ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడోత్సవాలు 2022లో పాల్గొన్న భారత అథ్లెట్లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి


“ఆసియా క్రీడోత్సవాల్లో అథ్లెట్లు కనబరచిన అద్భుత ప్రతిభ చూసి దేశం యావత్తు ఆనంద డోలికల్లో మునకలేస్తోంది”

“ఆసియా క్రీడోత్సవాల్లో ఇప్పటి వరకు భారతదేశం చూపిన అత్యద్భుతమైన ప్రదర్శన ఇది. మనం సరైన బాటలో నడుస్తున్నామన్న వ్యక్తిగత సంతృప్తి ఏర్పడింది”

“మీ అందరి కృషి కారణంగా అనేక క్రీడల్లో దశాబ్దాల ఎదురు చూపులకు తెర పడింది”

“చాలా క్రీడల్లో మీరు ఖాతాలు తెరవడమే కాదు రాబోయే తరాలు స్ఫూర్తి పొందేలా ఒక ప్రదర్శన చూపారు”

“భారత పుత్రికలు మొదటి స్థానం కన్నా తక్కువైనది ఏదీ అందుకోవడానికి సిద్ధంగా లేరు”

“మా టాప్స్, ఖేలో ఇండియా స్కీం లు పరివర్తన చోదక శక్తులుగా రుజువయ్యాయి”

“మన క్రీడాకారులు గోట్లు అంటే దేశానికీ అన్ని కాలాలకు గొప్పవారే “

“మెడల్స్ గెలుచుకున్న అథ్లెట్లలో యువత ఉండడం క్రీడా స్ఫూర్తికి నిదర్శనం”

“యువభారతం మంచి ప్రదర్శనతోనే సంతృప్తి చెందేందుకు సిద్ధంగా లేదు గెలుపు, పతకాలు కావాలని కోరుతోంది”

“మాదక ద్రవ్యాలఫై పోరాటంలో చేయూత అందించండి, చిరు ధాన్యాలు, పోషన్ కార్యక్రమాన్ని ప్రోత్సహి

Posted On: 10 OCT 2023 6:24PM by PIB Hyderabad

ఆసియా క్రీడోత్సవాలు 2022లో పాల్గొని దేశానికి విజయులై తిరిగి వచ్చిన భారత అథ్లెట్లనుద్దేశించి న్యూఢిల్లీలోని   మేజర్ ధ్యాన్  సింగ్  స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. వారితో ప్రధానమంత్రి సంభాషించారు. ఆసియా క్రీడోత్సవాలు 2022లో భారతదేశం 107 పతకాలు గెలుచుకుంది. వాటిలో 28 స్వర్ణ పతకాలున్నాయి. ఖండాంతర క్రీడా కార్యక్రమంలో భారతదేశం సాధించిన అత్యధిక పథకాలు ఇవే.

అథ్లెట్లనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ దేశంలోని ప్రతీ ఒక్క పౌరుని తరఫున వారికి సాదర స్వాగతం పలికారు. విజయలక్ష్మితో తిరిగి వచ్చినందుకు వారిని అభినందించారు. 1951లో అదే స్టేడియంలో ఆసియా క్రీడోత్సవాలు ప్రారంభం కావడం కాకతాళీయమని ప్రధానమంత్రి అన్నారు.  భారత అథ్లెట్లు చూపిన  సాహసం, కట్టుబాటు దేశంలోని మారుమూల ప్రాంతాల ప్రజలను కూడా పండుగ మూడ్  లోకి తీసుకెళ్లిందన్నారు. 100పైగా పతకాలు  సాధించేందుకు వారు పడిన శ్రమ గురించి ప్రస్తావిస్తూ వారిని చూసి జాతి యావత్తు గర్వపడుతోందని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. కోచ్  లు, ఫిజియోలు, శిక్షకులు, అధికారులను కూడా ఆయన అభినందించారు. అథ్లెట్ల తల్లిదండ్రులకు కూడా ప్రధానమంత్రి శిరసు వంచి అభివాదం చేస్తూ వారిని ఈ స్థాయిలో నిలపడానికి కుటుంబాలు  ఎన్నో త్యాగాలు చేసి ఎంతో సహాయం అందించాయని ఆయన అన్నారు. ‘‘శిక్షణ మైదానం నుంచి పోడియం వరకు ప్రయాణం తల్లిదండ్రుల మద్దతు లేకుండా సాగేది కాదు’’ అని ప్రధానమంత్రి అన్నారు.

