వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ధరలు పెరిగిన ప్రధాన వినియోగ కేంద్రాల్లో పంపిణీ చేయడానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి టమోటాలను కొనుగోలు చేయాలని జాతీయ వ్యవసాయ
సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్), జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్సీసీఎఫ్) లను ఆదేశించిన కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో రిటైల్ కేంద్రాల ద్వారా తక్కువ ధరలకు టమోటాల విక్రయం
మండీల నుంచి టమోటాలను సేకరించనున్న జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య
Posted On:
12 JUL 2023 12:46PM by PIB Hyderabad
గత నెల రోజుల నుంచి విపరీతంగా పెరిగిన టమాట ధరలు నియంత్రించడానికి తక్షణం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి టమోటాలను కొనుగోలు చేయాలని జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్), జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్సీసీఎఫ్)లకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సేకరించిన టమోటాలను ఈ శుక్రవారం ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో రిటైల్ కేంద్రాల ద్వారా తక్కువ ధరలకు విక్రయిస్తారు.
అఖిల భారత స్థాయి ధరల సూచిక సగటుకు మించి గత నెల రోజులుగా ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో డిస్కౌంట్ ధరకు టమోటాలను విక్రయిస్తారు. ధరల విషయంలో జోక్యం చేసుకోవడానికి రాష్ట్రాల్లో వినియోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను మంత్రిత్వ శాఖ గుర్తించింది.
దేశంలో అన్ని ప్రాంతాల్లో టొమాటో ఉత్పత్తి అవుతోంది. అయితే, దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో టొమాటో ఎక్కువగా సాగు అవుతోంది. ఈ రెండు ప్రాంతాల్లో దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం పంటలో 56%-58% పంట ఉత్పత్తి జరుగుతోంది. మిగులు లో ఉన్న దక్షిణ, పశ్చిమ ప్రాంతాల నుంచి సీజన్‌లను బట్టి ఇతర మార్కెట్‌లకు టొమాటో సరఫరా అవుతుంది. టొమాటో పంట కాలం ప్రాంతాల వారీగా విభిన్నంగా ఉంటుంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు టొమాటో ఎక్కువగా పండుతుంది. జూలై-ఆగస్టు, అక్టోబర్-నవంబర్ మధ్య టొమాటో తక్కువగా ఉత్పత్తి అవుతుంది. పంట తక్కువగా ఉండడం, వర్షాకాలం కావడంతో జూలై నెలలో టమోటా మార్కెట్ సమస్యలు ఎదుర్కొంటుంది. రవాణా పరమైన సమస్యలు, గమ్య స్థానం చేరుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, రవాణా నష్టాలు లాంటి సమస్యలు ఎదురవుతాయి. నాటడం, పంట చేతికి రావడం లాంటి అంశాలు ప్రాంతాల వారీగా మారుతూ వస్తుంటాయి. సరఫరా తగ్గడం, వాతావరణ పరిస్థితులు లాంటి కారణాల వల్ల ఒక్కోసారి ధరలు విపరీతంగా ఆకస్మికంగా పెరుగుతుంటాయి.
ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్ తో కొన్ని రాష్ట్రాలకు టొమాటో మహారాష్ట్రలోని సతారా, నారాయణగావ్, నాసిక్ నుంచి సరఫరా అవుతోంది. ఈ నెలాఖరు వరకు సరఫరాలు ఉంటాయి.ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె (చిత్తూరు) నుంచి కూడా సహేతుకమైన పరిమాణంలో టొమాటో వస్తున్నది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌కు ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్, కొంత పరిమాణం కర్ణాటకలోని కోలార్ నుంచి టొమాటో సరఫరా అవుతోంది.
నాసిక్ జిల్లాలో త్వరలో కొత్త పంటలు వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు నెలలో నారాయణగావ్ , ఔరంగాబాద్ ప్రాంతాల నుంచి అదనపు సరకు వచ్చే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ నుంచి కూడా సరఫరా ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. తదనుగుణంగా సమీప భవిష్యత్తులో ధరలు తగ్గుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
***
(Release ID: 1938941)
Visitor Counter : 207