ప్రధాన మంత్రి కార్యాలయం
వర్చువల్ విధానంలో భారతదేశం, సింగపూర్ మధ్య యుపిఐ- పే నౌ అనుసంధానం జరిగిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం తెలుగు అనువాదం
Posted On:
21 FEB 2023 12:24PM by PIB Hyderabad
గౌరవ ప్రధానమంత్రి లీ,
మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ మేనేజింగ్ డైరెక్టర్,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్,
భారతదేశం, సింగపూర్ దేశాలకు చెందిన స్నేహితులారా
భారతదేశం, సింగపూర్ మధ్య స్నేహం చాలా పాతది. కాల పరీక్ష తట్టుకుని రెండు దేశాల మధ్య స్నేహం, సంబంధ బాంధవ్యాలు కొనసాగుతున్నాయి. మన ప్రజల-ప్రజల సంబందం అనే అంశాన్నికి రెండు దేశాలు ప్రాధాన్యత ఇస్తున్నాయి. రెండు దేశాలకు చెందిన ప్రజలు ఎంతో కాలంగా యుపిఐ- పే నౌ అనుసంధానం కోసం ఎదురుచూస్తున్నారు. ఈరోజు జరిగిన యుపిఐ- పే నౌ అనుసంధానం రెండు దేశాల ప్రజలకు ఒక బహుమతి. ఈ సందర్భంగా భారతదేశం, సింగపూర్ ప్రజలకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
నేటి ప్రపంచంలో సాంకేతికత మనల్ని వివిధ మార్గాల్లో కలుపుతోంది. ఫిన్‌టెక్ కూడా అటువంటి రంగం. ఇది ప్రజలను ఒకరితో మరొకరిని కలుపుతుంది. సాధారణంగా ఫిన్‌టెక్ పరిధి దేశ సరిహద్దులకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ, ఈ రోజు జరిగిన కార్యక్రమంతో సరిహద్దులు దాటి ఫిన్‌టెక్ ప్రజలను కొలుపుతూ నూతన అధ్యాయానికి నంది పలికింది.
ఈ రోజు నుంచి సింగపూర్ , భారతదేశాలకు చెందిన ప్రజలు తమ తమ దేశాలలో చేసే విధంగానే తమ మొబైల్ ఫోన్‌ల నుంచి నగదు బదిలీ చేయగలుగుతారు. ఇది రెండు దేశాల ప్రజలు తమ మొబైల్‌ల నుంచి తక్షణమే తక్కువ ఖర్చుతో నగదు బదిలీ చేయడానికి సహాయపడుతుంది. ఈ సదుపాయంతో రెండు దేశాల మధ్య జరిగే చెల్లింపులు తక్కువ ఖర్చుతో నిర్ణీత సమయంలో చేయడానికి వీలవుతుంది. ఇది ముఖ్యంగా మన విదేశీ సోదరులు మరియు సోదరీమణులు, నిపుణులు, విద్యార్థులు మరియు వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.
స్నేహితులారా
భారతదేశం ఆవిష్కరణ , ఆధునీకరణకు అనుకూలమైన పరిస్థితి అభివృద్ధి చేసేందుకు గత కొన్ని సంవత్సరాలుగా అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. అదనంగా, మా డిజిటల్ ఇండియా కార్యక్రమం భారతదేశంలో వ్యాపారం సులభంగా చేయడం, జీవన సౌలభ్యాన్ని పెంచడానికి సహకరించింది. దీంతో డిజిటల్ కనెక్టివిటీ తో పాటు ఆర్థిక చేరిక ఊపందుకుంది. పాలన , ప్రజా సేవల పంపిణీలో భారీ సంస్కరణలు అమలు చేయడానికి డిజిటల్ ఇండియా కార్యక్రమం అవకాశం కల్పించింది. . డిజిటల్ మౌలిక సదుపాయాల ద్వారా లభించిన సౌకర్యం వల్ల కోవిడ్ మహమ్మారి సమయంలో మేము కోట్లాది మంది ప్రజల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేయగలిగాము.
మిత్రులారా,
యువత-శక్తిపై నమ్మకం, ఆవిష్కరణల రంగంలో అత్యుత్తమ ఆవిష్కరణగా ఫిన్‌టెక్ ఉంటుందని ఐదేళ్ల క్రితం నేను సింగపూర్‌లో చెప్పాను. డిజిటల్ విప్లవంలో భారతదేశం సాధించిన విజయానికి సాంకేతిక శిక్షణ పొందిన మా యువత నాయకత్వం వహిస్తున్నారు. నేడు, భారతదేశంలోని వేలాది స్టార్టప్‌లు ఫిన్‌టెక్ ప్రపంచంలో తమదైన ముద్ర వేస్తున్నాయి. ఈ శక్తి కారణంగా, నేడు భారతదేశం నిజ-సమయ డిజిటల్ లావాదేవీల పరంగా ప్రపంచంలో అగ్రగామి దేశాలలో ఒకటిగా నిలిచింది.
భారతదేశంలో అత్యంత ప్రాధాన్య చెల్లింపు విధానంగా యూపీఐ మారింది. వ్యాపారులు, వినియోగదారులు ఇద్దరూ దీనిని మరింత ఎక్కువగా స్వీకరిస్తున్నారు. అందువల్ల, భారతదేశంలో త్వరలో డిజిటల్-వాలెట్ లావాదేవీలు నగదు లావాదేవీలను మించి పోతాయి అని నేడు అనేక మంది నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది అంటే 2022 లో దాదాపు 126 లక్షల కోట్ల రూపాయలు అంటే 2 లక్షల కోట్ల సింగపూర్ డాలర్లకు పైగా లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయి. లావాదేవీల సంఖ్య గురించి నేను మాట్లాడితే, అది కూడా 7400 కోట్ల కంటే ఎక్కువ. భారతదేశ యూపీఐ వ్యవస్థ పెద్ద సంఖ్యలో వ్యక్తులు సులభంగా, సురక్షితంగా ఎలా నిర్వహిస్తుంది అన్న అంశాన్ని ఇది చూపిస్తుంది.
వివిధ దేశాలతో యూపీఐ భాగస్వామ్యం కూడా జరుగుతుండటం విశేషం. ఈ రోజు పర్సన్ టు పర్సన్ పేమెంట్ సదుపాయాన్ని ప్రారంభించిన మొదటి దేశం సింగపూర్. ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయడంలో పాలుపంచుకున్న సింగపూర్ మానిటరీ అథారిటీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకరించిన వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
నేను మరోసారి ఇరు దేశాల ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ధన్యవాదాలు.
నిగమనిక ఇది ప్రధానమంత్రి ప్రసంగానికి దాదాపు అనువాదం. అసలు వ్యాఖ్యలు హిందీలో సాగాయి.
(Release ID: 1901344)
Visitor Counter : 154
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam