ఆర్థిక మంత్రిత్వ శాఖ

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పొడిగింపు

Posted On: 28 MAR 2023 2:48PM by PIB Hyderabad

పన్ను చెల్లింపుదార్లకు మరికొంత సమయం కల్పిస్తూ, పాన్-ఆధార్‌ అనుసంధానం గడువును 30 జూన్ 2023 వరకు పొడిగించారు. దీని ఫలితంగా, వ్యక్తులు ఎటువంటి చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా ఆధార్-పాన్ అనుసంధానం ద్వారా తమ ఆధార్‌ను నిర్దేశిత అధికారికి తెలియజేయవచ్చు. ఈ ప్రకారం ప్రత్యేకంగా ఒక ప్రకటన విడుదలకానుంది.

ఆదాయపు పన్ను చట్టం 1961 నిబంధనల ప్రకారం, 1 జూలై 2017 నాటికి పాన్ పొంది, ఆధార్ నంబర్‌ను పొందేందుకు అర్హత ఉన్న ప్రతి వ్యక్తి 31 మార్చి 2023 లోపు నిర్ణీత రుసుము చెల్లించి నిర్దేశిత అధికారికి తన ఆధార్‌ గురించి తెలియజేయాలి. అలా చేయడంలో విఫలమైతే చట్ట ప్రకారం ఏప్రిల్ 1, 2023 నుంచి పన్ను చెల్లింపుదార్లు కొన్ని చర్యలకు బాధ్యలు అవుతారు. ఇప్పుడు, ఇప్పుడు ఈ గడువును 30 జూన్ 2023 వరకు పొడిగించడం జరిగింది.

ఆధార్‌-పాన్‌ అనుసంధానం చేయడంలో విఫలమైన పన్ను చెల్లింపుదార్ల పాన్‌ 1 జులై 2023 నుంచి పనిచేయదు. పాన్‌ పని చేయని సమయంలో ఈ క్రింది పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది:

  1. గడువు లోగా పాన్‌-ఆధార్‌ లింక్‌ చేయని పన్ను చెల్లింపుదార్లకు రిఫండ్‌ రాదు
  2. పాన్‌ పని చేయని కాలానికి రిఫండ్‌పై వడ్డీ చెల్లించరు
  3. అటువంటి పన్ను చెల్లింపుదార్ల నుంచి ఎక్కువ మొత్తంలో టీడీఎస్‌, టీసీఎస్‌ వసూలు చేస్తారు.

పాన్‌తో ఆధార్‌ను లింక్ చేసి రూ. 1,000 రుసుము చెల్లించిన తర్వాత, 30 రోజుల్లో పాన్ మళ్లీ క్రియాశీలంగా మారుతుంది.

పాన్-ఆధార్ అనుసంధానం నుంచి మినహాయింపు పొందిన వ్యక్తులకు పైన పేర్కొన్న పరిణామాలు వర్తించవు. నిర్దిష్ట రాష్ట్రాల్లో నివసించే వ్యక్తులు, చట్ట ప్రకారం ప్రవాస భారతీయులు, భారతీయ పౌరులు కాని వాళ్లు, గత సంవత్సరంలోని ఏ సమయంలోనైనా 80 ఏళ్లు పైబడిన వాళ్లు మినహాయింపు వర్గంలోకి వస్తారు.

ఇప్పటి వరకు 51 కోట్ల పాన్‌లను ఆధార్‌ నంబర్లతో అనుసంధానం చేశారు. https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar లింక్‌పై క్లిక్‌ చేయడం ద్వారా పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయవచ్చు.

 

****



(Release ID: 1911510) Visitor Counter : 620