ప్రధాన మంత్రి కార్యాలయం
క్రీడా భారతం 3వ విశ్వవిద్యాలయ క్రీడలను ప్రారంభించిన ప్రధానమంత్రి
“ఒకే భారతం - శ్రేష్ట భారతం’ స్ఫూర్తికి ఈ క్రీడలు కీలక మాధ్యమంగా మారాయి”;
“దేశంలో గత తొమ్మిదేళ్లలో క్రీడా మాధ్యమం ద్వారా
సమాజాన్ని శక్తిమంతం చేసే కొత్త క్రీడాశకం ప్రారంభమైంది;
“క్రీడలు నేడు ఆకర్షణీయ వృత్తిగా మారాయి... ఈ మార్పులో
క్రీడా భారతం కార్యక్రమం ప్రధాన పాత్ర పోషించింది”;
“క్రీడలు పాఠ్యప్రణాళికలో భాగం కావాలని జాతీయ విద్యావిధానం ప్రతిపాదించింది”;
“క్రీడా భారతం దేశ సంప్రదాయ క్రీడల వైభవాన్ని కూడా పునరుద్ధరించింది”;
“మీ ప్రతిభ.. ముందంజపైనే దేశ ప్రగతి ఆధారపడింది.. భవిష్యత్ విజేతలు మీరే”;
“స్వప్రయోజనాలకు భిన్నంగా సమష్టి విజయ సాధనలో క్రీడలే మనకు స్ఫూర్తి”
Posted On:
25 MAY 2023 8:17PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా క్రీడా భారతం (ఖేలో ఇండియా) 3వ విశ్వవిద్యాలయ క్రీడలు-2023ను ప్రారంభించారు. దేశంలోని 200కుపైగా విశ్వవిద్యాలయాల నుంచి 4750 మంది క్రీడాకారులు మొత్తం 21 క్రీడాంశాల్లో తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తారు. ఈ క్రీడల నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ ప్రధాని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉత్తరప్రదేశ్ నేడు క్రీడా-ప్రతిభా సంగమంగా మారిందని వ్యాఖ్యానించారు. వివిధ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుంచి 4000 మందికిపైగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యునిగా వారందర్నీ ప్రత్యేకంగా స్వాగతిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో తన నియోజకవర్గమైన వారణాసిలో క్రీడల ముగింపు కార్యక్రమం నిర్వహించనుండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారతదేశం స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు నిర్వహించుకుంటున్న తరుణంలో క్రీడా భారతం 3వ విశ్వవిద్యాలయ క్రీడలు నిర్వహించడంలోని ప్రాముఖ్యాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సమష్టి శక్తితోపాటు ‘ఒకే భారతం - శ్రేష్ట భారతం’ స్ఫూర్తిని పెంపొందించడంలో ఈ కార్యక్రమం అద్భుత మాధ్యమంగా మారిందఅన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులు పరస్పరం మమేకమవుతారని, ఉత్తరప్రదేశ్‌లో ఈ పోటీలు నిర్వహించే ఇతర ప్రాంతాలను కూడా వారు సందర్శిస్తారని చెప్పారు. దీనివల్ల ఆయా ప్రదేశాలతో వారికి అనుబంధం ఏర్పడగలదని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తంమీద ‘కీడా భారతం’ విశ్వవిద్యాలయ క్రీడల్లో పాల్గొనడం క్రీడాకారులందరికీ మధుర జ్ఞాపకం కాగలదనే ప్రగాఢ విశ్వాసం ప్రకటించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులందరూ ఈ క్రీడల్లో చిరస్మరణీయ విజయం సాధించాలని ఆకాంక్షించారు.
దేశంలో గత తొమ్మిదేళ్లలో కొత్త క్రీడాశకం ప్రారంభమైందని ప్రధానమంత్రి అన్నారు. ఇది భారతదేశాన్ని అగ్రశ్రేణి క్రీడాశక్తిగా రూపుదిద్దడమేగాక క్రీడా మాధ్యమం ద్వారా సమాజాన్ని శక్తిమంతం చేయగలదని ఆయన అభివర్ణించారు. క్రీడలకు ప్రభుత్వాల నుంచి అవసరమైన మద్దతు లభించని దుస్థితి ఒకనాడు ఉండేవని ప్రధాని గుర్తుచేశారు. దీంతో పేద, మధ్య తరగతి, గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలంటే తీవ్ర ఇబ్బందులు పడేవారని పేర్కొన్నారు. అలాగే జీవనోపాధి మార్గంగా దీని పరిధి పరిమితం కావడంతో చాలామంది తల్లిదండ్రులు కూడా పిల్లలను క్రీడలవైపు ప్రోత్సహించలేదని గుర్తుచేశారు. అయితే, నేడు వారి దృక్పథంలో భారీ మార్పు వచ్చిందంటూ- “క్రీడలు నేడు ఆకర్షణీయ వృత్తిగా మారాయి. ఈ పరివర్తనలో క్రీడా భారతం కార్యక్రమం ప్రధాన పాత్ర పోషించింది” అని ప్రధాని వివరించారు.
క్రీడలపై గత ప్రభుత్వాల ఉదాసీన ధోరణికి లోగడ కామన్వెల్త్ క్రీడల చుట్టూ అలముకున్న కుంభకోణాల ఆరోపణలే నిదర్శనమని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అప్పట్లో పంచాయతీ యువక్రీడలు-క్రీడా కార్యక్రమం వంటి పథకాల్లో ప్రభుత్వపరంగా చిత్తశుద్ధి లోపించిందని పేర్కొన్నారు. ఆ తర్వాత దీనికి ‘రాజీవ్ గాంధీ అభియాన్’ అని పేరు మార్చారని పెట్టారు. ఈ మేరకు మునుపటి కాలంలో క్రీడా మౌలిక సదుపాయాల కొరతపై శ్రీ మోదీ విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడు పరిస్థితులన్నీ మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు. పట్టణ క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు నాటి ప్రభుత్వాలు 60 ఏళ్లలో కేవలం రూ.300 కోట్లు ఖర్చుచేయగా, నేడు క్రీడా భారతం కింద రూ.3000 కోట్లు వెచ్చించామని గుర్తుచేశారు. దీనివల్ల మరింత ఎక్కువమంది క్రీడాకారులు ఆటల్లో పాల్గొనే సౌలభ్యం కలిగిందని ప్రధానమంత్రి అన్నారు. క్రీడా భారతం కింద నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో 30,000 మంది క్రీడాకారులు పాల్గొనడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. వీరిలో 1,500 మందికి ఈ కార్యక్రమం కింద ఆర్థిక సాయం లభిస్తోందని తెలిపారు. ఇక బడ్జెట్‌లో 9 ఏళ్ల కిందటితో పోలిస్తే నేడు కేటాయింపులు మూడు రెట్లు పెరిగినట్లు వెల్లడించారు. తద్వారా గ్రామీణ, మారుమూల ప్రాంతాలకూ మెరుగైన క్రీడా మౌలిక సదుపాయాలు లభిస్తున్నాయని చెప్పారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో క్రీడారంగం ప్రగతిని ప్రస్తావిస్తూ- లక్నోలో క్రీడా సౌకర్యాల విస్తరణ, వారణాసిలో సిగ్రా స్టేడియం ఆధునికీకరణ, రూ.400 కోట్లతో ఆధునిక క్రీడా సౌకర్యాల కల్పన గురించి వివరించారు. లాల్‌పూర్, మీరట్‌లలోని సింథటిక్ హాకీ మైదానాలు, గోరఖ్‌పూర్‌లోని వీర్ బహదూర్ సింగ్ స్పోర్ట్స్ కాలేజీలో మల్టీ పర్పస్ హాల్, షహరాన్‌పూర్‌లోని సింథటిక్ రన్నింగ్ ట్రాక్‌లను ఆయన ఉదాహరించారు. క్రీడాకారులకు అనేక పోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తున్నదని ప్రధాని పేర్కొన్నారు. తద్వారా తమ ప్రతిభ అంచనా, మెరుగు దిశగా వారికి మరిన్ని అవకాశాలు లభిస్తున్నాయని ఉద్ఘాటించారు. క్రీడా భారతం కింద విశ్వవిద్యాలయ క్రీడలే కాకుండా శీతాకాల క్రీడలు కూడా నిర్వహించడాన్ని ప్రధాని ప్రస్తావించారు. క్రీడా భారతం కింద ఆటల పోటీలు ప్రారంభించడానికి ప్రధాన కారణం ఇదేనని తెలిపారు. ఈ కృషితో సత్ఫలితాలు లభిస్తున్నాయని, మన క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం పెరిగినందున అంతర్జాతీయ పోటీల్లో గొప్ప ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు.
క్రీడలను పాఠ్యప్రణాళికలో ఒక పాఠ్యాంశంగా చేర్చాలని జాతీయ విద్యా విధానం ప్రతిపాదిస్తున్నదని ప్రధానమంత్రి వెల్లడించారు. దీంతోపాటు దేశంలో తొలి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం నిర్మాణంతో క్రీడారంగం మరింత బలపడుతుందని ప్రధాని తెలిపారు. రాష్ట్రాల స్థాయిలో క్రీడా-ప్రత్యేక ఉన్నత విద్య కోర్సులు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. క్రీడా రంగం ప్రగతికి ఉత్తరప్రదేశ్ ప్రశంసనీయంగా కృషి చేస్తున్నదని, మీరట్‌లో మేజర్ ధ్యాన్‌చంద్ క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనమని ఉదాహరించారు. దేశవ్యాప్తంగా 1000 ఖేలో ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దాదాపు 12 జాతీయ క్రీడానైపుణ్య కేంద్రాలను కూడా ఇప్పటికే పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి వెల్లడించారు. వీటిలో శిక్షణతోపాటు క్రీడాశాస్త్ర మద్దతుకూ వీలుంటుందని తెలిపారు. “క్రీడా భారతం దేశంలో సంప్రదాయ క్రీడల వైభవాన్ని కూడా పునరుద్ధరించింది” అని ప్రధాని గుర్తుచేశారు. ఇందులో భాగంగా గట్కా, మల్లకంభం, తంగ్-టా, కలరిపయట్టు, యోగాభ్యాసం వంటి వివిధ స్వదేశీ క్రీడల ప్రోత్సహిస్తూ ప్రభుత్వం ఉపకార వేతనాలు కూడా మంజూరు చేస్తున్నదని ప్రధాని ప్రముఖంగా వివరించారు.
క్రీడా భారతం కార్యక్రమంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంవల్ల ప్రోత్సాహకర ఫలితాలు వస్తున్నాయని ప్రధాని అన్నారు. ఈ నేపథ్యంలో క్రీడా భారతం కింద దేశంలోని పలు నగరాల్లో ‘ఇండియా ఉమెన్స్ లీగ్’ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో ఇప్పటిదాకా 23 వేలమంది వరకూ వివిధ వయసుల మహిళా క్రీడాకారులు పాల్గొన్నారని వివరించారు. ప్రస్తుత విశ్వవిద్యాలయ క్రీడల్లో మహిళా క్రీడాకారుల పెద్ద సంఖ్యలో పాల్గొనడాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ- వారికి శుభాకాంక్షలు తెలిపారు.
“మీ ప్రతిభ, ముందంజపైనే దేశ ప్రగతి ఆధారపడింది. భవిష్యత్ విజేతలు మీరే..” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఆ మేరకు త్రివర్ణ పతాక ప్రతిష్టను సమున్నత శిఖరాలకు చేర్చే బాధ్యత క్రీడాకారుల భుజస్కంధాలపై ఉందన్నారు. క్రీడాస్ఫూర్తి, సమష్టి కృషి గురించి ప్రస్తావిస్తూ- ఇది గెలుపోటములను అంగీకరించడం, జట్టుకృషికి మాత్రమే పరిమితమా? అని క్రీడాకారులను ప్రశ్నించారు. క్రీడాస్ఫూర్తి అంటే దీనికన్నా విస్తృతమైనదని ప్రధాని వివరించారు. ఆ మేరకు స్వప్రయోజనాలకన్నా సమష్టి విజయం దిశగా క్రీడలు మనకు ప్రేరణ ఇస్తాయన్నారు. క్రీడలు మనకు హుందాగా ప్రవర్తించడాన్ని, నిబంధనలు పాటించడాన్ని కూడా నేర్పుతాయని ఆయన వ్యాఖ్యానించారు. చివరగా, ప్రతికూల పరిస్థితులలో ఆటగాళ్లు సంయమనం కోల్పోకుండా నిబంధనలకు సదా కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు. ఆ మేరకు నియమనిబంధనల పరిమితులలోననే ప్రత్యర్థిపై ఓర్పుతో విజయం సాధించడమే ఆటగాళ్లకు గొప్ప గుర్తింపునిస్తుందని స్పష్టం చేశారు. “ఒక విజేత సదా క్రీడాస్ఫూర్తిని, హుందాతనాన్ని అనుసరించినప్పుడు... సమాజం అతని ప్రతి కదలిక నుంచి స్ఫూర్తి ప్రేరణ పొందినప్పుడే గొప్ప ఆటగాడు కాగలడు” అంటూ ఆయన తన ప్రసంగం ముగించారు.
నేపథ్యం
దేశంలో క్రీడా సంస్కృతిని పెంచడంతోపాటు క్రీడల్లో యువత ప్రోత్సాహంపై ప్రధానమంత్రి విస్తృతంగా దృష్టి సారించారు. తదనుగుణంగా వర్ధమాన క్రీడాకారులను ఆదుకోవడానికి ప్రభుత్వం వివిధ పథకాలను ప్రారంభించింది. అలాగే దేశంలో క్రీడా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి మొదలైంది. ఈ దిశగా క్రీడా భారతం విశ్వవిద్యాలయ క్రీడల నిర్వహణ మరో ముందడుగు.
ఈ సంవత్సరం క్రీడా భారతం 3వ విశ్వవిద్యాలయ క్రీడలు ఉత్తరప్రదేశ్‌లో మే 25న ప్రారంభం కాగా, జూన్ 3 వరకూ నిర్వహిస్తారు. ఈ క్రీడలను వారణాసి, గోరఖ్‌పూర్, లక్నో, గౌతమ్ బుద్ధ నగర్‌లలో నిర్వహిస్తుండగా 200కుపైగా విశ్వవిద్యాలయాల నుంచి 4750 మంది క్రీడాకారులు 21 క్రీడాంశాల్లో పోటీపడతారు. వారణాసిలో జూన్ 3న ఈ క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఆటల చిహ్నంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జంతువు ‘చిత్తడి జింక’ (బారసింఘ)ను ఎంపిక చేసి, ‘జితు’గా నామకరణం చేశారు.
(Release ID: 1927530)
Visitor Counter : 203
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam