సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
యవ్వన ప్రవేశ దశను ఉత్కంఠభరితంగా చిత్రీకరించిన కోస్టారికా దర్శకురాలు వాలెంటినా మౌరెల్ స్పానిష్ చిత్రం ‘టెంగో సూనోస్ ఎలెక్ట్రికోస్’ (నా మెరుపు కలలు)కు ప్రతిష్టాత్మక ‘స్వర్ణ మయూరం’ పురస్కారం
ఈ చలన చిత్రోత్సవాన్ని మనం మనసు, శరీరం, హృదయం, ఆత్మల సమ్మిళితమైన అనుభూతితో నిర్వహించుకుంటున్నాం. ఈ విశిష్ట కళపై విజ్ఞతతో కూడిన ప్రశంసల వర్షంలో ఆనందించాల్సిందిగ ‘ఇఫి’ అంతర్జాతీయ పోటీ న్యాయనిర్ణేతల సంఘం మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. అవును... ఈ సంఘం ఎంపిక మేరకు మన చేతులమీదుగా గౌరవం, గుర్తింపు, ప్రశంసలు ఎవరికి దక్కాలో ప్రకటించబోతున్న నేపథ్యంలో ఓసారి ఊపిరి బిగబట్టండి. ముందుగా:
ఉత్తమ చలనచిత్రంగా స్పానిష్ సినిమా ‘ఐ హ్యావ్ ఎలక్ట్రిక్ డ్రీమ్స్’ (నా మెరుపు కలలు)కు ‘స్వర్ణ మయూరం’
ఈసారి భారత 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో స్పానిష్ చిత్రం ‘టెంగో సూనోస్ ఎలెక్ట్రికోస్’ (నా మెరుపు కలలు)కు ప్రతిష్టాత్మక ‘స్వర్ణ మయూరం’ అవార్డు లభించింది. చలనచిత్ర వర్తమానం, భవిష్యత్తును ఈ సినిమా తెరపై ఆవిష్కరించిందని న్యాయనిర్ణేతల సంఘం దీనిపై ప్రశంసలు కురిపించింది. కోస్టారికా దర్శకురాలు వాలెంటినా మౌరెల్ రూపొందించిన ఈ చిత్రం 16 ఏళ్ల అమ్మాయి ‘ఇవా’ యవ్వనంలోకి ప్రవేశించే దశను అద్భుతంగా ప్రేక్షకుల కళ్లకు కడుతుంది. ఈ దశ కేవలం వయసు పెరగడానికి సంబంధించినది కాదని, ఈ ప్రక్రియ ఎంతో లోతైనది, కొన్ని సందర్భాల్లో వ్యక్తుల జీవితాన్ని అంతుబట్టని రీతిలో ఛిద్రం కూడా చేయగలదని ఈ చిత్ర కథనం వివరిస్తుంది. దీనిపై సంఘం సభ్యులు మాట్లాడుతూ- జీవన సంక్లిష్టతను నిజాయితీగా చిత్రించడంలో హింస, కరుణ, ఆగ్రహం, సాన్నిహిత్యం వంటి భావోద్వేగాలు పర్యాయపదాలుగా మారాయని వ్యాఖ్యానించింది. “ఇది చాలా ఉత్కంఠభరితంగా, ఉత్తేజపూరితంగా ఉంది. ఈ చిత్రాన్ని చూస్తున్నప్పుడు మనకూ వణుకుపుడుతుంది” అని పేర్కొన్నారు.
‘ఐ హ్యావ్ ఎలక్ట్రిక్ డ్రీమ్స్’ చిత్రంలో ఓ సన్నివేశం
ప్రపంచంలోని ఇతర కోణాల కథలను దీనితో సరిపోల్చుకునేలా.. అదే సమయంలో కుటుంబ విలువలు లేదా విశ్వవ్యాప్త భావనలతో మమేకం కావడంలో తోడ్పడేలా రూపొందిన ఈ చిత్రాన్ని బెనాయిట్ రోలాండ్, గ్రెగోయిర్ డెబైలీ నిర్మించారు.
ఇరాన్ తిరోగమన సామాజిక-రాజకీయ వ్యవస్థను ప్రతీకాత్మకంగా, హృద్యంగా చిత్రించిన ‘నో ఎండ్’ చిత్రానికిగాను ఇరాన్ రచయిత, దర్శకుడు నదీర్ సైవర్కు ఉత్తమ దర్శకుడిగా ‘రజత మయూరం’ అవార్డు
ఇక ఇరాన్ తిరోగమన సామాజిక-రాజకీయ వ్యవస్థను ప్రతీకాత్మకంగా, హృద్యంగా చిత్రించిన టర్కిష్ చిత్రం ‘బి పాయన్’ (అనంతం-నో ఎండ్) రచయిత, దర్శకుడు నదీర్ సైవర్ ‘ఉత్తమ దర్శకుడు’గా ‘రజత మయూరం’ అందుకున్నారు. ఇరాన్ రహస్య పోలీసుల అవకతవకలు, కుతంత్రాలను ఈ చిత్రం బట్టబయలు చేస్తుంది. చిత్తశుద్ధిగల అయాజ్ అనే వ్యక్తి రహస్య పోలీసుల నుంచి తన ఇంటిని కాపాడుకోవడంలో ఒక అబద్ధంతో మమేకమైపోవడాన్ని ఈ చిత్రం మన ముందుంచుతుంది. దీంతో వాస్తవ రహస్య పోలీసులు రంగప్రవేశం చేసినపుడు పరిస్థితి సంక్లిష్టమవుతుంది. ఈ అవార్డుల ఎంపిక ఏకగ్రీవమని న్యాయ నిర్ణేతల సంఘం ప్రకటించింది. ఇరాన్ పరిస్థితులకు సంబంధించిన ఈ కథను చిత్రించిన తీరు అక్కడి అత్యంత తిరోగమన సామాజిక-రాజకీయ వ్యవస్థ గుట్టును రట్టుచేసేదిగా ఉందని- సుతిమెత్తగానే మన అవగాహనపై గట్టి ప్రభావం చూపుతుందని పేర్కొంది.
కథానాయకుడిని వేధించే సంక్లిష్ట మనోభావాలకు రూపమిచ్చినందుకుగాను ‘ఉత్తమ నటుడు’గా ‘నో ఎండ్’ ప్రధాన పాత్రధారి వహిద్ మొబస్సేరికి ‘రజత మయూరం’తో సత్కారం
నదీర్ సైవర్ దర్శకత్వం వహించిన ‘నో ఎండ్’లో అయాజ్ పాత్రను అద్భుతంగా పోషించినందుకుగాను ‘ఉత్తమ నటుడు’గా వహిద్ మొబస్సేరిని ఏకగ్రీకంగా ఎంపిక చేసినట్లు న్యాయనిర్ణేతల సంఘం ప్రకటించింది. “ఈ చిత్రంలో కథానాయకుడిని వేధించే సంక్లిష్ట మనోభావాలను పొడవైన సంభాషణలతో నిమిత్తం లేకుండా తక్కువ పదాలతో తన హావభావాలతో ముఖంలో పలికించగల ప్రతిభ ఈ నటుడి సొంతం” అని ప్రశంసించింది. నిరసన ప్రకటించే ఒక నాటకీయ కథనంలో నిరంకుశత్వంతో ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితులను ఎదుర్కొంటున్న నిస్సహాయుడైన నిజాయితీగల సామాన్య ఇరాన్ పౌరుడుగా ప్రేక్షకుడి మదిలో చెరగని ముద్రవేశాడని పేర్కొంది.
ఉత్తమ చిత్రం 'ఐ హావ్ ఎలక్ట్రిక్ డ్రీమ్స్' కథానాయకి డానియెలా మారిన్ నవారోకు ఉత్తమ నటిగా ‘రజత మయూరం’తో సత్కారం
స్పానిష్ చిత్రం ‘ఐ హావ్ ఎలక్ట్రిక్ డ్రీమ్స్’లో 16 ఏళ్ల అమ్మాయి ‘ఇవా’గా కథానాయిక పాత్రతో తెరంగేట్రం చేసిన 19 ఏళ్ల డానియెలా మారిన్ నవారో తొలి చిత్రంతోనే ‘ఉత్తమ నటి’గా ఎంపిక కావడం విశేషం. దీనిపై న్యాయనిర్ణేతల సంఘం సభ్యులు మాట్లాడుతూ- “ఎంతో అమాయకత్వం నిండిన సంక్లిష్ట యవ్వనదశ ప్రవేశాన్ని సౌలభ్యం, తాజాదనం, విశ్వసనీయతతో హావభావాలను ప్రదర్శిస్తూ నటిగా ఆ పాత్రకు ఆమె జీవం పోశారు” అని కొనియాడారు. ముఖ్యంగా ఈ చిత్రంలో డానియెలా నటనకు లోకర్నో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలోనూ ‘ఉత్తమ నటి’ అవార్డు గెలుచుకుంది.
‘వెన్ ది వేవ్స్ ఆర్ గాన్/కపాగ్ వాలా నాంగ్ మ్గా అలోన్’ చిత్రానికిగాను ఫిలిపినో చిత్రనిర్మాత లావ్ డియాజ్కు ప్రత్యేక జ్యూరీ అవార్డు
‘ఇఫి’ 53వ వేడుకల స్పెషల్ జ్యూరీ అవార్డు ఫిలిపినో చిత్రనిర్మాత లావ్ డియాజ్కు లభించింది. ఆయన నిర్మించిన “వెన్ ద వేవ్స్ ఆర్ గాన్’ చిత్రం దృశ్యసహిత కథనం సంబంధిత శక్తిని వివరిస్తుంది. ఇక్కడ పదాలు తక్కువగా, భావోద్వేగాలు... ముఖ్యంగా ఆవేశం పూర్తి స్థాయిలో కనిపిస్తుంది” అని సంఘం పేర్కొంది.
‘వేవ్స్ ఆర్ గాన్’ చిత్రంలో ఒక సన్నివేశం
ఈ చిత్రం ఫిలిప్పీన్స్‌లో నైతికమార్గాల కూడలిలో చిక్కుకుపోయిన ఓ పరిశోధకుడి కథ. తీవ్ర ఆందోళన, అపరాధ భావన నుంచి బయటపడే ప్రయత్నంలోనూ చీకటి గతం అతన్ని వెంటాడటం గురించి ఈ చిత్రం చర్చిస్తుంది. లావ్ డియాజ్ తనదైన ‘నాటకీయతను సృష్టించడం’లో ప్రసిద్ధులు.
‘బిహైండ్ ది హేస్టాక్స్’ చిత్రానికిగాను అసిమినా ప్రొడ్రూకు ‘ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు’ అవార్డు
‘ఇఫి’లో అంతర్జాతీయ ప్రీమియర్‌గా ప్రదర్శించిన ‘బిహైండ్ ది హేస్టాక్స్’ చిత్రానికిగాను ఏథెన్స్ కు చెందిన దర్శకురాలు అసిమినా ప్రోడ్రూ ‘ఉత్తమ తొలిచిత్ర దర్శకత్వం’ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ చిత్రం “నిరుపయోగ నైతికత, విదేశీ శరణార్థుల సంక్షోభంపై అంతరాంతరాల్లో పాతుకుపోయిన విముఖతల నుంచి కౌమార స్పృహను మేల్కొల్పడంలోగల తీవ్ర మానసిక ప్రబోధానికి పరాకాష్ట” అని న్యాయనిర్ణేతల సంఘం పేర్కొంది. ఒక వ్యక్తి, అతని భార్య, కుమార్తెల ప్రయాణంలో తొలిసారి వారికి సంక్షోభం ఎదురైనపుడు తమ చర్యలకుగాను వారు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులలో వారితో భాగస్వాములు కావాల్సిందిగా ఈ కథ ప్రేక్షకులను ఆహ్వానిస్తుంది.
‘బిహైండ్ ది హేస్టాక్స్’ చిత్రంలో ఒక సన్నివేశం
‘సినిమా బండి’ చిత్రానికిగాను ప్రవీణ్ కొండ్రేగులకు ‘ప్రత్యేక ప్రస్తావన’ పురస్కారం
‘సినిమా బండి’ చిత్రానికిగాను దర్శకుడు, రచయిత, సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ కొండ్రేగులను న్యాయ నిర్ణేతలు ‘ప్రత్యేక ప్రస్తావన’ పురస్కారానికి ఎంపిక చేశారు. ఇది కష్టాల్లో కూరుకుపోయిన ఓ పేద ఆటోడ్రైవర్ కథ. అతడికి రికిన ఓ ఖరీదైన కెమెరా ఆటోడ్రైవర్ నుంచి చిత్రనిర్మాత స్థాయిదాకా ప్రయాణానికి దోహదం చేస్తుంది. భారతదేశంలో సినిమా రంగంపై ప్రజల్లోగల ఆకాంక్షను, అభిరుచిని ఈ చిత్రం వివరిస్తుందని సంఘం పేర్కొంది.
ఈ మేరకు ప్రస్తుత చలనచిత్రోత్సవంలో చిత్రాలన్నిటినీ ఓపికగా చూసి, భారత-ప్రపంచవ్యాప్త చలనచిత్రాలలో అత్యుత్తమమైన వాటిని గుర్తించడమన సవాలుతో కూడిన పని చేసిందెవరు? అంతర్జాతీయ పోటీకి సంబంధించిన న్యాయనిర్ణేతల సంఘం. ఈ సంఘానికి ఇజ్రాయెల్ రచయిత, చలనచిత్ర దర్శకుడు నాదవ్ లాపిడ్ సారథ్యం వహించగా, అమెరికా నిర్మాత జింకో గోటో, ఫ్రెంచ్ ఫిల్మ్ ఎడిటర్ పాస్కల్ చావాన్స్, ఫ్రెంచ్ డాక్యుమెంటరీ చిత్రనిర్మాత-సినీ విమర్శకుడు, పాత్రికేయుడైన జేవియర్ అంగులో బార్టూరెన్లతోపాటు భారత చలనచిత్ర దర్శకుడు సుదీప్తో సేన్ సభ్యులుగా వ్యవహరించారు.
******
(Release ID: 1879690)
Visitor Counter : 198
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam