ప్రధాన మంత్రి కార్యాలయం
బెంగళూరులో ‘ఇండియా ఎనర్జీ వీక్-2023’కు ప్రధాని శ్రీకారం
ఇండియన్ ఆయిల్ ‘అన్‌బాటిల్డ్’ కార్యక్రమం కింద యూనిఫారాలు ప్రారంభం;
ఇండియన్ ఆయిల్ ఇన్డోర్ సౌర వంట వ్యవస్థ జంట స్టవ్‌లు జాతికి అంకితం;
‘ఇ20’ ఇంధనం ఆవిష్కరణ; హరిత రవాణా ప్రదర్శనకు జెండా ఊపి శ్రీకారం;
“వికసిత భారతం సంకల్పంతో ముందుకు... ఇంధన రంగంలో అవకాశాల వెల్లువ”;
“మహమ్మారి.. యుద్ధం నడుమ చిక్కుకున్న ప్రపంచంలో ఉజ్వల తారగా భారత్”;
భారత ఆర్థిక ప్రతిరోధకతకు క్షేత్రస్థాయిలో నిర్ణయాత్మక ప్రభుత్వం..
సుస్థిర సంస్కరణలు.. సామాజిక-ఆర్థిక సాధికారతలే పునాదులు;
“సంస్కరణలతో ఆకాంక్షాత్మక సమాజం ఆవిష్కరణ”;
“మన దేశీయ శుద్ధి సామర్థ్యాన్ని నిరంతరం
ఆధునికంగా.. ఉన్నతంగా.. మార్చుకుంటున్నాం”;
“మన ఇంధన మిశ్రమంలో 2030 నాటికి సహజవాయువు
వినియోగం పెంచడానికి ఉద్యమ తరహాలో కృషి చేస్తున్నాం”
Posted On:
06 FEB 2023 2:16PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బెంగళూరులో భారత ఇంధన వారోత్సవాలు-2023 (ఇండియా ఎనర్జీ వీక్)కు శ్రీకారం చుట్టారు. అలాగే ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ (ఐఓఎల్) ‘అన్ బాటిల్డ్’ కార్యక్రమం కింద యూనిఫారాలను ప్రారంభించారు. వీటిని రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ సీసాల (పెట్ బాటిళ్లు)తో తయారుచేశారు. దీంతోపాటు ‘ఐఓఎల్’ రూపొందించిన ఇన్‌డోర్ సౌరశక్తి వంట వ్యవస్థ జంట స్టవ్‌లను జాతికి అంకితం చేయడంతోపాటు మార్కెట్ ప్రవేశం చేయించారు.
అనంతరం ఇథనాల్ మిశ్రమ మార్గప్రణాళికకు అనుగుణంగా 11 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని చమురు విక్రయ కంపెనీలకు చెందిన 84 చిల్లర విక్రయ కేంద్రాల్లో ‘ఇ20’ ఇంధన విక్రయాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. మరోవైపు హరిత రవాణా ప్రదర్శనకు కూడా ప్రధానమంత్రి జెండా ఊపి శ్రీకారం చుట్టారు. హరిత ఇంధనాలపై ప్రజల్లో అవగాహన పెంపు దిశగా చేపట్టిన ఈ ర్యాలీలో హరిత ఇంధనంతో నడిచే వాహనాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ముందుగా- భూకంపం వల్ల టర్కీ, పరిసర దేశాలలో సంభవించిన విధ్వంసం, ప్రాణనష్టంపై సంతాపం తెలిపారు. భారత్ తరఫున సాధ్యమైన మేర సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. బెంగళూరు నగరం సాంకేతికత, ప్రతిభ, ఆవిష్కరణలకు నిలయమని ఆయన కొనియాడారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ నిత్యం ఈ అనిర్వచనీయ శక్తి అనుభవంలో ఉన్నదేనని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘ఇండియా ఎనర్జీ వీక్’ అనేది జి-20 కేలండరులో తొలి కీలక ఇంధన కార్యక్రమం అని, దీనికి ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తున్నానని ఆయన తెలిపారు.
ప్రపంచానికి 21వ శతాబ్దపు భవిష్యత్తు దిశను నిర్దేశించడంలో ఇంధన రంగానికిగల కీలక పాత్ర గురించి ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. “ఇంధన పరివర్తన, సరికొత్త ఇంధన వనరుల అభివృద్ధి కోసం ప్రపంచంలో బలంగా గళం వినిపిస్తున్న భారతదేశం ఒకటి. ఆ మేరకు వికసిత భారతం సంకల్పంతో ముందుకెళ్తున్న మనదేశ ఇంధన రంగంలో అవకాశాలు అపారం” అని ప్రధాని పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా పురోగమిస్తున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ ఒకటని పేర్కొంటూ ‘ఐఎంఎఫ్’ ఇటీవల ప్రకటించిన అంచనాలను ప్రస్తావించారు. ప్రపంచం నేడు మహమ్మారి, యుద్ధం నడుమ చిక్కుకున్న నేపథ్యంలో భారతదేశం ఉజ్వల తారగా ప్రకాశిస్తున్నదని ప్రధాని అభివర్ణించారు. బాహ్యకారకాలతో నిమిత్తం లేకుండా ఎలాంటి అవరోధాన్నయినా అధిగమించగల సామర్థ్యాన్ని భారత ప్రతిరోధకత మనకు కల్పించిందని గుర్తుచేశారు.
