ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్‌ లోని విశాఖపట్నంలో 10,500 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేసిన - ప్రధానమంత్రి


"ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్ని రంగాల్లో తమకంటూ ఒక ప్రముఖ పేరు తెచ్చుకున్నారు"


“అభివృద్ధి మార్గం బహుముఖీయమైనది. ఇది సాధారణ పౌరుని అవసరాలపై అది దృష్టి సారిస్తుంది, అధునాతన మౌలిక సదుపాయాల కోసం ప్రణాళికలను అందిస్తుంది”


"సమ్మిళిత వృద్ధి, సమ్మిళిత అభివృద్ధి అనేది మన విధానం"


"పి.ఎం. గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేయడంతో పాటు, ప్రాజెక్టుల వ్యయాన్ని కూడా తగ్గించింది"


"బ్లూ ఎకానమీ అనేది మొదటి సారి చాలా పెద్ద ప్రాధాన్యత గా మారింది"

Posted On: 12 NOV 2022 12:16PM by PIB Hyderabad

 

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ లోని విశాఖపట్నంలో 10,500 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాప‌న చేసి, జాతికి అంకితం చేశారు. 

 

 

 

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ లో పర్యటించే అవకాశం గతంలో తనకు లభించిన అవకాశాన్ని గుర్తు చేసుకుంటూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. విశాఖప‌ట్నానికి చాలా విశిష్ట‌మైన వాణిజ్య, వ్యాపార సంప్రదాయాలు ఉన్నాయని ప్రధానమంత్రి అన్నారు. పురాతన భారతదేశంలో విశాఖపట్నం ఒక ముఖ్యమైన ఓడరేవుగా వేల సంవత్సరాల క్రితం పశ్చిమాసియా మరియు రోమ్‌ లకు వాణిజ్య మార్గంలో భాగమని, నేటికీ ఇది భారత దేశ వాణిజ్యానికి కేంద్ర బిందువుగా నిలిచి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు శంకుస్థాపన చేసి, అంకితం చేయబడిన 10,500 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు - మౌలిక సదుపాయాలు, జీవన సౌలభ్యంతో పాటు, సౌలభ్యంలో కొత్త కోణాలను తెరవడం ద్వారా విశాఖపట్నం మరియు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశలు, ఆకాంక్షలను, ఆత్మనిర్భర్ భారత్ ను సాధించడానికి ఒక మాధ్యమంగా పనిచేస్తాయని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గురించి కూడా ప్ర‌ధానమంత్రి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తూ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ట్ల ఆయ‌న‌కు ఉన్న ప్రేమ, అంకిత భావం అసమాన‌మైనవని అన్నారు.

 

 

 

అది విద్య లేదా వ్యవస్థాపకత, సాంకేతికత లేదా వైద్య వృత్తి ఏదైనా కావచ్చు, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ప్రతి రంగంలో తమకంటూ ఒక ప్రముఖమైన పేరు తెచ్చుకున్నారని ప్రధానమంత్రి కొనియాడారు. ఈ గుర్తింపు కేవలం వృత్తిపరమైన గుణాల వల్ల మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రేమ పూర్వకమైన, ఉల్లాసమైన స్వభావం వల్ల కూడా సాధ్యమైందని, ఆయన పేర్కొన్నారు. ఈరోజు జాతికి అంకితం చేసిన ప్రోజెక్టుల పట్ల ప్రధానమంత్రి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఈ రోజు శంకుస్థాప‌న‌ చేసిన ప్రోజెక్టుల ప్ర‌యోజ‌నాలు రాష్ట్రాభివృద్ధిని మ‌రింత‌గా పెంపొందిస్తాయని, అన్నారు.

 

 

 

“అభివృద్ధి చెందిన భారత దేశాన్ని సాధించాలనే లక్ష్యంతో, ఈ అమృత్ కాలంలో, దేశం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోంది” అని ప్రధానమంత్రి చెప్పారు. అభివృద్ధి మార్గం బహుముఖీయమైనదని ప్రధానమంత్రి వ్యాఖ్యానిస్తూ, ఇది సాధారణ పౌరుని అవసరాలపై దృష్టి సారిస్తుందని, అధునాతన మౌలిక సదుపాయాల కోసం ప్రణాలికను అందజేస్తుందని తెలియజేశారు. సమ్మిళిత వృద్ధి కి సంబంధించిన ప్రభుత్వ విధానాన్ని ఆయన ప్రత్యేకంగా వివరించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి కి గత ప్రభుత్వాలు అనుసరించిన ఏకాకి విధానం వల్ల సరకు రవాణా ఖర్చులు ఎక్కువ కావడంతో పాటు సరఫరా వ్యవస్థలో కుంభకోణాలు చోటుచేసుకున్నాయని ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు. సరఫరా వ్యవస్థ, సరకు రవాణా అనేవి, బహు విధ అనుసంధానతపై ఆధారపడి ఉంటాయని, అభివృద్ధి యొక్క సమగ్ర దృక్పథంపై దృష్టి సారిస్తుండటంతో ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి కొత్త విధానాన్ని అవలంబించిందని, ఆయన వివరించారు. అభివృద్ధికి తమ సమగ్ర దృక్కోణానికి ఈ రోజు చేపట్టిన - ప్రతిపాదిత ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్‌ లో ఆరు లైన్ల రహదారి; పోర్ట్ కనెక్టివిటీ కోసం ప్రత్యేక రహదారి; విశాఖపట్నం రైల్వే స్టేషన్ సుందరీకరణ; అత్యాధునిక ఫిషింగ్ హార్బర్ నిర్మాణం వంటి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ సమగ్ర అభివృద్ధి దృక్పథాన్ని పి.ఎం. గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌ కు అన్వయిస్తూ, ఇది మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేయడంతో పాటు ప్రాజెక్టుల వ్యయాన్ని కూడా తగ్గించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. "మల్టీ మోడల్ రవాణా వ్యవస్థ అనేది ప్రతి నగరం యొక్క భవిష్యత్తు అని పేర్కొంటూ, విశాఖపట్నం ఈ దిశలో ఒక అడుగు ముందుకు వేసింది", అని ఆయన అభినందించారు. ఈ అభివృద్ధి పరుగు పందెంలో ఆంధ్రప్రదేశ్, దాని తీర ప్రాంతాలు కొత్త ఉత్సాహం, కొత్త శక్తితో ముందుకు సాగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

 

 

ప్రపంచ వాతావరణ సమస్యల గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, క్లిష్టమైన ఉత్పత్తులు, ఇంధన అవసరాల కోసం ఎదురౌతున్న సరఫరా వ్యవస్థ అంతరాయం గురించి కూడా వివరించారు. అయితే, ఈ క్లిష్ట సమయాల్లో కూడా, భారతదేశం అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖించిందని ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశం సాధించిన విజయాలను నిపుణులు ప్రశంసిస్తున్నందున ప్రపంచం దీనిని గుర్తించింది, "భారతదేశం మొత్తం ప్రపంచానికి ఆశాకిరణంగా మారింది. భారతదేశం తన పౌరుల ఆకాంక్షలు మరియు అవసరాలను నిలబెట్టుకుంటూ పని చేస్తున్నందున ఇది సాధ్యమైంది. ప్రతి విధానం మరియు నిర్ణయం సామాన్య పౌరుడి జీవితాన్ని మెరుగుపరచడం కోసమే." అని ఆయన పేర్కొన్నారు. పి.ఎల్.ఐ. పధకం; జి.ఎస్.టి; ఐ.బి.సి. తో పాటు జాతీయ మౌలిక సదుపాయాల వ్యవస్థ భారతదేశంలో పెట్టుబడులు పెరగడానికి కారణమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అదే సమయంలో పేదల సంక్షేమం కోసం పథకాలను విస్తృతం చేస్తున్నామన్నారు. “ఈ రోజు ఈ అభివృద్ధి ప్రయాణంలో, ఇంతకుముందు అట్టడుగున ఉన్న ప్రాంతాలను సైతం చేర్చడం జరిగింది. అత్యంత వెనుకబడిన జిల్లాల్లో కూడా అభివృద్ది పథకాలను ఆశావహ జిల్లాల కార్యక్రమం ద్వారా అమలు చేయడం జరుగుతోంది.” అని ఆయన అన్నారు. గత రెండున్నరేళ్లుగా తమ ప్రభుత్వం అమలు చేస్తున్న, ప్రజలకు ఉచిత రేషన్, ప్రతి రైతు ఖాతాలో ప్రతి సంవత్సరం 6 వేల రూపాయలు, డ్రోన్, గేమింగ్, అంకుర సంస్థలకు సంబంధించిన నిబంధనల సడలింపు వంటి అనేక చర్యలను కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఉదహరించారు. 

సాధించవలసిన లక్ష్యాలు స్పష్టంగా ఉండాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. దీనికి ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా లోతైన జలాల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తిని అందించారు. నీలి ఆర్థిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ ఈ అంశంపై దృష్టి సారించిందని తెలిపారు. "నీలి ఆర్థిక వ్యవస్థ మొదటి సారి పెద్ద ప్రాధాన్యత అంశంగా మారింది" అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులకు అందిస్తున్న కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు,ఈ రోజు ప్రారంభమైన విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ ఆధునీకరణ వంటి చర్యలను ఆయన ప్రస్తావించారు. 

 భారతదేశ అభివృద్ధిలో సముద్రం శతాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్న శ్రీ నరేంద్ర మోదీ సముద్ర తీరం అభివృద్ధికి ముఖద్వారంగా ఉందని అన్నారు. రేవులు ఆధారంగా దేశంలో అభివృద్ధి సాధించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు వేల కోట్ల రూపాయలతో అమలు చేయనున్న ప్రాజెక్టులు నేటి నుంచి మరింత వేగంగా అభివృద్ధి సాధించేందుకు మరింతగా దోహదపడతాయని ఆయన వివరించారు. 

