ప్రధాన మంత్రి కార్యాలయం

గుజరాత్‌ రాష్ట్రం, తాపీ జిల్లా, వ్యారా లో 1970 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన - ప్రధానమంత్రి


"గిరిజన సంఘాల సంక్షేమమే మా ప్రథమ ప్రాధాన్యత, మేము ఎక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, మేము గిరిజన సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తాము"

"ఆదివాసి పిల్లలు ముందుకు ఎదగడానికి కొత్త అవకాశాలు వచ్చాయి"


"గత 7-8 ఏళ్లలో గిరిజన సంక్షేమ బడ్జెట్‌ మూడు రెట్లు పెరిగింది"


"సబ్‌-కా-ప్రయాస్‌ తో అభివృద్ధి చెందిన గుజరాత్‌ ని, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మిస్తాం."

Posted On: 20 OCT 2022 5:35PM by PIB Hyderabad

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్రమోదీ వ్యారా జిల్లా, తాపీ లో 1970 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.   సపుతర నుండి ఐక్యతా విగ్రహం వరకు రహదారిని మెరుగుపరచడం, మిస్సింగ్ లింక్‌ల నిర్మాణంతో పాటు, తాపి మరియు నర్మదా జిల్లాల్లో 300 కోట్ల రూపాయల విలువైన నీటి సరఫరా ప్రాజెక్టులు కూడా ఇందులో ఉన్నాయి.


ఈ సంద‌ర్భంగా హాజరైన ప్ర‌జ‌ల ఉత్సాహాన్ని, అభిమానాన్ని ప్ర‌ధానమంత్రి అభినందిస్తూ,   రెండు దశాబ్దాలుగా వారి ఆప్యాయతలకు గ్రహీతగా ఉండటం తన అదృష్టమని పేర్కొన్నారు.   “మీరందరూ సుదూరప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చారు.  మీ శక్తి,, మీ ఉత్సాహం, నా మనసుకి సంతోషాన్ని కలిగిస్తున్నాయి. నా బలాన్ని మరింత పెంచుతున్నాయి." అని ఆయన అన్నారు.   ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ,  "మీ అభివృద్ధికి హృదయపూర్వకంగా దోహదపడటం ద్వారా ఈ రుణాన్ని తిరిగి చెల్లించడానికి.నేను ప్రయత్నిస్తున్నాను.  తాపీ, నర్మదా ప్రాంతాలతో సహా ఈ మొత్తం గిరిజన ప్రాంత అభివృద్ధికి సంబంధించి వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది." అని చెప్పారు. 


గిరిజనుల ప్రయోజనాలకు, గిరిజన వర్గాల సంక్షేమానికి సంబంధించి దేశంలో రెండు రకాల రాజకీయాలు కనిపిస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.  గిరిజనుల ప్రయోజనాలను పట్టించుకోకుండా, గిరిజనులకు బూటకపు వాగ్దానాలు చేసిన చరిత్ర కలిగిన పార్టీలు ఒక వైపు ఉండగా, మరోవైపు గిరిజన సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చే బీజేపీ లాంటి పార్టీ ఉంది.   "మునుపటి ప్రభుత్వాలు గిరిజన సంప్రదాయాలను ఎగతాళి చేస్తే, మరోవైపు మేము గిరిజన సంప్రదాయాలను గౌరవిస్తున్నాము.  "గిరిజన వర్గాల సంక్షేమమే మా ప్రథమ ప్రాధాన్యత; మేము ఎక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, గిరిజన సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాము." అని ఆయన తమ ప్రసంగాన్ని కొనసాగించారు,


