ప్రధాన మంత్రి కార్యాలయం

జి-20 విదేశాంగ మంత్రులనుద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి


“లక్ష్యసాధనలో, కార్యాచరణలో ఐక్యమత్యాన్ని ప్రబోధిస్తున్న ‘ఒకభూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ భావన”

“ ప్రపంచ యుద్ధం తరువాత అంతర్జాతీయ పాలన అటు భవిష్యత్ యుద్ధ నివారణలోనూ, ఇటు ఉమ్మడి ప్రయోజనాలకోసం అంతర్జాతీయ సహకారం కూడగట్టటంలోనూ విఫలం”

“ తన నిర్ణయాలవల్ల తీవ్రంగా ప్రభావితమైన వారి గొంతు వినకుండా ఎవరూ అంతర్జాతీయ నాయకత్వానికి అర్హులు కాలేరు”

“దక్షిణార్థ గోళానికి గొంతుకగా నిలవటానికి భారత జి-20 అధ్యక్షత ప్రయత్నించింది”

“మనం సాధించుకోగలిగే అంశాలకు సాధించుకోలేనివి అవరోధం కాకూడదు”

“ఎదుగుదలకూ, సామర్థ్యానికీ మధ్య సరైన సమతుల్యతకు ఒకవైపు, కోలుకోవటం కోసం మరోవైపు కీలకపాత్ర పోషించాల్సిన బాధ్యత జి-20 ది”

Posted On: 02 MAR 2023 9:34AM by PIB Hyderabad

ఈరోజు జరిగిన జి-20 విదేశాంగమంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశమిచ్చారు. జి-20 అధ్యక్ష బాధ్యతలు నెరపుతున్న భారతదేశం ‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ భావను ఎంచుకోవటానికి కారణాన్ని ప్రస్తావించారు. లక్ష్య నిర్దేశంలోనూ, కార్యాచరణలోనూ ఐక్యమత్యపు అవసరాన్ని ఈ భావన నొక్కి చెబుతుందన్నారు. ఉమ్మడి లక్ష్య సాధనకోసం అందరూ దగ్గరవటమనే స్ఫూర్తిని ఈరోజు సమావేశం  ప్రతిబింబిస్తున్నదన్నారు.

నేటి ప్రపంచంలో బహుళ పక్ష వాదం సంక్షోభంలో పడినమాట నిజమని అందరూ ఒప్పుకోవాల్సిందేనన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత రెం వచ్చిన ప్రపంచ పాలన అనే నిర్మితి  రెండు విధులు నిర్వర్తించాల్సి ఉందని,  పోటీ ప్రయోజనాల మధ్య సమతుల్యత సాధించటం ద్వారా భవిష్యత్ యుద్ధాల నివారణ వాటిలో మొదటిదని, ఉమ్మడి ప్రయోజనాల మధ్య అంతర్జాతీయ సహకారం సాధించటం రెండోదని అన్నారు.  గత కొద్ది సంవత్సరాల్లో ఎదురైన అనుభవాలు -  ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పు, కరోనా సంక్షోభం, తీవ్రవాదం, యుద్ధాలు చూస్తుంటే ప్రపంచ పాలన తన రెండు విధులలోనూ విఫలమైందని రుజువైందని ప్రధాని అన్నారు. ఈ విషాదకర వైఫల్యం ఫలితాలను ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలే ఎదుర్కుంటున్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు. అనేక సంవత్సరాల పురోగతి అనంతరం ఈరోజు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో వెనకడుగు వేసే ప్రమాదంలో ఉన్నామని గుర్తు చేశారు.  అభివృద్ధి చెందుతున్న అనేక దేశాలు తట్టుకోలేనంత రుణం ఊబిలో ఉండి తమ ప్రజలకు ఆహార, ఇంధన భద్రత కల్పించటానికి కష్టపడుతున్నాయన్నారు. ఇవే దేశాలు ఒకప్పుడు ధనిక దేశాల వలన ఏర్పడిన గ్లోబల్ వార్మింగ్ బాధిత దేశాలేనని చెబుతూ,  అందుకే జి-20 అధ్యక్ష బాధ్యతల్లో భారతదేశం ఈ సమస్య బారిన పడిన దేశాల గొంతుకగా నిలవబోతోందని స్పష్టం చేశారు. తీవ్రంగా ప్రభావితమైన వారి మాట  వినకుండా ఏ  బృందమూ  అంతర్జాతీయ నాయకత్వం చేపట్టటానికి తగదని కూడా ప్రధాని విస్పష్టంగా తేల్చి చెప్పారు.

