ప్రధాన మంత్రి కార్యాలయం

జి-20 శిఖరాగ్ర సదస్సు రెండవ సెషన్ లో ప్రధానమంత్రి వ్యాఖ్యలు

Posted On: 09 SEP 2023 8:38PM by PIB Hyderabad

ఇప్పుడు ఒక మంచి వార్త వినిపించింది. మా బృందాలు చేసిన కఠోర శ్రమ, మీ అందరి మద్దతు కారణంగా జి-20 నాయకుల న్యూఢిల్లీ  శిఖరాగ్ర సదస్సు ప్రకటనను ఆమోదించినట్టు తెలిసింది. నాయకుల ప్రకటనను మనందరం కూడా ఆమోదించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. నాయకుల ప్రకటన ఆమోదించినట్టు నేను ప్రకటిస్తున్నాను. ఎంతో విలువైన ఈ పత్రం రూపకల్పన కోసం శ్రమించిన మంత్రి, షెర్పా, ఇతర అధికారులను నేను అభినందిస్తున్నాను. వారందరూ అభినందనీయులే.

మహోన్నతులారా,

వేలాది సంవత్సరాల క్రితమే రచించిన వేలాది సంవత్సరాల నాటి మా పురాతన వేదాలు ‘‘ఏకో అహమ్ బహుశ్యామ్’’ అన్నాయి. ‘‘నేను ఒక్కడినే; బహుళం అయ్యేలా నన్ను చేయండి’’ అన్నదే దాని అర్ధం. మనందరం సృష్టి, ఇన్నోవేషన్, లాభదాయకమైన పరిష్కారాల సాధన కోసం ‘‘నేను’’ నుంచి ‘‘మనం’’ అనే భావం అలవరచుకోవాలి. స్వార్ధం నుంచి అందరం అనే భావన అలవరచుకుంటే ‘‘నా’’ బదులుగా ‘‘మన’’ సంక్షేమం అనే భావన ప్రబలుతుంది. మనందరం దీని కోసమే గట్టిగా కృషి చేయాలి. మనం  ప్రపంచంలోని ప్రతీ ఒక్క వర్గాన్ని, ప్రతీ ఒక్క సమాజాన్ని, ప్రతీ ఒక్క ప్రాంతాన్ని అనుసంధానం చేయాలి. ఒకే కుటుంబం సిద్ధాంత సారం ఇదే. ప్రతీ కుటుంబానికి సొంత మద్దతు వ్యవస్థ ఉన్నట్టుగానే మనందరం కలిసికట్టుగా ప్రపంచ మద్దతు వ్యవస్థను నిర్మించాలి. ఒకరి ఆనందమే మన ఆనందానికి, ఒకరి దు:ఖం మనందరి దు:ఖానికి  కారణమవుతుందనే ఆలోచనా ధోరణి మనం అలవరచుకోవాలి. మనందరం ఒకే కుటుంబం అనే భావన ఏర్పడినప్పుడు ప్రతీ ఒక్క సభ్యుని ఏ విధంగా సాధికారం అని ఆలోచించగలుగుతాం. ఈ స్ఫూర్తితోనే భారతదేశం అతి పెద్ద ప్రపంచ కుటుంబంతో అన ప్రతీ ఒక్క అనుభవాన్ని పంచుకోవాలని భావిస్తోంది.

సమ్మిళిత, సుస్థిర అభివృద్ధికి భారతదేశం టెక్నాలజీని ఒక వారధి చేసుకుంది. సమ్మిళితత్వం, పారదర్శకత; బ్యాంకు ఖాతాలు, ఆధార్ గుర్తింపు, మొబైల్  ఫోన్ల త్రయం జామ్  ట్రినిటీ  ద్వారా లక్షిత జోక్యాల కోసం ఒక కొత్త నమూనాను మేం అభివృద్ధి చేశాం. జామ్ ట్రినిటీ ద్వారా భారతదేశం 6 సంవత్సరాల కాలంలోనే ఆర్థిక సమ్మిళితత్వం సాధించిందని ప్రపంచ బ్యాంకు కూడా గుర్తించింది. అది లేకపోయినట్టయితే దీన్ని సాధించేందుకు 47 సంవత్సరాల వ్యవధి పట్టేది. ఈ నమూనా ఆధారంగానే గత దశాబ్ది కాలంలో భారతదేశం 36 వేల కోట్ల డాలర్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేసింది. దీని వల్ల జిడిపిలో 1.25 శాతంతో  సమానమైన 3300 కోట్ల డాలర్ల లీకేజిని అరికట్టగలిగింది. ప్రపంచ సమాజానికి కూడా ఈ నమూనా ఉపయోగపడి తీరుతుందనడంలో సందేహం లేదు.