గిరిజన సముదాయాల సంక్షేమం గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, “నా గిరిజన సోదరులు, సోదరీమణులు తమ సొంత పక్కా ఇల్లు, విద్యుత్, గ్యాస్ కనెక్షన్, మరుగుదొడ్డి, ఇంటికి వెళ్లే రహదారి, సమీపంలో వైద్య కేంద్రం, పిల్లల కోసం ఒక పాఠశాలతో పాటు, సమీపంలో ఆదాయ మార్గాలను కలిగి ఉండాలి.  గుజరాత్ అపూర్వమైన అభివృద్ధి సాధించిందని ఆయన అన్నారు.  గుజరాత్‌ లో,  ప్రతి గ్రామానికీ ఈ రోజు 24 గంటల కరెంటు సరఫరా సౌకర్యం ఉందని,   అయితే, ప్రతి గ్రామం విద్యుత్ సౌకర్యంతో అనుసంధానించబడిన మొదటి ప్రదేశం గిరిజన జిల్లా డాంగ్. అని ప్రధానమంత్రి తెలియజేశారు.  “సుమారు ఒకటిన్నర దశాబ్దం క్రితం, జ్యోతిర్‌ గ్రామ్ యోజన కింద, డాంగ్ జిల్లాలోని 300 కంటే ఎక్కువ గ్రామాలలో 100 శాతం విద్యుదీకరణ లక్ష్యం సాధించబడింది.  "మీరు నన్ను ఢిల్లీకి ప్రధానమంత్రిగా పంపినప్పుడు డాంగ్ జిల్లా నుండి వచ్చిన ఈ స్ఫూర్తి దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుద్దీకరణ చేపట్టేలా చేసింది”, అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 


గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయానికి కొత్త జీవం పోసేందుకు చేపట్టిన "వాడి యోజన" గురించి కూడా ప్రధానమంత్రి వివరించారు.   గిరిజన ప్రాంతాల్లో  చిరుధాన్యాలు-మొక్కజొన్న పండించడం, కొనుగోలు చేయడం కష్టంగా ఉన్న పూర్వ పరిస్థితి ని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు.  “నేడు, మామిడి, జామ, నిమ్మ వంటి పండ్లతో పాటు గిరిజన ప్రాంతాల్లో జీడిపప్పు ను సాగు చేస్తున్నారు” అని ప్రధానమంత్రి తెలియజేశారు."వాడి యోజన" ఫలితంగా ఈ సానుకూల మార్పు సాకార మయ్యిందని ప్రధానమంత్రి పేర్కొంటూ, బంజరు భూమిలో పండ్లు, టేకు, వెదురు పండించడంలో గిరిజన రైతులకు ఈ  పథకం ద్వారా సహాయం అందజేసినట్లు తెలియజేసారు.  "ఈరోజు గుజరాత్‌ లోని అనేక జిల్లాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది." అని ఆయన చెప్పారు.  వల్సాద్ జిల్లాలో ఈ పథకాన్ని చూసేందుకు రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం వచ్చిన విషయాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.  ఆయన కూడా ఈ ప్రాజెక్టు ను చాలా ప్రశంసించారని చెప్పారు. 


గుజరాత్‌ లో మారిన నీటి సరఫరా పరిస్థితి గురించి కూడా శ్రీ మోదీ తెలియజేశారు.  గుజరాత్‌ లో విద్యుత్ గ్రిడ్‌ ల తరహాలో వాటర్‌ గ్రిడ్‌ లను ఏర్పాటు చేశారు.  తాపీతో సహా మొత్తం గుజరాత్‌లో కాలువలతో పాటు, ఎత్తిపోతల వ్యవస్థను నిర్మించడం జరిగింది.   దాబా కంఠ కాలువ నుంచి నీటిని ఎత్తి పోయడం తో తాపీ జిల్లా లో నీటి సరఫరా సౌకర్యం పెరిగింది.    వందల కోట్ల రూపాయల పెట్టుబడితో "ఉకై పథకం" నిర్మాణం కొనసాగుతోందని, ఈ రోజు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల వల్ల నీటి సరఫరా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని, ఆయన తెలియజేశారు.  “ఒకప్పుడు గుజరాత్‌లో పావువంతు కుటుంబాలకు మాత్రమే నీటి కనెక్షన్ ఉండేది.  ఈ రోజు గుజరాత్‌ లోని నూరు శాతం గృహాలకు పైపుల ద్వారా త్రాగు నీరు సరఫరా అవుతోంది. ”, అని ప్రధాన మంత్రి అన్నారు.