  "21వ శతాబ్దపు భారతదేశం అభివృద్ధి ప్రణాళిక స్పష్టమైన విధానంతో అమలు జరుగుతోంది " అంటూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.. దేశ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై యస్ ఆర్ జగన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, పార్లమెంటు సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు పాల్గొన్నారు. 

నేపథ్యం: 

దాదాపు 450 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి ప్రాజెక్ట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. పునరాభివృద్ధి చేయబడిన స్టేషన్ రోజుకు 75,000 మంది ప్రయాణీకుల అవసరాలు తీరుస్తోంది.ఆధునిక సౌకర్యాలను అందించడం ద్వారా ప్రయాణికులకు మరపురాని అనుభవాన్ని అందిస్తుంది. 

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ మరియు అప్‌గ్రేడేషన్‌కు పనులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు 150 కోట్ల రూపాయలు. ఫిషింగ్ హార్బర్, అభివృద్ధి ఆధునీకరణ తర్వాత ఫిషింగ్ హార్బర్ సామర్థ్యం రెట్టింపు అవుతుంది. అభివృద్ధి ఆధునీకరణ తర్వాత ఫిషింగ్ హార్బర్ సామర్థ్యం రోజుకు 150 టన్నుల నుండి రోజుకి 300 టన్నులకు పెరుగుతుంది. సురక్షితమైన ల్యాండింగ్ మరియు బెర్తింగ్ మరియు ఇతర ఆధునిక మౌలిక సదుపాయాలు జెట్టీలో వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తాయి, వృధాను తగ్గించి ధరలు మెరుగుపరచడంలో సహాయపడతాయి.

ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ రాయ్‌పూర్-విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్‌లో ఆంధ్రప్రదేశ్ విభాగానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. 3750 కోట్లకు పైగా వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు. ఎకనామిక్ కారిడార్ ఛత్తీస్‌గఢ్ -ఒడిశా పారిశ్రామిక పారిశ్రామిక ప్రాంతాలకు విశాఖపట్నం పోర్ట్, చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారికి వేగవంతమైన రవాణా సౌకర్యాన్ని అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశాలోని గిరిజన మరియు వెనుకబడిన ప్రాంతాలకు రాయ్‌పూర్-విశాఖపట్నం రోడ్డు రహదారి సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది.

  విశాఖపట్నంలో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలా నగర్ జంక్షన్ వరకు నిర్మించనున్న ప్రత్యేక పోర్టు రోడ్డుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇది విశాఖపట్నం నగరంలో స్థానిక మరియు పోర్టుకు వెళ్లే సరకు రవాణా వాహనాలను వేరు చేస్తుంది. దీనివల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది.

 శ్రీకాకుళం-గజపతి కారిడార్‌లో భాగంగా జాతీయ రహదారి -326 ఏ లో నరసన్నపేట నుంచి పాతపట్నం వరకు రూ.200 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన సెక్షన్ ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ప్రాజెక్ట్ ప్రాంతంలో మెరుగైన రవాణా సౌకర్యాలు అందిస్తుంది.

 

 

 ఆంధ్రప్రదేశ్‌లోని ఓఎన్జిసి 2900 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన U-ఫీల్డ్ ఆన్‌షోర్ డీప్‌వాటర్ బ్లాక్ ప్రాజెక్టును ప్రధానమం జాతికి అంకితం చేశారు. రోజుకు దాదాపు 3 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (MMSCMD) గ్యాస్ ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో ప్రాజెక్టు ను నిర్మించారు. ఇది అతి ఎక్కువ లోతు నుంచి గ్యాస్ ఉత్పత్తి చేస్తుంది. దాదాపు 6.65 MMSCMD సామర్థ్యంతో గెయిల్ చేపట్టనున్న శ్రీకాకుళం అంగుల్ సహజ వాయువు పైప్‌లైన్ ప్రాజెక్ట్‌కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. 2650 కోట్లకు పైగా వ్యయంతో 745 కి.మీ పొడవున్న ఈ పైప్‌లైన్‌ను నిర్మించనున్నారు. సహజవాయువు గ్రిడ్ (NGG)లో భాగంగా చేపట్టనున్న ప్రాజెక్టు పైప్‌లైన్ ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశాలోని వివిధ జిల్లాల్లో గృహాలు, పరిశ్రమలు, వాణిజ్య యూనిట్లు మరియు ఆటోమొబైల్ రంగాలకు అవసరమైన సహజ వాయువును సరఫరా చేయడానికి కీలకమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. 


 

 

*****

DS/TS(Release ID: 1875433) Visitor Counter : 204