ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలో బల్క్ డ్రగ్ పార్కుకు ప్రధాని శంకుస్థాపన ఉనా ‘ఐఐఐటీ’ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి;


“హిమాచల్ ప్రదేశ్పై మా ప్రేమ.. అంకితభావానికి
బల్క్ డ్రగ్ పార్కు.. వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ ప్రతీకలు”;

“హిమాచల్ ప్రదేశ్ అంతటా రైల్వే అనుసంధానం
మెరుగుకు ద్వంద్వ చోదక ప్రభుత్వం కట్టుబడి ఉంది”;

“నవ భారతం గత సవాళ్లను అధిగమించి వేగంగా అభివృద్ధి సాధిస్తోంది”;

“21వ శతాబ్దపు భారతదేశ ఆకాంక్షలను మా ప్రభుత్వం నెరవేరుస్తోంది;

“హిమాచల్ ప్రదేశ్ సామర్థ్యంకన్నా దాని పార్లమెంటరీ
స్థానాల సంఖ్యకే లోగడ విలువ ఎక్కువగా ఉండేది”;

“గత ప్రభుత్వాల హయాంలో ఏర్పడిన అభివృద్ధి అగాధాన్ని
పూడ్చటమేగాక రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాం”;

“హిమాచల్ ప్రదేశ్‌లో తయారైన ఔషధ శక్తిని ప్రపంచమంతా చూసింది”;

“రాష్ట్రంలో ఐఐటీ, ఐఐఐటీ, ఏఐఐఎంఎస్‌ ఏర్పాటు కోసం
ద్వంద్వచోదక ప్రభుత్వం వచ్చేదాకా ఎదురుచూడాల్సి వచ్చింది”;

“స్వాతంత్ర్య అమృత మహోత్సవాలతో హిమాచల్ ప్రగతిలో
స్వర్ణయుగం ప్రారంభం కాబోతోందని నేను విశ్వసిస్తున్నాను”

Posted On: 13 OCT 2022 11:51AM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఉనాలో బల్క్ డ్రగ్ పార్కుకు శంకుస్థాపనతోపాటు ఉనా ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ (ఐఐఐటీ)ని జాతికి అంకితం చేశారు. అంతకుముందు ఉనాలోని అంబ్ అందౌరా నుంచి న్యూఢిల్లీ మధ్య నడిచే కొత్త ‘వందే భారత్ ఎక్స్‌ ప్రెస్’ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి ముందుగా శ్రీ గురునానక్‌ దేవ్‌, ఇతర సిక్కుమత గురువులతోపాటు చింతపూర్ణి మాతకు పుష్పాంజలి ఘటించారు. ధన్‌తేరస్‌, దీపావళి పండుగల నేపథ్యంలో హిమాచల్‌ ప్రదేశ్‌కు బహమతులివ్వడంపై ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంతో అన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ- హిమాచల్‌ ప్రదేశ్‌ను ప్రకృతి సౌందర్యానికి పట్టుగొమ్మగా అభివర్ణిస్తూ చింతపూర్ణి మాతకు శిరసాభివందనం చేయడం తన అదృష్టమని ప్రధాని వ్యాఖ్యానించారు.

