ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్ లోని వడోదరలో సి-295 విమాన తయారీ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి
“భారతదేశంలో తయారుచేయండి, ప్రపంచం కోసం తయారుచేయండి” అనే మంత్రంతో నేడు భారతదేశం ముందుకు సాగుతోంది” “సాంస్కృతిక, విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందిన వడోదర ఇప్పుడు విమానయాన కేంద్రంగా కొత్త గుర్తింపు సాధిస్తుంది” “విమాన ప్రయాణాల్లో ప్రపంచంలోని మూడు అగ్రగామి దేశాల్లో ఒకటిగా మనం ప్రవేశించబోతున్నాం” “మహమ్మారి, యుద్ధం, సరఫరాపరమైన అంతరాయాలున్న స్థితిలో కూడా భారతదేశం వృద్ధిలో వేగం కొనసాగిస్తోంది” “తక్కువ తయారీ వ్యయాలు, అధిక ఉత్పాదకత అవకాశాలు భారతదశం కల్పిస్తోంది” “నేడు భారతదేశం కొత్త ఆలోచనా ధోరణి, కొత్త పని సంస్కృతితో కృషి చేస్తోంది” “నేడు మా విధానాలు స్థిరం, ఊహాత్మకం, భవిష్యత్ దృక్పథంతో కూడినవి” “2025 నాటికి రక్షణ తయారీని 25 బిలియన్ డాలర్లకు చేర్చాలన్నది లక్ష్యం, రక్షణ ఎగుమతులు కూడా 5 బిలియన్ డాలర్లు కూడా దాటతాయి”
Posted On:
30 OCT 2022 4:25PM by PIB Hyderabad
గుజరాత్ లోని వడోదరలో సి-295 విమాన తయారీ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. ఆత్మనిర్భర్ భారత్ కింద విమానయాన పరిశ్రమ అధిరోహించిన సాంకేతిక, తయారీ శిఖరాలను తెలియచేసే ప్రదర్శనను కూడా ఆయన తిలకించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచానికి తయారీ కేంద్రంగా చేసే దిశగా మనం పెద్ద అడుగు వేశామని చెప్పారు. భారతదేశం తయారుచేస్తున్న యుద్ధ విమానాలు, టాంకులు, జలాంతర్గాములు, ఔషధాలు, వ్యాక్సిన్లు, ఎలక్ర్టానిక్ గాడ్జెట్లు, మొబైల్ ఫోన్లు, కార్లు పలు దేశాల్లో ప్రాచుర్యం పొందాయని తెలిపారు. “భారతదేశంలో తయారుచేయండి, ప్రపంచం కోసం తయారుచేయండి” అనే మంత్రంతో నేడు భారతదేశం ముందడుగేస్తున్నదని, రవాణా విమానాల తయారీకి ప్రపంచ కేంద్రంగా మారుతున్నదని ఆయన చెప్పారు. త్వరలోనే ప్రయాణికుల విమానాలు కూడా భారతదేశం తయారుచేయడం మనం చూస్తామని ప్రధానమంత్రి తెలిపారు.
నేడు ఇక్కడ తాను శంకుస్థాపన చేసిన ఈ ఫ్యాక్టరీ దేశ రక్షణ, విమానయాన రంగాలను మార్చగల శక్తి కలిగి ఉన్నదని ఆయన అన్నారు. దీని ద్వారా దేశ చరిత్రలో తొలిసారిగా భారత రక్షణ రంగంలో భారీ పెట్టుబడి వస్తున్నదని ఆయన చెప్పారు. ఇక్కడ తయారుచేసే రవాణా విమానం సాయుధ దళాలకు శక్తిని ఇవ్వడమే కాకుండా దేశంలో కొత్తగా విమానాల తయారీ వాతావరణం అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని ప్రధానమంత్రి చెప్పారు. వడోదర ఒక సాంస్కృతిక, విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు కొత్తగా విమానయాన కేంద్రంగా గుర్తింపు సాధిస్తుంది అన్నారు. ఈ ప్రాజెక్టుతో 100కి పైగా ఎంఇఎంఇలు అనుబంధం కలిగి ఉండడం పట్ల ప్రధానమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో విదేశీ ఎగుమతి ఆర్డర్లు కూడా స్వీకరిస్తుంది గనుక “దేశంలో తయారుచేయండి, ప్రపంచంలో తయారుచేయండి” అనే మంత్రానికి ఈ భూమి కొత్త ఉత్తేజం కలిగిస్తుందని ఆయన అన్నారు.
