ప్రధాన మంత్రి కార్యాలయం

స్వాగత్ కార్యక్రమం 20 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు


"ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి సాంకేతికతను ఎలా సమర్ధవంతంగా ఉపయోగించవచ్చో, గుజరాత్‌ లో అమలౌతున్న స్వాగత్ కార్యక్రమం తెలియజేసింది"


"పదవి ద్వారా లభించిన పరిమితులకు నేను బానిసను కానని స్పష్టం చేస్తున్నాను. నేను ప్రజల మధ్యనే ఉంటూ, వారికి అండగా ఉంటాను”


"సులభమైన జీవనం, అందుబాటులో పరిపాలన అనే ఆలోచనతో స్వాగత్ ప్రారంభమయ్యింది"


"స్వాగత్ ద్వారా గుజరాత్ ప్రజలకు సేవ చేయడమే నాకు అతిపెద్ద ప్రతిఫలం"


"పరిపాలన అనేది పాత నియమాలు, చట్టాలకే పరిమితం కాదని, ఆవిష్కరణలు, నూతన ఆలోచనల కారణంగా పాలన సాగుతుందని మేము నిరూపించాము"


“పరిపాలనలో అనేక పరిష్కారాలకు స్వాగత్ ప్రేరణగా మారింది. చాలా రాష్ట్రాలు ఈ తరహా వ్యవస్థపై పనిచేస్తున్నాయి”


“గత తొమ్మిదేళ్ళలో దేశం వేగంగా అభివృద్ధి చెందడంలో ప్రగతి పెద్ద పాత్ర పోషించింది. ఈ భావన కూడా స్వాగత్ ఆలోచన పైనే ఆధారపడి పనిచేస్తోంది”

Posted On: 27 APR 2023 5:25PM by PIB Hyderabad

సాంకేతికతను ఉపయోగించి రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులను పరిష్కరించే "స్వాగత్" అనే కార్యక్రమాన్ని ప్రారంభించి 20 సంవత్సరాలైన సందర్భంగా గుజరాత్ లో నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు.   ఈ కార్యక్రమం విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం స్వాగత్ సప్తాహాన్ని జరుపుకుంటోంది.

ఈ ప‌థ‌కం ద్వారా గతంలో ప్రయోజనం పొందిన ల‌బ్దిదారుల‌తో కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా  సంభాషించారు.

సభనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, "స్వాగత్" ప్రారంభించడం వెనుక ఉన్న లక్ష్యం విజయవంతంగా నెరవేరిందని పేర్కొన్నారు. అదేవిధంగా పౌరులు తమ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంతో పాటు, సమాజంలోని వందలాది మంది ప్రజల మొత్తం సమస్యలను లేవనెత్తడం పట్ల ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.  "ప్రభుత్వ వైఖరి స్నేహపూర్వకంగా ఉండాలిఅప్పుడే సామాన్య పౌరులు సైతం తమ సమస్యలను వారితో సులభంగా పంచుకోగలరు" అని ప్రధానమంత్రి సూచించారు.   "స్వాగ‌త్" కార్య‌క్ర‌మం ప్రారంభించి ఇరవై ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న సందర్భాన్ని ప్ర‌ధానమంత్రి ప్ర‌స్తావిస్తూ, ల‌బ్దిదారుల‌తో సంభాషించిన అనంతరం తమ అనుభ‌వాల‌ను గుర్తు చేసుకున్నారు.  పౌరుల కృషి, అంకితభావం వల్లే "స్వాగత్‌" కార్యక్రమం అద్భుతంగా విజయవంతమయ్యిందనీ, ఈ దిశగా సహకరించిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. 

