ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

ముంబైలో అల్‌జామియా-తుస్-సైఫియా కొత్త ప్రాంగణానికి ప్రధాని ప్రారంభోత్సవం


“నేనిక్కడికిప్రధానమంత్రిగా కాకుండా నాలుగు తరాలనుంచీ

ఈ కుటుంబంతో అనుబంధంగల ఓ సభ్యుడిగా వచ్చాను”;

కాలానుగుణ మార్పులు.. ప్రగతికి తగినట్లు పరివర్తనలో

దావూదీ బోహ్రా సమాజం తననుతాను నిరూపించుకుంది...

అల్‌జామియా-తుస్-సైఫియా వంటి సంస్థే దీనికి సజీవ నిదర్శనం”;

“కొత్త జాతీయ విద్యా విధానం వంటి సంస్కరణలతో

దేశం అమృతకాల సంకల్పాలను ముందుకు తీసుకెళ్తోంది”;

“భారతీయ విలువలతో కూడిన ఆధునిక విద్యావిధానమే దేశ ప్రాధాన్యం”;

“ప్రపంచాన్ని తీర్చిదిద్దగల యువ ప్రతిభామూర్తుల నిలయంగా భారత్‌ మారుతోందనడానికి విద్యా మౌలిక వసతుల వేగం.. స్థాయి నిదర్శనాలు”;

“మన యువత వాస్తవ ప్రపంచ సమస్యలకుప్రాధాన్యమిస్తూ చురుగ్గా పరిష్కారాన్వేషణ చేస్తోంది”;

“దేశంనేడు ఉద్యోగ సృష్టికర్తలకు అండగా నిలుస్తోంది..తద్వారా విశ్వసనీయ వ్యవస్థసృష్టించబడుతోంది”;

“భారత్‌ వంటి దేశానికి అభివృద్ధి… వారసత్వం సమాన ప్రాథమ్యాలు”

Posted On: 10 FEB 2023 7:15PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముంబైలోని మ‌రోల్‌లో అల్‌జామియా-తుస్-సైఫియా (ది సైఫీ అకాడమీ) కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఇది దావూదీ బోహ్రా సమాజానికి ప్రధాన విద్యా సంస్థ. మాననీయ సయ్యద్నా ముఫద్దల్ సైఫుద్దీన్ మార్గనిర్దేశంలో ఈ సంస్థ సమాజంలోని అభ్యసన సంప్రదాయాలు, సాహితీ సంస్కృతి పరిరక్షణకు కృషి చేస్తోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- తానిక్కడికి ప్రధానమంత్రిగా కాకుండా నాలుగు తరాల నుంచీ ఈ కుటుంబంతో అనుబంధంగల ఓ సభ్యుడిగా వచ్చానని పేర్కొన్నారు. కాలనుగుణ పరివర్తన ద్వారా తమ ఔచిత్యాన్ని చెక్కుచెదరకుండా కొనసాగించగల సామర్థ్యం ద్వారానే ప్రతి సమాజం, సంఘం లేదా సంస్థకు గుర్తింపు లభిస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఆ మేరకు “కాలానుగుణ మార్పులు, అభివృద్ధికి తగినట్లు పరివర్తన సాధించడంలో దావూదీ బోహ్రా సమాజం తననుతాను రుజువు చేసుకుంది. అల్‌జామియా-తుస్-సైఫియా వంటి సంస్థే దీనికి సజీవ తార్కాణం” అని ప్రధాని అన్నారు.

దావూదీ బోహ్రా సమాజంతో తన సుదీర్ఘ అనుబంధాన్ని ప్రధాని వివరిస్తూ- తానెక్కడికి వెళ్లినా ఆ సమాజ ప్రేమాభినాలు తనపై వర్షిస్తూనే ఉంటాయన్నారు. డాక్టర్ సయ్యద్నా 99 ఏళ్ల వయసులోనూ ప్రబోధమివ్వడాన్ని, గుజరాత్‌లో ఆ సమాజంతో తన సన్నిహిత సంబంధాలను ప్రధాని స్మరించుకున్నారు. డాక్టర్ సయ్యద్నా శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో గుజరాత్‌ రాష్ట్ర నీటి సమస్య పరిష్కారంపై ఆధ్యాత్మిక నాయకుడు చూపిన శ్రద్ధను ఆయన గుర్తుచేసుకున్నారు. తదనుగుణంగా నిరంతర నిబద్ధత చూపినందుకుగాను వారికి కృతజ్ఞతలు తెలిపారు. పోషకాహార లోపం నుంచి నీటి కొరత దాకా సమస్యల పరిష్కారంలో ఆ సమాజం-ప్రభుత్వం పరస్పర సహకారంతో సాగిన తీరుకు ఇదొక ఉదాహరణగా శ్రీ మోదీ పేర్కొన్నారు. బోహ్రా సమాజానికి భారతదేశంపైగల ప్రేమాదరాలను ప్రస్తావిస్తూ- “దేశంలోనే కాదు… నేను ఏ దేశానికి వెళ్లినా అక్కడి నా బోహ్రా సోదర-సోదరీమణులు కచ్చితంగా నన్ను కలవడానికి వస్తారు” అని ప్రధాని వ్యాఖ్యానించారు.

త్సంకల్పంతో స్వప్న సాకారం సదా సాధ్యమేనని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ముంబైలో ముంబైలోని అల్‌జామియా-తుస్-సైఫియా స్వప్నం స్వాతంత్ర్యానికి ముందు నుంచీ ఉన్నదేనని ఆయన అన్నారు. దండి యాత్ర ప్రారంభానికి ముందు మహాత్మా గాంధీ దావూదీ బోహ్రా సమాజ నేత నివాసంలో బస చేశారని శ్రీ మోదీ గుర్తుచేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన అభ్యర్థన మేరకు ఆ భవనాన్ని మ్యూజియంగా మార్చేందుకు ప్రభుత్వానికి అప్పగించామని, దీన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాలని ప్రధాని కోరారు. దేశంలో యువతులకు, మహిళలకు ఆధునిక విద్య, కొత్త అవకాశాల సౌలభ్య కల్పన గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ- “కొత్త జాతీయ విద్యా విధానం వంటి సంస్కరణలతో అమృతకాల సంకల్పాలను మన దేశం ముందుకు తీసుకెళ్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

దిశగా అల్‌జామియా-తుస్-సైఫియా కూడా ముందడుగు వేస్తున్నదని ఆయన అన్నారు. భారతీయ విలువలతో కూడిన ఆధునిక విద్యావిధానమే దేశ ప్రాధాన్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. నలంద, తక్ష్‌శిల వంటి విశ్వవిద్యాలయాతో భారతదేశం విద్యకు కేంద్రంగా వర్ధిల్లుతూ ప్రపంచవ్యాప్తంగా విద్యార్థుల దృష్టిని ఆకర్షించిన కాలాన్ని ఆయన గుర్తుచేశారు. భారత గతవైభవ పునరుద్ధరణ కోసం విద్యారంగ ఉజ్వలకాల పునరుజ్జీవనం ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. ఈ దృక్పథంతోనే గత ఎనిమిదేళ్లుగా రికార్డు స్థాయిలో అనేక విశ్వవిద్యాలయాలతోపాటు ప్రతి జిల్లాలో వైద్య కళాశాలలు ఏర్పాటైనట్లు ప్రధాని పేర్కొన్నారు. ఈ మేరకు 2004-2014 మధ్య దేశంలో 145 కళాశాలలు ఏర్పాటు కాగా, 2014-22 మధ్య 260కిపైగా వైద్య కళాశాలలు ఏర్పడ్డాయని గుర్తుచేశారు. “గడచిన 8 సంవత్సరాల్లో ప్రతి వారం ఒక విశ్వవిద్యాలయం, రెండు కళాశాలలు వంతున కొత్తగా ప్రారంభమయ్యాయి. ప్రపంచాన్ని తీర్చిదిద్దగల యువ ప్రతిభామూర్తుల నిలయంగా భారత్ మారుతోందనడానికి విద్యా మౌలిక వసతుల పెరుగుదల వేగం, స్థాయి రుజువు చేస్తున్నాయి” అని ప్రధాని వివరించారు.

దేశ విద్యావ్యవస్థలో గణనీయ మార్పులను ప్రస్తావిస్తూ- విద్యారంగంలో ప్రాంతీయ భాషల ప్రాముఖ్యాన్ని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఈ మేరకు నేడు ఇంజినీరింగ్‌, వైద్య విద్యలను ప్రాంతీయ భాషల్లోనే అభ్యసించవచ్చునని ఆయన తెలిపారు. మరోవైపు పేటెంట్ విధానం సరళం చేయడంతో ఆ వ్యవస్థ సౌలభ్యం ఎంతగానో పెరిగిందని పేర్కొన్నారు. విద్యావ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞాన వాడకం పెరుగుతుండటాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. తదనుగుణంగా సాంకేతికత-ఆవిష్కరణలలో ప్రతిభా ప్రదర్శన దిశగా నేటి యువత నైపుణ్యం పొందుతున్నదని అన్నారు. “మన యువతరం ఇవాళ వాస్తవ ప్రపంచ సమస్యలకు ప్రాధాన్యమిస్తూ చురుగ్గా పరిష్కారాన్వేషణ చేస్తోంది” అని ప్రధాని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

