ప్రధాన మంత్రి కార్యాలయం
కాశీ తమిళ సంగమం-2023ను ప్రారంభించిన ప్రధానమంత్రి
బ్రెయిలీ లిపిసహా వివిధ భాషల్లో తిరుక్కురళ్, మణిమేకలై
తదితర ప్రాచీన తమిళ సాహిత్య అనువాదాల ఆవిష్కరణ;
కన్యాకుమారి-వారణాసి రైలును జండా ఊపి ప్రారంభించిన ప్రధాని;
‘‘కాశీ తమిళ సంగమంతో ‘ఒకే భారతం-శ్రేష్ట భారతం’ స్ఫూర్తి మరింత విస్తరిస్తుంది’;
‘‘కాశీ-తమిళనాడు సంబంధాలు సృజనాత్మకం.. భావోద్వేగ సమన్వితం’’:
‘‘ఒక దేశంగా భారత్ గుర్తింపునకు ఆధ్యాత్మిక విశ్వాసాలే మూలాలు’’;
‘‘ఉమ్మడి వారసత్వంతో మన సంబంధాల ప్రాచీనత.. సద్భావనలు ప్రస్ఫుటం’’
Posted On:
17 DEC 2023 8:11PM by PIB Hyderabad
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ తమిళ సంగమం-2023ను ప్రారంభించారు. అలాగే కన్యాకుమారి-వారణాసి తమిళ సంగమం రైలును ఆయన జండా ఊపి సాగనంపారు. అంతేకాకుండా బ్రెయిలీ లిపిసహా వివిధ భాషల్లో తిరుక్కురళ్, మణిమేకలై తదితర ప్రాచీన తమిళ సాహిత్య అనువాద ప్రతులను ఆవిష్కరించారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను పరిశీలించి, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. తమిళనాడు, కాశీ నగరాల మధ్యగల ప్రాచీన సంబంధాలను స్మరించుకోవడం, వేడుకల ద్వారా పునరుద్ఘాటించడం, పునరాన్వేషణ చేయడం వంటి లక్ష్యాలతో కాశీ తమిళ సంగమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు నగరాలూ దేశంలో అత్యంత కీలక, పురాతన విజ్ఞాన నిలయాలని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమాల తర్వాత బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరినీ అతిథులుగా కాకుండా తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ స్వాగతం పలుకుతున్నానని పేర్కొన్నారు. తమిళనాడు నుంచి కాశీ నగరానికి రావడమంటే మహాదేవుని ఆవాసాల్లో ఒకటైన మధుర మీనాక్షి నిలయం నుంచి కాశీ విశాలాక్షి పాదపద్మాల వద్దకు ప్రయాణించడమేనని ఆయన అభివర్ణించారు. తమిళనాడు-కాశీ ప్రజల మధ్యగల సంబంధాల్లోని అద్వితీయ ప్రేమానురాగాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. కాశీ పౌరుల ఆతిథ్యంపై అపార నమ్మకం ప్రకటించారు. ఈ వేడుకలకు వచ్చినవారు భగవాన్ మహాదేవుని ఆశీర్వాదంతోపాటు కాశీ సంస్కృతి, రుచికరమైన వంటకాలు, జ్ఞాపకాలతో తమిళనాడుకు తిరిగి వెళ్తారని ప్రధాని ఉద్ఘాటించారు. కృత్రిమ మేధ (ఎఐ) పరిజ్ఞానంతో తన ప్రసంగాన్ని తొలిసారి తక్షణం తమిళంలోకి అనువదించడాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- భవిష్యత్తులోనూ ఈ పరిజ్ఞాన వినియోగం ఎంతగా విస్తరిస్తుందో ఒకసారి ఊహించుకోవాలని సూచించారు.
ఇక్కడి కార్యక్రమాల్లో భాగంగా కన్యాకుమారి-వారణాసి తమిళ సంగమం రైలును ప్రధానమంత్రి జండా ఊపి ప్రారంభించారు. అలాగే బ్రెయిలీ లిపిసహా వివిధ భాషల్లో తమిళ ప్రాచీన సాహిత్యంలోని తిరుక్కురళ్, మణిమేకలై తదితర కావ్యాల అనువాదాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతిని ఉటంకిస్తూ- కాశీ-తమిళ సంగమం ప్రతిధ్వనులు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచమంతటా వినిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
నిరుడు కాశీ తమిళ సంగమం ప్రారంభించాక వివిధ మఠాల అధిపతులు, విద్యార్థులు, కళాకారులు, రచయితలు, హస్తకళాకారులు-వృత్తినిపుణులు సహా లక్షలాది ప్రజలు ఇందులో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. పరస్పర సంభాషణ, అభిప్రాయాలు, ఆలోచనల ఆదాన ప్రదానానికి ఇదొక ప్రభావశీల వేదికని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ వేడుకలకు సంబంధించి బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఐఐటి-చెన్నై సంయుక్తంగా చేపట్టిన వినూత్న కార్యక్రమాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘విద్యాశక్తి’ కార్యక్రమం కింద వారణాసిలోని వేలాది విద్యార్థులకు శాస్త్రవిజ్ఞానం, గణితంలో ఐఐటి-చెన్నై ఆన్‌లైన్ తోడ్పాటునిస్తున్నదని చెప్పారు. ఇటీవలి ఈ పరిణామాలన్నీ కాశీ, తమిళనాడు ప్రజల మధ్యగల భావోద్వేగ సమన్విత, సృజనాత్మక బంధానికి ప్రతీకలని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
‘‘కాశీ తమిళ సంగమంతో ‘ఒకే భారతం-శ్రేష్ట భారతం’ స్ఫూర్తి మరింత విస్తరిస్తుంది’’ అని ప్రధానమంత్రి చెప్పారు. కాశీ తెలుగు సంగమం, సౌరాష్ట్ర కాశీ సంగమం నిర్వహణలోనూ ఇదే స్ఫూర్తి ప్రస్ఫుటం అవుతుందని వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని రాజ్‌భవన్‌లలో ఇతర రాష్ట్రావిర్భావ దినోత్సవాల నిర్వహణ ద్వారా వినూత్న సంప్రదాయంతో ‘ఒకే భారతం-శ్రేష్ట భారతం’ స్ఫూర్తి మరింత బలపడిందని చెప్పారు. ఇదే స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ‘ఆధీనం’ మఠానికి చెందిన సాధువుల పర్యవేక్షణలో కొత్త పార్లమెంట్ భవనంలో పవిత్ర సెంగోల్ ప్రతిష్టాపన గురించి ప్రధాని మోదీ గుర్తుచేశారు. ‘ఇవాళ మన జాతి ఆత్మను చైతన్యంతో నింపుతున్నది ‘ఒకే భారతం-శ్రేష్ట భారతం’ స్ఫూర్తి మాత్రమే’’ అని ఆయన అన్నారు.
భారతదేశ వైవిధ్యంలో అణువణువునా ఆధ్యాత్మిక చైతన్యం ఉట్టిపడుతుందని ప్రధానమంత్రి అన్నారు. దేశంలో ప్రతి ప్రవాహం గంగా జలమేనని, ప్రతి భౌగోళిక ప్రదేశం కాశీ నగరమేనని చాటిన ప్రసిద్ధ పాండ్యవంశజుడైన పరాక్రమ పాండియన్ వ్యాఖ్యానించడాన్ని ప్రధాని ఉటంకించారు. ఉత్తర భారతంలోని విశ్వాస కేంద్రాలు ఒకనాడు నిరంతరం విదేశీ శక్తుల దాడుల బారినపడుతున్న వేళ తెన్‌కాశీ, శివకాశి ఆలయాల నిర్మాణంతో కాశీ నగర వారసత్వాన్ని సజీవంగా నిలిపేందుకు పరాక్రమ పాండియన్ ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. భారత వైవిధ్యంపై జి-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న పలువురు దేశాధినేతలు అమితాసక్తి ప్రదర్శించడాన్ని శ్రీ మోదీ గుర్తుచేశారు.
ప్రపంచంలోని ఇతర దేశాలు రాజకీయపరంగా నిర్వచించబడగా, భారతదేశం మాత్రం ఆధ్యాత్మిక విశ్వాసాల నుంచి నిర్మితమైనదిగా నిర్వచించబడిందని ప్రధాని అన్నారు. ఆదిశంకరాచార్యులు, రామానుజుడు వంటి సాధువులు భారతదేశాన్ని ఏకతాటిపైకి తెచ్చారని ప్రధాని మోదీ నివాళి అర్పించారు. ఈ దిశగా శివస్థానాలకు ఆధీనం మఠం నుంచి సాధువుల యాత్ర పోషించిన పాత్రను కూడా ప్రధాని గుర్తుచేసుకున్నారు. ‘‘ఈ యాత్రల వల్ల భారత అస్తిత్వం శాశ్వతంగా-అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నది’’ అని శ్రీ మోదీ తెలిపారు.
తమిళనాడు నుంచి కాశీ, ప్రయాగ, అయోధ్య తదిరత పుణ్యక్షేత్రాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు, యువతరం ప్రయాణాన్ని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ప్రాచీన సంప్రదాయాలపై దేశ యువతరంలో ఆసక్తిపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘రామేశ్వరానికి రూపమిచ్చిన శ్రీరాముడిని అయోధ్యలో దర్శించుకోవడం ఎంతో దివ్యమైన అనుభవం కాగలదు’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. కాశీ తమిళ సంగమానికి హాజరయ్యే వారంతా అయోధ్యను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
దేశంలోని ప్రజలంతా ఇతరుల సంస్కృతిని పరస్పరం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉందని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఇది విశ్వాసాన్ని పెంచి, అనుబంధాన్ని ఇనుమడింపజేస్తుందని తెలిపారు. గొప్ప ఆలయ నగరాలైన కాశీ, మదురైలను ఉదాహరిస్తూ- తమిళ సాహిత్యం వాగై, గంగై (గంగ) రెండింటి గురించీ మాట్లాడుతుందని శ్రీ మోదీ అన్నారు. ‘‘ఈ వారసత్వం గురించి తెలుసుకున్నప్పుడు మన సంబంధాల్లోని ప్రాచీనత మన హృదయాలను తాకుతుంది’’ అని ఆయన అన్నారు.
కాశీ-తమిళ సంగమం భారత వారసత్వాన్ని బలోపేతం చేస్తూ ‘ఒకే భారతం-శ్రేష్ఠ భారతం’ స్ఫూర్తిని మరింత విస్తరింపజేస్తుందని ప్రధాని మోదీ ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. చివరగా- కాశీని సందర్శించే వారంతా ఆహ్లాదకర అనుభవాలతో తిరుగు ప్రయాణం కావాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ప్రముఖ గాయకుడు శ్రీరామ్ తన ప్రదర్శనతో యావత్ ప్రేక్షకలోకాన్ని సమ్మోహితం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని తన ప్రసంగం ముగించారు.
ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర సహాయమంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ తదితరులు పాల్గొన్నారు.
***
DS/TS
(Release ID: 1987730)
Visitor Counter : 84
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam