రాష్ట్రప‌తి స‌చివాల‌యం

2024 గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి రాష్ట్రపతి గౌ|| శ్రీమతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగం తెలుగు అనువాదం

Posted On: 25 JAN 2024 7:42PM by PIB Hyderabad

నా ప్రియమైన సహ పౌరులారా
నమస్కారం.

 

75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. ఎన్నో ఆటంకాలు ప్రతికూల పరిస్థితులను అదిగమించి మనం ఎంత దూరం ప్రయాణించామో వెనక్కి తిరిగి చూసుకుంటే నా మనసు గర్వంతో నిండిపోతుంది. ఈ ప్రయాణంలో 75 వ గణతంత్ర దినోత్సవం నిజంగానే అనేక విధాలుగా ఒక చారిత్రాత్మకమైన మైలురాయి. మనం స్వాతంత్రం గడించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకున్నప్పుడు మన దేశ విశిష్ట ఔన్నత్యాన్ని, వైవిధ్యంతో కూడిన సంస్కృతిని ఏ విధంగా అయితే స్మరించుకున్నామో ఇది కూడా అటువంటి పండుగ సందర్భమే.

 

మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రేపటి రోజున పండుగలా జరుపుకుంటాము. రాజ్యాంగ పీఠిక ‘మనం, భారతీయులం’ అనే పదాలతో ప్రారంభమై ఆ పత్రంలో ఉన్న ఇతివృత్తాన్ని అంటే ప్రజాస్వామ్యాన్ని ప్రముఖంగా ఎత్తి చూపుతుంది. పాశ్చాత్య ప్రజాస్వామ్యం అనే యోచన కంటే భారత్ లో ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతగానో ప్రాచీనమైనది అందువల్లే భారత్ ను ప్రజాస్వామ్యానికి మాతృదేశంగా పిలుస్తారు.

 

సుదీర్ఘ సంక్లిష్ట పోరాటం అనంతరం 1947 ఆగస్టు 15వ తేదీన భారత్ విదేశీ పాలన నుంచి విముక్తమైంది.  అయినప్పటికీ ఈ దేశాన్ని పాలించేందుకు అవసరమైన సూత్రాల రూపకల్పన దేశ శక్తియుక్తులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం అనేది అప్పటికి ఇంకా కొనసాగుతోంది. పాలనలో అన్ని అంశాల గురించి సవివరంగా దాదాపూ మూడేళ్ల పాటు రాజ్యాంగ పరిషత్ సభ చర్చించింది మన జాతికి అత్యంత గొప్ప మౌలిక పత్రాన్ని, భారత రాజ్యాంగాన్ని, ఆ మూడేళ్ల చర్చల ఫలస్వరూపంగా రూపొందించారు. ఈనాడు మన దేశం కృతజ్ఞతతో ఆనాటి నాయకులను మన స్ఫూర్తిదాయకమైన అద్భుతమైన రాజ్యాంగాన్ని రూపొందించడంలో తమ వంతు పాత్ర పోషించిన అధికారులను గుర్తు చేసుకుంటోంది.

 

మన స్వాతంత్ర్య శతాబ్ది వైపుగా సాగుతున్న అమృతకాలంలో ప్రారంభ వత్సరాలను దేశం ఇప్పుడు జరుపుకుంటోంది. ఇది ఐతిహాసికమైన పరివర్తనలకు సమయం. మన దేశాన్ని కొత్త శిఖరాలు అధిరోహించేలా ముందుకు తీసుకువెళ్లేందుకు ఒక సువర్ణవకాశం లభించింది. మన లక్ష్యాలను చేరుకునేందుకు ప్రతి ఒక్క పౌరుడి వైపు నుంచి కృషి అందడం ఎంతో కీలకం. అందువల్ల మన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక బాధ్యతలకు కట్టుబడాలని నేను నా సహ పౌరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. భారత్ ను స్వాతంత్ర శతాబ్ది నాటికి అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దడంలో ప్రతి పౌరుడు అనుసరించవలసిన తప్పనిసరి అయిన బాధ్యతలు ఇవి. “కేవలం హక్కుల గురించే ఆలోచించిన ప్రజలెవ్వరూ కూడా ఉన్నతి సాధించలేరు. బాధ్యతలను గుర్తించిన వారు మాత్రమే సాధించగలిగారు అని మహాత్మా గాంధీ ఎంతో స్పష్టంగా చెప్పారు.

