పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఉన్నతస్థాయి రౌండ్‌టేబుల్‌ సమావేశంలో కేంద్ర పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పు శాఖ మంత్రి శ్రీ భూపేందర్‌ యాదవ్‌ ప్రసంగం


ముఖ్యాంశాలు:
• అన్ని కార్యాచరణ ప్రణాళికల అమలుకు రౌండ్‌టేబుల్‌ సమావేశం ద్వారా ముందస్తు హెచ్చరికలు జారీ

• ప్రధాన కార్యదర్శి నిర్దేశిత హెచ్చరికల అమలుకు భారత్‌ పూర్తి మద్దతు; తద్వారా లోటుపాట్ల తగ్గింపు, ప్రకృతి విపత్తులపై సన్నద్ధత, సత్వర-సకాల సమష్టి స్పందనకు తోడ్పాటు

• భారత వెబ్‌-డీసీఆర్‌ఏ (డైనమిక్‌ కాంపోజిట్‌ రిస్క్‌ అట్లాస్‌)తో ముందస్తు హెచ్చరికలపై సత్వర-ఆధునిక కార్యాచరణకు వెసులుబాటు

• ముందస్తు హెచ్చరికల అమలులో భాగంగా వాతావరణ సూచనల అనువర్తనాల రూపకల్పన, మౌలిక సదుపాయాల నష్టాలు-ప్రాథమిక సేవల్లో అంతరాయాల నివారణ దిశగా విపత్తు ప్రతిరోధక మౌలిక వసతుల సంకీర్ణం (సీడీఆర్‌ఐ) ఏర్పాటుకు మార్గనిర్దేశం చేసిన భారతదేశం

Posted On: 07 NOV 2022 9:01PM by PIB Hyderabad

   కేంద్ర పర్యావరణ-అటవీ-వాతావరణ మార్పు శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఇవాళ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి నిర్వహించిన ఉన్నతస్థాయి రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ప్రసంగించారు. అన్ని దేశాల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి ముందస్తు హెచ్చరికల జారీ ప్రారంభించే నిమిత్తం షర్మ్ ఎల్-షేక్ నగరంలో నిర్వహించిన ఈ శిఖరాగ్ర సదస్సులో కాప్‌-27కు చెందిన ప్రపంచ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ యాదవ్ మాట్లాడుతూ కింది విధంగా ప్రకటన చేశారు...

   “ముందస్తు హెచ్చరికలను అన్ని దేశాలూ అమలు చేయడానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ప్రతిపాదిత కార్యక్రమానికి మేం పూర్తి మద్దతు ఇస్తున్నాం. వాతావరణ మార్పు ఉపశమనానికి సంబంధించి ప్రస్తుతం చేపడుతున్న చర్యల వేగం వాతావరణ మార్పు రేటు నియంత్రణకు సరిపోదు. ప్రపంచవ్యాప్తంగా గణనీయ నష్టాలకు దారితీసే ప్రకృతి విపత్తుల పర్యవసాన ప్రభావాన్ని ప్రపంచం గుర్తించాల్సిన అవసరం ఎంతయినా ఉంది.

   అయితే, నష్ట నివారణకు ఏదైనా చేయగల దేశాలపై ఈ ప్రభావాలు తక్కువ కాబట్టి ఈ అంశాలపై అవి దృష్టి సారిస్తున్నప్పటికీ, అది తరచూ పక్కకు మళ్లుతోంది. ఆ విధంగా సదరు దేశాలు వాతావరణ మార్పులకు ప్రధాన కారకాలవుతున్నాయి.

   ఈ మార్పుల వల్ల అత్యంత ముప్పుగల ప్రాంతాలు కర్కాటక-మకరం రేఖల ఉష్ణమండల నడుమన ఉన్నాయి. భారతదేశం సహా ప్రపంచంలోని అధికశాతం వర్ధమాన దేశాలు ఈ ఈ ఉష్ణమండల ప్రాంతాల మధ్యలోనే ఉన్నాయి. బాహ్య విపత్తులు ప్రారంభం కాగానే కోలుకోగల సామర్థ్యం స్వల్పంగా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పటికే ప్రభుత్వ వ్యయం, ఆదాయ నష్టం పెరగడం మొదలైంది.

     పసిఫిక్, కరేబియన్‌ ప్రాంతాలలో ఉష్ణమండల తుఫానుల తీవ్రత పర్యవసానం విషయానికొస్తే- కొన్ని చిన్న ఉష్ణమండల దేశాలు కేవలం కొన్ని గంటల్లోనే తమ జాతీయ ఆదాయంలో 200 శాతందాకా కోల్పోయాయి. ఈ తరహా విపత్తులను ఎదుర్కొనగల దీటైన శక్తిసామర్థ్యాలు లేని దేశాల్లో ఇలాంటి సందర్భాలు వినాశక పరిణామాలకు దారితీస్తాయి.

