ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని వ్యాఖ్యల పాఠం

Posted On: 21 JUN 2023 11:30PM by PIB Hyderabad

   గౌరవనీయులైన ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ అధ్యక్షులు జబా కొరోసి..

ఐరాస ఉప ప్రధాన కార్యదర్శి శ్రీమతి అమీనా జె.మొహమ్మద్‌..

న్యూయార్క్‌ నగర మేయర్‌ శ్రీ ఎరిక్‌ ఆడమ్స్‌...

ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన నా ప్రియ స్నేహితులారా!

నమస్కారం!

మిత్రులారా!

   నేటి  శుభోదయాన మనమంతా అద్భుతమైన ఈ న్యూయార్క్‌ నగరంలో సకల మానవాళి ఏకమయ్యే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో సమావేశమయ్యాం! మీరంతా చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఉంటారన్న విషయం నాకు తెలుసు. ఇక్కడికి రావడం కోసం మీలో చాలామంది సూర్యోదయానికి ముందే మేల్కొని, సిద్ధమై ఉంటారు. ఏదేమైనా మిమ్మల్నందర్నీ చూడటం నాకెంతో ఆనందం కలిగించింది. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు!

మిత్రులారా!

   క్షణంలో దాదాపు ప్రతిదేశానికీ ప్రాతినిధ్యం వహించేవారు ఇక్కడ సమావేశమైనట్లు నాకు సమాచారం అందింది. అందునా ‘యోగా’ వంటి అద్భుత కార్యక్రమం మనందర్నీ ఒకచోటకు చేర్చడం మహదానందం కలిగిస్తోంది!

   యోగా అంటే- ఏకీకరణ… కాబట్టి మీ అందరి సమ్మేళనం యోగాకు మరో రూపం. నాకు బాగా గుర్తుంది… సుమారు తొమ్మిదేళ్ల కిందట సరిగ్గా ఈ ఐరాస కార్యాలయంలోనూ జూన్‌ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవ దినంగా ప్రకటించాలని నేను ప్రతిపాదించాను.

   ఆనాడు నా ప్రతిపాదనకు ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన సానుకూల స్పందనను ప్రత్యక్షంగా చూడటం నాకొక అద్భుతం. ఐరాసలో శాంతి స్థాపక యోధుల స్మారకం వద్ద కొద్ది క్షణాల కిందటే నేను నివాళి అర్పించాను. ఇక 2015లో ఈ శాంతి యోధుల సంస్మరణార్థం కొత్త స్మారకం నిర్మాణానికి నేను విజ్ఞప్తి చేశాను.

   ఈ నేపథ్యంలో గత వారం యావత్‌ ప్రపంచం భారత్‌తో చేయికలిపి త్వరలో దీన్ని సాకారం చేసేందుకు మద్దతిస్తామని ప్రకటించింది. ప్రపంచ శాంతిస్థాపనకు అధిక సంఖ్యలో దళాలను పంపే దేశంగా మా ఉదాత్త ఆశయానికి చేయూతనిస్తామని ప్రకటించిన అన్ని దేశాలకూ మేం కృతజ్ఞతలు తెలుపుతున్నాం.

   అదేవిధంగా 2023ను అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరంగా నిర్వహించాలన్న మా గత సంవత్సర ప్రతిపాదనను కూడా ప్రపంచం ముక్తకంఠంతో సమర్థించింది. చిరుధాన్యాలు అద్భుతమైన ఆహారధాన్యాలు. మానవాళి సంపూర్ణ ఆరో్గ్యం-శ్రేయస్సుకే కాకుండా పర్యావరణానికీ చిరుధాన్యాలు ఎంతగానో దోహదం చేస్తాయి. ఇక ఇవాళ ప్రపంచం యావత్తూ యోగాభ్యాసం కోసం ఏకం కావడం మరొక అద్భుతమని చెప్పక తప్పదు!

మిత్రులారా!

