ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కాప్-28లో ప్రపంచ హరిత ప్రోత్సహక కార్యక్రమంపై యుఎఇ-భారత్ సహాధ్యక్షత

Posted On: 01 DEC 2023 8:28PM by PIB Hyderabad

   దుబాయ్‌లో 2023 డిసెంబరు 1న కాప్- 28 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ‘ప్రపంచ హరిత ప్రోత్సాహక కార్యక్రమం’పై ఉన్నతస్థాయి సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మాననీయ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. స్వీడన్ ప్రధాన మంత్రి గౌరవనీయ ఉల్ఫ్ క్రిస్టర్సన్, మొజాంబిక్ అధ్యక్షుడు మాననీయ ఫిలిప్ న్యుసి, ఐరోపా సమాఖ్య అధ్యక్షుడు చార్లెస్ మిషెల్ ఇందులో పాల్గొన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా అన్ని దేశాలకూ ప్రధానమంత్రి ఆహ్వానం పలికారు.

 వాతావరణ మార్పుల సవాలును ఎదుర్కొనడంలో సమర్థ ప్రతిస్పందనాత్మక, స్వచ్ఛంద భూగోళ హిత చర్యలకు స్ఫూర్తినిచ్చే వ్యవస్థగా ‘హరిత ప్రోత్సాహక కార్యక్రమం’ రూపొందించబడింది. సహజ పర్యావరణ వ్యవస్థల పునరుజ్జీవనం, పునరుద్ధరణ లక్ష్యంగా నిరుపయోగ/నేలకోతకు గురైన  భూములుసహా సహా నదీ పరివాహక ప్రాంతాల్లో మొక్కల పెంపకంపై ఈ వ్యవస్థ హరిత ప్రోత్సాహకా (గ్రీన్ క్రెడిట్స్)లను జారీ చేస్తుంది.

   ఈ సమావేశంలో భాగంగా పర్యావరణ హిత కార్యక్రమాలను ప్రోత్సహించే విధానాలు, ఉత్తమాచరణల భాండాగారంగా ఉపయోగపడే వెబ్ వేదిక https://ggci-world.in/ కూడా ప్రారంభించబడింది.

   గ్రీన్ క్రెడిట్స్ వంటి కార్యక్రమాలు/వ్యవస్థల ద్వారా పర్యావరణ హిత చర్యల ప్రణాళిక-అమలు-పర్యవేక్షణలో పరిజ్ఞానం, అనుభవాలు, ఉత్తమాచరణల పరస్పర మార్పిడి ద్వారా ప్రపంచ సహకారం, తోడ్పాటు, భాగస్వామ్యాలకు సౌలభ్యం కల్పించడమే ఈ అంతర్జాతీయ కార్యక్రమం లక్ష్యం.

****


(Release ID: 1982045) Visitor Counter : 205