దేశంలోనైనా బలమైన విద్యావ్యవస్థ, పారిశ్రామిక పర్యావరణాలకు సమాన ప్రాధాన్యం ఉంటుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. యువతరం భవిష్యత్తకు బలమైన పునాది వేసేది ఇవేనని ఆయన స్పష్టం చేశారు. గత 8-9 సంవత్సరాల్లో ‘వాణిజ్య సౌలభ్యం’లో చారిత్రక మెరుగుదలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ మేరకు 40వేలదాకా అనుసరణ ప్రక్రియలను భారత్‌ రద్దు చేసిందని, వందలాది నిబంధనలను నేరరహితం చేసిందని ప్రధాని వెల్లడించారు. వ్యాపారాలను ప్రభావితం చేసే ఈ చట్టాల ద్వారా ఒకనాడు పారిశ్రామికవేత్తలను ఏ విధంగా వేధించిందీ ఆయన గుర్తుచేశారు. అయితే, ““దేశం నేడు ఉద్యోగ సృష్టికర్తలకు అండగా నిలుస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు 42 కేంద్ర చట్టాల సంస్కరణకు ప్రవేశపెట్టిన ‘జన్‌ విశ్వాస్‌’ బిల్లు, వ్యాపార యాజమాన్యాల్లో నమ్మకం పెంచడానికి ఉద్దేశించిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకం తేవడాన్ని ఆయన ఉదాహరించారు. ఇక ఈ ఏడాది బడ్జెట్‌లో పన్ను రేట్లను సంస్కరించామని, దీంతో ఉద్యోగులతోపాటు పారిశ్రామికవేత్తలకు నగదు లభ్యత మరింత పెరుగుతుందని వివరించారు.

దేశంలోని ప్రతి సమాజం, సిద్ధాంతాల విశిష్టతలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ- “భారత్ వంటి దేశానికి అభివృద్ధి, వారసత్వం సమాన ప్రాథమ్యాలు” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారతదేశంలోని సుసంపన్న వారసత్వ ప్రగతి మార్గం, ఆధునికత వల్లనే ఈ విశిష్టత లభించిందని శ్రీ మోదీ వివరించారు. భౌతిక-సామాజిక మౌలిక సదుపాయాలు రెండింటికీ సమాన ప్రాధాన్యమిస్తూ దేశం ముందుకు వెళ్తున్నదని ఆయన నొక్కిచెప్పారు. మనం ఇటు ప్రాచీన సంప్రదాయ పండుగలు నిర్వహించుకుంటూ అటు డిజిటల్ చెల్లింపులు చేస్తుండటమే ఇందుకు నిదర్శనమని ఆయన గుర్తుచేశారు. ఈ ఏడాది బ‌డ్జెట్ గురించి వివరిస్తూ- కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పాత రికార్డుల‌ డిజిట‌లీకరణకు ప్ర‌తిపాదన చేసినట్లు తెలిపారు. ఈ మేరకు అన్ని సామాజికవర్గాల, సంఘాల సభ్యులంతా ముందుకొచ్చి, తమవద్దగల సంబంధిత పురాతన గ్రంథాలను డిజిటలీకరించాలని ఆయన కోరారు. ఈ ప్రచారంతో యువత అనుసంధానం ద్వారా బోహ్రా సమాజం కూడా అందించగల సహకారం గురించి ఆయన సూచించారు. అలాగే పర్యావరణ పరిరక్షణ, చిరుధాన్యాలకు ప్రాచుర్యం, భారత జి-20 అధ్యక్షతకు తోడ్పాటు వంటి ఇతరత్రా అంశాల్లో ప్రజా భాగస్వామ్యాన్ని బోహ్రా సమాజం ప్రోత్సహించాలని ప్రధాని కోరారు.

చివరగా- “ఉజ్వల భారతదేశానికి సముచిత ప్రతినిధులుగా విదేశాల్లోని బోహ్రా సమాజం వ్యవహరించవచ్చు. అలాగే వికసిత భారతం లక్ష్యాన్ని సాధించడంలో దావూదీ బోహ్రా సమాజం కీలక పాత్ర పోషణను కొనసాగిస్తుంది” అంటూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, గౌరవనీయ సయ్యద్నా ముఫద్దల్ సైఫుద్దీన్, మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రులు తదితరులు పాల్గొన్నారు.

 



(Release ID: 1908677) Visitor Counter : 131