   యోగా భారతదేశం నుంచి ఆవిర్భవించింది. ఇదెంతో ప్రాచీన సంప్రదాయం… అయినప్పటికీ అన్ని పురాతన భారతీయ సంప్రదాయాల తరహాలోనే ఇది కూడా నిత్య నూతనం, చైతన్యవంతమైనదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. యోగా పూర్తిగా ఉచితం – దీనికి మేధోసంపద హక్కులేమీ లేవు… వస్తూత్పత్తి హక్కులు అసలే వర్తించవు. రాయల్టీ చెల్లింపులేవేవీ లేవు. మీ వయస్సు, లింగం, శరీర దృఢత్వ స్థాయి వంటివాటితో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికీ యోగా సానుకూలం. ఇది ఎక్కడైనా, ఏ సమయంలోనైనా చేయగలిగే వీలుంది. ఆ మేరకు ఇంట్లో.. ఆఫీసులో.. చివరకు ప్రయాణంలో కూడా యోగా చేయవచ్చు.

   యోగా అనువైనది- మీరు ఒంటరిగా లేదా సమూహంలో దీన్ని సాధన చేయవచ్చు. గురుముఖతా నేర్చుకుని, మీరే బోధకులు కావచ్చు. యోగా ప్రతి ఒక్కరినీ ఏకం చేస్తుంది. జాతిభేదం, విశ్వాస వ్యత్యాసంతో నిమిత్తం లేకుండా  అన్ని సంస్కృతులకూ సానుకూలం… నిజంగా ఇది విశ్వవ్యాప్తం!

మిత్రులారా!

   మనం యోగా చేస్తున్నపుడు శరీర దృఢత్వం, మానసిక ప్రశాంతత భావన, భావోద్వేగపరంగా సంతృప్తి కలుగుతాయి. అయితే, ఇది కేవలం ఓ మెత్తని చాపై కసరత్తులు చేయడానికి పరిమితం కాదు. ఇదొక జీవన విధానం… చక్కని ఆరోగ్యం-శ్రేయస్సుకు ఓ సంపూర్ణ మార్గం. ఆలోచనలు, చర్యలలో ఏకాగ్రతకు మార్గం. మనతో మనం.. ఇతరులతో మనం.. ప్రకృతితో మనమంతా సామరస్యంతో సహజీవనం చేసే విధానం. మీలో చాలామంది యోగాలోని వివిధ అంశాలను శాస్త్రీయంగా ధ్రువీకరించుకునే కృషి చేస్తున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. నిజనిర్ధారణకు ఇదే మార్గం అన్నది వాస్తవం.

మిత్రులారా!

   మీరంతా ఇవాళ్టినుంచే ప్రారంభించడానికి ఉత్సాహంగా ఉన్నారని నాకు తెలుసు! సరే… నేనూ అదే స్థితిలో ఉన్నాను. ఇవాళ ఇక్కడ మాకు ఆతిథ్యమిచ్చినందుకు ఐక్యరాజ్యసమితికి కృతజ్ఞతలు చెప్పాలని భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మద్దతు ఇచ్చినందుకు మేయర్‌ సహా న్యూయార్క్ నగరవాసులందరికీ నా కృతజ్ఞతలు. అన్నింటికీ మించి, ఇవాళ ఇక్కడ ఉన్నందుకు నేను మరోసారి మీకందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. మనం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటమేగాక మనతో మనం, పరస్పరం సహానుభూతితో ఉండటానికి కూడా యోగా శక్తిని సద్వినియోగం చేద్దాం.

   స్నేహవారధులు, శాంతియుత ప్రపంచ, పరిశుభ్ర-హరిత, సుస్థిర భవిష్యత్తు నిర్మాణం కోసం యోగా శక్తిని వాడుకుందాం. “ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు” లక్ష్య సాకారానికి మనమంతా చేయికలిపి కదులుదాం! ఈ మేరకు బలమైన ఆకాంక్షను వెలిబుచ్చుతూ నా ప్రసంగం ముగిస్తున్నాను.

సర్వే భవన్తు సుఖినః

సర్వే సంతు నిరామయః

ప్రతి ఒక్కరూ సంతోషంతో జీవింతురుగాక… ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో వర్ధిల్లుదురుగాక!

 

ధన్యవాదాలు…

అనేకానేక ధన్యవాదాలు!

*****


(Release ID: 1934602) Visitor Counter : 159