ఈ మేరకు ప్రధానమంత్రి అనేక అంశాలను ఉదాహరించారు- మొదటిది… నిలకడైన నిర్ణయాత్మక ప్రభుత్వం కాగా, రెండోది… సుస్థిర సంస్కరణలని, మూడోది… క్షేత్రస్థాయిలో
సామాజిక-ఆర్థిక సాధికారతేనని స్పష్టం చేశారు. దీంతోపాటు బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్థిక సార్వజనీనత, ఉచిత ఆరోగ్య సౌకర్యాలు, సురక్షిత పారిశుధ్యం, విద్యుత్తు, గృహనిర్మాణం, కొళాయిల ద్వారా కోట్లాది కుటుంబాలకు మంచినీరు వంటి బృహత్తర, సామాజిక మౌలిక సౌకర్యాలు పలు ప్రధాన దేశాల జనాభాకన్నా ఎక్కువమంది ప్రజలకు చేరువయ్యాయని తెలిపారు.
దేశంలో పేదరికం నుంచి మధ్యతరగతి స్థాయికి చేరుకున్న కోట్లాది ప్రజల జీవన నాణ్యతలో వచ్చిన సానుకూల మార్పులను ప్రధానమంత్రి గుర్తుచేశారు. దేశంలో 6,00,000 కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ లైన్ ఏర్పాటు చేశామని, తద్వారా ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్ సదుపాయం ఉందని ఆయన తెలిపారు. గత 9 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ, దేశంలో బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 13 రెట్లు పెరిగిందన్నారు. అలాగే ఇంటర్నెట్ కనెక్షన్లు కూడా మూడు రెట్లు పెరిగాయని ప్రధానమంత్రి తెలిపారు. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వాడకందారుల సంఖ్య వేగంగా పెరుగుతోందన్నారు. అంతర్జాతీయంగా మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ 2వ అతిపెద్ద దేశంగా అవతరించిందని ప్రధాని వెల్లడించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆకాంక్షాత్మక తరగతిగా ఏర్పడటానికి దారితీసిందని ప్రధాన మంత్రి తెలియజేశారు. “భారత ప్రజలు మెరుగైన ఉత్పత్తులు, మెరుగైన సేవలు, మరింత మెరుగైన మౌలిక సదుపాయాలను ఆకాంక్షిస్తున్నారు” అని పేర్కొన్నారు. భారత పౌరుల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఇంధనానికిగల కీలక పాత్రను ఎత్తి చూపుతూ ప్రధాని ప్రసంగం కొనసాగించారు.
సమీప భవిష్యత్తులో భారతదేశంలో ఇంధన ఆవశ్యకతను, పెరిగే డిమాండ్‌ను నొక్కిచెప్పిన ప్రధానమంత్రి- అభివృద్ధి శరవేగం అందుకుంటున్నందున కొత్త నగరాలు ఆవిర్భవిస్తాయని తెలిపారు. అంతర్జాతీయ ఇంధన సంస్థను ఉటంకిస్తూ- ప్రస్తుత దశాబ్దంలో భారత ఇంధన డిమాండ్లు అత్యధికంగా ఉంటాయని, తద్వారా ఈ రంగంలోని పెట్టుబడిదారులకు, భాగస్వాములకు అపార అవకాశాలు కలిసివస్తాయని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రపంచ చమురు డిమాండ్‌లో భారత్ వాటా 5 శాతం కాగా, 11 శాతానికి వరకు పెరుగుతుందని అంచనాలున్నట్లు పేర్కొన్నారు. అలాగే భారత గ్యాస్ డిమాండ్ కూడా 500 శాతందాకా పెరుగుతుందని అంచనా. ఈ విధంగా దేశంలో ఇంధన రంగం విస్తరణతో పెట్టుబడులు, సహకారం దిశగా సరికొత్త అవకాశాలు సృష్టించబడుతున్నాయని ఆయన నొక్కిచెప్పారు.