   వాతావరణ మార్పుల ఉపశమనానికి ఆర్థిక సాయం ఇప్పటికే కొరవడిన నేపథ్యంలో  ముందస్తు హెచ్చరికల రూపంలో వాతావరణ ఉపశమనాల అనుసరణ జన జీనవం, జీవనోపాధుల పరిరక్షణకు ఎంతో కీలకం. ఆ మేరకు తక్షణ భౌతిక ప్రభావాలను అరికట్టడంతోపాటు తదనుగుణ తీవ్ర దీర్ఘకాలిక సామాజిక-ఆర్థిక ప్రభావాలను తగ్గించడంలో కూడా అందరికీ ముందస్తు హెచ్చరికలు కీలక పాత్ర పోషిస్తాయి.

   అన్ని హైడ్రో-వాతావరణ ముప్పులకు సంబంధించి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఆద్యంతం బలోపేతం చేయడానికి భారతదేశం కృషి చేస్తోంది. ఇది నిర్దిష్ట ఫలితాల సాధనకు తోడ్పడింది: ఆ విధంగా గత 15 ఏళ్లలో మేము తుఫాను సంబంధిత మరణాలను 90 శాతందాకా తగ్గించాం. తూర్పు, పశ్చిమ తీరాలలో తుఫాను ముందస్తు హెచ్చరిక వ్యవస్థల విషయంలో దాదాపు 100 శాతం విస్తృతి కలిగి ఉన్నాం. అలాగే వడగాడ్పుల వంటి ఇతర విపత్తుల విషయంలోనూ మేం వేగంగా పురోగమిస్తున్నాం. తద్వారా మా సమాజాలలో అధిక ప్రతిరోధకతకు వీలు కలిగింది.

   కొన్నేళ్లుగా ముందస్తు హెచ్చరిక ప్రభావ-ఆధారితంగా, సమాజాల  ద్వారా ప్రజానీకానికి మరింత సులభంగా అర్థమయ్యేలా, వారు అనుసరించగలిగేలా అవగాహన పెంచడానికి పటిష్ట రీతిలో సమష్టిగా కృషి చేశాం. ముందస్తు హెచ్చరికలపై వేగవంతమైన, అధునాతన చర్యలకు శ్రీకారం చుట్టడంపై వెబ్-డీసీఆర్‌ఏ (డైనమిక్ కాంపోజిట్ రిస్క్ అట్లాస్)ను రూపొందించడం కోసం మేము విపత్తులు, దుర్బల పరిస్థితులు, ముప్పుల సమాచారాన్ని క్రోడీకరించాం.

   బంగాళాఖాతం, అరేబియా సముద్ర ప్రాంతంలోని 13 దేశాలుసహా వివిధ దేశాలకు ఉత్తర హిందూ మహాసముద్రం (ప్రపంచంలోని ఆరు కేంద్రాలలో ఒకటి) మీదుగా ఉత్పన్నమయ్యే ఉష్ణమండల తుఫానుల పర్యవేక్షణ, అంచనా, హెచ్చరిక సేవలను అందించేందుకు న్యూ ఢిల్లీలోని ‘ఐఎండీ’ పరిధిలోగల తుఫాను హెచ్చరికల విభాగం (సీడబ్ల్యూడీ) ఒక బహుపాక్షిక ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రంగానూ పనిచేస్తోంది. బంగాళాఖాతం, అరేబియా సముద్ర దేశాల వ్యవస్థలు-‘ఐఎండీ’ మధ్య వాతావరణ సమాచార మార్పిడితో మరింత మెరుగైన పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిలకు ఈ సంయుక్త కృషి ఎంతగానో తోడ్పడింది.

   అంతేకాకుండా ఉపగ్రహ, రాడార్, వాతావరణ సమాచారం, ‘ఐఎండీ’ నుంచి నమూనా మార్గనిర్దేశంసహా ఉష్ణమండల తుపాను సూచనల బులెటిన్లు జారీ చేయడంవల్ల అనేక దేశాలు ప్రాణనష్టాన్ని తగ్గించగలిగాయి. గడచిన 10 సంవత్సరాల్లో ఉష్ణమండల తుఫానుల వల్ల ప్రాణనష్టం కేవలం 100కు తగ్గడమే ఇందుకు నిదర్శనం. ఈ మేరకు ఉష్ణమండల తుఫానులపై ‘ఐఎండీ’ అందించే సూచనలు, సలహాలు, ముందస్తు హెచ్చరికలతో భారతదేశంతోపాటు బంగాళాఖాతం, అరేబియా సముద్ర ప్రాంత పరిధిలోని అన్ని దేశాలకూ ఎంతగానో సహాయపడింది.

   మేమిప్పుడు ప్రాణనష్టం తగ్గించడంతోపాటు జీవనోపాధి, జాతీయ ప్రగతి ప్రయోజనాల దిశగా ముందస్తు హెచ్చరిక వ్యవస్థల పూర్తి సామర్థ్యాన్ని గరిష్ఠం చేయాలని యోచిస్తున్నాం. వాతావరణ సూచనల కోసం అనువర్తనాల రూపకల్పన, మౌలిక సదుపాయాల నష్టాలతోపాటు  ప్రాథమిక సేవలలో అంతరాయాల నివారణ లక్ష్యంగా ముందస్తు హెచ్చరికల జారీకోసం విపత్తు ప్రతిరోధక మౌలిక వసతుల సంకీర్ణం (సీడీఆర్‌ఐ) ఏర్పాటుకు భారతదేశం మార్గనిర్దేశం చేసింది.