 

నా ప్రియమైన సహపౌరులారా.

మన మౌలిక విలువలు సిద్ధాంతాలను గుర్తు చేసుకునేందుకు గణతంత్ర దినోత్సవం ఒక సందర్భం. వాటిల్లో ఏ ఒక్క విలువ, సూత్రం గురించి అయినా మనం ఆలోచించినప్పుడు, మిగిలిన వాటి వైపు మనకు సహజంగానే మార్గదర్శకత్వం లభిస్తుంది. ప్రజాస్వామ్యం అంటే సంస్కృతి విశ్వాసాలు పద్ధతుల్లో వైవిధ్యం, వైవిధ్యం గురించి మనం ఆలోచించడం అనుసరించడం అంటే సమానత్వం సాదిస్తున్నామని అర్థం. సమానత్వానికి న్యాయం ప్రాతిపదిక. స్వేచ్ఛ వీటన్నిటిని కూడా సుసాధ్యం చేస్తుంది. ఈ విలువలు సిద్ధాంతాలు సూత్రాల సంపూర్ణ సమగ్ర స్వరూపమే మనను భారతీయులను చేస్తోంది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గొప్ప వివేకంతో మార్గం చూపగా, రాజ్యాంగ స్ఫూర్తితో ఈ విలువలు సూత్రాలు పునాదిగా మనం సామాజిక న్యాయ పథంలో అనివార్యంగా ముందుకు సాగి అన్ని రకాల వివక్షను అంతం చేస్తున్నాము.

 

సామాజిక న్యాయం కోసం అవిశ్రాంతంగా పనిచేసిన మహానుభావుడు కర్పూరి ఠాకూర్ జీ శత జయంతి ఉత్సవం నిన్న ముగిసిందని నేను గుర్తు చేయదల్చుకున్నాను కర్పూరి జి వెనుకబడిన తరగతుల ప్రజల హక్కులను పరిరక్షించిన అతి గొప్ప నాయకుల్లో ఒకరు. వారి సంక్షేమం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన జీవితమే ఒక సందేశం. తన కృషి ద్వారా ప్రజా జీవనాన్ని సుసంపన్నం చేసినందుకు కర్పూరి ఠాకూర్ జీకి నేను నా నివాళి అర్పిస్తున్నాను.

 

మన గణతంత్ర సారం నూట నలభై కోట్ల మంది ఒక కుటుంబంగా నివసించేందుకు దోహదం చేస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కుటుంబానికి సహజీవనమంటే కేవలం సరిహద్దులకు భౌగోళికతకూ సంబంధించిన విషయమే కాదు.  అది మన సంతోషానికి మూలం. మన గణతంత్ర వేడుకల్లో ఇదే ఆనందం, అనుభూతి అభివ్యక్తం అవుతుంది.

 

ఈవారం ప్రారంభంలో మనం అయోధ్యలో రామ జన్మభూమిలో నిర్మించిన వైభవోపేతమైన భవ్య రామాలయంలో శ్రీరామచంద్ర ప్రతిష్ట చారిత్రాత్మక కార్యక్రమాన్ని తిలకించాము. విశాల దృక్పథంతో చూసినప్పుడు ఈ కార్యక్రమాన్ని భారత్ తన నాగరికత వారసత్వాన్ని పునర్ అన్వేషించడంలో జరిపిన ప్రస్థానంలో ఒక మైలురాయిగా భవిష్యత్తులో చరిత్రకారులు పరిగణిస్తారు. ఆలయ నిర్మాణం చట్టబద్ధమైన ప్రక్రియ తర్వాత దేశంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన అనంతరం ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. ఈనాడు అది ఒక గొప్ప సౌధంగా నిలబడి ప్రజల విశ్వాసానికి ఒక ప్రతీకగానే కాక న్యాయ ప్రక్రియ పట్ల ప్రజలకు ఉన్న అపారమైన విశ్వాసానికి రుజువుగా కూడా నిలబడి ఉంది.

