ప్రధాన మంత్రి కార్యాలయం

ఏప్రిల్ 27న  స్వాగత్ కార్యక్రమానికి20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధానమంత్రి


2003లో అప్పటి గుజరాత్ సీఎం హోదాలో స్వాగత్ ను ప్రారంభించిన ప్రధాని

ఇది దేశంలోనే మొట్టమొదటి సాంకేతిక ఆధారిత ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం.

ప్రజల సమస్యలను పరిష్కరించడంలో సాంకేతిక పరిజ్ఞానం సామర్థ్యాన్ని అప్పటి సిఎంమోదీ త్వరగా గ్రహించడాన్ని ప్రతిబింబించింది

సామాన్యుడు తన ఆవేదనను నేరుగా సీఎంకు నివేదించడానికి దోహదపడడం స్వాగత్ ప్రత్యేకత.

త్వరితగతిన, సమర్థవంతంగా, నిర్ణీత కాల వ్యవధిలో ఫిర్యాదులను

పరిష్కరించడం ద్వారా జీవన సౌలభ్యాన్ని పెంచిన స్వాగత్

ఇప్పటి వరకు 99 శాతం ఫిర్యాదుల పరిష్కారం

Posted On: 25 APR 2023 5:06PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏప్రిల్ 27న సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా గుజరాత్ లో స్వాగత్ కార్యక్రమానికి 20 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో, ఈ పథకం పాత లబ్ధిదారులతో కూడా ప్రధాన మంత్రి సంభాషిస్తారు. ఈ కార్యక్రమం విజయవంతంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం స్వగత్ సప్తాహ్ ను జరుపుకుంటోంది.

 

స్వాగత్ (స్టేట్ వైడ్ అటెన్షన్ ఆన్ గ్రీవెన్స్ బై అప్లికేషన్ ఆఫ్ టెక్నాలజీ) ను 2003 ఏప్రిల్ లో ప్రధాన మంత్రి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు. ఒక ముఖ్యమంత్రికి అత్యంత బాధ్యత తన రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించడమేనన్న నమ్మకంతోనే ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సంకల్పంతో జీవన సౌలభ్యాన్ని కల్పించడంలో సాంకేతిక పరిజ్ఞానం సామర్థ్యాన్ని త్వరగా గ్రహించిన సిఎం గా మోదీ మొట్టమొదటి సాంకేతిక ఆధారిత ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పౌరులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించడం, వారి దైనందిన ఆకాంక్షలను త్వరితగతిన, సమర్థవంతంగా, సమయానుకూలంగా పరిష్కరించడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. కాలక్రమేణా, కాగిత రహితంగా, పారదర్శకంగా , హడావుడి లేని పద్ధతిలో ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికి సమర్థవంతమైన సాధనంగా స్వాగత్ ప్రజల జీవితాలపై గుణాత్మక ప్రభావం చూపింది.

 

సామాన్యుడు తన ఆవేదనను నేరుగా ముఖ్యమంత్రికి తెలియజేయడానికి తోడ్పడటం స్వాగత్ ప్రత్యేకత. ఫిర్యాదుల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి పౌరులతో ముఖాముఖి నిర్వహించే ప్రతి నెలా నాల్గవ గురువారం ఇది జరుగుతుంది. సత్వర పరిష్కారం ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించింది.

ఈ కార్యక్రమం కింద, ప్రతి దరఖాస్తుదారునికి నిర్ణయాన్ని తెలియజేసేలా చూస్తారు. అన్ని దరఖాస్తుల ప్రొసీడింగ్స్ ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు అందిన ఫిర్యాదుల్లో 99 శాతానికి పైగా పరిష్కారమయ్యాయి.

 

స్వాగత్ ఆన్ లైన్ ప్రోగ్రామ్ లో స్టేట్ రిసెప్షన్, డిస్ట్రిక్ట్ రిసెప్షన్, తాలూకా స్వాగత్ విలేజ్ స్వాగత్ అనే నాలుగు కాంపోనెంట్స్ ఉన్నాయి. స్టేట్ స్వాగత్ లో ముఖ్యమంత్రి స్వయంగా పబ్లిక్ హియరింగ్ కు హాజరవుతారు. జిల్లా కలెక్టర్ జిల్లా స్వాగత్ కు, మమ్లత్దార్, క్లాస్-1 అధికారి తాలూకా స్వాగత్ కు నేతృత్వం వహిస్తారు.గ్రామ స్వాగత్ లో పౌరులు ప్రతి నెల 1 నుంచి 10వ తేదీ వరకు తలాటి/మంత్రికి దరఖాస్తు దాఖలు చేస్తారు. వీటి పరిష్కారానికి తాలూకా స్వాగత్ కార్యక్రమంలో వీటిని చేర్చారు. అదనంగా, పౌరుల కోసం లోక్ ఫరియాద్ కార్యక్రమం కూడా అమలులో ఉంది, దీనిలో వారు తమ ఫిర్యాదులను స్వాగత్ యూనిట్ లో దాఖలు చేస్తారు.

 

ప్రజా సేవలో పారదర్శకత, జవాబుదారీతనం ,ప్రతిస్పందనను మెరుగుపరచినందుకు 2010 లో యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ అవార్డుతో సహా స్వాగత్ ఆన్లైన్ ప్రోగ్రామ్ కు సంవత్సరాలుగా వివిధ అవార్డులు లభించాయి.

 

 

*****



(Release ID: 1919840) Visitor Counter : 145