ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విక‌సిత భార‌తం సంకల్ప యాత్ర


203 పంచాయితీలలో 1,232 ఆరోగ్య శిబిరాలు...

1,66,000 మందికిపైగా ప్రజలకు ఆరోగ్య పరీక్షలు;
శిబిరాల్లో 33,000కుపైగా ఆయుష్మాన్ కార్డుల
సృష్టి.. 21,000 మందికి ప్రత్యక్షంగా పంపిణీ;

41,000 మందికిపైగా ప్రజలకు క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్ష...
చికిత్స పొందాల్సిందిగా 4,000 మందికిపైగా ప్రజలకు సూచన;

24,000 మందికిపైగా ప్రజలకు కొడవలి రక్తకణ వ్యాధి పరీక్ష..

చికిత్స పొందాల్సిందిగా 1,100 మందికిపైగా ప్రజలకు సూచన;

1,35,000 మందికి అధిక రక్తపోటు.. మధుమేహ నిర్ధారణ పరీక్ష..
చికిత్స పొందాల్సిందిగా 10,000 మందికిపైగా ప్రజలకు సూచన

Posted On: 22 NOV 2023 1:51PM by PIB Hyderabad

   దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మ‌క పథకాల అమ‌లులో 100 శాతం సంతృప్త స్థాయి సాధించడం లక్ష్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జార్ఖండ్‌లోని ఖుంటిలో 2023 నవంబర్ 15న వినూత్న రీతిలో వికసిత భార‌తం సంక‌ల్ప యాత్ర (విబిఎస్‌వై)కు శ్రీ‌కారం చుట్టారు. యాత్రలో భాగంగా తక్షణ సేవలు అందించడం కోసం కేంద్ర ఆరోగ్య, తపాలా తదితర మంత్రిత్వ శాఖలు వివిధ శిబిరాలు నిర్వహించాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన పథకాలపై ప్రజలకు సాధికారత కల్పనతోపాటు  ఆయా పథకాల ప్రయోజనాలను నేరుగా అందజేయడం ధ్యేయంగా ఈ యాత్రకు రూపకల్పన చేశారు.

   గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ యాత్రను ప్రారంభించి, పథకాల సందేశవ్యాప్తి కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘ఐఇసి’ వాహ‌నాల‌ను జెండా ఊపి సాగ‌నంపారు. ఈ యాత్రలో భాగంగా తక్షణ సేవల ప్రదానం కింద ‘ఐఇసి’ వాహనాలు బసచేసే వివిధ పంచాయతీలలో గ్రామీణుల కోసం ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు.

   ఈ మేరకు 2023 నవంబరు 21న తొలివారం యాత్ర పూర్తయ్యేసరికి 203 పంచాయితీలలో 1,232 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి, మొత్తం 1,66,000 మందికిపైగా ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

లోయ‌ర్ సుబ‌న్‌సిరి, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌;   డాంగ్, గుజరాత్;   రాజౌరి, జమ్ముకశ్మీర్;   ఉత్తర-మధ్య అండమాన్;   కోరాపుట్, ఒడిషా;   వంతాడపల్లి (ఎఎస్ఆర్), ఆంధ్రప్రదేశ్

ఆరోగ్య శిబిరాల్లో నిర్వహించిన కార్యక్రమాలు:

  1. ఆయుష్మాన్ భారత్-ప్రధానమంత్రి జనారోగ్య యోజన (ఎబి-పిఎంజెఎవై): సంక‌ల్ప యాత్రలో భాగంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌ శాఖ ఈ ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కం కింద‌ ఆయుష్మాన్ అనువ‌ర్త‌నం ద్వారా ఆయుష్మాన్ కార్డులు సృష్టించి, నేరుగా పంపిణీ చేస్తోంది. ఈ మేర‌కు తొలివారం ముగిసేస‌రికి శిబిరాల వద్ద 33,000కుపైగా కార్డులు సృష్టించి, 21,000 మందికిపైగా ల‌బ్ధిదారుల‌కు అంద‌జేసింది.
  2. క్షయ (టిబి) వ్యాధి నిర్ధారణ పరీక్షలు: ఆరోగ్య శిబిరాల్లో ‘ఎన్ఎఎటి’ యంత్రాలతోనూ, కఫం పరీక్ష ద్వారానూ క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్ష నిర్వహించబడుతోంది. వ్యాధి లక్షణాలు ఉన్నవారిని తదుపరి చికిత్స కోసం పెద్ద ఆస్పత్రులకు పంపుతూ సిఫారసు చేస్తున్నారు. ఈ మేరకు తొలివారంలో 41,000 మందికిపైగా పరీక్షలు నిర్వహించి, వారిలో 4,000 మందిని మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు పంపారు.

   ప్రధానమంత్రి క్షయ విముక్త భారతం కార్యక్రమం (పిఎంటిబిఎంఎ) కింద ‘నిక్షయ్ మిత్ర’ కార్యకర్తల సేవలు స్వీకరించడంపై వ్యాధి పీడితుల సమ్మతిని నమోదు చేస్తున్నారు. అలాగే ‘నిక్షయ్ మిత్ర’గా స్వచ్ఛంద సేవలకు సంసిద్ధత తెలిపినవారి తక్షణ నమోదు ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ మేరకు తొలివారంలో 2,500 మందికిపైగా వ్యాధి పీడితులు సమ్మతి తెలుపగా- 1,400 మందికిపైగా కొత్త ‘నిక్షయ్ మిత్ర’ కార్యకర్తలు నమోదు చేసుకున్నారు.

   నిక్షయ్ పోషణ్ యోజన (ఎన్‌పివై) కింద ప్రత్యక్ష లబ్ధి బదిలీ ద్వారా క్షయ రోగులకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. దీనికి సంబంధించి పెండింగ్‌ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించి ఆధార్‌తో జోడిస్తున్నారు. ఈ మేరకు తొలివారంలో 966 మంది వివరాల సేకరణ పూర్తయింది.

  1. కొడవలి రక్తకణ వ్యాధి (ఎస్‌సిడి): గిరిజన ప్రాబల్యంగల ప్రాంతాల్లో రోగుల సంరక్షణ కేంద్రాల (పిఒసి)లో ‘ఎస్‌సిడి’ పీడితులను గుర్తించే దిశగా 40 ఏళ్లలోపు ఉన్నవారికి వ్యాధి నిర్ధారణ కోసం ‘ద్రావణీయత’ పరీక్ష నిర్వహిస్తున్నారు. అనంతరం నిర్ధారిత కేసులను మెరుగైన చికిత్స కోసం తగిన సదుపాయాలుగల ప్రభుత్వ ఆస్పత్రులకు పంపుతున్నారు. ఈ మేరకు తొలివారంలో 24,000 మందికిపైగా వ్యక్తులను పరీక్షించి, 1,100 మందిని చికిత్స కోసం పంపారు.
  2. అసాంక్రమిక వ్యాధులు (ఎన్‌సిడి): అసాంక్రమిక వ్యాధులైన అధిక రక్తపోటు, మధుమేహం నిర్ధారణ కోసం 30 ఏళ్లు అంతకుపైబడిన వయోజనులకు పరీక్షలు నిర్వహించి, అనుమానిత కేసులను మెరుగైన చికిత్స కోసం పంపుతున్నారు. ఈ మేరకు తొలివారంలో దాదాపు 1,35,000 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో అధిక రక్తపోటు, మధుమేహం లక్షణాలు గుర్తించిన 10,000 మందికిపైగా వ్యక్తులను మెరుగైన చికిత్స కోసం ఉన్నతస్థాయి ప్రభుత్వ ఆస్పత్రులకు పంపారు.

   వికసిత భారత సంకల్పయాత్ర తొలి వారం పురోగమనంపై వివిధ రాష్ట్రాల నుంచి అందుతున్న సానుకూల సమాచారం కిందివిధంగా ఉంది:

జార్ఖండ్: రాష్ట్రంలోని ‘పివిటిజి’ ప్రాంతాలతోపాటు ‘విబిఎస్‌వై’ ఆరోగ్య శిబిరాల ద్వారా ‘ఎస్‌సిడి’ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ మేరకు సంకల్ప యాత్ర సందర్భంగా అన్ని జిల్లాల్లోనూ తొలిసారి ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించబడ్డాయి. వీటితోపాటు ‘డిడి-డిఎన్‌హెచ్‌’ అదనంగా ఏర్పాటు చేసిన ‘శ్రమయోగి ఆరోగ్య సేవ సంచార వాహనం’ సంకల్ప యాత్రలో తనవంతు కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

జమ్ముకశ్మీర్: రాష్ట్రంలోని ‘జిపి దావర్’ వంటి మారుమూల ప్రాంతాల్లో కఠిన శీతల వాతావరణంసహా జన సంచారంపై నిషేధాజ్ఞల వంటి సవాళ్లు ఉన్నప్పటికీ దాదాపు 35,000 జనాభాకు అవసరమైన సేవలందించే దిశగా సైన్యం, స్థానిక స్వచ్ఛంద కార్యకర్తల మధ్య అద్భుత సమన్వయం కొనసాగుతోంది.

అరుణాచల్ ప్రదేశ్: తవాంగ్ జిల్లాలోని సామాజిక కార్యకర్తలు ప్రజల్లో అవగాహన పెంచేందుకు చొరవ చూపుతున్నారు. ఈ మేరకు వీధి నాటకాలు, రంగస్థల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

   కొన్ని రాష్ట్రాల్లో వివిధ సమస్యల వల్ల యాత్ర కార్యక్రమాలు సజావుగా సాగడం లేదని సమాచారం అందుతోంది. ఈ మేరకు మహారాష్ట్రలో సామాజిక ఆరోగ్యాధికారులు సమ్మె చేస్తుండటంతో ఆరోగ్య శిబిరాలకు ఆటంకం కలిగినప్పటికీ, ‘ఎఎన్ఎం’లు, ‘ఆశా’ కార్యకర్తల తోడ్పాటుతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అలాగే యాత్ర వాహనాలు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు, కుగ్రామాలకు చేరిన నేపథ్యంలో ప్రజలకు అవసరమైన సేవలు అందుబాటులో ఉంటాయని సమాచారం అందింది.

   ‘ఆయుష్మాన్ గోల్డెన్ కార్డ్’ పథకం సందేశ వ్యాప్తితోపాటు దాన్ని ప్రోత్సహించడంలో ఈ యాత్ర కీలక పాత్ర పోషించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని అనేక సమితులలో యాత్ర సందర్భంగా సామాజిక సదస్సుల నిర్వహణ విజయవంతమైంది. ఇక గుజరాత్ రాష్ట్రంలో ఆధార్, రేషన్ కార్డుల సమర్ధ పంపిణీకి యాత్రా వేదికను సద్వినియోగం చేసుకున్నారు. త్రిపురలో ఆదాయ, వైకల్య ధ్రువీకరణ పత్రాల జారీకి యాత్రా వేదికను చక్కగా వాడుకున్నారు. కాగా, కొడవలి రక్తకణ (సికిల్ సెల్) వ్యాధి, క్షయ, మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధి లక్షణాలున్న వారిని సులువుగా గుర్తించి, సమీకరించడంలో ఆరోగ్య శిబిరాలు ఎంతో సౌలభ్యం కల్పించాయని పలు రాష్ట్రాలు నివేదించాయి.

 

****


(Release ID: 1979372) Visitor Counter : 170