‘‘మీరు చరిత్ర సృష్టించారు. భారతదేశం విజయానికి ఆసియా క్రీడోత్సవాల్లో గెలుచుకున్న పతకాల సంఖ్యే ఉదాహరణ. నేటి వరకు ఆసియా క్రీడోత్సవాల్లో భారత క్రీడాకారుల అద్భుత ప్రదర్శన ఇది. మనం సరైన దిశలోనే ఉన్నందుకు వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తిగా ఉంది’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. మనం కరోనా వ్యాక్సిన్లు ప్రారంభించిన సమయంలో కూడా ఇదే తరహా అనుమానాలుండేవి. కాని మనం వ్యాక్సిన్లు వేయడం ప్రారంభించి ప్రజల జీవితాలను కాపాడడడమే కాకుండా 250 దేశాలకు సహాయం కూడా చేసినప్పుడు కూడా సరైన దిశలో నడుస్తున్నామన్నది అనుభవంలోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు.

ఆసియా  క్రీడల్లో భారత  క్రీడాకారులు సాధించిన అత్యధిక పతకాలు ఇవే అన్న విషయం గుర్తు చేస్తూ షూటింగ్, ఆర్చరీ, స్క్వాష్, రోయింగ్, మహిళల బాక్సింగ్ వంటి ఈవెంట్లలో అత్యధికంగా పతకాలు సాధించడంతో పాటు మహిళలు, పురుషుల క్రెకెట్  లోను, స్క్వాష్  మిక్స్ డ్  డబుల్స్  లోను తొలి బంగారు పతకాలు మన  క్రీడాకారులు సాధించడం ఆనందదాయకమన్నారు.  కొన్ని ఈవెంట్లలో సుదీర్ఘ విరామం అనంతరం పతకాలు గెలిచిన విషయం గుర్తు చేస్తూ మహిళల షాట్  పుట్, (72 సంవత్సరాల తర్వాత); 4 x 4 100 మీటర్లు (61 సంవత్సరాల తర్వాత), ఈక్వెస్ట్రియన్ (41 సంవత్సరాల తర్వాత), పురుషుల బ్యాడ్మింటన్ (40 సంవత్సరాల తర్వాత) సాధించిన పతకాలే ఇందుకు ఉదాహరణ అని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.

భారతదేశం ఈ క్రీడోత్సవాల్లో పాల్గొన్న అన్ని ఈవెంట్లలోనూ ఏదో ఒక పతకం సాధించడం కూడా  విశేషమని ప్రధానమంత్రి అన్నారు. భారతదేశం కనీసం 20 ఈవెంట్లలో పతకాలు గెలిచింది. ‘‘మీరు ఆయా క్రీడాంశాల్లో ఖాతాలు తెరవడమే కాదు, రాబోయే తరం యువతను  స్ఫూర్తివంతం చేసే ప్రయోగం కూడా ప్రదర్శించారు. నేను దీన్ని ఆసియా క్రీడోత్సవాలకు అతీతంగా చూస్తున్నాను. రాబోయే ఒలింపిక్స్  లో కూడా ఇదే తరహా ప్రదర్శన చూపిస్తారనే విశ్వాసం ఏర్పడింది’’ అని ప్రధానమంత్రి అన్నారు.

మహిళా అథ్లెట్లు ప్రదర్శించిన ప్రతిభ మరింత గర్వకారణమని పేర్కొంటూ భారతీయ పుత్రికల సామర్థ్యాలకు ఇది మచ్చుతునక అని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఈ సారి భారతదేశం గెలుచుకున్న మొత్తం పతకాల్లో సగం పైగా పతకాలు సాధించినవేనని, మహిళా క్రికెట్  టీమ్  కూడా విజయ యాత్ర ప్రారంభించిందని ఆయన అన్నారు. ప్రధానంగా బాక్సింగ్ లో మహిళలు అత్యధిక పతకాలు సాధించారని గుర్తు చేశారు. అద్భుతమైన ప్రతిభ ప్రదర్శించినందుకు మహిళా అథ్లెట్లను కొనియాడుతూ ‘‘భారతదేశ కుమార్తెలు ట్రాక్, ఫీల్డ్  ఈవెంట్లలో ప్రథమ స్థానం తప్పితే మరేదీ అంగీకరించేందుకు  సిద్ధంగా లేరు’’ అని పేర్కొన్నారు. ‘‘ఇదే నవభారతం శక్తి’’ అని కూడా ఆయన అన్నారు. తుది విజిల్  మోగే వరకు విశ్రాంతి తీసుకోరాదని నవభారతం నిశ్చయంతో ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘నవభారతం చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి కృషి చేసింది’’ అన్నారు.

