ఆర్థిక మంత్రిత్వ శాఖ

జి-20పై ప్రపంచ బ్యాంకు పత్రంలో భారత పురోగమనంపై ప్రశంస

Posted On: 08 SEP 2023 11:38AM by PIB Hyderabad

   భారతదేశంలో ప్రభుత్వ డిజిటల్‌ మౌలిక సదుపాయాలు (డిపిఐ) పరివర్తనాత్మక ప్రభావం చూపాయి. ఈ ప్రభావం దేశంలో ఆర్థిక సార్వజనీనత లక్ష్యాన్ని మించి విస్తరించింది. గత దశాబ్దంగా మోదీ ప్రభుత్వ పాలనలో సాకారమైన ఈ వాస్తవాన్ని ప్రపంచ బ్యాంకు కూడా గుర్తించింది. ఈ మేరకు ‘ఆర్థిక సార్వజనీనత కోసం జి-20 అంతర్జాతీయ భాగస్వామ్యం’పై రూపొందించిన పత్రంలో ప్రశంసలు కురిపించింది. ఇందులో భాగంగా మోదీ ప్రభుత్వం చేపట్టిన సంచలనాత్మక చర్యలు, విధానాలు-నియంత్రణలు ‘డిపిఐ’ వ్యవస్థ రూపకల్పనలో కీలక పాత్ర పోషించాయని ఈ పత్రం నొక్కి చెప్పింది.

  • ఆర్థిక సార్వజనీనత: ప్రపంచ బ్యాంకు తన పత్రంలో భారత ‘డిపిఐ’ విధానాన్ని ప్రశంసిస్తూ ఐదు దశాబ్దాల్లో సాధించాల్సిన విజయాన్ని మన దేశం కేవలం 6 సంవత్సరాల్లో సాకారం చేసుకున్నదని పేర్కొంది.
  • దేశంలో 2008నాటికి ఆర్థిక సార్వజనీనత కేవలం 25 శాతం కాగా, ‘జన్‌ధన్‌, ఆధార్‌, మొబైల్‌’ (జామ్‌) త్రయం ప్రవేశంతో గడచిన ఆరేళ్లలోనే వయోజనంలో 80శాతానికిపైగా విస్తరించిందని పేర్కొంది. ఈ ప్రగతి పయనం వ్యవధిని ‘డిపిఐ’ వ్యవస్థ దాదాపు 47 సంవత్సరాలు తగ్గించిందని కొనియాడింది.
  • “ఈ సత్వర ప్రగతిలో ‘డిపిఐ’ వ్యవస్థది నిస్సందేహంగా ప్రధాన పాత్రే అయినప్పటికీ, దీని సౌలభ్యంతో రూపొందిన ఇతర పర్యావరణ వ్యవస్థ సంబంధిత పరివర్తనశీల అంశాలు, విధానాలు కూడా కీలకమైనవి. చట్టబద్ధ, నియంత్రణ చట్రం రూపకల్పన చర్యలు, ఖాతాల నిర్వహణపై జాతీయ విధానాలు, గుర్తింపు ధ్రువీకరణ నిమిత్తం ఆధార్‌ వినియోగం వంటివి వీటిలో భాగంగా ఉన్నాయి” అని ఈ పత్రం నిర్ద్వంద్వంగా ప్రకటించింది.
  • ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన (పిఎంజెడివై)కు శ్రీకారం చుట్టాక 2015 మార్చి నాటికి ఈ ఖాతాల సంఖ్య 147.2 మిలియన్లు కాగా, 2022 జూన్ నాటికి 462 మిలియన్లకు..  అంటే- మూడు రెట్లు పెరిగాయి; ఇక ఈ ఖాతాదారులలో మహిళల సంఖ్య 260 మిలియన్లకుపైగా.. అంటే- 56 శాతందాకా ఉండటం విశేషం.
  • ఇక జన్‌ధన్‌ ప్లస్ కార్యక్రమం స్వల్పాదాయ మహిళల్లో పొదుపు అలవాటును ప్రోత్సహిస్తుంది. దీనివల్ల మహిళా ఖాతాదారుల సంఖ్య (2023 ఏప్రిల్ నాటికి) 12 మిలియన్లకుపైగా పెరిగింది. ఇదే వ్యవధిలో మొత్తం ఖాతాలతో పోలిస్తే కేవలం ఐదు నెలల్లోనే సగటు ఖాతా నిల్వలో 50 శాతం పెరుగుదల నమోదైంది. దేశవ్యాప్తంగా 100 మిలియన్ల స్వల్పాదాయ మహిళల్లో పొదుపును ప్రోత్సహించడం ద్వారా  ప్రభుత్వరంగ బ్యాంకులు సుమారు రూ.25,000 కోట్ల (3.1 బిలియన్ డాలర్ల)దాకా డిపాజిట్లను ఆకర్షించగలవని అంచనా.
  • ప్రభుత్వం నుంచి వ్యక్తులకు (జి2పి) చెల్లింపులు:
  • భారతదేశం ‘డిపిఐ’ని సద్వినియోగం చేసుకుంటూ గడచిన దశాబ్ది వ్యవధిలో ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ‘జి2పి’ వ్యవస్థలలో ఒకటిగా ఆవిర్భవించింది.
  • ఈ విధానం 312 ప్రధాన పథకాల ద్వారా 53 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల నుంచి నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు దాదాపు 361 బిలియన్‌ డాలర్లు బదిలీ కావడంలో తోడ్పడింది.
  • ఈ విధానం ఫలితంగా 2022 మార్చి నాటికి స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో 1.14 శాతానికి సమానమైన 33 బిలియన్‌ డాలర్ల మొత్తం ఆదా అయింది.
  • ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ (యూపీఐ):
  • భారతదేశంలో ఒక్క 2023 మే నెలలోనే రూ.14.89 ట్రిలియన్ల విలువైన 9.41 బిలియన్లకుపైగా లావాదేవీలు నమోదయ్యాయి.
  • ఇక 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను యూపీఐ లావాదేవీల మొత్తం విలువ భారత నామకార్థ ‘జిడిపి’లో దాదాపు 50 శాతం కావడం గమనార్హం.
  • ప్రైవేట్ రంగం కోసం ‘డిపిఐ’ల సంభావ్య అదనపు విలువ:

భారత్‌లో వ్యాపార కార్యకలాపాల సంబంధిత సంక్లిష్టత, వ్యయం, వ్యవధి తగ్గింపు ద్వారా దేశంలోని ప్రైవేట్‌ సంస్థల సామర్థ్యాన్ని ‘డిపిఐ’ మెరుగుపరిచింది.

  • ఈ మేరకు కొన్ని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు కూడా ‘ఎస్‌ఎంఇ’ రుణాల్లో 8 శాతం మేర అధిక మార్పిడి రేటును సాధించాయి. అలాగే తరుగుదల వ్యయంలో 65 శాతం ఆదా కాగా, మోసపూరిత లావాదేవీల గుర్తింపు వ్యయం 66 శాతందాకా తగ్గింది.
  • పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం- ‘డిపిఐ’ వినియోగం వల్ల భారత్‌లో బ్యాంకులకు ఖాతాదారు సేవల తలసరి వ్యయం 23 డాలర్ల నుంచి 0.1 డాలరుకు తగ్గింది.
  • బ్యాంకులకు ‘కేవైసీ’ నిబంధనల అనుసరణ వ్యయం తగ్గుదల:
  • దేశంలో ‘కేవైసీ’ నిబంధనల అనుసరణ ప్రక్రియ ‘ఇండియా శ్టాక్‌’ ద్వారా డిజిటలీకరణతోపాటు సరళీకరించడంతో దానిపై వ్యయం తగ్గింది. ‘ఇ-కేవైసీ’ ప్రక్రియను ఉపయోగించే బ్యాంకులు వాటి అనుసరణ వ్యయాన్ని 0.12 డాలర్ల నుంచి 0.06 డాలర్లకు తగ్గించుకోగలిగాయి. ఖర్చులలో తగ్గుదల వల్ల స్వల్పాదాయ ఖాతాదారులకు మరింత ఆకర్షణీయ సేవలందించేందుకు దోహదం చేసింది. అలాగే కొత్త ఉత్పత్తుల రూపకల్పనకు తగినమేర లాభార్జనకు తోడ్పడింది.
  • సీమాంతర చెల్లింపులు:
  • భారత్‌-సింగపూర్ దేశాల మధ్య 2023లో ‘యూపీఐ-పేనౌ’ అనుసంధానం అమలులోకి వచ్చింది. ఇది జి-20 ఆర్థిక సార్వజనీనత ప్రాథమ్యాలకు అనువైనది మాత్రమేగాక వేగంగా, చౌకగా, మరింత పారదర్శకంగా సీమాంతర చెల్లింపుల సౌలభ్యం కల్పిస్తుంది.
  •  
  • ఖాతా సమాచార సేవా ప్రదాతల (ఎఎ) చట్రం:
  • భారత ఖాతా సమాచార సేవాప్రదాతల చట్రం దేశంలో సమాచార మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఎలక్ట్రానిక్ ఆమోద చట్రం పరిధిలో వినియోగదారులు-సంస్థలు స్వీయ సమ్మతితో మాత్రమే సమాచారం పంచుకునేలా ఇది పర్యవేక్షిస్తుంది. ఈ చట్రం రిజర్వు బ్యాంకు నియంత్రణలో ఉంటుంది.
  • ఈ నేపథ్యంలో సమాచార మార్పిడి కోసం మొత్తం 1.13 బిలియన్ సంచిత ఖాతాలు ప్రారంభించబడ్డాయి. తదనుగుణంగా 2023 జూన్ నెలలో 13.46 మిలియన్ల సంచిత సమ్మతులు కూడా సేకరించబడ్డాయి.
  • సమాచార సాధికారత-రక్షణ వ్యవస్థ (డిఇపిఎ):
  • భారత ‘డిఇపిఎ’ వ్యవస్థ వ్యక్తిగత సమాచారంపై స్వీయ నియంత్రణ అధికారం కల్పిస్తుంది. అలాగే సేవాప్రదాతలతో వారి సమాచార భాగస్వామ్యానికీ వీలు కల్పిస్తుంది. ముందస్తు ఖాతాదారు సంబంధాలపై అధికంగా ఆధారపడే అవసరం లేకుండా ఆవిష్కరణ-పోటీతత్వం పెంచడం ద్వారా ఇది సముచిత ఉత్పత్తి-సరైన సేవల సౌలభ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

 

******



(Release ID: 1955544) Visitor Counter : 183