 

నా ప్రియమైన సహపౌరులారా,

 

మన జాతీయ పండుగలు వెనక్కి తిరిగి చూసుకునేందుకు, భవిష్యదభిముఖంగా దృష్టి సారించేందుకూ ముఖ్యమైన సందర్భాలు. గత గణతంత్ర దినోత్సవం నాటి నుంచి గడిచిన ఏడాదిని చూసుకుంటే మనం సంతోషించదగ్గ విషయాలు ఎన్నో ఉన్నాయి. దేశ రాజధానిలో జి 20 కూటమి సమావేశాలను విజయవంతంగా మన అధ్యక్ష బాధ్యతలో నిర్వహించడం మునుపెన్నడూ లేని స్థాయిలో సాధించిన విజయం. జి 20 కార్యక్రమాల్లో ప్రజలు పాలుపంచుకోవడం అనేది ముఖ్యంగా గమనించదగ్గ విషయం. ఆలోచనలు సలహాలు సూచనలు పైనుంచి కిందకే కాదు కింద నుంచి అట్టడుగు స్థాయి నుంచి పైకి కూడా ప్రయాణించాయి. ఈ మహాద్భుతమైన కార్యక్రమం పౌరులను వ్యూహాత్మక దౌత్య వ్యవహారాల్లో భాగస్వాములు చేయాలి అన్న విలువైన పాఠాన్ని మనకి నేర్పించింది. ఈ వ్యవహారాలు వారి భవిష్యత్తునే తీర్చి దిద్దే అంశాలు కనుక వారికి కూడా వీటిలో పాలుపంచుకునేందుకు అవకాశం ఇవ్వాలి.  ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రతినిధిగా భారత్ ఆవిర్భవించడానికి, అంతర్జాతీయంగా జరిగే చర్చకు అత్యవసరమైన ఒక గళాన్ని చేర్చేందుకు ఈ జి 20 శిఖరాగ్ర సదస్సు తోడ్పడింది.

 

చారిత్రాత్మకమైన మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఆమోదించడంతో స్త్రీ పురుష సమానత్వం అనే ఆదర్శం దిశలో మనం మరింతగా ముందుకి సాగాము. నారీ శక్తి వందన అధినియం మహిళా సాధికారతకు ఒక విప్లవాతకమైన కొత్త ఉపకరణాన్ని అందించనుంది. మన పరిపాలన ప్రక్రియలను మెరుగుపరచడంలో కూడా అది ఎంతగానో తోడ్పడుతుంది. సమిష్టి ప్రాముఖ్యత గల వ్యవహారాల్లో మరింత మంది మహిళలకు పాత్ర కల్పించినప్పుడు ప్రజల అవసరాలకు అనుగుణంగా మన పరిపాలన ప్రాధాన్యతలు కూడా రూపుదిద్దుకుంటాయి.

 

గత సంవత్సరం భారత్ చంద్రుడి పైకి ఏగిన సంవత్సరం కూడా. చంద్ర గ్రహం దక్షిణ ధ్రువ ప్రాంతంలో తొలిసారిగా మన దేశం అడుగుపెట్టింది. చంద్రయాన్ 3 మిషన్ సాధించిన అనంతరం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సౌర మిషన్లు కూడా చేపట్టింది. ఇటీవల ఆదిత్య ఎల్ వన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ఉంచారు. మొదటి ఎక్స్ రే పోలారి మీటర్ ఉపగ్రహం ఎక్స్పోజ్ శాట్ ప్రయోగంతో మనం కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాము.  అంతరిక్షంలో బ్లాక్ హోల్స్ వంటి అనుహ్యమైన అద్భుతమైన విషయాలను ఈ ఉపగ్రహం అధ్యయనం చేస్తుంది.  ప్రస్తుత సంవత్సరంలో మరిన్ని అంతరిక్ష మిషన్లను కూడా చేపట్టనున్నారు. భారత అంతరిక్ష ప్రయాణం మరిన్ని కొత్త మైలురాళ్లు దాటుతుందని చెప్పేందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. మొదటిసారి మనిషిని అంతరిక్షంలోకి పంపే గగన్ యాన్ మిషన్ కి ఏర్పాట్లు కూడా నిరాటంకంగా సాగుతున్నాయి. మన శాస్త్రవేత్తలు మన సాంకేతిక పరిజ్ఞాన నిపుణుల పట్ల మనకి ఎప్పుడూ గర్వం ఉన్నప్పటికీ వారు ఇప్పుడు మరింత ఎత్తైన శిఖరాలను అధిరోహించి మరిన్ని కొత్త సవాళ్లను ఎదుర్కోవడంలో విజయం సాధిస్తున్నారు. భారత అంతరిక్ష కార్యక్రమం మానవాళి యావత్తుకు ప్రయోజనం కలిగించడంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పాత్రను మరింతగా విస్తరించి, ఇనుమడింపచేస్తోంది ఇస్రో చేపట్టే కార్యక్రమాల పట్ల మనదేశంలో కనబడే ఆసక్తి ఉత్సాహం ఎంతో స్ఫూర్తిని కలిగిస్తాయి. ఈ రంగంలో సాధిస్తున్న కొత్త విజయాలు యువతరాల కల్పనా శక్తికి కూడా ఇంధనం సమకూర్చాయి. మరింత మంది పిల్లలు శాస్త్రవిజ్ఞానం పట్ల ఆసక్తి కనబరచి  శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుంటారని నేను భావిస్తున్నాను మరింత మంది యువజనులు ముఖ్యంగా యువతులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన రంగంలో తమ వృత్తిని ఎంచుకుంటారని కూడా నాకు అనిపిస్తోంది.

 

నా ప్రియమైన సహపౌరులారా,

 

భారత్ విశ్వాసంతో ముందుకి సాగుతోంది. ఇది మన అర్థ వ్యవస్థ పటిష్టత నుంచి రావడమే కాక మన ఆర్థిక వ్యవస్థ సాదిస్తున్న ప్రగతిలో కూడా ప్రతిఫలిస్తోంది. ఇటీవల కాలంలో ప్రధాన అర్థ వ్యవస్థల్లో చూస్తే మన స్థూల జాతియోత్పత్తి పెరుగుదల రేటు అత్యధికంగా కొనసాగుతోంది. ఈ అసాధారణమైన ప్రదర్శన ఈ 2024లోనూ ఆ తర్వాత కూడా కొనసాగుతుంది అనడానికి అన్ని కారణాలు ఉన్నాయి. మన అర్థవ్యవస్థకు ఊపునిచ్చే ప్రణాళిక పటిమ మన సంక్షేమ చర్యలకు కూడా ఊతం ఇచ్చి మన అభివృద్ధిని అన్ని విధాలా సమ్మిళితం చేస్తోంది. సమాజంలో బలహీన వర్గాలకు కరోనా మహమ్మారి కాలంలో ఉచితంగా ఆహారం అందించేందుకు ప్రభుత్వం వివిధ పథకాల విస్తృతిని, పరిధిని పెంచింది. అవే చర్యలను ఆ తర్వాత కూడా కొనసాగించి సంక్షోభంలో నుంచి పూర్తిగా బయటకు వచ్చేందుకు ప్రత్యేకంగా బలహీన వర్గాల జనాభాకు చేయూతనిచ్చారు. ఆ పథకం పరిధిని విస్తృతం చేయడం ద్వారా ప్రభుత్వం ఐదేళ్లపాటు 81 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇది చరిత్రలోనే అతిపెద్ద సంక్షేమ చర్య అని చెప్పవచ్చు.

 

అంతేకాకుండా పౌరులందరికీ జీవన సౌలభ్యాన్ని పెంచేందుకు మిషన్ పద్ధతిలో అమలు చేస్తున్న అనేక పథకాలు కూడా ఉన్నాయి. ఇంట్లోనే సురక్షితమైన మంచినీరు తగు మొత్తంలో అందుబాటులో ఉంచడంతోపాటు ఎవరికి వారికి సొంత ఇల్లు సౌకర్యం కల్పించడంతో సహా, ఇవన్నీ కూడా కనీస అవసరాలు తీర్చేవే కానీ విలాసవంతమైన విశేష సౌకర్యాలు కల్పించేవి కావు. ఈ విషయాలు రాజకీయ ఆర్థిక సిద్ధాంతాలను దాటి కేవలం మానవతా దృక్పథంతో పరిగణించవలసినవి. ప్రభుత్వం సంక్షేమ పథకాలను విస్తరించడం కాదు సంక్షేమం అనే ఆలోచననే పునర్ నిర్వచించింది. ప్రజలు నిర్వాసితులుగా, ఇళ్ళు లేని వారీగా ఉండడం అనేది అత్యంత అరుదైన విషయంగా ఉండే అతి కొద్ది దేశాల సరసన భారత నిలబడ్డప్పుడు మనందరికీ కూడా ఎంతగానో ఆనందం కలుగుతుంది. అదేవిధంగా జాతీయ విద్యా విధానం డిజిటల్ వ్యత్యాసాలను పూడ్చి బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల ప్రయోజనార్థం ఒకే విధమైన విద్యా వ్యవస్థను కల్పించనుంది. ఆయుష్మాన్ భారత్ పథకంలో విస్తరిస్తున్న భీమా వల్ల లబ్ధిదారులందరూ ఒకే పథకం పరిధిలోకి వచ్చి పేదలకు అణగారిన వర్గాలకు కొత్తగా ఒక భద్రత భావం కలగనుంది.

 

మన క్రీడాకారులు అంతర్జాతీయ వేదికపై భారత ప్రతిష్టను ఎంతగానో ఇనుమడింపజేశారు గత ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో మనం రికార్డ్ స్థాయిలో 107 పతకాలు గెలుచుకుని చరిత్ర సృష్టించాము. Asian para గేమ్స్ లో మన క్రీడాకారులు 111 పతకాలు గెలుచుకున్నారు. మన పతకాల పట్టికలో మహిళ విజేతలు అనేకమంది ఉండడం కూడా ఎంతో హర్షనీయమైన విషయం. మన క్రీడాకారులు వివిధ క్రీడలు ఆటలు చేపట్టేలాగా పిల్లలకి స్ఫూర్తినిచ్చి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. మన క్రీడాకారులు ఈ కొత్త విశ్వాసంతో రానున్న ప్యారిస్ ఒలింపిక్స్ లో కూడా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారని నాకు విశ్వాసం ఉంది.

ప్రియమైన సహపౌరులారా,  

ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల సంఘర్షణలు తలెత్తాయి. అనేక ప్రాంతాల్లో తీవ్రమైన హింసాకాండ కూడా జరుగుతోంది. ఘర్షణ పడుతున్న రెండు పక్షాలు కూడా తాను చెప్పేది సరైనదని అవతలిపక్షం తప్పు అని అనుకున్నప్పుడు హేతుబద్ధంగా ఒక పరిష్కారం కనుగొనడం సరైన మార్గం. దురదృష్టవశాత్తూ  హేతుబద్ధంగా కాకుండా భయాలు అపోహలతో ఆవేశ కావేషాలు పెరిగి విరామం లేని హింస కొనసాగుతోంది. భారీ స్థాయిలో అనేక చోట్ల మానవతాపరమైన విషాద సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మనుషులు ఈ విధంగా పడుతున్న హింస క్షోభ చూస్తే ఎంతగానో విచారం కలుగుతుంది.  ఇటువంటి సమయాల్లో మనం గౌతమ బుద్ధుడి చెప్పిన విషయం గుర్తు చేసుకోవాలి.
 

ఏనాడు కూడా శత్రుత్వాన్ని శత్రుత్వంతో చల్లార్చలేము. మిత్రతతో మాత్రమే ఇది సాక్ష్యం. ఇదే అనంత సత్యం. అన్నారు గౌతమబుద్ధుడు.

 

వర్ధమాన మహావీరుడు అశోక్ సామ్రాట్ నుంచి జాతిపిత మహాత్మా గాంధీ వరకు అహింస అనేది కేవలం ఒక ఆదర్శం, కష్టతరమైన ఒక లక్ష్యం కాదని ఇది ఆచరణాత్మకమైన ఒక అవకాశం అని భారత్ రుజువు చేసింది.  నిజానికి అనేకమందికి ఇది అనుసరణీయమైన ఒక వాస్తవమైన జీవిత సత్యం. సంఘర్షణలో మునిగి ఉన్న ప్రాంతాలన్నీ కూడా తమ ఘర్షణలు రూపుమాపుకునేందుకు శాంతియుతమైన మార్గాలు కనుగొంటారని ఆశిద్దాం.

 

భారత్లో ఉన్న ప్రాచీనమైన విజ్నానం, వివేచనలు పర్యావరణ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రపంచానికి మార్గాలు సూచించగలవు. పునర్వినియోగ ఇంధన వనరులను పెంపొందించడంలో భారత్ అగ్రగామిగా నిలవడం భౌగోళిక వాతావరణ చర్యల విషయంలో నాయకత్వ పాత్ర పోషించడం నాకు ఎంతగానో సంతోషం కలిగిస్తున్నాయి. పర్యావరణం పట్ల ఒక సహానుభూతి కలిగిన జీవనశైలి పాటించేందుకు లైఫ్ మూవ్మెంట్ను మన దేశం ప్రారంభించింది వ్యక్తిగతంగా ప్రవర్తనలో మార్పు రావాలని వాతావరణంలో మార్పులను ఎదుర్కొనేటప్పుడు వ్యక్తిగత నడవడిక ముఖ్యమని మన దేశం చెపుతున్న విషయాన్ని ప్రపంచ సమాజం కూడా గుర్తించి ఆదరించింది ప్రతి చోటా ప్రజలు తమ జీవనశైలిని ప్రకృతికి అనుగుణంగా మార్చుకోవాలి దీనివల్ల రానున్న తరాల కోసం భూగ్రహాన్ని కాపాడటమే కాదు అందరి జీవన నాణ్యత కూడా పెరుగుతుంది.

ప్రియమైన సహపౌరులారా,

అమృతకాలంలో మునుపెన్నడూ లేని స్థాయిలో సాంకేతిక పరమైన మార్పులు రానున్నాయి కృత్రిమ మేధస్సు మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతిక ప్రగతి... వార్తాపత్రికల్లో వచ్చే హెడ్ లైన్స్ నుంచి అనూహ్యంగా మన రోజువారి జీవితంలోకి ప్రవేశించాయి. సమీప భవిష్యత్తులో ఇందుకు సంబంధించిన అనేక పరిస్థితులు కొంత ఆందోళన కలిగించవచ్చు. అయినా ఎంతో ఉత్సాహం కలిగించే అవకాశాలు ముఖ్యంగా యువజనులకు అవకాశాలు ముందున్నాయి. వారు కొత్త రంగాలను అన్వేషిస్తూ ఉన్నారు. వారి మార్గంలో ఉన్న ఆటంకాలను తొలగించేందుకు మనం అన్ని చర్యలు తీసుకుని వారు పూర్తీ స్థాయిలో తమ శక్తి సామర్థ్యాలను వినియోగించేలాగా చూడాలి అవకాశాల్లో సమానత్వం అనేది వారికి మనం అందించాలి. సమానత్వం గురించిన పాత చింతకాయ ఆలోచనలు భావాలు నినాదాలు కాదు, వారి దృక్పథంలో, వారి ఆలోచనలో ఉండే అత్యంత విలువైన సమానత్వ ఆదర్శం సాకారం కావడం ముఖ్యం.

 

ఎందుకంటే వారి విశ్వాసమే రేపటి భవిష్యత్తులో భారత్ ను నిర్మిస్తుంది. యువజనుల మస్తిష్కం ఆలోచనలను ఉపాధ్యాయులే తీర్చిదిద్దుతారు. వారే దేశ భవిష్యత్తుకు నిజమైన వాస్తు శిల్పులు. మన దేశ ప్రగతి కోసం నిశ్శబ్దంగా శ్రమించి, దేశం మెరుగైన భవిష్యత్తు కోసం తమ వంతు కృషి చేసే రైతులు కార్మికులకు కూడా నేను కృతజ్ఞతతో నివాళి అర్పిస్తున్నాను. రేపు గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా నేను సాయుధ దళాలు, పోలీస్, అనుబంధ సైనిక దళాల సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. వారి సాహసం, సర్వదా ఉండే నిఘా వల్ల మాత్రమే మన దేశం గొప్ప శిఖరాలని అధిరోహించగలిగింది.

చివరిగా నేను న్యాయ వ్యవస్థ సివిల్ సర్వీసెస్ వారికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వివిధ దేశాలలో భారత రాయబార కార్యాలయాల్లో ఉన్నవారికి భారతీయ సంతతికి చెందిన వారికి కూడా నా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.  దేశ సేవలో మనమందరం పునరంకితమవుదాం. మన సహపౌరుల సంక్షేమం కోసం అన్ని విధాల మనం అంకితం కావాలి. ఈ గొప్ప కార్యంలో మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.  

ధన్యవాదాలు

జైహింద్ జై భారత్.

 

****



(Release ID: 1999694) Visitor Counter : 665