ప్రధాన మంత్రి కార్యాలయం

మూడు దశాబ్దాల అనిశ్చితి.. అస్థిరత.. రాజకీయ ఒత్తిళ్ల తర్వాత బలమైన.. సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుపై ప్రజలకు ప్రధాని అభినందన


‘సర్వజన హితం.. సర్వజన సుఖం’ తారకమంత్రంగా ప్రజాధనంలో
ప్రతి పైసా ఖర్చయ్యేలా ప్రభుత్వం అనుక్షణం శ్రమిస్తోంది: ప్రధానమంత్రి;

వివిధ రంగాలపై నిశిత దృష్టితో దేశంలో సమతుల ప్రగతి లక్ష్యంగా
సృష్టించిన కొత్త మంత్రిత్వ శాఖల పాత్రను నొక్కిచెప్పిన శ్రీ మోదీ

Posted On: 15 AUG 2023 12:44PM by PIB Hyderabad

   భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఎర్రకోట ప్రాకారం నుంచి 140 కోట్ల ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా- మూడు దశాబ్దాల అనిశ్చితి, అస్థిరత, రాజకీయ ఒత్తిళ్ల అనంతరం దేశంలో బలమైన, సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేశారంటూ ఆయన ప్రజలకు అభినందనలు తెలిపారు. ‘సర్వజన హితం, సర్వజన్ సుఖం’ తారకమంత్రంగా దేశ సమతుల ప్రగతి కోసం ఈ ప్రభుత్వం అనుక్షణం తపిస్తూ ప్రజా ధనంలో ప్రతిపైసానూ వెచ్చిస్తున్నదని పేర్కొన్నారు.

   తమ ప్రభుత్వం ‘దేశమే ప్రథమం’ అనే ఒకేఒక కొలబద్ద ప్రాతిపదికగా పనిచేస్తున్నదని చెప్పడానికి తానెంతో గర్విస్తున్నట్లు ప్రధాని అన్నారు. దీనికి అనుగుణంగానే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. దేశం నలుమూలలా పనిచేస్తున్న అధికార యంత్రాంగమే తమ కాళ్లూచేతులని శ్రీ మోదీ అభివర్ణించారు. ఈ యంత్రాంగంలోని భాగస్వాములంతా ‘పరివర్తన ప్రధానంగా కృషి’చేశారని “కాబట్టే ఈ ‘సంస్కరణ.. సామర్థ్యం.. పరివర్తన’ శకం నేడు దేశ భవిష్యత్తును రూపొందిస్తోంది. రాబోయే వెయ్యేళ్లకు పునాదిని బలోపేతం చేయగల శక్తులను దేశంలో మేం ప్రోత్సహిస్తున్నాం” అని వివరించారు.

సమతుల ప్రగతి కోసం కొత్త మంత్రిత్వ శాఖల ఏర్పాటు

   దేశంలో సమతుల ప్రగతి లక్ష్యంగా వివిధ రంగాలపై దృష్టి సారించి, కొత్త మంత్రిత్వశాఖలను ఏర్పాటు చేసినట్లు ప్రధానమంత్రి చెప్పారు. ప్రపంచానికి యువశక్తి అవసరమని, అలాంటి యువతరానికి నైపుణ్యం అత్యావశ్యకమని శ్రీ మోదీ స్పష్టం చేశారు. తదనుగుణంగా సృష్టించిన నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ భారతదేశ అవసరాలను మాత్రమేగా ప్రపంచ అవసరాలనూ తీర్చగలదని ధీమా వ్యక్తం చేశారు.

   అలాగే దేశంలోని ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించడంపై జలశక్తి మంత్రిత్వశాఖ దృష్టి సారిస్తోందని శ్రీ మోదీ అన్నారు. “పర్యావరణ రక్షణకు సున్నిత వ్యవస్థల రూపకల్పన అవసరాన్ని మేం పునరుద్ఘాటిస్తూ, దానిపై దృష్టి పెడుతున్నాం” అని ఆయన చెప్పారు. కరోనా మహమ్మారి కమ్ముకొచ్చిన వేళ భారత్‌ ప్రపంచానికి వెలుగు చూపిన తీరును వివరిస్తూ- ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఆయుష్ మంత్రిత్వ శాఖను సృష్టించిందని గుర్తుచేశారు. నేడు ఆయుష్‌ సహా యోగాభ్యాసం ప్రపంచవ్యాప్త ప్రకంపనలు సృష్టిస్తున్నాయని వ్యాఖ్యానించారు. భారతదేశం కరోనాను ధైర్యంగా ఎదుర్కొన్న నేపథ్యంలో ప్రపంచం నేడు అత్యావశ్యకమైన సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ దిశగా ఆశతో ఎదురుచూస్తున్నదని ఆయన అన్నారు.

   మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు గురించి ప్రస్తావిస్తూ- ఇవి దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలని, ఆర్థిక వృద్ధికి దోహదం చేసే కీలకరంగాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో  సమాజంలో ఏ ఒక్క వర్గమూ వెనుకబడకుండా ఈ కొత్త మంత్రిత్వశాఖ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని ఆయన చెప్పారు.

   సామాజిక ఆర్థిక వ్యవస్థలో సహకార ఉద్యమం ప్రధాన అంతర్భాగమని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు కొత్తగా ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖ తన నెట్‌వర్క్‌ ను సహకార సంస్థల ద్వారా విస్తరిస్తున్నదని చెప్పారు. తద్వారా నిరుపేదల అవసరాలను తెలుసుకుని, సంపూర్ణంగా తీర్చడానికి కృషి చేసే వీలుంటుందని ఆయన అన్నారు. ప్రగతి సాధన యంత్రాంగంలో ఓ చిన్న భాగస్వామిగా దేశాభివృద్ధికి సంఘటిత మార్గంలో సహకరించేలా ఈ మంత్రిత్వశాఖ వారికి సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు. ఈ మేరకు “మేం సహకారం ద్వారా సౌభాగ్యానికి పయనించే మార్గాన్ని ఎంచుకున్నాం” అని ప్రధాని వివరించారు.

 

*****

RM/DS/VM

 



(Release ID: 1948994) Visitor Counter : 100