వ్యవసాయ మంత్రిత్వ శాఖ

పీఎం-కిసాన్‌ పథకం కింద 8 కోట్ల మందికి పైగా లబ్దిదారు రైతులకు రూ.16,800 కోట్లకు పైగా 13వ విడత మొత్తాన్ని కర్ణాటకలోని బెలగావిలో రేపు విడుదల చేయనున్న ప్రధాన మంత్రి

Posted On: 26 FEB 2023 4:36PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, ప్రధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి (పీఎం-కిసాన్) ప‌థ‌కం కింద ఒక్కో రైతుకు రూ.2000 రేపు విడుద‌ల చేయ‌నున్నారు. ఈ పథకం కింద, 8 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లో రూ.16,800 కోట్లకు పైగా మొత్తం నేరుగా జమ అవుతుంది.

పీఎం-కిసాన్‌ 13వ విడత విడుదల కార్యక్రమం కర్ణాటకలోని బెలగావిలో జరుగుతుంది. భారతీయ రైల్వే శాఖ, జల్ జీవన్ మిషన్‌ విభాగం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, ఆ శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ అహుజా హాజరవుతారు. లక్ష మందికి పైగా పీఎం కిసాన్‌, జల్ జీవన్ మిషన్ లబ్దిదార్లు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడాలన్న ఆసక్తి ఉన్నవారు https://lnkd.in/gU9NFpd యూఆర్‌ఎల్‌ ద్వారా పేరు నమోదు చేసుకోవచ్చు. ప్రత్యక్ష ప్రసారాలను https://pmindiawebcast.nic.in/లో చూడవచ్చు.

పీఎం కిసాన్‌ 11, 12వ విడతలను గతేడాది మే, అక్టోబర్‌ నెలల్లో ఇచ్చారు. 13వ విడత విడుదల ద్వారా, భారతదేశ రైతులను ఆదుకోవడంలో, వారి జీవనోపాధి లక్ష్యాలను సాధించేందుకు సహాయపడడంలో కేంద్ర ప్రభుత్వం తన నిబద్ధతను చాటుతోంది. పీఎం కిసాన్‌ పథకం వల్ల దేశవ్యాప్తంగా రైతులు గణనీయమైన ప్రయోజనాలు అందుకున్నారు. తాజా విడత కూడా వారి ఆదాయాలను మరింత పెంచి, వ్యవసాయ రంగ వృద్ధికి తోడ్పడుతుంది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించారు. కొన్ని నిర్దిష్ట మినహాయింపులకు లోబడి, సాగు భూమి ఉన్న రైతు కుటుంబాలకు ఆర్థిక మద్దతు అందించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద సంవత్సరానికి రూ.6000ను మూడు విడతలుగా రూ.2000 చొప్పున నేరుగా లబ్ధిదారు బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేస్తారు.

నిర్దిష్ట మినహాయింపు లోబడి దేశంలోని అన్ని రైతు కుటుంబాలు పీఎం కిసాన్ అందుకోవడానికి అర్హులు.

ఇప్పటివరకు, రూ.2.25 లక్షల కోట్లకు పైగా నగదును 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు, ప్రధానంగా చిన్న & సన్నకారు కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అందించింది. ముఖ్యంగా, కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో, అవసరంలో ఉన్న నిరుపేద రైతులను ఆదుకోవడానికి వివిధ విడతల్లో రూ.1.75 లక్షల కోట్లను పంపిణీ చేశారు. ఈ పథకం కింద 3 కోట్ల మందికి పైగా మహిళా రైతులు రూ.53,600 కోట్లుకు పైగా ప్రయోజనం పొందారు.

ఈ పథకం ద్వారా అందించిన నిధులు గ్రామీణ ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించాయి, రైతుల రుణ భారాన్ని తగ్గించాయి, వ్యవసాయ పెట్టుబడులను పెంచాయి. రైతులు రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని కూడా ఈ పథకం పెంచింది, దీనివల్ల మరింత ఉత్పాదక పెట్టుబడులు సాధ్యమయ్యాయి. ఐఎఫ్‌పీఆర్‌ఐ ప్రకారం, పీఎం కిసాన్ ద్వారా అందుతున్న డబ్బు లబ్ధిదార్ల వ్యవసాయ అవసరాలు తీర్చడానికి వారి కుటుంబాల్లో విద్య, వైద్యం, వివాహం వంటి ఇతర ఖర్చులను తీర్చడంలో సహాయపడుతోంది.

 

****



(Release ID: 1902633) Visitor Counter : 315