ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023 సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి


యోగా ప్రపంచ స్ఫూర్తిగా, ప్రజా ఉద్యమంగా మారింది.. ప్రధానమంత్రి

'వసుదైక కుటుంబం స్ఫూర్తిగా యోగా వివిధ దేశాలకు చెందిన ప్రజలను ఏకం చేస్తోంది.. ప్రధానమంత్రి

"ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు" స్ఫూర్తితో జీ-20 అధ్యక్ష హోదాలో భారతదేశం పని చేస్తుంది.. ప్రధానమంత్రి

ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా డాక్టర్ మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో న్యూ ఢిల్లీ ఎయిమ్స్ లో జరిగిన సామూహిక యోగా కార్యక్రమాలు

భారతదేశ మృదువైన శక్తిగా యోగా మారింది.. మాండవీయ

“యోగా మనస్సును శాంతపరచి శరీరానికి శక్తినిస్తుంది. ఆరోగ్యం, సంక్షేమం గురించి మాట్లాడినప్పుడల్లా యోగా మన స్ఫురణకు వస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించే యోగా ఒక రకమైన నివారణ సంరక్షణ ఇస్తుంది.''

'' కోవిడ్ తదనంతరం ఆరోగ్యం, సంరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన పెరిగిన నేపథ్యంలో యోగా ప్రాముఖ్యత, ప్రాధాన్యత మరింత పెరిగింది''

యోగాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ మాండవీయ

Posted On: 21 JUN 2023 10:02AM by PIB Hyderabad

ప్రపంచ యోగా దినోత్సవం 2023 సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.  "యోగా ప్రపంచ స్ఫూర్తిగా, ప్రజా ఉద్యమంగా మారింది. వసుదైక కుటుంబం స్ఫూర్తితో భారతదేశం జీ-20 అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తోంది.ఇదే స్ఫూర్తితో యోగా వివిధ దేశాలకు చెందిన ప్రజలను ఏకం చేస్తోంది. 'ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు." నినాదం అందరికీ ఆదర్శంగా ఉండాలి" అని   ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.    

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీ ఎయిమ్స్ లో  జరిగిన సామూహిక యోగా కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు యోగాసనాలు వేశారు. 

ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ప్రసంగించిన డాక్టర్ మాండవీయ యోగా ప్రాముఖ్యత, చరిత్ర వివరించారు. “యోగా  భారతదేశ పురాతన సంప్రదాయం, అయితే కాలక్రమేణా యోగా అభ్యాసం తగ్గడం ప్రారంభించింది. అయితే, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చొరవతో యోగాకి పూర్వ వైభవం సిద్దించింది.  ప్రస్తుతం ప్రతి దేశంలో యోగాను అభ్యసిస్తున్నారు. భారతదేశం  మృదువైన శక్తి గా  యోగా మారింది."అని డాక్టర్ మాండవీయ అన్నారు. 

 

రోజువారీ జీవితంలో యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను డాక్టర్ మాండవీయ వివరించారు.  “యోగా మనస్సును శాంత పరుస్తుంది.  శరీరానికి శక్తినిస్తుంది. ఆరోగ్యం, సంక్షేమం  గురించి మాట్లాడినప్పుడల్లా యోగా స్ఫురణకు వస్తుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది యోగ  ఒక రకమైన నివారణ సంరక్షణ" అని మంత్రి అన్నారు. 

యోగా ప్రాధాన్యతను గుర్తించిన ప్రజలు పెద్ద సంఖ్యలో యోగా చేస్తున్నారని డాక్టర్ మాండవీయ తెలిపారు.

 “కోవిడ్ తదనంతరం  ప్రజలు తమ ఆరోగ్యం, సంరక్షణ పట్ల మరింత అవగాహన పెంచుకున్నారు. దీంతో యోగా ఔచిత్యం, ప్రజాదరణ కూడా గణనీయంగా పెరిగింది" అని మంత్రి అన్నారు.

కార్యక్రమానికి  డాక్టర్ మాండవీయ సైకిల్ తొక్కుతూ వచ్చారు. ఎయిమ్స్ లో అమలు జరుగుతున్న 'గో గ్రీన్' కార్యక్రమానికి మంత్రి తన సహకారం అందించారు. 

 

యోగాకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి డాక్టర్ మాండవీయ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాను అభ్యసించడమే కాకుండా ఇతరులను కూడా అభ్యసించేలా ప్రోత్సహించాలని ఆయన కోరారు. 

కార్యక్రమాన్ని : https://www.youtube.com/watch?v=Z201HxCOA5Y లో చూడవచ్చు. 

కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ సుధాన్షు పంత్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ రాజీవ్ మాంఝీ, న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం శ్రీనివాస్ , ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు  పాల్గొన్నారు.

***



(Release ID: 1933906) Visitor Counter : 106