ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఏప్రిల్ 24, 25 తేదీలలో మధ్యప్రదేశ్, కేరళ, దాద్రా నాగర్ హవేలీ , డామన్ , డయ్యు సందర్శించనున్న ప్రధాన మంత్రి


రూ. 27,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు

రేవాలో జరిగే జాతీయ పంచాయతి రాజ్ దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు.

పంచాయత్ స్థాయిలో ప్రభుత్వసంబంధ సేకరణ కోసం సమీకృత ఈ-గ్రామస్వరాజ్ మరియు ప్రభుత్వ ఈ మార్కెట్ పోర్టల్ ను ప్రధాని ప్రారంభిస్తారు. మరియు 35 లక్షల మందికి స్వమిత్వ ఆస్తి కార్డులను అందజేస్తారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ పథకం కింద గృహాలు పొందిన 4 లక్షల మందికి పైగా లబ్ధిదారుల 'గృహప్రవేశ్ ' కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటారు.

కేరళలో మొట్టమొదటి వందే భారత్ ఎక్సప్రెస్ ను జెండా ఊపి ప్రారంభిస్తారు.

కొచ్చీ వాటర్ మెట్రోను జాతికి అంకితం ఇస్తారు.

సిల్వాస్సాలో నమో వైద్య విద్య & పరిశోధన సంస్థను సందర్శించి జాతికి అంకితం ఇస్తారు.

డామన్ లో దేవకా సముద్ర తీరాన్ని ప్రధాని అంకితం ఇస్తారు.

Posted On: 21 APR 2023 3:02PM by PIB Hyderabad

   ఏప్రిల్ 24, 25 తేదీలలో మధ్యప్రదేశ్, కేరళ, దాద్రా నాగర్ హవేలీ , డామన్ , డయ్యు సందర్శించనున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ.
       24వ తేదీ ఉదయం 11-30కు ప్రధానమంత్రి  మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని  రేవాలో జరిగే జాతీయ పంచాయతి రాజ్ దినోత్సవ వేడుకల్లో  పాల్గొంటారు. అక్కడ ఆయన రూ. 19,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం ఇస్తారు.    25వ తేదీ ఉదయం 10-30కు తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ లో ప్రధానమంత్రి వందే భారత్ ఎక్సప్రెస్ కు జెండా ఊపి ప్రారంభిస్తారు.  ఆ తరువాత ఉదయం 11 గంటలకు తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో  రూ. 3200 కోట్లకు పైగా  విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం ఇస్తారు.  
       అదే రోజు మధ్యాహ్నం నాలుగు గంటలకు ప్రధాని నమో వైద్యవిద్య & పరిశోధన సంస్థను సందర్శిస్తారు.  ఆ తరువాత 4-30కు సిల్వాసా (దాద్రా నాగర్ హవేలీ) లో రూ. 4850 కోట్లకు పైగా విలువైన  అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం ఇస్తారు.  ఆ తరువాత సాయంత్రం ఆరు గంటలకు డామన్ లో దేవకా సముద్ర తీరాన్ని ప్రధాని ప్రారంభిస్తారు.  

రేవాలో ప్రధానమంత్రి
మధ్యప్రదేశ్ లోని రేవాలో ప్రధాని జాతీయ పంచాయతి రాజ్ దినోత్సవ వేడుకలలో పాల్గొని దేశవ్యాప్తంగా ఉన్న గ్రామ సభలను మరియు పంచాయతి రాజ్ సంస్థలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.    ఈ సందర్బంగా ప్రధాని పంచాయత్ స్థాయిలో ప్రభుత్వసంబంధ వస్తువుల  సేకరణ కోసం సమీకృత ఈ-గ్రామస్వరాజ్ మరియు ప్రభుత్వ ఈ మార్కెట్ పోర్టల్ ను ప్రారంభిస్తారు.  దీని ద్వారా పంచాయత్ లు తమకు అవసరమైన వస్తువులను, సేవలను  ఈ-గ్రామస్వరాజ్ వేదికను ఉపయోగించి తెచ్చుకోవచ్చు.   ప్రభుత్వ పథకాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఉద్దేశించిన ప్రచార కార్యక్రమం “विकास की ओर साझे क़दम” (అభివృద్ధి దిశలో అడుగులు కదపండి) ప్రధాని ప్రారంభిస్తారు.  ఈ ప్రచార కార్యక్రమం ఇతివృత్తం సమీకృత అభివృద్ధి.  చివరి మైలు రాయి వరకు అభివృద్ధి ఫలాలు అందడంపై దృష్టి పెట్టడం.   ఈ సందర్బంగా ప్రధాని 35 లక్షల మందికి స్వమిత్వ ఆస్తి కార్డులను అందజేస్తారు.  ఈ 35 లక్షలతో కలిపి దేశవ్యాప్తంగా స్వమిత్వ ఆస్తి కార్డులు అందుకున్న వారి సంఖ్య 1.25 కోట్లకు చేరింది.   'అందరికీ సొంత ఇల్లు' కలను సాకారం చేయడానికి  ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ కార్యక్రమం కింద ఇళ్ళు పొందడానికి గుర్తుగా  4 లక్షల మందికి పైగా  లబ్ధిదారుల 'గృహప్రవేశ్ ' కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. రూ. 4200 కోట్ల విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు.  జాతికి అంకితం చేసే ప్రాజెక్టులలో మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో  నూటికి నూరు శాతం విద్యుదీకరించిన రైల్వే లైన్లు,  రెండేసి లైన్లు వేయడం, గేజ్ మార్పిడి, విద్యుదీకరణ ప్రాజెక్టులు ఉన్నాయి.  గ్వాలియర్ స్టేషన్ పునరుద్ధరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.  అదేవిధంగా  రూ. 7,000 కోట్ల విలువైన  జల జీవన్ మిషన్  ప్రాజెక్టులకు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు.  

తిరువనంతపురంలో ప్రధానమంత్రి

కేరళలో ప్రధానమంత్రి కేరళలో మొట్టమొదటి వందే భారత్ ఎక్సప్రెస్ ను తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్ లో జెండా ఊపి ప్రారంభిస్తారు.  ఈ రైలు తిరువనంతపురం - కాసరగోడ్ మధ్య నడుస్తుంది.   ఈ రైలు రాష్ట్రంలో 11 జిల్లాలు వరుసగా తిరువనంతపురం, కొల్లామ్, కొట్టాయం, ఎర్నాకులం , త్రిసూర్, పాలక్కాడ్ , పట్టణంతిట్ట, మల్లాపురం , కోజికోడ్, కన్నూర్ మరియు కాసరగోడ్  జిల్లాలను చుడుతుంది.    కేరళలో ప్రధానమంత్రి రూ. 3200 కోట్లకు పైగా విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేస్తారు.  
కొచ్చీ వాటర్ మెట్రోను ప్రధాని  జాతికి  అంకితం ఇస్తారు.  ఇది అద్వితీయమైన ప్రాజెక్టు.  ఇది కొచ్చీ చుట్టుపక్కల ఉన్న  10 దీవులను (లంకలు) కలుపుతూ ఏర్పాటు చేసిన ప్రాజెక్టు.  బ్యాటరీతో నడిచే విద్యుత్ హైబ్రిడ్ పడవల ద్వారా కొచ్చీ నగరంతో అంతరాయం లేని సంధాయకత ఏర్పడుతుంది.  అంతేకాకుండా ప్రధానమంత్రి డిండిగల్ - పళని - పాలక్కాడ్ సెక్షన్ విద్యుదీకరణ ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు.   ఈ సందర్బంగా ప్రధానమంత్రి తిరువనంతపురం,  కోజికోడ్, వర్కాల శివగిరి రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ,  నేమాన్ మరియు కోచువేలితో సహా  తిరువనంతపురం ప్రాంత సమగ్ర అభివృద్ధి మరియు తిరువనంతపురం - షోరనూర్ సెక్షనులో వేగం పెంచే పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.  
      ఇవి కాకుండా ప్రధానమంత్రి తిరువనంతపురంలో  డిజిటల్ సైన్స్ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. పరిశ్రమ, వ్యాపారవర్గాలు, విద్యాసంస్థల సమన్వయంతో పరిశోధనలు జరిపేందుకు ఏర్పాటవుతున్న కీలకమైన పరిశోధనా సౌకర్యం  డిజిటల్ సైన్స్ పార్కు.  ఈ పరిశోధనల ద్వారా  డిజిటల్ ఉత్పత్తులు మరియు సేవలను అభివృద్ధి చేయాలన్నది సంకల్పం.   ఇది మూడవతరం సైన్స్ పార్క్.   కృత్రిమ మీద, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, స్మార్ట్ మెటీరియల్స్ మొదలైన  4.0 టెక్నాలజీలు అభివృద్ధి చేయడానికి డిజిటల్ సైన్స్ పార్కులో ఉమ్మడి సౌకర్యాలు ఉంటాయి.   యూనివర్సిటీలతో కలసి పరిశ్రమలు ఉన్నతశ్రేణి అనువర్తిత పరిశోధనలు జరిపే సౌకర్యాల కోసం ఏర్పాటయ్యే అత్యంత అధునాతన మౌలిక సదుపాయాలను ఉపయోగించి ఉత్పత్తులను అభివృద్ధి చేయవచ్చు.  మొదటి దశలో ఈ ప్రాజెక్టుకు ఆరంభ పెట్టుబడి  దాదాపు  రూ. 200 కోట్లు.  మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 1515 కోట్లు.  