భారత ఇంధన రంగం సంబంధిత వ్యూహంలో నాలుగు అంచెల గురించి ప్రధానమంత్రి వివరించారు. మొదటిది… దేశీయ అన్వేషణ-ఉత్పత్తిని పెంపు, రెండోది… సరఫరా వైవిధ్యీకరణ, మూడోది… జీవ ఇంధనం- ఇథనాల్, కంప్రెస్డ్ బయోగ్యాస్, సౌరశక్తి వంటి ఇంధనాల విస్తరణ. నాలుగోది… ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ద్వారా కర్బనవిముక్తి. ఈ నేపథ్యంలో చమురుశుద్ధి సామర్థ్యం రీత్యా భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద దేశమన్నారు. ప్రస్తుత వార్షిక సామర్థ్యం 250 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంఎంటిపిఎ) కాగా, దీన్ని 450 ‘ఎంఎంటిపిఎ’కి పెంచే కృషి సాగుతోందన్నారు. ఈ మేరకు “మన శుద్ధి సామర్థ్యాన్ని నిరంతరం ఆధునికంగా, ఉన్నతంగా, దేశీయంగా మార్చుకుంటున్నాం” అని ఆయన చెప్పారు. అలాగే పెట్రో-రసాయనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి భారత్ కృషి చేస్తోందన్నారు. ఇంధన రంగం తన సామర్థ్యాన్ని విస్తృతం చేసుకునేందుకు భారతదేశ సాంకేతికతను, అంకుర పర్యావరణ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని అగ్రశ్రేణి సంస్థలను ఆయన కోరారు.
దేశంలో ఇంధన మిశ్రమంరీత్యా 2030 నాటికి అందులో సహజ వాయు వినియోగాన్ని 6 నుంచి 15శాతానికి పెంచే దిశగా ప్రభుత్వం ఉద్యమ తరహాలో కృషి చేస్తోందని, ఇందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల ‘ఒన్ నేషన్-ఒన్ గ్రిడ్’ కింద అందజేస్తామని ప్రధానమంత్రి తెలిపారు. “ఎల్‌ఎన్‌జి టెర్మినల్ రీగ్యాసిఫికేషన్ సామర్థ్యం పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తోంది” అని ప్రధాని చెప్పారు. ఈ మేరకు 2022లో టెర్మినల్ రీగ్యాసిఫికేషన్ సామర్థ్యం 21 ‘ఎంఎంటిపిఎ’ స్థాయికి చేరి రెట్టింపైందని, మరింత పెంచే ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. దేశంలో ‘సిజిడి’ల సంఖ్య 9 రెట్లు పెరిగిందని, ఈ మేరకు 2014లో 900 కాగా, నేడు ‘సిఎన్‌జి’ స్టేషన్ల సంఖ్య 5000కు చేరిందని ఆయన అన్నారు. గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్ కూడా 2014 నుంచి ఇప్పటిదాకా 14,000 స్థాయి నుంచి 22,000 కిలోమీటర్లకు పెరగడాన్ని ప్రధాని ఉటంకించారు. నాలుగైదేళ్లలో 35,000 కిలోమీటర్లకు విస్తరించగలదని ధీమాగా చెప్పారు.
దేశీయంగా చమురు అన్వేషణ-ఉత్పత్తికి సంబంధించి భారత్ ప్రాధాన్యాన్ని వివరిస్తూ- ఈ రంగం ఇప్పటిదాకా అందుబాటులో లేని ప్రాంతాలపైనా ఆసక్తి చూపుతున్నదని ప్రధాని తెలిపారు. ఈ మేరకు “మేము ప్రవేశ నిషిద్ధ (నో-గో) ప్రాంతాలను తగ్గించాం. దీంతో 10 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ‘నో-గో’ నిబంధన నుంచి విముక్తమైంది. ఈ అవకాశాలన్నిటినీ సద్వినియోగం చేసుకోవాలని, శిలాజ ఇంధన అన్వేషణలో మీ ఉనికిని చాటుకోవాలని పెట్టుబడిదారులందరినీ కోరుతున్నాను” అని ఆయన చెప్పారు.
జీవ ఇంధన విస్తరణకు సంబంధించి, ప్రధానమంత్రి గత ఏడాది ఆగస్టులో తొలి 2జి ఇథనాల్ బయో-రిఫైనరీ గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో 12 వాణిజ్య 2జి ఇథనాల్ ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే స్థిరమైన విమాన ఇంధనం, వాణిజ్యపరంగా పునరుత్పాదక డీజిల్ సాధ్యాసాధ్యాలపై ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులను ప్రస్తావిస్తూ- 500 కొత్త ‘వర్థ్యం నుంచి అర్థం’ గోబర్ధన్ ప్లాంట్లు, 200 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు, 300 సామాజికాధారిత ప్లాంట్లు వంటివి పెట్టుబడులకు కొత్త బాటలు వేస్తాయని తెలిపారు. మరోవైపు “జాతీయ హరిత ఉదజని కార్యక్రమం 21వ శతాబ్దపు భారతదేశానికి కొత్త దిశను నిర్దేశిస్తుంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ దశాబ్దం చివరికల్లా 5 ‘ఎంఎంటిపిఎ’ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు. తద్వారా రూ.8 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని నొక్కి చెప్పారు. అలాగే ‘గ్రే హైడ్రోజన్’ స్థానంలో భారత్ తన గ్రీన్ హైడ్రోజన్ వాటాను 25 శాతానికి పెంచుతుందని ఆయన ప్రకటించారు.
***
DS/TS
(Release ID: 1896680)
Visitor Counter : 306
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam