యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
మొట్టమొదటి 'ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023'ను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్
Posted On:
10 DEC 2023 6:48PM by PIB Hyderabad
కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, మొట్టమొదటి 'ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023'ను రేపు న్యూదిల్లీలో ప్రారంభించనున్నారు.
డిసెంబర్ 10-17 తేదీల మధ్య, న్యూదిల్లీలోని మూడు వేదికల్లో ఈ పోటీలు జరుగుతాయి. 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, సర్వీసెస్ స్పోర్ట్స్ బోర్డు నుంచి 1,400 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు.
ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని కేడీ జాదవ్ ఇండోర్ హాల్‌లో క్రీడల ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ వేడుకలో దిల్లీ పోలీస్ బ్యాండ్ ప్రదర్శన ఇస్తుంది. ఆ తర్వాత, 'మిట్టి మే మిల్ జావా', 'వందేమాతరం' కార్యక్రమాలను 'వీ ఆర్ వన్' బృందం నృత్య కళాకారులు ప్రదర్శిస్తారు.
'పారా క్రీడాపోటీల పరిణామక్రమం' అంశంపై ఎల్‌ఈడీ ప్రదర్శన ఇస్తారు. ప్రారంభ వేడుకలో, శాయ్ అధికారుల ప్రత్యేక ప్రదర్శన కూడా ఉంటుంది.
‘యునైటెడ్ బై స్పోర్ట్స్’ ప్రదర్శనతో సాంస్కృతిక కార్యక్రమాలు ముగుస్తాయి. ఈ వేడుకల్లో పాల్గొనే వారందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నుంచి ఒక ప్రత్యేక సందేశాన్ని కూడా వినిపిస్తారు.
దివ్యాంగ క్రీడాకారులందరికీ గుర్తింపును ఇచ్చి, సాధికారత కల్పించడం ఖేలో ఇండియా పారా గేమ్స్ నిర్వహణ లక్ష్యం. దివ్యాంగుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కీలక పథకాలను ప్రారంభించింది. మొట్టమొదటి ఖేలో ఇండియా పారా గేమ్స్ ఇందిరా గాంధీ స్టేడియం, జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం, కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్‌లో జరుగుతాయి. అథ్లెటిక్స్, షూటింగ్, ఆర్చరీ, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ అంశాల్లో పోటీలు ఉంటాయి. శీతల్ దేవి, భవినా పటేల్, అశోక్, ప్రమోద్ భగత్ వంటి భారతదేశపు అగ్రశ్రేణి అంతర్జాతీయ పారా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్‌ను అత్యంత విజయవంతంగా నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ఖేలో ఇండియా పారా గేమ్స్‌ను నిర్వహిస్తోంది. దేశ రాజధాని దిల్లీలో సందడి వాతావరణం మధ్య ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. వారం పాటు జరిగే ఈ క్రీడా ఉత్సవం అందరినీ కలుపుకుపోవడం, మానవ గౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది.
***
(Release ID: 1986116)
Visitor Counter : 113