ప్రధాన మంత్రి కార్యాలయం

మధ్యప్రదేశ్‌ లో పి.ఎం.ఏ.వై-జి కి చెందిన 4.5 లక్షల మందికి పైగా లబ్ధిదారుల ‘గృహ ప్రవేశం’ కార్యక్రమంలో పాల్గొన్న - ప్రధానమంత్రి

Posted On: 22 OCT 2022 5:40PM by PIB Hyderabad

"3.5 కోట్ల కుటుంబాల అతి పెద్ద స్వప్నాన్ని నెరవేర్చడం మా ప్రభుత్వం యొక్క గొప్ప అదృష్టం"

"ధంతేరాస్ పండుగ రోజున నవీన భారతదేశంలో పేద ప్రజలు ఈ రోజు తమ స్వంత ఇంటి గృహ ప్రవేశం జరుపుకుంటున్నారు."

"ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహాలను, ప్రభుత్వానికి చెందిన వివిధ విధానాలు, పథకాలు అన్ని సౌకర్యాలతో పూర్తి చేస్తున్నాయి."

"సామాజిక, ఆర్థిక సాధికారతకు పి.ఎం-ఆవాస్ యోజన ఒక సాధనంగా మారింది"

"తరతరాలుగా కొనసాగుతున్న నిరాశ్రయత అనే విష వలయాన్ని మేము విచ్ఛిన్నం చేస్తున్నాం."

"కనీస సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన పేద ప్రజలు ఇప్పుడు తమ పేదరికాన్ని తగ్గించుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు" 

"దేశం నుంచి రేవారి సంస్కృతిని విముక్తి చేయడానికి, దేశం లోని పెద్ద భాగం సిద్ధమవుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను"

ధంతేరాస్ పండుగ సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు మధ్యప్రదేశ్‌ లోని సత్నాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్‌ లోని దాదాపు 4.51 లక్షల మంది లబ్ధిదారుల ‘గృహ ప్రవేశం’ కార్యక్రమంలో దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొన్నారు.

ఈ స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధానమంత్రి ప్ర‌సంగిస్తూ,  ధంతేరాస్  మరియు దీపావ‌ళి పండుగల శుభ సంద‌ర్భంగా అంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు.  "తమ కొత్త పక్కా ఇళ్లలో గృహ ప్రవేశం చేస్తున్న మధ్యప్రదేశ్‌ లోని 4.50 లక్షల మంది సోదర, సోదరీమణులకు ఈ రోజు ఒక నూతన ప్రారంభం" అని ఆయన పేర్కొన్నారు.  ధంతేరాస్ పండుగను సమాజం లోని సంపన్నులు మాత్రమే కార్లు లేదా ఇళ్లు వంటి ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేసే రోజులను ప్రధానమంత్రి గుర్తుచేస్తూ,  గతంలో ధంతేరాస్ సంపన్నులకు మాత్రమే పండుగగా ఉండేదని పేర్కొన్నారు.  అయితే, నవీన భారతదేశంలో ఈరోజు  ధంతేరాస్ సందర్భంగా పేదలు తమ కొత్త ఇళ్లలో గృహ ప్రవేశం జరుపుకున్నారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.  ఈ రోజు ఇంటి యజమానులు గా మారిన వారిని, ముఖ్యంగా మహిళలను శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు.

ఇల్లు లేకుంటే అన్ని అవకాశాలు మసకబారి పోరాయనీ, నేడు ఇళ్లు పొందుతున్న వారిలో ఉన్న అవకాశాలను తాను చూడగలుగుతున్నానని ప్రధానమంత్రి పేర్కొంటూ, ఈ రోజు జరిగింది కేవలం కొత్త ఇంట్లో గృహ ప్రవేశం మాత్రమే కాదని, ఇది కొత్త ఆనందం, కొత్త తీర్మానాలు, కొత్త కలలు, కొత్త శక్తితో పాటు, కొత్త గమ్యాన్ని సూచిస్తుందని వివరించారు.  "3.5 కోట్ల కుటుంబాలు కన్న అతిపెద్ద కలలను నెరవేర్చడం మా ప్రభుత్వం సాధించిన గొప్ప అదృష్టం." అని ఆయన అన్నారు.

కొత్త ఇళ్ల తో పాటు సమకూర్చిన మౌలిక సౌకర్యాల గురించి ప్రధానమంత్రి ప్రత్యేకంగా పేర్కొంటూ, తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వమనీ, వారి సంక్షేమం కోసం అంకితమైన ప్రభుత్వమని అన్నారు. పేదల అవసరాలు, కోరికలను అర్థం చేసుకుంది కాబట్టి, ప్రభుత్వం నిర్మించిన ఈ గృహాలకు మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరాతో పాటు,  నీటి కనెక్షన్, గ్యాస్ కనెక్షన్ కూడా సమకూర్చడం జరిగిందని, ఆయన తెలియజేశారు.   ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా నిర్మించిన లక్షలాది గృహాలకు ప్రభుత్వానికి చెందిన వివిధ విధానాలు, పథకాలు పూర్తి సౌకర్యాలు కల్పిస్తున్నాయి. 

గత ప్రభుత్వాలు ఇళ్లు మంజూరు చేస్తే విడివిడిగా మరుగుదొడ్లు నిర్మించుకోవాల్సివచ్చేదనీ, ఇంటి యజమానులు తమ ఇళ్లకు విద్యుత్తు, నీరు, గ్యాస్ కనెక్షన్లు పొందేందుకు వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్దకు కాళ్ళు అరిగేలా పరుగెత్తాల్సి వచ్చేదని, ప్రధానమంత్రి గుర్తు చేశారు.  చాలా సందర్భాల్లో గృహ యజమానులు లంచం ఇవ్వాల్సి వచ్చేదని కూడా ప్రధానమంత్రి చెప్పారు.  గత ప్రభుత్వాల హయాంలో ఇళ్ల నిర్మాణానికీ, ఆ తర్వాత వాటిని అందజేయడానికీ అనేక కఠినమైన విధి విధానాలు, నియమనిబంధనలతో,  గృహ యజమానులు అనేక ఇబ్బందులు పడేవారనీ, వారి కోరికలు, ప్రాధాన్యతలను ఆ ప్రభుత్వాలు పట్టించుకోలేదనీ ప్రధానమంత్రి,పేర్కొన్నారు.   "మేము ఆ యా విధానాలు, నియమ నిబంధనలను మార్చడంతో పాటు, గృహ యజమానులకు ఆయా ఇళ్ళపై పూర్తి నియంత్రణ కల్పించాము,"  అని ప్రధాన మంత్రి చెప్పారు.  ఈ నియంత్రణ వల్ల పి.ఎం-ఆవాస్ యోజన ఇప్పుడు సామాజిక, ఆర్థిక సాధికారత సాధనంగా మారిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

ఒకప్పటి తప్పుడు విధానాల వల్ల ప్రజలు తమ నిరాశ్రయతను తర్వాతి తరానికి కూడా అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రధానమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.  “కోట్లాది నా తోటి దేశస్థులను ఈ విష వలయం నుంచి బయటపడేసే అవకాశం నాకు లభించడం నేను గౌరవంగా భావిస్తున్నాను”, అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  కేవలం మధ్యప్రదేశ్‌ లోనే దాదాపు 30 లక్షల గృహాలను నిర్మించడం జరిగింది.  మరో 9 నుంచి 10 లక్షల గృహ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.  ఈ లక్షల నిర్మాణాలు ఉపాధికి కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని, ఆయన చెప్పారు.   వివిధ నిర్మాణ సామాగ్రి తో పాటు, వివిధ విభాగాలకు అనేక ఇతర ఆర్థిక అవకాశాలతో పాటు మేస్త్రీల నైపుణ్యం కలిగిన కార్మికులకు ఉద్యోగాలు సృష్టించబడ్డాయి.  ఈ ఇళ్ల నిర్మాణానికి కేవలం మధ్యప్రదేశ్‌ లోనే 22,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఆయన తెలియజేశారు.  ఈ భారీ పెట్టుబడి, రాష్ట్రంలో ఆర్థిక జీవనంలోని అన్ని అంశాలకు సహాయపడింది.   "ఈ గృహాలు అందరికీ పురోగతిని తీసుకువస్తున్నాయి." అని ఆయన పేర్కొన్నారు.

మారిన పని సంస్కృతి గురించి ప్ర‌ధానమంత్రి ప్రస్తావిస్తూ, ఒక‌ప్పుడు పౌరులు ప్ర‌భుత్వం వ‌ద్ద‌కు పరుగెత్తుకు వచ్చి, స‌దుపాయాల‌ను అభ్య‌ర్థించేవారనీ, అయితే ఇప్పుడు అలా కాకుండా, ప్ర‌భుత్వమే పౌరుల వ‌ద్ద‌కు వెళ్లి ప‌థ‌కాల యొక్క అన్ని ప్రయోజనాలను ప్రజలకు అందజేసేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోందని వివరించారు.   "ఈ రోజు మనం ఎలాంటి వివక్ష లేకుండా పథకాల అమలును సంతృప్తి పరచడం గురించి మాట్లాడుకుంటున్నాము." అని, ఆయన పేర్కొన్నారు. 

ప్రజల కనీస అవసరాల పై ప్రభుత్వం చూపుతున్న ఆవశ్యకత గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ,   దీనికి గత పాఠాలే కారణమని పేర్కొన్నారు.  గతంలో, చాలా మంది ప్రజలు ఈ కనీస సౌకర్యాలకు నోచుకోలేదు, వారికి ఏ విషయం గురించి ఆలోచించే సమయం లేదు.  “అందుకే 'గరీబీ హటావో' నినాదాలన్నీ పనికిరాకుండా పోయాయి.  అందుకే దేశంలోని ప్రతి పౌరుడికి ఈ ప్రాథమిక సౌకర్యాలను వేగంగా అందుబాటులోకి తేవాలని మేము నిర్ణయించుకున్నాము.  ఇప్పుడు పేదలకు కనీస సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో, వారు పేదరికాన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు,” అని ఆయన వివరించారు.

కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రభుత్వం 80 కోట్ల మంది దేశవాసులకు ఉచిత రేషన్ అందజేస్తోందని, ఇందుకోసం 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని ఆయన తెలియజేశారు.   ప్రధాన మంత్రి మాట్లాడుతూ,  “తమ డబ్బు సరైన అవసరానికి వినియోగించ పడుతోందని భావించినప్పుడు, పన్ను చెల్లింపుదారులు కూడా సంతోషంగా ఉంటారు.  కరోనా కాలంలో కోట్లాది మందికి ఆహారం అందించడం ద్వారా చేస్తున్న గొప్ప సేవకు, ఈ రోజు, దేశం లోని కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులు కూడా సంతృప్తి చెందారు.  అదే పన్ను చెల్లింపుదారుడు తన వద్ద వసూలు చేసిన డబ్బుతో ఉచిత ‘రేవారీ’ పంపిణీ చేయడాన్ని చూసినప్పుడు, అతను కూడా బాధపడ్డాడు.  ఈ రోజు, అలాంటి పన్ను చెల్లింపుదారులు చాలా మంది నాకు బహిరంగంగా లేఖలు రాస్తున్నారు.  రేవారీ సంస్కృతిని దేశం నుండి విముక్తి చేయడానికి దేశంలోని పెద్ద భాగం సన్నద్ధమవుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను." అని పేర్కొన్నారు. 

తన ప్రజల కలలను, ఆకాంక్షలను నెరవేర్చడానికి మాత్రమే, ప్రభుత్వ లక్ష్యం పరిమితం కాకుండా మధ్య, అల్పాదాయ వర్గాల ఖర్చులను తగ్గించడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిన్నట్లు, ప్రధానమంత్రి తెలియజేశారు.   ప్ర‌ధానమంత్రి ఈ సందర్భంగా ఆయుష్మాన్ భార‌త్‌ ను ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొంటూ, పేద, ఆర్థికంగా వెనుకబడిన నాలుగు కోట్ల మంది రోగులు ఈ ప‌థ‌కంలో భాగంగా ఇప్పటి వరకు చికిత్స పొందినట్లు, తెలియజేశారు.  కరోనా సమయంలో ఉచిత టీకా ప్రచారం కోసం, ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, పేదలు తమ సొంత జేబుల నుంచి డబ్బు గుల్ల చేసుకోకుండా కాపాడగలిగామని, ఆయన పేర్కొన్నారు.

ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెరుగుతున్న ఎరువుల ధరలపై ప్రధానమంత్రి వ్యాఖ్యానిస్తూ, రైతులపై భారం పడకుండా ప్రభుత్వం ఈ ఏడాది 2 లక్షల కోట్ల రూపాయల మేర అదనపు మొత్తాన్ని వెచ్చించబోతోందని స్పష్టం చేశారు.   “కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కూడా రైతులకు ఒక వరం లా ఉపయోగపడుతోంది.” అని ప్రధానమంత్రి అన్నారు.  కొద్ది రోజుల క్రితం ప్రారంభించిన 16 వేల కోట్ల రూపాయల మేర వాయిదా పంపిణీ ప్రతి లబ్ధిదారునికి వెంటనే చేరిందని ఆయన తెలియజేశారు.  “ఇప్పుడే, మా ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా జమ చేసింది” అని ప్రధానమంత్రి చెప్పారు.   విత్తనాలు, ఎరువులు, మందుల కోసం రైతులకు డబ్బు అవసరమైన సమయంలో ఈ సహాయం వచ్చింది.  పంటలు విక్రయించిన సొమ్ము నేరుగా రైతుల బ్యాంకు ఖాతాకు చేరుతుందని కూడా ప్రధానమంత్రి చెప్పారు.  “ఎం.ఎన్.ఆర్.ఈ.జి.ఏ. డబ్బు కూడా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.   గర్భిణీ తల్లులకు పౌష్టికాహారం ఎక్కువగా అవసరమైనప్పుడు మాతృ వందన యోజన ద్వారా వేలాది రూపాయల మేర ఆర్థిక సహాయం వారికి చేరుతుంది." అని కూడా శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.   సేవాభావం, రాజకీయ సంకల్పం వల్లే ఇదంతా సాధ్యమవుతుంది. 

సామాన్య పౌరుల జీవితాలను సులభతరం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించడం గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు.  స్వామిత్వ పథకంతో పాటు వ్యవసాయంలో కూడా ఆస్తుల రికార్డులను రూపొందించడంలో డ్రోన్ సర్వేల పాత్ర గురించి ఆయన పేర్కొన్నారు.   లక్షలాది ఎరువుల దుకాణాలను కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా మార్చడంతో పాటు దేశవ్యాప్తంగా భారత్ బ్రాండ్ తో యూరియా ను ప్రవేశపెడుతూ ఇటీవల తీసుకున్న చర్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.  ఈ చర్యలు రైతులకు సహాయపడతాయని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

నేపధ్యం

దేశంలోని ప్రతి పౌరునికి అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన ఇంటిని అందించడం ప్రధానమంత్రి యొక్క నిరంతర ప్రయత్నం.  నేటి కార్యక్రమం ఈ దిశగా మరో ముందడుగు.   ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, మధ్యప్రదేశ్‌ లో ఇప్పటి వరకు సుమారు 38 లక్షల ఇళ్లు మంజూరు చేయగా, 35 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ వ్యయంతో, సుమారు 29 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది.

*****

DS/TS

 



(Release ID: 1870452) Visitor Counter : 154