"వనబంధు కళ్యాణ్ యోజన" గురించి ప్రధానమంత్రి వివరిస్తూ, గుజరాత్‌ లోని గిరిజన సమాజం యొక్క ప్రతి ప్రాథమిక అవసరాలు, ఆకాంక్షలను నెరవేర్చడం కోసం ఈ పధకాన్ని రూపొందించి, అమలు చేస్తున్నట్లు తెలియజేశారు.   “ఈ రోజు మనం తాపీ మరియు ఇతర గిరిజన జిల్లాల నుండి చాలా మంది కుమార్తెలు ఇక్కడ పాఠశాలు, కళాశాలలకు వెళ్లడం చూస్తున్నాము.  ఇప్పుడు గిరిజన సమాజంలోని చాలా మంది కుమారులు, కుమార్తెలు సైన్స్ చదివి డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారు” అని ఆయన చెప్పారు.  ఈ యువకులు 20-25 సంవత్సరాల క్రితం జన్మించినప్పుడు, ఉమర్‌ గామ్ నుండి అంబాజీ వరకు మొత్తం గిరిజన ప్రాంతంలో చాలా తక్కువ పాఠశాలలు ఉండేవని, సైన్స్ చదవడానికి తగినంత సౌకర్యాలు ఉండేవికావని, ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. గుజరాత్‌ లో నిన్న ప్రారంభించిన "మిషన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్" కింద గిరిజన తాలూకాల్లో దాదాపు 4,000 పాఠశాలలను ఆధునీకరించనున్నట్లు ప్రధానమంత్రి తెలియజేశారు.


గత రెండు దశాబ్దాల కాలంలో, గిరిజన ప్రాంతాల్లో 10 వేలకు పైగా పాఠశాలలు నిర్మించామని, ఏకలవ్య మోడల్‌ స్కూల్‌, ఆడపిల్లల కోసం ప్రత్యేక ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేశామని ప్రధానమంత్రి తెలియజేశారు.  నర్మదాలోని బిర్సా ముండా గిరిజన విశ్వవిద్యాలయం, గోద్రా లోని శ్రీ గోవింద్ గురు విశ్వవిద్యాలయం గిరిజన యువతకు ఉన్నత విద్యకు అవకాశాలను కల్పిస్తున్నాయి.  గిరిజన పిల్లలకు ఉపకార వేతనాల బడ్జెట్‌ ను ఇప్పుడు రెండింతలకు పైగా పెంచారు.  "ఏకలవ్య పాఠశాలల సంఖ్య కూడా అనేక రెట్లు పెరిగింది" అని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.  మన గిరిజన పిల్లల చదువు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతోపాటు విదేశాల్లో చదివేందుకు ఆర్థిక సాయం కూడా చేశాం." అని ఆయన తెలియజేశారు.  "ఖేలో ఇండియా" వంటి ప్రచారాల ద్వారా క్రీడల్లో పారదర్శకతను తీసుకురావడం, గిరిజన పిల్లలు వారి సామర్థ్యాన్ని పెంపొందించి, అభివృద్ధి చేయడానికి కొత్త అవకాశాలను అందించడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
"వనబంధు కళ్యాణ్ యోజన" కోసం గుజరాత్ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని ప్రధానమంత్రి చెప్పారు.  ఇప్పుడు ఈ పథకం యొక్క రెండవ దశలో, గుజరాత్ ప్రభుత్వం మళ్లీ లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనున్నట్లు కూడా ఆయన తెలియజేశారు.  దీంతో గిరిజన పిల్లల కోసం అనేక కొత్త పాఠశాలలు, అనేక వసతి గృహాలు, కొత్త వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు కూడా నిర్మించనున్నారు.  "ఈ పథకం కింద గిరిజనులకు రెండున్నర లక్షలకు పైగా ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.  గత కొన్నేళ్లుగా గిరిజన ప్రాంతాల్లో సుమారు లక్ష గిరిజన కుటుంబాలకు 6 లక్షలకు పైగా ఇళ్లు, భూమి లీజులు ఇవ్వడం జరిగింది." అని ఆయన చెప్పారు.


