ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో స్వర్వేద్ మహామందిర్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి


"కాశీ పునరుజ్జీవనానికి ప్రభుత్వం, సమాజం, సంత్ సమాజం అందరూ కలిసి పనిచేస్తున్నారు"

"స్వర్వేద్ మహామందిర్ భారతదేశ సామాజిక, ఆధ్యాత్మిక బలానికి ఆధునిక చిహ్నం"

"భారతదేశ ఆర్కిటెక్చర్, సైన్స్, యోగా ఆధ్యాత్మిక నిర్మాణాల చుట్టూ అనూహ్యమైన ఎత్తుకు చేరుకున్నాయి"

"ఈ రోజు కాల చక్రాలు మళ్లీ మారాయి, భారత్ తన వారసత్వం గురించి గర్విస్తోంది,బానిస మనస్తత్వం నుండి స్వేచ్ఛను ప్రకటిస్తోంది"

"ఇప్పుడు బనారస్ అర్థం-అభివృద్ధి, విశ్వాసం, పరిశుభ్రత, పరివర్తనతో పాటు ఆధునిక సౌకర్యాలు"

తొమ్మిది తీర్మానాలను ముందుకు తెచ్చిన ప్రధాని

Posted On: 18 DEC 2023 12:47PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని వారణాసిలోని ఉమరహాలో స్వర్వేద్ మహామందిర్‌ను ప్రారంభించారు. మహర్షి సదాఫల్ దేవ్ జీ మహారాజ్ విగ్రహానికి నివాళులర్పించిన ప్రధాన మంత్రి, ఆలయ సముదాయాన్ని సందర్శించారు. స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, తాను కాశీ సంద‌ర్శ‌కు ఈరోజు రెండో రోజు అని, కాశీలో గ‌డుపుతున్న ప్ర‌తి క్షణమూ అపూర్వ‌మైన అనుభూతుల‌తో నిండిపోతుంద‌ని వ్యాఖ్యానించారు. రెండేళ్ల క్రితం అఖిల భారతీయ విహంగం యోగ్ సంస్థాన్ వార్షిక ఉత్సవాలను గుర్తుచేసుకున్న ప్రధాన మంత్రి, ఈ ఏడాది శతాబ్ది ఉత్సవాల్లో భాగమయ్యే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ విహంగం యోగ సాధన వంద సంవత్సరాల మరపురాని ప్రయాణాన్ని సాధించిందని అన్నారు. మునుపటి శతాబ్దంలో జ్ఞానం, యోగా పట్ల మహర్షి సదాఫల్ దేవ్ జీ చేసిన సేవలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. దాని దివ్య కాంతి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల జీవితాలను మార్చిందని అన్నారు. ఈ శుభ సందర్బంగా, 25,000  కుండియా స్వర్వేద్ జ్ఞాన మహాయజ్ఞం నిర్వహించడాన్ని ప్రధాన మంత్రి ప్రస్తుతించారు. మహాయజ్ఞానికి ఇచ్చే ప్రతి సమర్పణ వికసిత్ భారత్ సంకల్పాన్ని బలపరుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అతను మహర్షి సదాఫల్ దేవ్ జీ కి నివాళులు అర్పిస్తూ,  దర్శనాన్ని అందించిన సాధువులందరికీ కూడా తన నివాళులర్పించాడు.

కాశీ పరివర్తనలో ప్రభుత్వం, సమాజం, సంత్ సమాజ్ సమిష్టి కృషిని ప్రధాన మంత్రి గుర్తు చేసుకున్నారు. ఈ సామూహిక స్ఫూర్తికి స్వర్వేద్ మహామందిర్ నిదర్శనమని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఈ దేవాలయం దైవత్వంతో పాటు వైభవానికి ఆకర్షణీయమైన ఉదాహరణ అని ప్రధాన మంత్రి అన్నారు. " స్వర్వేద్  మహామందిర్ భారతదేశం సామాజిక, ఆధ్యాత్మిక బలానికి ఆధునిక చిహ్నం" అని ఆయన చెప్పారు. ఆలయ అందం, ఆధ్యాత్మిక సంపదను వివరిస్తూ, ప్రధాన మంత్రి దీనిని 'యోగ,, జ్ఞాన తీర్థం' అని సంబోధించారు. 

భారతదేశం ఆర్థిక భౌతిక, ఆధ్యాత్మిక వైభవాన్ని గుర్తుచేస్తూ, భారతదేశం భౌతిక పురోగతిని భౌగోళిక విస్తరణ, లేదా దోపిడీకి మాధ్యమంగా మార్చడానికి ఎప్పుడూ అనుమతించదని అన్నారు. "మేము ఆధ్యాత్మిక, మానవీయ చిహ్నాల ద్వారా భౌతిక పురోగతిని అనుసరించాము" అని ప్రధాని అన్నారు. శక్తివంతమైన కాశీ, కోణార్క్ టెంపుల్, సారనాథ్, గయా స్థూపాలు, నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలకు ఉదాహరణలు ఇచ్చారు. "ఈ ఆధ్యాత్మిక నిర్మాణాల చుట్టూ భారతదేశ వాస్తుశిల్పం అనూహ్యమైన ఎత్తుకు చేరుకుంది" అని ప్రధాని మోదీ అన్నారు. .

విదేశీ ఆక్రమణదారుల లక్ష్యం అయిన  భారతదేశ విశ్వాసానికి చిహ్నాలు గురించి ప్రధాని ప్రస్తావిస్తూ... స్వాతంత్య్రం తర్వాత వాటిని పునరుద్ధరించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన సోమనాథ్ ఆలయాన్ని ఉదాహరణగా చూపుతూ, అటువంటి చిహ్నాల పునరుద్ధరణ దేశ ఐక్యతను బలోపేతం చేయడానికి దారితీసిందని ప్రధాన మంత్రి అన్నారు. “ఈ రోజు కాల చక్రాలు మళ్లీ మారాయి, భారతదేశం తన వారసత్వాన్ని గురించి గర్విస్తోంది, బానిస మనస్తత్వం నుండి విముక్తిని ప్రకటిస్తోంది” అని ప్రధాన మంత్రి అన్నారు. సోమనాథ్‌లో ప్రారంభమైన పనులు ఇప్పుడు పూర్తి స్థాయి ప్రచారంగా మారాయని, కాశీ విశ్వనాథ ఆలయం, మహాకాల్ మహాలోక్, కేదార్‌నాథ్ ధామ్, బుద్ధ సర్క్యూట్‌లను ఉదాహరణగా చూపారు. అయోధ్యలో రామ్ సర్క్యూట్, త్వరలో ప్రారంభించబోయే రామమందిరానికి సంబంధించిన పనులను కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు.

ఒక దేశం తన సామాజిక వాస్తవాలను, సాంస్కృతిక గుర్తింపులను పొందుపరిచినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. "అందుకే, నేడు, మన 'తీర్థాల' పునరుజ్జీవనం జరుగుతోంది, భారతదేశం ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనలో కొత్త రికార్డులను సృష్టిస్తోంది" అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ విషయాన్ని వివరించేందుకు కాశీని ఉదాహరణగా ప్రస్తావించారు. గత వారంతో రెండేళ్లు పూర్తి చేసుకున్న కొత్త కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాంగణం నగరంలోని ఆర్థిక వ్యవస్థకు, ఉద్యోగాలకు కొత్త ఊపునిచ్చింది. "ఇప్పుడు బనారస్ అంటే  -అభివృద్ధి, విశ్వాసం, పరిశుభ్రత, పరివర్తనతో పాటు ఆధునిక సౌకర్యాలు" అని తెలిపారు. 4-6 లైన్ల రోడ్లు, రింగ్‌రోడ్డు, రైల్వే స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేయడం, కొత్త రైళ్లు, ప్రత్యేక సరుకు రవాణా కారిడార్, గంగా ఘాట్‌ల పునరుద్ధరణ, గంగా క్రూయిజ్, ఆధునిక ఆసుపత్రులు, ఆధునిక డైరీ, గంగానది పొడవునా సహజ వ్యవసాయం, యువతకు శిక్షణా సంస్థలు వంటి వాటిని ఆయన ప్రస్తావించారు. సన్సద్ రోజ్గర్ మేళాల ద్వారా ఉద్యోగాలు కూడా చాల మంది పొందారని ప్రధాని తెలిపారు.

ఆధ్యాత్మిక ప్రయాణాలను, మరింత అందుబాటులోకి తీసుకురావడంలో ఆధునిక అభివృద్ధి పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, వారణాసి నగరం వెలుపల ఉన్న స్వరవేద ఆలయానికి అద్భుతమైన అనుసంధానాన్ని ప్రధాన మంత్రి వివరించారు. బనారస్‌కు వచ్చే భక్తులకు ఇది ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించనుందని, తద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో వ్యాపార, ఉపాధి అవకాశాలకు దారులు తెరుచుకోనున్నాయని చెప్పారు.

“విహంగం యోగ సంస్థాన్ ఆధ్యాత్మిక సంక్షేమానికి ఎంత అంకితమైనదో, అది సమాజానికి సేవ చేయడానికి కూడా అంతే అంకితం” అని అన్నారు. మహర్షి సదాఫల్ దేవ్ జీ యోగ భక్త సన్యాసి అని, అలాగే స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధుడు అని ప్రధాని అన్నారు. ఆజాదీ కా అమృత్ కాల్‌లో తన తీర్మానాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ప్రధాని 9 తీర్మానాలను ప్రవేశపెట్టి, వాటిని పాటించాలని కోరారు. ముందుగా, నీటిని పొదుపు చేయడం మరియు నీటి సంరక్షణపై అవగాహన కల్పించడం, రెండవది - డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించడం, మూడవది - గ్రామాలు, ప్రాంతాలు మరియు నగరాల్లో పరిశుభ్రత ప్రయత్నాలను పెంచడం, నాల్గవది - స్వదేశీ మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ప్రోత్సహించడం మరియు ఉపయోగించడం, ఐదవది - భారతదేశంలో పర్యటించడం మరియు అన్వేషించడం, ఆరవది- రైతులలో సహజ వ్యవసాయం గురించి అవగాహన పెంచడం, ఏడవది - మీ దైనందిన జీవితంలో మినుములు లేదా శ్రీ అన్‌తో , ఎనిమిదవది - క్రీడలు, ఫిట్‌నెస్ లేదా యోగాను జీవితంలో అంతర్భాగంగా మార్చడం మరియు చివరిగా భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి కనీసం ఒక పేద కుటుంబానికి మద్దతు ఇవ్వడం అని ప్రధాని వెల్లడించారు. 

వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రపై మాట్లాడుతూ, ఈ ప్రయాణం గురించి అవగాహన కల్పించాలని ప్రతి మత పెద్దలను ప్రధాని కోరారు. "ఇది మన వ్యక్తిగత తీర్మానం కావాలి" అని ప్రధాన మంత్రి ముగించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర నాథ్ పాండే, సద్గురు ఆచార్య శ్రీ స్వతంత్రదేవ్ జీ మహారాజ్, సంత్ ప్రవర్ శ్రీ విజ్ఞానదేయో జీ మహరాజ్ పాల్గొన్నారు.

 

***

DS/TS


(Release ID: 1987727) Visitor Counter : 110