భారతదేశంలో ప్రతిభకు కొదవ లేదని, గతంలో కూడా మన అథ్లెట్లు మంచి ప్రదర్శన ఇచ్చినా ఎన్నో సవాళ్ల కారణంగా వారు పతకాల పోటీలో వెనుకబడి ఉండేవారని ప్రధానమంత్రి అన్నారు. 2014 తర్వాత ఆధునికీకరణ, పరివర్తిత మార్పునకు కృషి జరిగిన విషయం ఆయన గుర్తు చేశారు. భారతదేశం తన అథ్లెట్లకు అత్యుత్తమ శిక్షణ సదుపాయాలు అందుబాటులో ఉంచేందుకు; జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి అవకాశాలు కల్పించేందుకు, ఎంపికలో మంచి పారదర్శకతకు, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల ప్రతిభకు మంచి అవకాశం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నదని ప్రధానమంత్రి చెప్పారు. 9 సంవత్సరాల క్రితం నాటితో పోల్చితే క్రీడా రంగ బడ్జెట్  మూడు రెట్లు పెరిగిందని ఆయన తెలిపారు. ‘‘మన టాప్స్, ఖేలో ఇండియా పథకాలు మంచి మార్పునకు నాంది పలికాయి’’ అన్నారు. ఖేలో గుజరాత్  రాష్ర్టంలో క్రీడా సంస్కృతిని ఏ విధంగా మార్చింది ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఆసియాడ్  కు వెళ్లిన 125 మంది అథ్లెట్లు ఖేలో ఇండియా ప్రచారం ద్వారా ఎదిగిన వారేనంటూ వారిలో 40 మందికి పైగా పతకాలు గెలుచుకున్నారని ఆయన అన్నారు. ‘‘ఖేలో ఇండియా అథ్లెట్లలో ఎక్కువ మంది విజయం సాధించడం ఆ పథకం సరైన బాటలో సాగుతోంది అనేందుకు నిదర్శనం’’ అని చెప్పారు. ఈ క్రీడాకారులందరూ ఏడాదికి రూజ6 లక్షలకు పైబడి స్కాలర్  షిప్  లు పొందుతున్నారన్నారు. ‘‘ఈ పథకం కింద అథ్లెట్లకు రూ.2.5 వేల కోట్ల విలువైన సహాయం అందుతోంది. మీ ప్రయత్నాలకు నిధుల లేమి ఇక ఏ మాత్రం అవరోధం కాదని నేను హామీ ఇస్తున్నాను. మీ కోసం ప్రభుత్వం వచ్చే ఐదేళ్ల కాలంలో మరో రూ.3 వేల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంది.  నేడు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ మీ కోసం ఆధునిక క్రీడా మౌలిక వసతులు నిర్మాణంలో ఉన్నాయి’’ అని శ్రీ మోదీ చెప్పారు.

పతకాలు గెలుచుకున్న వారిలో యువ అథ్లెట్లు ఉండడం పట్ల ప్రధానమంత్రి హర్షం ప్రకటించారు. ‘‘ఇది క్రీడా జాతికి సంకేతం. ఈ యువ విజేతలందరూ సుదీర్ఘ కాలం పాటు దేశం కోసం అత్యుత్తమంగా పోరాడగలుగుతారు. భారత యువత మంచి ప్రదర్శన ఇవ్వడంతో  పతకాలు సంతృప్తి చెందాలనుకోవడం లేదు. పతకాలు గెలవాలన్నదే వారి ఆకాంక్ష’’ అని ప్రధానమంత్రి అన్నారు.

‘‘జాతికి మీరంతా GOATలు-అన్ని కాలాల్లోను గొప్పవారు’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. క్రీడల పట్ల వారి వ్యామోహం, అంకిత భావం, బాల్యదశ కథనాలు ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. ఈ అథ్లెట్ల ప్రతిభ యువతరంపై చూపే ప్రభావం గురించి నొక్కి చెబుతూ ఈ పాజిటివ్  ఎనర్జీని మరింత మంది యువతను అనుసంధానం చేయడానికి ఉపయోగించాలని సూచించారు. పాఠశాలలకు వెళ్లి బాలలతో సంభాషించాలి అన్న తన సలహాను ఆయన  పునరుద్ఘాటిస్తూ మాదక ద్రవ్యాలు జీవితాన్ని, కెరీర్ ను ఎలా విచ్ఛిన్నం చేస్తాయో క్రీడాకారులు యువతకు చైతన్యం కలిగించవచ్చునన్నారు. మాదక ద్రవ్యాలపై దేశం నిర్ణయాత్మక పోరాటం సాగిస్తున్నదంటూ అవకాశం వచ్చినప్పుడల్లా మాదక ద్రవ్యాలు, ప్రమాదకరమైన ఔషధాల దుష్ర్పభావాల గురించి యువతకు తెలియచేయాలని సూచించారు. మాదక ద్రవ్యాలపై పోరాటానికి బలం చేకూర్చాలని, మాదక ద్రవ్యాల రహిత భారతదేశం ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని ఆయన పిలుపు ఇచ్చారు.

