ప్రధాన మంత్రి కార్యాలయం

జి-20 శిఖరాగ్ర సదస్సు సమాపనోత్సవంలో ప్రధాని వ్యాఖ్యల అనువాద పాఠం

Posted On: 10 SEP 2023 2:03PM by PIB Hyderabad

మిత్రులారా!

   మా అందరికీ స్ఫూర్తిదాయక త్రయంపై సంపూర్ణ విశ్వాసం ఉంది.

   ఈ నేపథ్యంలో జి-20 తదుపరి అధ్యక్ష బాధ్యత స్వీకరించనున్న బ్రెజిల్‌కు అచంచల మద్దతు ప్రకటిస్తున్నాం. మా ఉమ్మడి లక్ష్యాలను బ్రెజిల్‌ నాయకత్వంలో ఈ కూటమి మరింత ముందుకు తీసుకెళ్లగలదని విశ్వసిస్తున్నాం.

   బ్రెజిల్‌ అధ్యక్షులు, నా మిత్రులైన లూలా డి సిల్వాకు నా అభినందనలు తెలుపుతూ అధ్యక్ష బాధ్యతలను ఆయనకు బదలాయిస్తున్నాను.

   ఈ సందర్భంగా తన మనోభావాలను పంచుకోవాల్సిందిగా అధ్యక్షులు లూలాను కోరుతున్నాను.

 

(అధ్యక్షులు లూలా వ్యాఖ్యలు)

 

మాననీయులు/గౌరవనీయులైన అధినేతలారా!

   భారత జి-20 అధ్యక్షత హోదా ఈ ఏడాది నవంబరుదాకా కొనసాగుతుందన్నది మీకందరికీ తెలిసిందే. కాబట్టి మాకు ఇంకా రెండున్నర నెలల సమయం ఉంది.

   అయితే, గడచిన రెండు రోజులలో మీరంతా అనేక అంశాలను ముందుకు తెచ్చారు. సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు పలు ప్రతిపాదనలు చేశారు.

   వీటన్నిటినీ మరొకసారి కూలంకషంగా పరిశీలించాల్సిన బాధ్యత మాపై ఉంది. తద్వారా వాటి అమలును వేగిరపరచే మార్గాన్వేషణకు వీలుంటుంది.

   ఈ నేపథ్యంలో నవంబరు ఆఖరులోగా వర్చువల్‌ మాధ్యమం ద్వారా మరోసారి జి-20 సమావేశం నిర్వహించాలని నేను ప్రతిపాదిస్తున్నాను.

   ప్రస్తుత సదస్సులో ప్రస్తావనకు వచ్చిన చర్చనీయాంశాలపై ఆ సమావేశంలో సమీక్షిద్దాం.

   దీనికి సంబంధించిన వివరాలను మా బృందం మీ అందరితోనూ పంచుకుంటుంది.

    ఆ మేరకు వర్చువల్‌ మాధ్యమ సమావేశంలో మీరంతా పాల్గొంటారని ఆశిస్తున్నాను.

 

 

మాననీయులు/గౌరవనీయులైన అధినేతలారా!

   ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు దిశగా మన పయనం ఆహ్లాదకరంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తూ ప్రస్తుత జి-20 శిఖరాగ్ర సదస్సుకు నేను భరతవాక్యం పలుకుతున్నాను.

స్వస్తి అస్తు విశ్వస్య!

అంటే “ప్రపంచం ఆశలన్నీ నెరవేరి శుభం కలుగుగాక!’ అని అర్థం.

మా 140 కోట్ల మంది భారతీయుల శుభకామనలతో మీకందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను!

 

బాధ్యత నిరాకరణ ప్రకటన- ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటనకు ఇది స్వేచ్ఛానువాదం మాత్రమే. వాస్తవ ప్రకటన హిందీ భాషలో జారీ చేయబడింది.

 

***



(Release ID: 1956201) Visitor Counter : 149