ప్రధాన మంత్రి కార్యాలయం

వేసవి వాతావరణ సన్నద్ధతపై ప్రధాని అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష


రుతుపవన అంచనా.. రబీ పంటలపై ప్రభావం.. వైద్య మౌలిక సౌకర్యాల సంసిద్ధత.. ఉష్ణోగ్రత-ఉపశమనచర్యల సంబంధిత విపత్తులపై సన్నద్ధత గురించి ప్రధానికి వివరణ;

వివిధ భాగస్వాముల కోసం ప్రత్యేక అవగాహన సరంజామా తయారీపై ప్రధాని సూచన;

అందరికీ అర్థమయ్యేలా రోజువారీవాతావరణ సూచనల జారీపై ‘ఐఎండి’కి ప్రధాని ఆదేశం;

అన్ని ఆస్పత్రులలో అగ్ని ప్రమాదసన్నద్ధతల తనికీ ఆవశ్యకతను నొక్కిచెప్పిన ప్రధాని;

విపరీత వాతావరణ పరిస్థితులకు తగినట్లు ధాన్యం నిల్వ నిర్వహణపై ‘ఎఫ్‌సిఐ’కి సూచన

Posted On: 06 MAR 2023 6:06PM by PIB Hyderabad

రాబోయే వేసవిలో వాతావరణ ఉష్ణోగ్రతలు, సంబంధిత విపరిణామాలను ఎదుర్కొనడంపై సంసిద్ధతకు సంబంధించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఎల్‌.కె.మార్గ్‌లో తన నివాసమైన నం.7 భవనంలో తన అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న కొన్ని నెలలపాటు భారత వాతావరణ విభాగం (ఐఎండి) జారీ చేయబోయే వాతావరణ సూచనలతోపాటు ఈ ఏడాది రుతుపవనాలు సాధారణ రీతిలోనే ఉంటాయని అంచనా వేసినట్లు ప్రధానమంత్రికి అధికారులు వివరించారు.

దేశంలో రబీ పంటలపై వాతావరణ ప్రభావం, ప్రధాన పంటల దిగుబడి గురించి కూడా వారు ఆయనకు వివరించారు. అనంతరం సాగునీటి సరఫరా, పశుగ్రాసం, తాగునీటి సరఫరాలపైనా పర్యవేక్షణకు సంబంధించిన ఏర్పాట్లను కూడా ప్రధాని సమీక్షించారు. అలాగే అన్ని రాష్ట్రాల్లోనూ అత్యవసర పరిస్థితుల నిర్వహణకు తగిన సామగ్రి లభ్యత, ఆస్పత్రులలో మౌలిక వసతుల కల్పన తదితరాలపైనా సంబంధిత శాఖల అధికారులు ప్రధానికి విశదీకరించారు. వేసవి ఉష్ణోగ్రతలు, విపరీత పరిస్థితుల నిర్వహణ-ఉపశమన చర్యల సంబంధిత సన్నద్ధత దిశగా దేశమంతటా చేపట్టిన కృషి గురించి కూడా ప్రధానమంత్రికి ఉన్నతాధికారులు తాజా సమాచారం అందజేశారు.

పౌరులు, వైద్య వృత్తి నిపుణులు, పురపాలక-పంచాయతీల పాలక మండళ్లు, అగ్నిమాపక సిబ్బంది వంటి విపత్తు ప్రతిస్పందన బృందాలు వంటి అందరు భాగస్వాముల కోసం విభిన్న అవగాహన సరంజామాను సిద్ధం చేయాల్సిందిగా ప్రధానమంత్రి ఆదేశించారు. వేసవి తీవ్రత పరిస్థితులను ఎదుర్కోవడంపై బాలల్లో చైతన్యం దిశగాచేపాఠశాలల్లో కొన్ని మల్టీమీడియా ఉపన్యాసాల వంటి ఏర్పాట్లు చేయాలని కూడా ఆయన సూచించారు. వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకునే విధివిధానాల రూపకల్పనతోపాటు చేయదగిన/చేయకూడని చర్యలేమిటో తెలపాలని కోరారు. ఈ మేరకు వివిధ రూపాల్లో ప్రచారం చేపట్టాలని స్పష్టం చేశారు. ఇందుకు తగినట్లుగా లఘు గీతాలు, చిత్రాలు, కరపత్రాలు తదితర రూపాల్లో ప్రచార సరంజామా తయారు చేయాలని ప్రధానమంత్రి అన్నారు. రోజువారీ వాతావరణ సూచనలను సులభంగా అర్థమయ్యేలా, విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా జారీ చేయాలని ప్రధానమంత్రి ‘ఐఎండి’ని ఆదేశించారు. వార్తా చానెళ్లు, ఎఫ్‌.ఎం. రేడియో తదితర ప్రసార సాధనాల ద్వారా రోజువారీ వాతావరణ సూచనల సమాచారమిస్తూ ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించేలా నిత్యం కొంత సమయం కేటాయించేలా చూడటంపైనా సమావేశం చర్చించింది.

దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్తులలో అగ్నిమాపక ఏర్పాట్లపై సమగ్ర తనిఖీ ఆవశ్యకత గురించి ప్రధానమంత్రి అప్రమత్తం చేశారు. అంతేకాకుండా సంబంధిత సిబ్బంది సన్నద్ధత కసరత్తు ద్వారా నిత్యం చురుగ్గా ఉండేవిధంగా చూడాలని ప్రధాని నొక్కి చెప్పారు. అడవుల్లో చెలరేగే కార్చిచ్చును ఆర్పేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. కార్చిచ్చును ఆర్పే సమన్వయ కృషికి సంబంధించి అవసరమైన మేరకు వ్యవస్థాగత మార్పులు చేపట్టడంపైనా సమావేశం చర్చించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల రిజర్వాయర్లలో నీటి నిల్వలు, పశుగ్రాసం లభ్యతను పర్యవేక్షించాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ప్రధానమంత్రి ఆదేశించారు. వేసవిలో విపరీత వాతావరణ పరిస్థితులు ఏర్పడితే అందుకు తగినట్లు ధాన్యం నిల్వలు నిర్వహించాలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ)కు సమావేశం సూచించింది.

ఈ సమావేశంలో ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి, కేంద్ర మంత్రిమండలి కార్యదర్శితోపాటు హోంశాఖ, ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ, వ్యవసాయ-రైతు సంక్షేమశాఖ, భూవిజ్ఞాన శాఖల కార్యదర్శులు, ‘ఎన్‌డిఎంఎ’ సభ్య కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

 

 



(Release ID: 1904765) Visitor Counter : 151