ప్రపంచం వేరు వేరుగా విభజితమైన సమయంలో ఈ సమావేశం జరుగుతోందని,  విదేశాంగ మంత్రుల చర్చల మీద ఈనాటి భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం ఉండి తీరుతుందని ప్రధాని గుర్తుచేశారు. “ఈ ఉద్రిక్తతల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో మన అభిప్రాయాలు, దృక్పథాలు మనకుంటాయి” అన్నారు.  అదే సమయంలో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ముందుకు నడుపుతున్న దేశాలుగా మనకు ఇక్కడ లేనివారి పట్ల కూడా బాధ్యత ఉందని గుర్తు చేశారు. “ఎదుగుదల, అభివృద్ధి, ఆర్థికంగా కోలుకోవటం, విపత్తులనుంచి కోలుకోవటం, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ నేరాలు, అవినీతి, తీవ్రవాదం, ఆహార, ఇంధన భద్రతలు లాంటి కీలక సమస్యలు, సవాళ్ళ మీద జి-20 తీసుకునే నిర్ణయాలకోసం ప్రపంచం ఎదురుచూస్తోంది” అని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ అంశాలన్నిటిలోనూ ఏకాభిప్రాయం సాధించి స్పష్టమైన ఫలితాలు సాధించే సామర్థ్యం జి-20 కి ఉందని  శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. .మనం ఉమ్మడిగా పరిష్కరించగల సమస్యలకు సాధించలేని అంశాలు అడ్డు పడకుండా చూసుకోవాలని ఈ సందర్భం గా హితవు చెప్పారు. గాంధీ, బుద్ధుడు జన్మించిన నేలమీద మీరు సమావేశమవుతున్నందున భారత నాగరకత అందించిన విలువలనుంచి పొందిన స్ఫూర్తిని అందరూ అందుకోవాలని, విభజించే శక్తులమీద కాకుండా కలిపి ఉంచే వాటి మీద దృష్టిపెట్టాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

వేలాది మంది ప్రాణాలు కోల్పోవటానికి కారణమైన ప్రకృతి వైపరీత్యాలను, ఘోరమైన కోవిడ్ సంక్షోభాన్ని  ప్రస్తావిస్తూ, వీటివలన అంతర్జాతీయ సరఫరా గొలుసుకట్టు విచ్ఛిన్నమైందని అన్నారు. సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థలు సైతం అకస్మాత్తుగా రుణాల సుడిగుండంలో చిక్కుకొని ఆర్థిక సంక్షోభంలో పడటాన్ని ప్రధాని గుర్తు చేశారు.  అందుకే మన సమాజాలు, మన ఆర్థిక వ్యవస్థలు, మన ఆరోగ్య వ్యవస్థలు, మన మౌలిక సదుపాయాలు మళ్ళీ వేగంగా కోలుకోవాలని ఈ అనుభవాలు మనకు స్పష్టంగా సూచిస్తున్నాయన్నారు. ఒకవైపు ఎదుగుదలకూ, సామర్థ్యానికీ మధ్యన సరైన సమతుల్యత సాధిస్తూ  ఇంకోవైపు కోలుకోవటం మీద దృష్టిసారిస్తూ జి-20 ఒక కీలకమైన పాత్ర పోషించాల్సి ఉందని ప్రధాని సూచించారు. కలసికట్టుగా పనిచేయటం ద్వారా మనం ఈ సమతుల్యత సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని తన ప్రసంగం ముగిస్తూ, ఉమ్మడి విజ్ఞత, సామర్థ్యం మీద తనకు పూర్తి విశ్వాసముందని, నేటి సమావేశం ప్రతిష్ఠాత్మకం, సమ్మిళితం, కార్యాచరణతో కూడినది, విభేదాలకు అతీతమైనదని నమ్ముతున్నట్టు ప్రకటించారు.

 

 

***

DS/TS

 



(Release ID: 1903683) Visitor Counter : 143