త్వరితగతిన వృద్ధి చెందుతున్న విమానయాన రంగం గురించి మాట్లాడుతూ భారతదేశం విమానయానంలో ప్రపంచంలోనే మూడు అగ్రదేశాల్లో ఒకటిగా త్వరలో మారనుందని చెప్పారు. ఉడాన్ పథకం పలువురు విమానయాత్రికులుగా మారడానికి సహాయకారిగా ఉందన్నారు. దేశంలో ప్రయాణికులు, సరకు రవాణా విమానాలకు పెరుగుతున్న డిమాండు గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ రాబోయే 15 సంవత్సరాల కాలంలో భారతదేశానికి 2000కి పైగా విమానాలు అవసరమవుతాయని తెలిపారు. నేడు ఈ దిశగా ఒక కీలకమైన అడుగు పడింది, అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ప్రధానమంత్రి సూచించారు. కరోనా మహమ్మారి, యుద్ధం, సరఫరా అంతరాయాలతో అల్లాడిపోతున్న ప్రపంచానికి భారతదేశం మంచి అవకాశాన్ని కల్పిస్తున్నదని శ్రీ మోదీ చెప్పారు. ఇంత క్లిష్ట సమయంలో కూడా భారతదేశం వృద్ధిపథంలో సాగుతున్నదని ఆయన అన్నారు. నాణ్యతతో పాటు వ్యయాల్లో కూడా పోటీ సామర్థ్యం కలిగి ఉన్నందు వల్ల భారతదేశంలో పరిస్థితులు నిరంతరాయంగా మెరుగుపడుతున్నదని ఆయన వివరించారు. “భారతదేశం తక్కువ తయారీ వ్యయాలు, అధిక ఉత్పాదకత అవకాశాలు అందిస్తోంది” అని ప్రధానమంత్రి వివరించారు. భారతదేశంలో నిపుణులైన మానవవనరులు పుష్కలంగా ఉన్నట్టు ఆయన చెప్పారు. గత 8 సంవత్సరాల్లో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల గురించి వివరిస్తూ నేడు భారతదేశం ముందెన్నడూ ఎరుగని రీతిలో తయారీ వాతావరణం కలిగించిందని ఆయన అన్నారు. భారత తయారీ రంగాన్ని ప్రపంచ స్థాయిలో పోటీసామర్థ్యం కలదిగా తయారుచేయడానికి సరళతర కార్పొరేట్ పన్ను విధానం ప్రవేశపెట్టామని, 100 శాతం ఎఫ్ డిఐలు అనుమతించామని, రక్షణ-అంతరిక్ష రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతించామని, 29 కేంద్ర పన్నులను 4 కోడ్ లుగా వర్గీకరించామని, కాలం చెల్లిపోయిన 33000 నిబంధనలు రద్దు చేశామని, డజన్ల కొద్ది పన్నుల సంక్లిష్టతను తొలగించేందుకు వస్తు సేవల పన్ను ప్రవేశపెట్టామని వివరించారు. “నేడు భారతదేశం కొత్త ఆర్థిక సంస్కరణల శకం రచిస్తోంది. తద్వారా తయారీ రంగం మంచి ప్రయోజనాలు సాధిస్తోంది” అన్నారు.
ఈ విజయానికి ఆలోచనా ధోరణిలో మార్పే కారణమని ప్రధానమంత్రి అన్నారు. “నేడు భారతదేశం కొత్త ఆలోచనా ధోరణి, కొత్త పని సంస్కృతితో పని చేస్తోంది” అని ఆయన అన్నారు. గతంలో ప్రభుత్వానికి అన్నీ తెలుసు అనే ఆలోచనా ధోరణి ఉండేదని, దాని వల్ల ప్రతిభ మరుగునపడిపోయేదని, ప్రైవేటు రంగం శక్తి ఏమిటో వెలికి రాలేదని అన్నారు. “నేడు “సబ్ కా ప్రయాస్” మంత్రం అనుసరిస్తూ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు సమానావకాశాలు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తోంది” అని చెప్పారు. గత ప్రభుత్వ వైఖరి వల్ల తయారీ రంగం కేవలం సబ్సిడీల పైనే ఆధారపడుతూ మనుగడ సాగించేదని ప్రధానమంత్రి విమర్శించారు. లాజిస్టిక్స్, విద్యుత్ సరఫరా, నీటి సరఫరా వంటి అంశాలన్నింటినీ నిర్లక్ష్యం చేశారని చెప్పారు. “విధాన నిర్ణయాల్లో మేం తాత్కాలిక విధానాలకు స్వస్తి చెప్పాం. ఇన్వెస్టర్లకు పలు కొత్త ప్రోత్సాహకాలతో ముందుకు వచ్చాం. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం ప్రవేశపెట్టాం. దాని వల్ల వచ్చిన మార్పు స్పష్టంగానే కనిపిస్తోంది. నేడు మా విధానాలన్నీ స్థిరంగా, ఊహలకు అందేవిగా, భవిష్యత్ దృక్పథం కలవిగా ఉన్నాయి” అన్నారు.
గతంలో తయారీ రంగం ఎవరికీ అందుబాటులో ఉండదనే వైఖరితో సేవల రంగానికే అధిక ప్రాధాన్యం ఇచ్చారని ప్రధానమంత్రి గుర్తు చేశారు. “నేడు మేం సేవలు, తయారీ రంగాలు రెండింటి మెరుగుదలకు కృషి చేస్తున్నాం” అని చెప్పారు. తయారీ, సేవల రంగాలు రెండింటికీ అవకాశం గల సమగ్ర వైఖరి అనుసరించడం అవసరమని ఆయన నొక్కి వక్కాణించారు. “నేడు తయారీలో భారతదేశం ప్రతీ ఒక్కరి కన్నా ముందుంది” అన్నారు. “గత 8 సంవత్సరాల కాలంలో నైపుణ్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చి, అందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పరచడంతోనే ఇదంతా సాధ్యమయింది. ఈ మార్పులన్నింటినీ సమీకృతం చేసుకుంటూ నేడు భారతదేశం తయారీ రంగం అభివృద్ధి ప్రయాణంలో ఒక కొత్త దశకు చేరింది” అని ప్రధానమంత్రి సూచించారు.
ప్రభుత్వ పెట్టుబడి ప్రోత్సాహక విధానాల గురించి నొక్కి చెబుతూ ఎఫ్ డిఐల రాక ద్వారా ఆ ప్రయోజనం ఇప్పుడు కనిపిస్తోందన్నారు. “గత 8 సంవత్సరాల కాలంలో 160కి పైగా దేశాల కంపెనీలు భారతదేశంలో ఇన్వెస్ట్ చేశాయి” అని చెప్పారు. నేడు విదేశీ పెట్టుబడులు కొన్ని పరిశ్రమలకే పరిమితం కాదని, 31 రాష్ర్టాల్లో విస్తరించి ఉన్న 61 రంగాలకు విస్తరించాయని ఆయన వివరించారు. ఒక్క విమానయాన రంగంలోనే 300 కోట్ల డాలర్లకు పైబడి పెట్టుబడులు వచ్చాయని ఆయన తెలిపారు. 2014 సంవత్సరం తర్వాత ఈ రంగంలో పెట్టుబడులు 2000-2014 మధ్యలో వచ్చిన పెట్టుబడుల కన్నా 5 రెట్లకు పైబడి పెరిగాయన్నారు. రాబోయే సంవత్సరాల్లో రక్షణ, ఏరోస్పేస్ రంగాలు ఆత్మనిర్భర్ భారత్ ప్రచారానికి మూలస్తంభాలుగా నిలుస్తాయని ఆయన అన్నారు. “2025 నాటికి రక్షణ తయారీ రంగాన్ని 2500 కోట్ల డాలర్లు పైబడి విస్తరించాలనుకుంటున్నాం. మన రక్షణ ఎగుమతులు కూడా 500 కోట్ల డాలర్లు దాటిపోతాయి” అని చెప్పారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ర్టాల్లో అభివృద్ధి చేస్తున్న రక్షణ కారిడార్లు ఈ రంగం వృద్ధికి దోహదపడతాయని ప్రధానమంత్రి తెలిపారు. గాంధీనగర్ లో ఇంతకు ముందెన్నడూ కనివిని ఎరుగనంత భారీ రక్షణ ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు రక్షణ మంత్రిత్వ శాఖను, గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈ ఎక్స్ పోలో ప్రదర్శించిన పరికరాలు, టెక్నాలజీలు అన్నీ భారతదేశంలో తయారైనవేనని చెప్పారు. “రాబోయే సంవత్సరాల్లో నిర్వహించే రక్షణ ఎక్స్ పోలో సి-295 ప్రాజెక్టుకు సంబంధించినవి కూడా చోటు చేసుకుంటాయి” అని ఆయన అన్నారు.
ప్రస్తుతం దేశంలో ఏర్పడిన గతంలో లేని పెట్టుబడి విశ్వాసం నుంచి వీలైనంత ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించాలని పారిశ్రామిక రంగంతో అనుబంధం ఉన్నవారందరికీ ప్రధానమంత్రి సూచించారు. దేశంలోని స్టార్టప్ లు పురోగమించేందుకు సహాయం అందించాలని ఆయన కోరారు. పరిశోధన రంగంలో కూడా ప్రైవేటు రంగం భాగస్వామ్యం పెరుగుతున్నదని ఆయన నొక్కి చెప్పారు. “ఇదే ధోరణిని ప్రోత్సహించినట్టయితే ఇన్నోవేషన్, తయారీకి అనుకూలమైన బలమైన వాతావరణం కల్పించగలుగుతాం. మీరు సబ్ కా ప్రయాస్ మంత్రాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి” అన్న సూచనతో ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, టాటా సన్స్ చైర్మన్ శ్రీ ఎన్.చంద్రశేఖరన్, ఎయిర్ బస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ క్రిస్టియన్ షెరర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పూర్వాపరాలు...
ఈ సి-295 విమాన తయారీ విభాగం భారతదేశంలో ప్రైవేటు రంగంలోని తొలి విమాన తయారీ కేంద్రం. టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ లిమిటెడ్-ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్, స్పెయిన్ మధ్య సహకారంలో భారత విమానయానం కోసం 20 సి-295 విమానాలు ఇక్కడ తయారుచేస్తారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధనకు ఇది కీలక అడుగు. ఈ రంగంలో ప్రైవేటు రంగం సామర్థ్యాలు |