ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజ‌రాత్‌లోని అమోద్‌, బ‌రూచ్‌ల‌లో 8,000 కోట్ల రూపాయ‌ల విలువ‌గ‌ల ప‌లు ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేసి, జాతికి అంకితం చేసిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ.


“ఈ రోజు, గుజ‌రాత్ లోని న‌ర్మ‌దా న‌దీమ త‌ల్లి ఒడ్డు నుంచి నేను ములాయంసింగ్ యాద‌వ్ జీకి నివాళి అర్పిస్తున్నాను”

“బారుచ్ గుజ‌రాత్ అభివృద్ధి, ఇండియా అభివృద్ధిలో కీల‌క పాత్ర పోషించ‌నుంది”

“న‌రేంద్ర‌- భూపేంద్ర ల నాయ‌క‌త్వంలోని డ‌బుల్ ఇంజిన్ ప్ర‌భుత్వం ఉల్కా వేగంతో ల‌క్ష్యాలు సాధించేందుకు కృషిచేస్తోంది”

“త‌గిన విధంగా నిర్దేశిత‌ కలలను సాకారం చేసుకోవ‌డానికి విధానాలు, ఉద్దేశం (నీతి ,నియాత్) రెండూ అవసరం"

“ 2014లో 10 వ స్థానంలో ఉన్న భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ 5వ స్థానానికి చేరుకుంది”

“ క‌రోనా పై పోరాటంలో గుజ‌రాత్ దేశానికి ఎంత‌గానో స‌హాయ‌ప‌డింది. దేశ ఫార్మా ఎగుమ‌తుల‌లో 25 శాతం వాటా గుజ‌రాత్ దే”

“ ఆదివాసీ ప్ర‌జ‌లు దేశ ప్ర‌గ‌తి ప్ర‌స్థానానికి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ్డారు”

“ భారుచ్‌, అంక‌లేశ్వ‌ర్ ల అభివృద్ధ‌ఙ ట్విన్ సిటీ అభివృద్ధి న‌మూనాకు అనుగుణంగా చేప‌ట్ట‌డం జ‌రుగుతుంది.”

Posted On: 10 OCT 2022 1:09PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, గుజ‌రాత్ లోని అమోద్‌, భ‌రూచ్‌ల‌లో ప‌లు ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న‌లు చేసి 8,000 కోట్ల‌రూపాయ‌ల విలువ‌గ‌ల వివిధ ప్రాజెక్టుల‌నుఈ రోజు జాతికి అంకితం చేశారు. ప్ర‌ధాన‌మంత్రి  జంబుస‌ర్‌లో బ‌ల్క్‌డ్ర‌గ్ పార్క్‌కు శంకుస్థాప‌న చేశారు. అలాగే అంక‌లేశ్వ‌ర్ విమానాశ్ర‌యం తొలి ద‌శ‌కు చెందిన ద‌హేజ్ వ‌ద్ద డీప్ సీ పైప్ లైన్ ప్రాజెక్టుకు , అంక‌లేశ్వ‌ర్‌, ప‌నోలి వ‌ద్ద బ‌హుళ స్థాయి పారిశ్రామిక షెడ్ల అభివృద్ధికి ప్ర‌ధాన‌మంత్రి శంకుస్థాప‌న చేశారు.  గుజ‌రాత్ లో ర‌సాయ‌నాల రంగాన్ని ముందుకు తీసుకుపోయే ప‌లు ప్రాజెక్టుల‌ను ప్ర‌ధాన‌మంత్రి జాతికి అంకితం చేశారు. వీటిలో జిఎసిఎల్ ప్లాంట్‌, భ‌రూచ్ భూగ‌ర్భ డ్రైనేజ్‌, ఐఒసిఎల్ ద‌హేజ్ కొయాలి పైప్‌లైన్ ప్రాజెక్టు ఉన్నాయి.

 ఈ సంద‌ర్భంగా దివంగ‌త శ్రీ ములాయం సింగ్ యాద‌వ్ కు ప్ర‌ధాన‌మంత్రి  ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ“ ములాయం సింగ్ జీతో నా బంధం ప్ర‌త్యేక మైన‌ది. ముఖ్య‌మంత్రులుగా మేం క‌లుసుకున్న‌ప్పుడు, ఒక‌రిప‌ట్ల మ‌రొక‌రికి ప్రేమ‌, సాన్నిహిత్యం ఉండేది” అని ఆయ‌న అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థి అయిన త‌ర్వాత వివిధ పార్టీల నాయ‌కుల‌ను క‌లుసుకున్న సంద‌ర్భంగురించి ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, ఆ స‌మ‌యంలో ములాయం సింగ్ జీ ఆశీస్సులు అందిస్తూ అన్న మాట‌లు, వారి స‌ల‌హా త‌న‌కు ఇప్ప‌టికీ  త‌న‌కు ఎంతో ముఖ్య‌మైన‌వ‌ని ఆయ‌న అన్నారు. కాలమాన ప‌రిస్థితులు మారిన‌ప్ప‌టికీ ములాయంసింగ్ జీ 2013 లో లాగ‌నే త‌న ఆశీస్సులు కొన‌సాగించార‌న్నారు. గ‌త లోక్‌స‌భ సెష‌న్‌లోములాయం సింగ్ జీ త‌న‌కు అందించిన ఆశీస్సుల‌ను గుర్తు చేసుకుంటూ ప్ర‌ధాన‌మంత్రి, దివంగ‌త ములాయంసింగ్‌జీ, ఎలాంటి రాజ‌కీ విభేదాల‌కుతావులేకుండా 2019లో న‌రేంద్ర‌మోదీ  ప్ర‌ధాన‌మంత్రిగా తిరిగి అధికారంలోకి వ‌స్తార‌ని ఊహించార‌ని , అంద‌రినీ త‌న‌తో క‌లుపుకుపోయే నాయ‌కుడిగా అభివ‌ర్ణించార‌ని అన్నారు.  “ ఇవాళ‌, ఈ గుజ‌రాత్ గ‌డ్డ‌మీద‌నుంచి ప‌విత్ర న‌ర్మదాన‌దీమ‌త‌ల్లి ఒడ్డునుంచి దివంగ‌త ములాయంసింగ్ జీకి విన‌మ్ర‌నివాళులు అర్పిస్తున్నాను. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు, ములాయంసింగ్‌జీ అభిమానుల‌కు వారు ఈ కోలుకోలేని న‌ష్టాన్ని  త‌ట్టుకునే బ‌లం ఆ భ‌గ‌వంతుడు వారికి క‌ల్పించాల్సిందిగా ప్రార్థిస్తున్న‌ట్టు” ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు.

ఆజాది కా అమృత్ మ‌హోత్స‌వ్ స‌మ‌యంలో బ‌రూచ్‌కి రావ‌డం గురించి ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, ఈ గ‌డ్డ దేశం కోసం పాటుప‌డిన ఎంద‌రికో జ‌న్మ‌నిచ్చింద‌ని , వారు దేశ పేరు ప్ర‌తిష్ఠ‌ల‌ను స‌మున్న‌త స్థాయికి తీసుకువెళ్లార‌ని అన్నారు.  సోమ‌నాథ్ ఉద్య‌మంలో కీల‌క పాత్ర వ‌హించిన‌, రాజ్యాంగ‌స‌భ స‌భ్యుడు స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌, క‌న్హ‌య్య‌లాల్‌మ‌నేక్ లాల్ మున్షీ, ప్ర‌ఖ్యాత సంగీత విద్వాంసుడు పండిట్ ఓంకార్‌నాథ్ ఠాకూర్ వీరిలో ఉన్నార‌న్నారు. గుజ‌రాత్ అభివృద్ధిలో , ఇండియా అభివృద్ధిలో బ‌రూచ్ కీల‌క పాత్ర పోషించ‌నున్న‌ద‌ని అన్నారు.మ‌నం భార‌త‌దేశ చ‌రిత్ర‌ను చ‌దివిన‌పుడు, భ‌విష్య‌త్‌గురించిన చ‌ర్చ వ‌చ్చిన‌పుడు, బ‌రూచ్ గురించి ఎంతో గ‌ర్వంగా చెప్పుకుంటాం. బ‌రూచ్ జిల్లా కాస్మోపాలిట‌న్ స్వ‌భావాన్ని సంత‌రించుకోవ‌డాన్ని ఆయ‌న ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించారు.

ర‌సాయ‌నాల రంగానికి చెందిన వివిధ ప్రాజెక్టుల‌తో పాటు తొలి బ‌ల్క్ డ్ర‌గ్ పార్క్‌ను బ‌రూచ్ లో ఏర్పాటు చేస్తున్న‌ట్టు ప్ర‌ధానమంత్రి తెలిపారు. అనుసంధాన‌త‌కు సంబంధించిన రెండు ప్ర‌ధాన ప్రాజెక్టులు ఈ రోజు ప్రారంభించారు. అంక‌లేశ్వ‌ర్ లో బ‌రూచి ఎయిర్ పోర్టు కు శంకుస్థాప‌న చేసే కార్య‌క్ర‌మం ఈరోజు జ‌రిగింది. దీనితో బ‌రోడా,సూర‌త్‌ల‌పై బ‌రూచ్ ఆధార‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. దేశంలోని చిన్న రాష్ట్రాల‌లో ఉన్న ప‌రిశ్ర‌మ‌ల కంటే బ‌రూచ్‌లోనే ఎక్కువ ప‌రిశ్ర‌మ‌లు ఉన్నాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. నూత‌న విమానాశ్ర‌య ప్రాజెక్టుతో ఈ ప్రాంతం అభివృద్ధి ప‌థంలో దూసుకుపోనున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. ఇది డ‌బుల్ ఇంజిన్ ప్ర‌భుత్వం వ‌ల్ల సాధ్య‌మైంది. న‌రేంద్ర‌- భూపేంద్రలు నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌ను ఉల్కా వేగంతో
పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు అని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. ఇది గుజ‌రాత్ ప్ర‌భుత్వ కొత్త ముఖ‌చిత్రం అని అంటూ, గ‌తంలో వివిధ రంగాల‌లో వెనుక‌బ‌డి ఉన్న గుజ‌రాత్ గ‌త రెండు ద‌శాబ్దాల‌లో  వ్య‌వ‌సాయ‌, పారిశ్రామిక రంగాల‌లో దూసుకుపోతున్న‌ద‌ని అన్నారు. ర‌ద్దీగా ఉండే పోర్టులు, కోస్తా తీర‌ప్రాంత అభివృద్ధితో గిరిజ‌న‌, మ‌త్స్య‌కార ప్ర‌జ‌ల జీవితాల‌లో ఎంతో మార్పు వ‌చ్చింది. గుజ‌రాత్ ప్ర‌జ‌ల క‌ష్టించిప‌డే త‌త్వం వ‌ల్ల రాష్ట్ర యువ‌త‌కు ఆజాది కా అమృత్ మ‌హోత్స‌వ్ వేల సువ‌ర్ణ‌శ‌కం ఆరంభ‌మైంద‌ని ఆయ‌న అన్నారు. ఎలాంటి అడ్డంకులు లేని ప‌రిస్థితులు నెల‌కొల్పేందుకు గ‌ల అవ‌కాశాన్ని జార‌విడుచుకోరాద‌ని ఆయ‌న అన్నారు. మ‌న క‌ల‌ల‌ను సాకారం చేసుకోవ‌డానికి నీతి,నియ‌త్ (విధానం, సంక‌ల్పం) రెండూ అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు. భ‌రూచ్ ప్రాంతంలో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిస్థితి మెరుగుప‌డిన విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు.గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా వ్య‌వ‌సాయం, ఆరోగ్యం, మంచినీటి స‌ర‌ఫ‌రా ప‌రిస్థితి ఎలా మెరుగుప‌డిందీ ఆయ‌న వివ‌రించారు. తాను ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు తాను ఎదుర్కొన్న స‌మ‌స్య‌ను ప్ర‌స్తావించి , ఆ స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రించిందీ వివ‌రించారు. ఇవాల్టిపిల్ల‌ల‌కు క‌ర్ఫ్యూ అనే ప‌దం గురించి తెలియ‌ద‌ని, గ‌తంలో అది స‌ర్వ‌సాధ‌ర‌ణమైన‌దిగా ఉండేద‌ని చెప్పారు. ఇవాళ మ‌న మ‌హిళ‌లు గౌర‌వ‌ప్ర‌ద‌మైన జీవితాన్ని గ‌డ‌ప‌డ‌మే కాకుండా క‌మ్యూనిటికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్నార‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

అలాగే, యువ‌త‌కు నూత‌న అవ‌కాశాలు క‌ల్పిస్తూ విద్యా స‌దుపాయాలు వ‌చ్చిన‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌, నిరుప‌యోగంగా ఉన్న వ‌న‌రుల‌ను స‌మ‌ర్ధంగా ఉప‌యోగించుకోవ‌డం ద్వారా గుజ‌రాత్ త‌యారీ రంగ‌, పారిశ్రామిక‌, వ్యాపార హ‌బ్‌గా మారింద‌ని అన్నారు. ఎన్నో ప్ర‌పంచ‌శ్రేణి స‌దుపాయాలు ఇక్క‌డ ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు. డ‌బుల్ ఇంజిన్‌ప్ర‌భుత్వం , డ‌బుల్‌ప్ర‌యోజ‌నాలు ఇచ్చేదానికి గొప్ప ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. వోక‌ల్‌ఫ‌ర్ లోక‌ల్ కోసం కోసం తాను ఇచ్చిన పిలుపును ప్ర‌ధాన‌మంత్రి ఈ సంద‌ర్బంగా పున‌రుద్ఘాటించారు. స్థానిక ఉత్ప‌త్తుల‌ను కొనుగోలు చేయ‌డం, దిగుమ‌తుల‌ను వ‌దిలించుకోవ‌డం ద్వారా ప్ర‌తి పౌరుడూ ఆత్మ‌నిర్భ‌ర్‌భార‌త్‌కు దోహ‌ద‌ప‌డ‌వ‌చ్చ‌ని ఆయ‌న అన్నారు. రానున్న దివాలి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా స్థానిక ఉత్ప‌త్తుల‌ను , హ‌స్త‌క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించాల‌ని ఆయ‌న అన్నారు.

2014లో ప‌దో స్థానంలో ఉన్న భార‌త ఆర్ధిక వ్య‌వ‌స్థ 5 వ స్థానానికి చేరింద‌ని అన్నారు. ఇండియా ఒక‌నాటి మ‌న వ‌ల‌స‌పాల‌కుల‌ను కూడా దాటిపోవ‌డం గొప్ప‌విష‌య‌మ‌ని అన్నారు. ఇందుకు దేశ యువ‌త‌, రైతులు, శ్రామికులు, చిన్న‌, పెద్ద వ్యాపారులు, పెద్ద పారిశ్రామిక వేత్త‌ల‌కు ఈ గొప్ప‌ద‌నం ద‌క్కుతుంద‌ని ఆయ‌న అన్నారు. ఔష‌ధాల త‌యారీ ద్వారా ప్ర‌జల ప్రాణాలు కాపాడే గొప్ప ప‌నిలో బ‌రూచ్ ప్ర‌జ‌లు నిమగ్న‌మై ఉన్నార‌ని అంటూ ప్ర‌ధాన‌మంత్రి వారికి అభినందన‌లు తెలిపారు. కోవిడ్ మ‌హ‌మ్మారి, ఫార్మారంగం ప్రాముఖ్య‌త‌ను అత్యంత‌ స్ప‌ష్టంగా తెలియ‌జేసింద‌ని ,అంటూ ప్ర‌ధాన‌మంత్రి కోవిడ్ పై పోరాటంలో గుజ‌రాత్ దేశ‌ప్ర‌జ‌ల‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డింద‌ని అన్నారు. గుజ‌రాత్ దేశ ఫార్మా ఎగుమ‌తుల రంగంలో 25 శాతం క‌లిగి ఉంద‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.

బ‌రూచ్‌లో కొంద‌రు దుండ‌గులు అభివృద్ధి ప‌థాన్ని అడ్డుకునేందుకు గ‌తంలో ప్రయ‌త్నించిన విష‌యాన్ని ప్ర‌ధాన‌మంత్రి గుర్తుచేశారు. 2014లో తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత గుజ‌రాత్ న‌రేంద్ర‌-భూపేంద్ర ల డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ శ‌క్తి ఏమిటో తెలుసుకుంద‌ని, అన్ని ర‌కాల అడ్డంకుల‌ను తొలగించ‌డం జ‌రిగింద‌ని ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. అర్బ‌న్‌న‌క్స‌ల్స్ స‌ర్దార్ స‌రోవ‌ర్ డ్యామ్ నిర్మాణం సందర్భంగా అడ్డంకులు సృష్టించార‌ని ఆయ‌న అన్నారు. జార్ఖండ్‌, బీహార్‌, ఒడిషా, చ‌త్తీస్‌ఘ‌డ్‌, మ‌ధ్యప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌లోని కొన్ని ప్రాంతాల‌లో న‌క్స‌లైట్ల కార్య‌క‌లాపాల గురించి ప్ర‌స్తావిస్తూ, గుజ‌రాత్ లో గిరిజ‌నులు , న‌క్స‌లైట్ల‌ను గుజ‌రాత్‌కు  రానివ్వ‌లేద‌ని ఆ ర‌కంగా రాష్ట్రాన్ని ప్ర‌జ‌ల‌ను వారు కాపాడార‌ని ఆయ‌న అన్నారు.రాష్ట్రంలో అర్బ‌న్ న‌క్స‌లైట్లు అడుగుపెట్టేందుకు అవ‌కాశం ఇవ్వ‌వ‌ద్ద‌ని ఆయ‌న అన్నారు. సైన్స్‌, గ‌ణితంల‌లో మంచి విద్య అందించ‌కుండాఅభివృద్ధి సాధ్య‌మ‌య్యేది కాద‌ని, ప్ర‌భుత్వ  కృషి వ‌ల్లే ఇదంతా విజ‌య‌వంతం అయింద‌ని అన్నారు. ఇవాళ గిరిజ‌న యువ‌త పైల‌ట్ శిక్ష‌ణ పొందుతున్నార‌ని, డాక్ట‌ర్లు, శాస్త్ర‌వేత్త‌లు, న్యాయ‌వాదులు అవుతున్నారని అన్నారు. ఆదివాసీ క‌మ్యూనిటీ దేశ‌, రాష్ట్ర ప్ర‌గ‌తికి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ్డార‌ని ఆయ‌న అన్నారు. వారి చేయూత‌ను గౌర‌వించేందుకు ప్ర‌భుత్వం భ‌గ‌వాన్ బిర్సా ముంద‌డా జ‌యంతిని జ‌న‌జాతీయ గౌర‌వ్‌దివ‌స్ గా ప్ర‌క‌టించింద‌ని, అన్నారు. బిర్సా ముండాను దేశ‌వ్యాప్తంగా గిరిజ‌నులు ఎంత‌గానో ఆరాధిస్తార‌ని ఆయ‌న చెప్పారు.

బ‌రూచ్ , అంకలేశ్వ‌ర్ ల అభివృద్ధిని ట్విన్ సిటీ డ‌వ‌ల‌ప్‌మెంట్ న‌మూనాలో ముందుకు తీసుకుపోనున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. ఇది అహ్మ‌దాబాద్‌, గాంధీన‌గ‌ర్‌లో లాగా ఉంటుంద‌న్నారు. న్యూయార్క్‌, న్యూజెర్సీ గురించి ప్ర‌జ‌లు త‌ల‌చుకున్న‌ట్టే భ‌రూచ్‌, అంక‌లేశ్వ‌ర్‌ల‌ను ప్ర‌జ‌లు త‌ల‌చుకుంటార‌ని ఆయ‌న అన్నారు.
గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి శ్రీ భూపేంద్ర ప‌టేల్‌, కేంద్ర ర‌సాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండ‌వీయ‌, ఇత‌ర పార్ల‌మెంటు స‌భ్యులు శ్రీ సి.ఆర్ పాటిల్‌, శ్రీ మ‌న్‌సుఖ్ వాస‌వ త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

నేప‌థ్యంః
ఇండియాను ఫార్మాసూటిక‌ల్ రంగంలో ఆత్మ‌నిర్భ‌ర్ చేసే దిశ‌గా మ‌రో అడుగు ముందుకు ప‌డింది. ఇందుకు సంబంధించి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ జంబుస‌ర్‌లో బ‌ల్క్‌డ్ర‌గ్ పార్క్‌కు శంకుస్థాప‌న చేశారు. దేశ మొత్తం ఫార్మాసూటిక‌ల్ దిగుమ‌తుల‌లో 60 శాతం  దిగుమ‌తులుగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు దిగుమ‌తుల‌కు ప్ర‌త్యామ్నాయాన్ని క‌ల్పించ‌డంలో, ఇండియాను బ‌ల్క్ డ్ర‌గ్ రంగంలో స్వావ‌లంబ‌న దిశ‌గా ముందుకు తీసుకుపోయేందుకు ఉప‌యోగ‌ప‌డ‌నుంది. ప్ర‌ధాన‌మంత్రి ద‌హేజ్‌లో డీప్‌సీ పైప్‌లైన్ ప్రాజెక్టుకు శంకుస్థాప‌న చేశారు. ఇది పారిశ్రామిక ఎస్టేట్ ల‌నుంచి వ్య‌ర్థ‌జ‌లాల‌ను తొలగించ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌ధాన‌మంత్రి శంకుస్థాప‌న చేసిన ఇత‌ర ప్రాజెక్టుల‌లో అంక‌లేశ్వ‌ర్ ఎయిర్ పోర్ట్ తొలిద‌శ‌, అంక‌లేశ్వ‌ర్‌, ప‌నోలిల‌లో బ‌హుళ‌స్థాయి పారిశ్రామిక షెడ్ల నిర్మాణం ఉన్నాయి. ఇది ఎం.ఎస్‌.ఎం.ఇ రంగానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

ప్ర‌ధాన‌మంత్రి బ‌హుళ పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి భూమిపూజ చేశారు. ఇందులో నాలుగు గిరిజ‌న పారిశ్రామిక పార్కులు ఉన్నాయి. ఇవి వ‌లియ (భారుచ్‌), అమీర్‌ఘ‌డ్ (బ‌న‌స్కంఠ‌), చ‌కాలియ (ద‌హోద్‌), వ‌న‌ర్ (చోటా ఉద‌య్‌పూర్‌), ముడెతా (బ‌న‌స్కంఠ‌)లో ఆగ్రోఫుడ్ పార్క్‌,కాక్వాడి దంతి (వ‌ల‌సద్ )వ‌ద్ద సీఫుడ్‌పార్క్‌, మ‌హిసాగ‌ర్ లోని ఖండివావ్ వ‌ద్ద ఎం.ఎస్‌.ఎం.ఇ పార్కు ఉన్నాయి.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి ప‌లు ఇత‌ర ప్రాజెక్టుల‌ను కూడా జాతికి అంకితం చేశారు.ఇవి ర‌సాయ‌నాల రంగానికి మ‌రింత ఊతం ఇవ్వ‌నున్నాయి. 800 టిపిడి కాస్టిక్‌సోడా ప్లాంట్‌ను ప్ర‌ధాన‌మంత్రి జాతికి అంకితం చేశారు. దీనిని ద‌హేజ్ లోని 130 మెగావాట్ల కోజ‌న‌రేష‌న్ ప‌వ‌ర్‌ప్లాంట్‌తో అనుసంధానం చేశారు. దీనితోపాటు, ద‌హేజ్‌లో ప్ర‌స్తుతం ఉన్న కాస్టిక్‌సోడా ప్లాంట్ విస్త‌ర‌ణ‌ను జాతికిఅంకితం చేశారు. దీని సామ‌ర్ధ్యాన్ని రోజుకు 785 మెట్రిక్ ట‌న్నుల నుంచి 1310 మెట్రిక్ ట‌న్నులకు పెంచారు.  ఏటా ఒక ల‌క్ష ట‌న్నుల క్లోరో మీథేన్‌ను ద‌హేజ్‌లో త‌యారుచేసే ప్రాజెక్టును ప్ర‌ధాన‌మంత్రి జాతికి అంకితం చేశారు. ప్ర‌ధాన‌మంత్రి జాతికి అంకితం చేసిన ఇత‌ర ప్రాజెక్టుల‌లో ద‌హేజ్ లో హైడ్రాజైన్ హైడ్రేట్ ప్లాంట్ కూడా ఒక‌టి. ఇది దిగుమ‌తుల‌కు ప్ర‌త్యామ్నాయ ఉత్పత్తి. ఐఒసిఎల్ ద‌హేజ్‌- కోయ‌లి పైప్ లైన్ ప్రాజెక్ట్‌, బ‌రూచ్ భూగ‌ర్భ డ్రైనేజ్ ప్రాజెక్టు, ఎస్‌టిపి వ‌ర్క్‌, ఉమ్లా ఆసా ప‌నేథా రోడ్ వెడ‌ల్పు ఎస్‌టిపి వ‌ర్క్ ప‌నుల‌ను కూడా ప్ర‌ధాన‌మంత్రి జాతికిఅంకితం చేశారు.


(Release ID: 1866946) Visitor Counter : 124