సిల్వాసా, డామన్ లో ప్రధానమంత్రి

ప్రధానమంత్రి దాద్రా నాగర్ హవేలీలో సిల్వాసా వద్ద నమో వైద్య విద్య & పరిశోధనా సంస్థను సందర్శించి జాతికి అంకితం చేస్తారు.  ఈ సంస్థకు శంకుస్థాపన కూడా 2019 జనవరిలో ప్రధాని స్వయంగా చేశారు.  దీనివల్ల  దాద్రా నాగర్ హవేలీ, డామన్, డయ్యు కేంద్ర పాలిత ప్రాంత వాసులకు ఆరోగ్య సేవలలో పరివర్తన వస్తుంది.   అత్యంత అధునాతనమైన ఈ మెడికల్ కాలేజీలో  అధునాతన పరిశోధన కేంద్రాలు, రేయింబవళ్లు ఉండే  గ్రంథాలయ సౌకర్యాలు,  ప్రయోగశాలలు,  పరిశోధనా ప్రయోగశాలలు,  శరీరనిర్మాణ శాస్త్ర ప్రదర్శనశాల, విద్యార్థులకు,  ఆచార్య గణానికి  నివాసాలు, క్రీడా సౌకర్యాలు, క్లబ్ హౌజ్ ఉన్నాయి.  
    ఆ తర్వాత ప్రధాని సిల్వాసా సైలి మైదానంలో రూ.4850 కోట్లకు పైగా విలువైన 96 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం ఇస్తారు.   దాద్రా నాగర్ హవేలీ జిల్లాలో మోర్ఖాల్ , కుర్దీ, సింధోణి మరియు మసాట్ లలో ప్రభుత్వ పాఠశాలలు,  దాద్రా నాగర్ హవేలీ జిల్లాలో వివిధ రోడ్ల సుందరీకరణ మరియు విస్తరణ,   డామన్ లోని   అమ్బావాడి, పరియారి,  డామన్ వాడా, ఖరివాడ్ లలో ప్రభుత్వ పాఠశాలలు,  డామన్ లో ఇంజనీరింగ్ కాలేజీ;  మోతీ డామన్ , నాని డామన్ లో  చేపల మార్కెట్ , షాపింగ్ కాంప్లెక్స్ ,  నాని డామన్ లో నీటి సరఫరా పథకాన్ని వృద్ధి చేయడం తదితర ప్రాజెక్టులు ఉన్నాయి.    
     డామన్ లో దేవకా సముద్ర తీరాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు.    సముద్ర తీరంలో రూ. 165 కోట్ల ఖర్చుతో 5.45 కిలోమీటర్ల పొడవున నిర్మించిన సముద్ర తీర విహారస్థలం ఇది.  ఇటువంటి సముద్ర తీరా విహార స్థలం దేశంలో మరొకటి లేదు.   దీని ద్వారా స్థానిక ఆర్ధిక స్థితి వృద్ధి చెందుతుంది.  ఈ ప్రాంతానికి పర్యాటకుల రాక పెరుగుతుంది.   ఇది మనోల్లాసానికి,  విశ్రాంతికి కేంద్రంగా మారగలదు.  ఈ సముద్ర తీరం అంతర్జాతీయ యాత్రికులకు ప్రపంచ శ్రేణి పర్యాటక గమ్యంగా పరివర్తన చెందింది.  అక్కడ సొగసైన విద్యుద్దీప కాంతులు, పార్కింగ్ సౌకర్యం, ఉద్యానాలు, ఫుడ్ స్టాల్స్,  వినోద, ఉల్లాస క్రీడా కేంద్రాలు ఉన్నాయి. భవిష్యత్తులో విలాసాలకు నెలవుగా మారేందుకు ఏర్పాట్లు ఉన్నాయి.  

 

 

***


(Release ID: 1918679) Visitor Counter : 207