శారీరక దారుఢ్యాన్ని పెంచడంలో సూపర్-ఫుడ్ ప్రాధాన్యతను ప్రధానమంత్రి నొక్కి చెబుతూ బాలల్లో పోషకాహారం పట్ల చైతన్యం కలిగించేందుకు ప్రయత్నించాలని ఆయన అథ్లెట్లకు సూచించారు. పిల్లలతో మమేకమై వారికి మంచి ఆహారపు అలవాట్ల గురించి తెలియచేసినట్టయితే చిరుధాన్యాల ఉద్యమానికి, పోషకాహార మిషన్  కు ఎంతో సేవ అందించినట్టవుతుందని ఆయన చెప్పారు.

క్రీడా రంగంలో భారతదేశ విజయాన్ని జాతీయ స్థాయికి విస్తరించడానికి అనుసంధానం చేయాలని ప్రధానమంత్రి ప్రయత్నించారు. ‘‘నేడు ప్రపంచంలో భారతదేశం ప్రాధాన్యత పెరుగుతోంది. దాన్ని మీరు క్రీడా మైదానంలో ప్రదర్శించారు. నేడు భారతదేశం ప్రపంచంలోనే మూడో  పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. మన యువత దాని వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు’’ అన్నారు. అంతరిక్షం, స్టార్టప్  లు, సైన్స్, టెక్నాలజీ, ఎంటర్  ప్రెన్యూర్  షిప్  రంగాల్లో కూడా అదే విజయం ఏర్పడింది. ‘‘‘భారత యువత సామర్థ్యాలు ప్రతీ ఒక్క రంగంలోనూ కనిపిస్తున్నాయి’’ అని చెప్పారు.

‘‘క్రీడాకారులందరిపైన దేశం అమిత విశ్వాసం కలిగి ఉంది’’ అని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.  ఈ ఏడాది ఆసియా క్రీడోత్సవాలకు ‘‘100 పార్’’ నినాదం ఇచ్చిన విషయం ఆయన గుర్తు చేశారు. రాబోయే క్రీడోత్సవాల్లో ఈ సంఖ్య మరింత  పెరుగుతుందన్న నమ్మకం ప్రధానమంత్రి ప్రకటించారు. పారిస్  ఒలింపిక్స్  త్వరలో రానున్నాయి, వాటి కోసం గట్టిగా కృషి చేయండి అని ప్రధానమంత్రి అన్నారు. ఈ సారి విజయం సాధించలేని వారి పట్ల ఓదార్పు మాటలు చెబుతూ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని సరికొత్తగా ప్రయత్నించాలని ఆయన సూచించారు. అక్టోబరు 22న ప్రారంభం కానున్న పారా ఒలింపిక్స్  క్రీడాకారులందరికీ శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలియచేశారు.

కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనురాగ్  స  ఠాకూర్, ఇతరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పూర్వాపరాలు

ఆసియా క్రీడోత్సవాలు 2022లో సాధించిన అద్భుత విజయాలకు అభినందించేందుకు, భవిష్యత్  క్రీడోత్సవాల కోసం వారిలో స్ఫూర్తిని నింపేందుకు ప్రధానమంత్రి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆసియా క్రీడోత్సవాలు 2022లో 28 స్వర్ణ పతకాలు సహా మొత్తం 107 పతకాలు భారత క్రీడాకారులు గెలుచుకున్నారు. మొత్తం పతకాల పరంగా ఆసియా క్రీడోత్సవాల్లో ఇప్పటి వరకు భారతదేశం అత్యుత్తమ ప్రదర్శన ఇది.

 

ఆసియా క్రీడోత్సవాలకు హాజరైన భారతీయ అథ్లెట్లు, వారి కోచ్  లు, ఇండియన్  ఒలింపిక్స్ అసోసియేషన్  అధికారులు, జాతీయ క్రీడా సమాఖ్యల ప్రతినిధులు; యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ   అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


(Release ID: 1966633) Visitor Counter : 186