను అన్వేషించి, అమలు చేయడానికి ప్రయత్నాలు జరగాలని మంత్రి సూచించారు. దీనివల్ల దేశంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు ప్రసార కార్యక్రమాలు అందుతాయని, నిరంతరం అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల అవసరాలు తీరుతాయని ఆయన అన్నారు.

సమాచార భద్రత ప్రాముఖ్యతను శ్రీ ఠాకూర్ వివరించారు. పెరుగుతున్న పరస్పర అనుసంధాన ప్రపంచంలో సమాచార గోప్యత , సున్నితమైన సమాచారం భద్రతను పరిరక్షించడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. సమాచార భద్రత, గోప్యతకు భారతదేశం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్వదేశీ సైబర్ సెక్యూరిటీ పరిష్కారాలు అభివృద్ధి చేయడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలు సమాచార భద్రతకు దేశం ఇస్తున్న ప్రాధాన్యతను నిదర్శనమని మంత్రి అన్నారు. బ్రాడ్ కాస్టింగ్ రంగంలో సృజనాత్మకతను ప్రోత్సహించడానికి సాంకేతిక పరిజ్ఞానం శక్తిని పూర్తిగా ఉపయోగించుకోవడానికి చర్యలు అమలు జరుగుతున్న సమయంలో సున్నితమైన సమాచార రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ డిజిటల్ మౌలిక సదుపాయాల సమగ్రతకు అవసరమైన చర్యలు అమలు జరగాలని శ్రీ ఠాకూర్ స్పష్టం చేశారు.

పర్యావరణం పట్ల మన బాధ్యతను గుర్తు చేసిన మంత్రి ప్రసార కార్యకలాపాల్లో సుస్థిర పద్ధతులు అవలంబించడం నైతిక అనివార్యం మాత్రమే కాదని, వ్యూహాత్మక అవసరం కూడా అని అన్నారు. కర్బన ఉద్గారాలు, వ్యర్థాలను తగ్గించడం ద్వారా భారతదేశం ఎబియు "గ్రీన్ బ్రాడ్ కాస్టింగ్" ప్రాజెక్ట్ వంటి ప్రపంచ కార్యక్రమాల అమలులో ముందుందని మంత్రి తెలిపారు. సౌరశక్తితో నడిచే ప్రసార పరికరాలు,తక్కువ ఇంధనం వినియోగించే స్టూడియోల అభివృద్ధి కోసం భారతదేశంలో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి అని తెలిపిన శ్రీ ఠాకూర్ ఈ కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణ పట్ల దేశం చూపిస్తున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.

మారుతున్న ప్రేక్షకుల అభిరుచితో ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు ఆదరణ పెరిగిందని శ్రీ ఠాకూర్ అన్నారు. వ్యక్తిగత ప్రసార కార్యక్రమాలకు పెరిగిన డిమాండ్ తో మీడియా రూపురేఖలు రూపాంతరం చెందుతున్నాయని పేర్కొన్న శ్రీ ఠాకూర్ ఈ మార్పును గుర్తించి ప్రసార రంగం తదనుగుణంగా మారాలని సూచించారు. పోటీ వాతావరణంలో కొనసాగడానికి కంటెంట్ సృష్టి వ్యూహాలు, తాజా సాంకేతిక స్వీకరణ , నియంత్రణ వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందాలి అని శ్రీ ఠాకూర్ స్పష్టం చేశారు.

ప్రసారం అవుతున్న కార్యక్రమాలపై నియంత్రణ ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, సామాజిక విలువలకు మధ్య సమతుల్యత సాధించడం అవసరమని అన్నారు. సహేతుకమైన పరిధిలో సృజనాత్మక వ్యక్తీకరణ వృద్ధి చెందే వాతావరణాన్ని ప్రోత్సహించి, బాధ్యతాయుతమైన, నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.

జ్ఞానం మరియు విజ్ఞానాన్ని పంచుకోవడం, ఆలోచనలను ఇచ్చిపుచ్చుకోవడం, బ్రాడ్ కాస్టింగ్ పరిశ్రమ భవిష్యత్తు నిర్దేశించే రూపొందించే భాగస్వామ్యాలను ఏర్పరచడం వంటి ఈ కీలకమైన సహకారానికి ఈ రోజు ప్రారంభమైన బిఇఎస్ ఎక్స్ పో సరైన వేదికగా పనిచేస్తుంది అన్న ఆశాభావాన్ని శ్రీ ఠాకూర్ వ్యక్తం చేశారు.

వినియోగదారుల ప్రయోజనాలు, మీడియా పారదర్శకతను పరిరక్షించడానికి మంత్రిత్వ శాఖకు కృషి చేస్తుందని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు అన్నారు. దీనిలో భాగంగా సంప్రదింపుల కోసం ఒక ముసాయిదా ప్రసార సేవల (నియంత్రణ) బిల్లు 2023 ను విడుదల చేశామని తెలిపారు.

టెలికమ్ రెగ్యులేటరీ ఆధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చైర్మన్ శ్రీ అనిల్ కుమార్ లహోటి మాట్లాడుతూ బ్రాడ్ కాస్టింగ్ రంగం వృద్ధికి విస్తారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది అని చెప్పారు.

మీడియా రంగంలో వస్తున్న; మార్పులను ప్రసార భారతి సిఇఒ శ్రీ గౌరవ్ ద్వివేది వివరించారు. ప్రస్తుతం మీడియా అనేక విధాలుగా ఉపయోగపడుతుంది ఆయన చెప్పారు. వీక్షకులకు ఇప్పుడు చాలా విస్తృతమైన ఎంపికలు అందుబాటులోకి వచ్చాయని దీంతో ప్రసార కార్యక్రమాల నాణ్యత పెరగక తప్పదని ఆయన స్పష్టం చేశారు. డీ2ఎం, టెరెస్ట్రియల్ ట్రాన్స్ మిషన్ అవసరాలను తీర్చడానికి పబ్లిక్ సర్వీస్ బ్రాడ్ కాస్టర్ కోసం స్పెక్ట్రమ్ ను సంరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బిఇఎస్ అధ్యక్షుడు శ్రీ సునీల్ తన స్వాగతోపన్యాసంలో డీ2ఎం వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం వల్ల మీడియా ఎదుర్కొంటున్న సవాళ్లు గురించి మాట్లాడారు.

 

***

 

 

 

 


(Release ID: 2006426) Visitor Counter : 137