ఏ పథకమైనా ఆ పథకాన్ని ప్రారంభించిన సమయంలో రూపొందించిన దాని ఉద్దేశం, దృక్పథం ద్వారా దాని భవితవ్యాన్ని నిర్ణయించడం జరుగుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.   2003 సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ముఖ్యమంత్రి గా తనకు పెద్దగా అనుభవం లేదని, అయితే, అధికారం అందరినీ మారుస్తుందనే సాధారణ వ్యాఖ్యలను తాను కూడా ఎదుర్కొన్నానని ఆయన గుర్తు చేసుకున్నారు. అధికార పీఠాన్ని అధిష్టించడం ద్వారా తన ప్రవర్తనలో మార్పు రాదని ఆయన స్పష్టం చేశారు.  "పదవి ద్వారా లభించిన పరిమితులకు నేను బానిసను కానని స్పష్టం చేస్తున్నాను.  నేను ప్రజల మధ్యనే ఉంటూ, వారికి అండగా ఉంటాను” అని అన్నారు. ఈ దృఢ సంకల్పమే సాంకేతికతను ఉపయోగించి రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులను పరిష్కరించే "స్వాగత్" అనే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రేరణనిచ్చింది.  చట్టాలు లేదా పరిష్కారాల విషయంలో ప్రజాస్వామ్య సంస్థల పట్ల సాధారణ ప్రజల అభిప్రాయాలను స్వాగతించడమే "స్వాగత్" కార్యక్రమం వెనుక ఉన్న ఆలోచన అని ప్రధానమంత్రి వివరించారు.  "సులభమైన జీవనం, అందుబాటులో పరిపాలన అనే ఆలోచనకు ఆలంబనగా నిలిచేదే స్వాగత్" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

ప్రభుత్వం పూర్తి నిజాయితీతో, అంకితభావంతో చేసిన కృషి వల్లే గుజరాత్‌ లోని సుపరిపాలన నమూనా ప్రపంచంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించిందని ఆయన నొక్కి చెప్పారు.  ఇ-పారదర్శకత, ఇ-జవాబుదారీతనానికి ప్రతీకగా స్వాగత్ ద్వారా సుపరిపాలన ఒక ప్రధాన ఉదాహరణగా అంతర్జాతీయ టెలికాం సంస్థ ను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఐక్యరాజ్యసమితి నుంచి, "స్వాగత్" కార్యక్రమానికి అనేక ప్రశంసలు లభించాయి.  ప్రజా సేవకు అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డును కూడా పొందిందని ఆయన పేర్కొన్నారు.   2011 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో "స్వాగత్" కార్యక్రమం కారణంగా ఈ-గవర్నెన్స్ విభాగంలో గుజరాత్ రాష్ట్రం బంగారు పురస్కారాన్ని పొందిందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

"స్వాగత్ ద్వారా గుజరాత్ ప్రజలకు మనం సేవ చేయగలగడమే, నాకు అతిపెద్ద ప్రతిఫలంగా భావిస్తాను" అని ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.   "స్వాగత్" కార్యక్రమంలో మేము ఒక ఆచరణాత్మక వ్యవస్థను సిద్ధం చేసాము.  "స్వాగత్" కార్యక్రమం కింద బహిరంగ విచారణల మొదటి దశ బ్లాక్ మరియు తహసీల్ స్థాయిలలో జరుగుతాయి.   ఆ తర్వాత జిల్లా స్థాయిలో జిల్లా మేజిస్ట్రేట్‌ కు బాధ్యతలు అప్పగించడం జరిగింది.  ఇక రాష్ట్ర స్థాయిలో బాధ్యతలను తన భుజస్కందాలపై వేసుకున్నట్లు ప్రధానమంత్రి తెలియజేశారు.   పథకాల ప్రభావం, వాటి అమలుతో పాటు, అమలు చేసే సంస్థలు, తుది లబ్ధిదారుల మధ్య సంబంధాలను అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమం తనకు చాలా సహాయపడిందని, ఆయన చెప్పారు.  "స్వాగత్" కార్యక్రమం పౌరులకు అధికారం ఇవ్వడంతో పాటు, వారి నుంచి విశ్వసనీయతను పొందింది.

"స్వాగ‌త్"  కార్య‌క్ర‌మాన్ని వారానికి ఒక్క‌సారి నిర్వ‌హించినప్పటికీ, వందల సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో వాటి పరిష్కారానికి సంబంధించిన పనులు నెలంతా కొనసాగుతాయని ప్రధానమంత్రి వివరించారు.   ఏదైనా నిర్దిష్ట విభాగాలు, అధికారులు లేదా ప్రాంతాల నుంచి తరచుగా ఇతరుల కంటే ఎక్కువగా ఫిర్యాదులు నమోదవుతున్నాయేమో గమనించడానికి తాను ఒక ప్రత్యేక విశ్లేషణ కూడా నిర్వహిస్తానని ప్రధానమంత్రి తెలియజేశారు.  "అవసరమైతే విధానాలు కూడా సవరించడానికి వీలుగా లోతైన విశ్లేషణ కూడా జరిగింది", అని శ్రీ మోదీ తెలియజేస్తూ,  "ఇది సాధారణ పౌరులలో నమ్మకాన్ని సృష్టించింది" అని పేర్కొన్నారు.   సమాజంలో సుపరిపాలన కొలమానం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ నాణ్యతపై ఆధారపడి ఉంటుందని, ఇది ప్రజాస్వామ్యానికి నిజమైన పరీక్ష అని ఆయన వ్యాఖ్యానించారు.

స్వాగత్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన మార్గాలను అనుసరించాలనే పాత భావనను మార్చిందని ప్రధాన మంత్రి అన్నారు.  "పరిపాలన అనేది పాత నియమాలు, చట్టాలకే పరిమితం కాదని మేము నిరూపించాము, అయితే ఆవిష్కరణలు, కొత్త ఆలోచనల కారణంగా పాలన జరుగుతుంది" అని ఆయన చెప్పారు.  2003 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వాలు ఇ-గవర్నెన్స్‌ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని శ్రీ మోదీ గుర్తు చేశారు.  పేపర్ ట్రయల్స్, ఫిజికల్ ఫైల్స్ చాలా జాప్యాలకు,  వేధింపులకు దారితీశాయి, వీడియో కాన్ఫరెన్సింగ్ అనేది చాలావరకు తెలియదు.  “ఇటువంటి పరిస్థితులలో, గుజరాత్ రాష్ట్రం భవిష్యత్తు ఆలోచనలతో పని చేసింది.  కాగా, ఈ రోజు, పాలనలో ఎదురయ్యే అనేక పరిష్కారాలకు స్వాగత్ వంటి కార్యక్రమాలు ప్రేరణగా నిలిచాయి.   చాలా రాష్ట్రాలు ఈ తరహా వ్యవస్థపై పనిచేస్తున్నాయి.  ఇదేవిధంగా, కేంద్రంలో కూడా  ప్రభుత్వ పనితీరును సమీక్షించేందుకు "ప్రగతి" అనే వ్యవస్థను రూపొందించాం.  గత 9 ఏళ్లలో దేశం వేగంగా అభివృద్ధి చెందడంలో ఈ "ప్రగతి" కార్యక్రమం కీలక పాత్ర పోషించింది.  ఈ భావన కూడా "స్వాగత్" ఆలోచనపైనే ఆధారపడి ఉంటుంది.  "ప్ర‌గ‌తి" కార్యక్రమం ద్వారా దాదాపు 16 ల‌క్ష‌ల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల‌ను తాను స‌మీక్షించాన‌నీ, దీని వ‌ల్ల అనేక ప‌థ‌కాలు వేగ‌వంతం అయ్యాయ‌నీ ప్ర‌ధానమంత్రి తెలియజేశారు.

ఒక చిన్న మొక్కగా మొలకెత్తిన విత్తనం ఆ తర్వాత వందలాది కొమ్మలతో భారీ వృక్షం గా ఎదిగిన సారూప్యతను ప్రధానమంత్రి వివరిస్తూ, "స్వాగత్" కార్యక్రమం అమలు చేయాలనే ఆలోచన సుపరిపాలనలో వేలాది కొత్త ఆవిష్కరణలకు దారి తీస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.  ప్రజల్లో కొత్త జీవితాన్ని, శక్తిని నింపే విధంగా పాలనా కార్యక్రమాలు జరుపుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.  "ప్రజా-ఆధారిత పాలన యొక్క నమూనా గా మారడం ద్వారా , ఈ కార్యక్రమం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటుంది" అని ప్రధానమంత్రి తమ ప్రసంగాన్ని ముగించారు.

నేపథ్యం 

సాంకేతికతను ఉపయోగించి రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులను పరిష్కరించే "స్వాగత్" అనే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి 2003 ఏప్రిల్‌ నెలలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు.  రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించడం ముఖ్యమంత్రి ముందున్న అత్యంత ముఖ్యమైన బాధ్యత అనే భావనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.  ఈ సంకల్పంతో, జీవన సౌలభ్యాన్ని ప్రోత్సహించడానికి సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రయోజనాన్ని ముందుగానే ఊహించి, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ మొట్టమొదటిసారిగా సాంకేతిక ఆధారంగా పనిచేసే ఈ ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, సాంకేతికతను ఉపయోగించి ప్రజల రోజువారీ ఫిర్యాదులను త్వరగా, సమర్థవంతంగా, సమయానుకూలంగా పరిష్కరించడం ద్వారా పౌరులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేయడం.  కాలక్రమేణా, "స్వాగత్ కార్యక్రమం" ప్రజల జీవితాలపై పరివర్తనాత్మక ప్రభావాన్ని తీసుకువచ్చింది.  కాగితంతో పనిలేకుండా, పారదర్శకంగా, ఎటువంటి అవాంతరాలకు తావులేకుండా ప్రజల కష్టాలను పరిష్కరించడానికి ఇది ఒక సమర్థవంతమైన సాధనంగా మారింది.

ఈ "స్వాగత్" కార్యక్రమం ప్రత్యేకత ఏమిటంటే, సాధారణ పౌరుడు సైతం తన ఫిర్యాదులను నేరుగా ముఖ్యమంత్రి కి తెలియజేయడానికి ఇది సహాయపడుతుంది.  ప్రతి నెల నాలుగో గురువారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ఫిర్యాదుల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి నేరుగా పౌరులతో సంభాషిస్తారు.  ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించడం ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అంతరాన్ని తగ్గించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోంది.  కార్యక్రమం కింద, ప్రతి దరఖాస్తుదారునికి, వారి ఫిర్యాదుపై తీసుకున్న నిర్ణయం గురించి తెలియజేయడం జరుగుతుంది.  పరష్కార దిశగా ఆయా దరఖాస్తులు ఏ ఏయే దశల్లో ఉన్నదీ వివరాలు ఆన్‌-లైన్‌ లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది.  ఇప్పటి వరకు సమర్పించిన ఫిర్యాదుల్లో 99 శాతానికి పైగా దరఖాస్తులను పరిష్కరించడం జరిగింది. 

"స్వాగత్" ఆన్‌-లైన్ కార్యక్రమంలో నాలుగు భాగాలు ఉన్నాయి: అవి రాష్ట్ర స్వాగత్, జిల్లా స్వాగత్, తాలూకా స్వాగత్, గ్రామ స్వాగత్.  "రాష్ట్ర స్వాగత్" కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తారు.  "జిల్లా స్వాగత్‌" కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తారు, కాగా, మమలత్దార్ మరియు క్లాస్-1 అధికారి "తాలూకా స్వాగత్‌" కార్యక్రమానికి నాయకత్వం వహిస్తారు.  "గ్రామ స్వాగత్‌" కార్యక్రమంలో పౌరులు ప్రతి నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు తలతి/మంత్రి కి తమ దరఖాస్తు దాఖలు చేస్తారు.  పరిష్కారం కోసం వీటిని "తాలూకా స్వాగత్" కార్యక్రమానికి తీసుకువస్తారు.   వీటికి అదనంగా, ప్రజల కోసం "లోక్-ఫరియాద్" కార్యక్రమం కూడా అమలులో ఉంది, దీనిలో వారు తమ ఫిర్యాదులను స్వాగత్ యూనిట్‌ లో దాఖలు చేస్తారు.

ప్రజా సేవలో పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు ప్రతిస్పందనను మెరుగుపరిచినందుకు 2010 సంవత్సరంలో, "స్వాగత్" ఆన్‌-లైన్ కార్యక్రమానికి యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ అవార్డుతో సహా వివిధ అవార్డులు లభించాయి. 

 

 

*****



(Release ID: 1920590) Visitor Counter : 168