మిత్రులారా,

భారతదేశ యువత, వారిలోని ప్రతిభ కూడా ఒకే కుటుంబం సూత్రం ఆధారంగా ప్రపంచ శ్రేయస్సుకే ఉపయోగపడుతుంది. దీర్ఘ కాలంలో స్థిరమైన ప్రపంచ వృద్ధికి భారీ సంఖ్యలో గత యువ నిపుణుల ప్రతిభ ఎంతో దోహదపడుతుంది. అందుకే మనందరం ‘‘ప్రపంచ స్కిల్  మ్యాపింగ్’’ దిశగా అడుగులేయాలి. ప్రపంచ పడమటి ప్రాంతానికి ఇదే ప్రాధాన్యం కావాలి.

మిత్రులారా,

ఒకే కుటుంబం గురించి మాట్లాడనప్పుడు ప్రపంచ కుటుంబం ముందున్న సవాళ్లను కూడా మనందరం దృష్టిలో  పెట్టుకోవాలి. కోవిడ్  రూపంలో భారీ ప్రపంచ  సమాజానికి వచ్చిన పెను సవాలును మనందరం ఇటీవలే వీక్షించాం. ఆ సందర్భంగా దశాబ్దాలుగా నిర్మించిన ప్రపంచ సరఫరా వ్యవస్థల్లోని లోపాలు బట్టబయలయ్యాయి. ఒకే కుటుంబం సూత్రం కింద నేడు మనం విశ్వసనీయమైన, పారదర్శకమైన ప్రపంచ సరఫరా వ్యవస్థను నిర్మించాలి. ఇది మనందరి ఉమ్మడి బాధ్యత.

ప్రపంచ దేశాలను, మానవతను మనం కేవలం మార్కెట్  అన్న భావనతోనే చూడకూడదు. మనకి సునిశితమైన, దీర్ఘకాలిక వైఖరి అవసరం. వర్థమాన దేశాల్లో సామర్థ్యాల నిర్మాణంపై మనందరం ప్రత్యేకంగా దృష్టి సారించాలి. అందుకే భారతదేశం ప్రతిపాదించిన ఈ మ్యాపింగ్  విధానం ప్రస్తుత సరఫరా వ్యవస్థలను పటిష్ఠం చేస్తుంది. ప్రపంచ సరఫరా వ్యవస్థను సమ్మిళితం చేయడంలో చిన్న వ్యాపారాల క్రియాశీల పాత్రను కూడా మనం గుర్తించాలి. చిన్న వ్యాపారాలకు మార్కెట్లు, సమాచారం అందుబాటులో ఉంచడం, వారి వ్యాపార వ్యయాలను కూడా తగ్గించడం తప్పనిసరి.

మిత్రులారా,

ఒకే  కుటుంబం మంత్రాన్ని కొనసాగిస్తూ మనందరం వర్థమాన దేశాల రుణ సంక్షోభంపై కూడా దృష్టి సారించాలి. సంక్షోభాల్లో ఉన్న కుటుంబాలు దాన్ని అధిగమించేందుకు, మరో సారి అలాంటి  సంక్షోభం ఏర్పడకుండా నివారించేందుకు మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఈ కోణంలోనే ‘‘స్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం కృషిని వేగవంతం చేయడానికి కార్యాచరణ ప్రణాళిక’’పై ఒక అంగీకారం కుదరడం నాకు ఆనందంగా ఉంది. ఇందుకు సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు.

మిత్రులారా,

‘‘సంపూర్ణ ఆరోగ్యం, సంక్షేమ’’ వ్యవస్థకు కూడా ఒకే కుటుంబ సూత్రం సమ ప్రాధాన్యం కలిగి ఉంది.  భారతదేశంలో ఏర్పాటు చేస్తున్న సాంప్రదాయిక వైద్యవిధానాల ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్  సెంటర్ ప్రపంచ సంక్షేమానికి ఎంతగానో దోహదపడుతంది. మనం తొందరలో ప్రపంచ సాంప్రదాయిక ఔషధాల రిపోజిటరీ ఏర్పాటు చేసుకోగలుగుతామని నేను ఆవిస్తున్నాను.

మిత్రులారా,

ప్రతీ ఒక్క సమాజంలోనూ కుటుంబానికి చోదక శక్తి మహిళలే. నేడు భారతదేశంలో ప్రతీ ఒక్క రంగంలోనూ మహిళా నాయకత్వాన్ని మేం చూస్తున్నాం. దేశంలో సుమారు 45% మంది స్టెమ్  (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణిత శాస్ర్తం) పట్టభద్రులు మహిళలే. నేడు భారత అంతరిక్ష కార్యక్రమంలో ఎన్నో సంక్లిష్టమైన వ్యవస్థల కార్యకలాపాలను మహిళలే నడుపుతున్నారు. నేడు దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 9 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక బృందాల్లో భాగస్వాములు కావడం ద్వారా చిన్న వ్యాపారాలను ముందుకు నడుపుతున్నారు. 21వ శతాబ్ది పరివర్తనకు మహిళల చోదక అభివృద్ధి కీలకమని నేను విశ్వసిస్తున్నాను.

మిత్రులారా,

ఈ ఒకే కుటుంబ సెషన్ లో మూడు సలహాలు మీ ముందుంచాలనుకుటున్నాను.

వాటిలో మొదటిది దేశంలోని అత్యున్నత స్థాయి క్రీడా లీగ్  లన్నీ ప్రపంచ దక్షిణ భాగంలో క్రీడా వసతుల నిర్మాణం కోసం తమ ఆదాయాల్లో 5% ఇన్వెస్ట్ చేయాలని మనందరం పిలుపు ఇవ్వాలి. ఇది  ప్రపంచ స్థాయిలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఒక కొత్త నమూనాగా ఉంటుంది.

అన్ని దేశాలు విభిన్న విభాగాల్లో వీసాలు జారీ చేస్తూ ఉంటాయి. వాటిలో భాగంగానే ఒక ప్రత్యేక వర్గీకరణగా ‘‘జి-20 టాలెంట్ వీసా’’ ఏర్పాటు చేయాలన్నది రెండో సూచన.  ప్రపంచంలోని ఉన్నత స్థాయి సైన్స్ అండ్  టెక్నాలజీ ప్రతిభావంతులకు ఈ తరహా వీసాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వారందరి ప్రతిభ, ప్రయత్నాలు ఆర్థిక వ్యవస్థలకు ఎంతో  సహాయకారి అవుతాయి.

మూడో సూచన. ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యవేక్షణలో మనందరం గ్లోబల్  బయో-బ్యాంకులను ఏర్పాటు చేయాలి. ఈ బయో బ్యాంకులు గుండె వ్యాధులు, రక్తహీనత, ఎండోక్రైన్  లోపాలు, వక్షోజ క్యాన్సర్ వంటి వ్యాధులపై  దృష్టి సారించగలుగుతాయి. ఈ ప్రపంచ బయో-బ్యాంకుల ఏర్పాటు నాకెంతో సంతృప్తి కలిగిస్తుంది.

మిత్రులారా,

ఇప్పుడు నేను మీ అందరి అభిప్రాయాలు వినాలనుకుంటున్నాను.

గమనిక-ప్రధానమంత్రి హిందీ ప్రకటనకు ఇది అనువాదం మాత్రమే. 

 

***



(Release ID: 1956239) Visitor Counter : 153