   రాష్ట్ర పారిశ్రామికీకరణ చరిత్రలో నేడు ఒక సుదినమని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో అనుసంధానం, విద్యా రంగాలను మెరుగుపరచడమే హిమాచల్‌లో తన పర్యటన ప్రధాన లక్ష్యమని వివరించారు. “ఇవాళ ఇక్కడ ఉనాలో దేశంలోని రెండో బల్క్ డ్రగ్స్ పార్క్ నిర్మాణం ప్రారంభమవుతోంది. దీంతోపాటు నేడు రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశాం. వీటన్నిటితో ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది” అని ఆయన అన్నారు. బల్క్ డ్రగ్స్ పార్కుల ఏర్పాటుకు ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ఒకటిగా హిమాచల్‌ను ఎంపిక చేశామని ప్రధాని పేర్కొన్నారు. “బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటుకు ఎంపిక చేసిన మూడు రాష్ట్రాల్లో హిమాచల్‌ ఒకటిగా నిర్ణయించడం విశేషం. ఈ రాష్ట్రంపై మా ప్రేమకు, అంకితభావానికి ఇది నిదర్శనం” అని ఆయన అన్నారు. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్‌ నుంచి ‘వందే భారత్’ రైలును ప్రవేశపెట్టాలనే నిర్ణయం కూడా ఈ రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలుపుతుందన్నారు. రాష్ట్రానికి చెందిన పూర్వతరాలు కనీసం రైలును కూడా చూడలేదని, అలాంటి ఇవాళ ఇక్కడినుంచి అత్యంత అధునాతన రైళ్లు నడుస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. ఈ మేరకు ద్వంద్వచోదక ప్రభుత్వం ప్రజల ప్రగతికి కృషిచేస్తున్న తీరు సంతృప్తికరంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

   హిమాచల్ ప్రదేశ్ పౌరుల అవసరాలు, ఆకాంక్షలను మునుపటి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. “ఈ పరిస్థితి వల్ల మన తల్లులు, సోదరీమణులు ఎక్కువగా నష్టపోయారు” అన్నారాయన. ఇప్పుడు కాలం మారిందని, ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజల అవసరాలను తీర్చడమేగాక వారి ఆశలు-ఆకాంక్షలను అత్యంత శ్రద్ధ, అంకితభావాలతో సాకారం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. “గత ప్రభుత్వాల హయాంలో ఏర్పడిన అభివృద్ధి అగాధాన్ని పూడ్చటమేగాక రాష్ట్ర భవిష్యత్తుకు మేం బలమైన పునాది వేస్తున్నాం” అని ఆయన అన్నారు.

   నేక దేశాలు, చివరకు గుజరాత్‌ వంటి కొన్ని రాష్ట్రాలు గత శతాబ్దంలోనే తమ పౌరులకు మరుగుదొడ్లు, గ్రామీణ రహదారులు, ఆధునిక ఆరోగ్య సంరక్షణ వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు. “కానీ, భారతదేశంలో మాత్రం సామాన్యులు ఈ ప్రాథమిక సంరక్షణ పొందడాన్ని కూడా మునుపటి ప్రభుత్వం కష్టతరం చేసింది. ఫలితంగా పర్వత ప్రాంతాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఇంతకుముందు నేనిక్కడ నివసించిన సమయంలో ఇదంతా నేను చాలా సన్నిహితంగా చూశాను” అని చెప్పారు. అయితే, “నవ భారతం నేడు గత సవాళ్లను అధిగమించి వేగంగా అభివృద్ధి సాధిస్తోంది. గత శతాబ్దంలోనే ప్రజలకు అందాల్సిన ప్రాథమిక సౌకర్యాలు ఇవాళగానీ అందుబాటులోకి రాలేదు. ఇకపై 20వ శతాబ్దపు సదుపాయాలను మీకు చేరువచేసి, హిమాచల్‌ ప్రదేశ్‌ను 21వ శతాబ్దంతో అనుసంధానిస్తాం” అని ప్రధాని ప్రకటించారు. గ్రామీణ రహదారులను రెట్టింపు వేగంతో నిర్మిస్తున్నామని, గ్రామ పంచాయతీలను బ్రాడ్‌బ్యాండ్తో సంధానిస్తున్నామని చెప్పారు. “మా ప్రభుత్వం ఇప్పుడు 21వ శతాబ్దపు భారతదేశ ఆకాంక్షలను నెరవేరుస్తోంది” అని పేర్కొన్నారు.

   షధ తయారీలో భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలపడంలో హిమాచల్ ప్రదేశ్ కీలక పాత్ర పోషించిందని, ఇప్పుడు రాష్ట్రానికి అవకాశాలు మరింత పెరగబోతున్నాయని ప్రధాని తెలిపారు. “హిమాచల్ ప్రదేశ్‌లో తయారైన ఔషధ శక్తి ఎంతటితో ప్రపంచమంతా చూసింది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఔషధ తయారీకి ముడి సరుకులను హిమాచల్ ప్రదేశ్‌లో ఉత్పత్తి చేయనున్నందున, మన దేశం ఇందుకోసం ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి గణనీయంగా తగ్గుతుందని ఆయన చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద జనౌషధి కేంద్రాల ద్వారా పేదలకు, అణగారిన వర్గాలకు ప్రభుత్వం ఏటా రూ.5 లక్షల మేర ఉచిత చికిత్సను అందిస్తున్నదని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. “ప్రజలకు నాణ్యమైన, సరసమైన వైద్య సంరక్షణను అందించే దిశగా ప్రభుత్వ చేపట్టిన కార్యక్రమానికి ఈ బల్క్ డ్రగ్ పార్క్ మరింత బలాన్నిస్తుంది” అని ఆయన తెలిపారు. “వ్యవసాయమైనా, పరిశ్రమ అయినా అభివృద్ధి వేగానికి ఊపునిచ్చేది అనుసంధానమే”నని శ్రీ మోదీ అన్నారు. ఈ సందర్భంగా 40 ఏళ్ల కిందట మంజూరైన నంగల్ డ్యాం-తల్వారా రైలుమార్గం పనులపై ప్రస్తుత ప్రభుత్వం సరైన రీతిలో శ్రద్ధ చూపేదాకా క్షేత్రస్థాయిలో ఎలాంటి పురోగతి లేకపోవడాన్ని ఆయన ఉదాహరించారు. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ అంతటా రైల్వే అనుసంధానం మెరుగకు ద్వంద్వచోదక ప్రభుత్వం కట్టుబడి ఉందని, నేడు ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ వందేభారత్‌ రైళ్లతో దేశం అనుసంధానితం అవుతున్న నేపథ్యంలో హిమాచల్‌ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు.

   వాగ్దానాలను నెరవేర్చడం, గడువుకు ముందే పనులు పూర్తిచేయడం వంటి కొత్త పని తీరు గురించి ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. “హిమాచల్ ప్రదేశ్ సామర్థ్యంకన్నా దాని పార్లమెంటరీ స్థానాల సంఖ్యకే లోగడ విలువ ఎక్కువగా ఉండేది. రాష్ట్రంలో విద్యా సంస్థల కోసం చాలా కాలం నుంచి మూలపడి ఉన్న డిమాండ్‌ అత్యవసరంగా పరిష్కరించబడింది. ఆ మేరకు ఐఐటీ, ఐఐఐటీ, ఏఐఐఎంఎస్‌ వంటి విద్యాసంస్థల ఏర్పాటు కోసం ద్వంద్వచోదక ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రం ఎదురుచూడాల్సి వచ్చింది” అని ఆయన వ్యాఖ్యానించారు. హిమాచల్ ప్రదేశ్‌లో విద్యారంగ సంబంధిత కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో మేలుచేస్తాయని ప్రధాని చెప్పారు.  ఉనాలో ‘ఐఐఐటీ’ శాశ్వత భవనం వల్ల విద్యార్థులకు మరింత ఊరట లభిస్తుందన్నారు. లోగడ ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని, మారుతున్న పని సంస్కృతికి మరింత ఊతమిచ్చేలా దీన్ని జాతికి అంకితం చేస్తున్నామని ప్రకటించారు. మహమ్మారి సవాళ్లు ఎదురైనప్పటికీ అనుకున్న సమయానికల్లా పూర్తి చేసినందుకు ఇందులో భాగస్వాములైన ప్రజలను ఆయన అభినందించారు.