   గ్లాస్గోలో ‘కాప్‌-26’ నిర్వహించినపుడు ‘ఐరిస్‌’ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలెంట్ ఐలాండ్ స్టేట్స్)ను ప్రారంభించిన సమయంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మానవ సంక్షేమంలో ‘ఐరిస్‌’ పోషించగల కీలకపాత్ర గురించి నొక్కిచెప్పారు. ఆనాటి ఆయన ప్రకటనను ఈ సందర్భంగా నేనిక్కడ ఉటంకిస్తున్నాను.

   “ఐరిస్‌ వల్ల అత్యంత దుర్బల దేశాలకు ఆశ, విశ్వాసం, ఆకాంక్షలు తీరగలవన్న ఊరట లభిస్తుంది. ఈ వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేసిన  ‘సీడీఆర్‌ఐ’కి నా అభినందనలు, ‘ఐరిస్‌, సీడీఆర్‌ఐ’లు కేవలం మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించినవి కాదు.. అవి మానవ సంక్షేమాన్ని ఒక బాధ్యతగానూ స్వీకరిస్తాయి. మానవాళి పట్ల ఇది మనందరి సమష్టి కర్తవ్యం. అందుకే ఈ ‘ఐరిస్‌’ ప్రయోగాన్ని నేను చాలా ముఖ్యమైనదిగా పరిగణివిస్తున్నాను. దీనిద్వారా సాంకేతికత, ఆర్థిక సహాయం, అవసరమైన సమాచార సేకరణ వగైరాలు ‘ఎస్‌ఐడీసీ’కి సులభ సాధ్యం కాగలవు. చిన్న ద్వీపదేశాల్లో నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పనను ప్రోత్సహించడం వల్ల అక్కడి జన జీవనంతోపాటు జీవనోపాధికి ప్రయోజనం చేకూరుతుంది.”

   భారతదేశం ‘సీడీఆర్‌ఐ’ని సృష్టించి, ప్రోత్సహిస్తోంది. తదనుగుణంగా మౌలిక సదుపాయాల ఆవిష్కరణ-ప్రతిరోధకతను ప్రోత్సహించే దిశగా వివిధ భాగస్వామ్య సంస్థలు, వ్యక్తులను ఏకీకృతం చేయడంలో అది తనవంతుగా గట్టి కృషి చేస్తోంది. మౌలిక వసతుల రంగాల్లోగల భాగస్వాముల కోసం వెబ్ ఆధారిత వేదిక ‘డీఆర్‌ఐ కనెక్ట్’ రూపకల్పన ఈ కృషిలో ఒక భాగం. పునరుద్ధరణ సహిత మౌలిక సదుపాయాల కల్పనలో సవాళ్లను పరిష్కారానికి, విపత్తు ప్రతిరోధక వసతుల కల్పన కోసం కార్యాచరణ-ఆధారిత విధానాలు-ఆవిష్కరణల వాతావరణం పెంపొందించడానికి, కొత్త విజ్ఞానం, అనుసరణీయ పరిష్కారాల సృష్టిలో సంకీర్ణ సభ్యత్వ సామూహిక మేధస్సు వినియోగానికి ఈ వేదిక ఉద్దేశించబడింది.

   ప్రస్తుతం మరో 31 దేశాలు, 8 సభ్య సంస్థల చేరికతో ‘సీడీఆర్‌ఐ’ మరింత విస్తరించబడింది. ఆఫ్రికా ప్రాంతంలో దీని ఉనికి పెరుగుతోంది. ఈ ప్రణాళికను ఆమోదించిన తాజా సభ్యులలో దక్షిణ సూడాన్‌, యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ కూడా ఉన్నాయి. ‘సీడీఆర్‌ఐ’ చేపడుతున్న వ్యూహాత్మక చర్యలు, కార్యక్రమ విస్తరణ, సభ్యత్వ చేరికకు కృషి తదితరాలతో తన లక్ష్యసాధన దిశగా సంకీర్ణం పురోగమనానికి తోడ్పడుతున్నాయి.

   ఏదేమైనప్పటికీ వాతావరణ మార్పు ఉపశమన చర్యలకు ఆర్థిక సహాయం నేటికీ ఎండమావిగానే ఉంది. దుర్బలత్వాన్ని తగ్గించడంతోపాటు ప్రకృతి విపత్తులపై సంసిద్ధత, వేగవంతమైన, సత్వర, సకాల ప్రతిస్పందనపై మనం ప్రపంచానికి సమష్టిగా భరోసా ఇవ్వడంలో అన్ని దేశాలకూ ముందస్తు హెచ్చరికల వంటి ప్రభావవంతమైన వాతావరణపరమైన పద్ధతుల అనుసరణ మనకెంతో సహాయపడుతుంది.

****


(Release ID: 1874382) Visitor Counter : 308