"గిరిజన సమాజాన్ని పోషకాహార లోప సమస్యల నుంచి పూర్తిగా విముక్తి చేయడమే మా సంకల్పం" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.   అందుకే కేంద్ర ప్రభుత్వం భారీ ‘పోషణ్ అభియాన్’ను ప్రారంభించింది, దీని ద్వారా తల్లులు గర్భధారణ సమయంలో పౌష్టికాహారం తినడానికి వేల రూపాయలు అందజేస్తున్నారు.  తల్లులు, పిల్లలకు సకాలంలో టీకాలు వేయడానికి, "మిషన్ ఇంద్రధనస్సు" కింద భారీ ప్రచారం జరుగుతోంది.  ఇప్పుడు, గత రెండున్నరేళ్లుగా దేశవ్యాప్తంగా పేదలకు ఉచితంగా రేషన్ సరుకులు అందజేస్తున్నట్లు, ప్రధానమంత్రి చెప్పారు.  ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తోంది.  పొగ వల్ల వచ్చే వ్యాధులకు దూరంగా ఉండేందుకు తల్లులు, సోదరీమణుల కోసం ఇప్పటివరకు దేశంలో సుమారు 10 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది.  "ఆయుష్మాన్ భారత్" పథకం కింద లక్షలాది గిరిజన కుటుంబాలకు సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స పొందే సౌకర్యం లభించింది. 


భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో గిరిజన సమాజం మరచిపోయిన వారసత్వాన్ని పునరుద్ధరించడంలో ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధానమంత్రి వివరిస్తూ, గిరిజన సమాజానికి చాలా గొప్ప వారసత్వం ఉందని వ్యాఖ్యానించారు.  "ఇప్పుడు మొదటిసారిగా, దేశం నవంబర్ 15వ తేదీన భగవాన్ బిర్సా ముండా జయంతి ని గిరిజనుల ఆత్మగౌరవ దినోత్సవంగా జరుపుకుంటోంది" అని ఆయన చెప్పారు.  గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల సేవలను దేశవ్యాప్తంగా మ్యూజియంల ద్వారా భద్రపరిచి ప్రదర్శిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు.  గిరిజన మంత్రిత్వ శాఖ ఉనికిలో లేని కాలాన్ని ప్రధానమంత్రి గుర్తు చేస్తూ, అటల్ జీ ప్రభుత్వమే తొలిసారిగా గిరిజన మంత్రిత్వ శాఖను ఏర్పాటు  చేసిందని పేర్కొన్నారు.  “అటల్ జీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన గ్రామ్ సడక్ యోజన, ఫలితంగా గిరిజన ప్రాంతాలకు అనేక ప్రయోజనాలు లభించాయి.  గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేందుకు మా ప్రభుత్వం కృషి చేసింది." అని ఆయన చెప్పారు.   గిరిజన సంక్షేమానికి సంబంధించిన బడ్జెట్‌ను కూడా గత 8 సంవత్సరాలలో మూడు రెట్లకు పైగా పెంచడం జరిగిందని, తద్వారా మన గిరిజన యువతకు ఉపాధి తో పాటు, స్వయం ఉపాధి కోసం కొత్త అవకాశాలను సృష్టించడం జరిగిందని, ప్రధానమంత్రి తెలియజేశారు.


గిరిజన యువకుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి డబుల్ ఇంజన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు చేయూత నివ్వాలని ఆయన ప్రతి ఒక్కరినీ కోరుతూ, "ఈ అభివృద్ధి భాగస్వామ్యాన్ని నిరంతరం బలోపేతం చేయాలి", అని ప్రధానమంత్రి అన్నారు.  “సబ్-కా-ప్రయాస్‌ తో అభివృద్ధి చెందిన గుజరాత్‌ ని, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మిద్దాం.” అని ప్రధానమంత్రి తమ ప్రసంగాన్ని ముగించారు.


ఈ కార్యక్రమంలో  గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్;  మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్;  పార్లమెంటు సభ్యులు, శ్రీ సి.ఆర్. పాటిల్, శ్రీ కె.సి. పటేల్, శ్రీ మన్సుఖ్ వాసవ, శ్రీ ప్రభు భాయ్ వాసవ;   గుజరాత్ రాష్ట్ర మంత్రులు శ్రీ రుషికేశ్ పటేల్, శ్రీ నరేష్ భాయ్ పటేల్, శ్రీ ముఖేష్ భాయ్ పటేల్, శ్రీ జగదీష్ పంచాల్, శ్రీ జితు భాయ్ చౌదరి ప్రభృతులు కూడా పాల్గొన్నారు. 

 

 

From Vyara, various projects are being launched, which will further Gujarat's growth trajectory. https://t.co/bPtEkZtE6P

— Narendra Modi (@narendramodi) October 20, 2022

*****

DS/TS



(Release ID: 1869782) Visitor Counter : 217