   దేశవ్యాప్తంగా నైపుణ్య-ఆవిష్కరణ సంస్థల ఏర్పాటు ఆవశ్యకతను ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. అదేవిధంగా యువత నైపుణ్యాలను, సామర్థ్యాన్ని మెరుగుపర్చడం ఇవాళ్టి మన అతిపెద్ద ప్రాధాన్యమని ఆయన అన్నారు. హిమాచల్‌ యువత సైన్యంలో సేవలందించడం, దేశ భద్రతలో కొత్త కోణాలను ఆవిష్కరిస్తున్నారని ఆయన ప్రశంసించారు. "ఇవాళ వివిధ రకాల నైపుణ్యాలు వారిని సైన్యంలో ఉన్నత స్థానాలకు తీసుకెళ్లడానికి తోడ్పడతాయి” అని చెప్పారు.

   చివరగా- కలలు, సంకల్పాలు అత్యున్నతమైనపుడు వాటిని సాకారం చేసుకునే కృషి కూడా ఆ స్థాయిలో ఉండాలన్నారు. ద్వంద్వచోదక ప్రభుత్వ నమూనాలో ఇటువంటి కృషి ప్రతిచోటా కనిపిస్తున్నదని శ్రీ మోదీ అన్నారు. ఇది కొత్త చరిత్రను సృష్టిస్తుందని, సరికొత్త సంప్రదాయం ఆవిర్భవిస్తుందని చెప్పారు. “స్వాతంత్ర్య అమృత మహోత్సవాలతో హిమాచల్ ప్రగతిలో స్వర్ణయుగం ప్రారంభం కాబోతోందని నేను విశ్వసిస్తున్నాను. ఈ స్వర్ణయుగం మీరందరూ దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అభివృద్ధి పథంలో హిమాచల్‌ను పరుగులు తీయిస్తుంది” అని ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.

   హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ శ్రీ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌, ముఖ్యమంత్రి శ్రీ జైరామ్‌ ఠాకూర్‌, కేంద్ర సమాచార-ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు శ్రీ సురేష్‌ కశ్యప్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

   స్వయం సమృద్ధ భారతం కోసం ప్రధాని ఇచ్చిన స్పష్టమైన పిలుపుతోపాటు ప్రభుత్వం చేపట్టిన వివిధ వినూత్న కార్యక్రమాల మద్దతువల్ల దేశం బహుళ రంగాల్లో స్వావలంబన వైపు వేగంగా ముందడుగు వేయడానికి దోహదం చేసింది. అటువంటి కీలక రంగాల్లో ఔషధ రంగం కూడా ఒకటి కాగా, ఈ రంగం స్వావలంబన దిశగా ఉనా జిల్లాలోని హరోలిలో రూ.1900 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించే బల్క్ డ్రగ్ పార్కుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ పార్కు నిర్మాణంతో ఔషధ తయారీకి ముడి పదార్థాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ఈ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు రూ.10,000 కోట్లదాకా పెట్టుబడులు వస్తాయని, తద్వారా 20,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. దీంతోపాటు ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడానికీ ఇది దోహదం చేస్తుంది.

   ఉనాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) సంస్థను కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ఈ విద్యాసంస్థ నిర్మాణానికి ప్రధాని 2017లో శంకుస్థాపన చేయగా, ప్రస్తుతం ఇక్కడ 530 మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు.

   అంతకుముందు ఉనాలోని అంబ్ అందౌరా నుంచి న్యూఢిల్లీ మధ్య నడిచే కొత్త ‘వందే భారత్ ఎక్స్‌ ప్రెస్’ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఇది దేశంలో ప్రవేశపెట్టిన నాలుగో రైలు కాగా, ఇప్పటివరకూ నడుస్తున్న మూడు రైళ్లకన్నా ఆధునికమైనది.. తేలికైనది.. తక్కువ వ్యవధిలో అధిక వేగం అందుకోగలది కావడం విశేషం. ఇది కేవలం 52 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగం పుంజుకోగలదు. ఈ రైలును ప్రవేశపెట్టడంతో ఈ ప్రాంతంలో పర్యాటకం వృద్ధికి దోహదం చేయడంతోపాటు మరింత సౌకర్యం, వేగవంతమైన ప్రయాణ సాధనంగా మారుతుంది.

***


(Release ID: 1867485) Visitor Counter : 194