గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వచ్ఛ్ అమృత్ మహోత్సవ్


వ్యర్థ పదార్థాల నుండి బొమ్మలను రూపొందించే పోటీ, "స్వచ్ఛ్-టాయ్‌- కాథాన్" ను ప్రారంభించిన - కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ


వ్యర్థాలను బొమ్మలుగా మార్చేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని సృజనాత్మక వ్యక్తులను కోరిన - కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి


ఆసక్తిగల అభ్యర్థులు 2022 సెప్టెంబర్, 26వ తేదీ నుంచి 2022 నవంబర్, 11వ తేదీ మధ్య కాలంలో https://innovateindia.mygov.in/swachh-toycathon/ వెబ్‌- సైట్ ద్వారా తమ దరఖాస్తులను నమోదు చేసుకోవచ్చు

Posted On: 26 SEP 2022 3:33PM by PIB Hyderabad

బొమ్మల తయారీ పరిశ్రమను పర్యావరణ అనుకూలమైనదిగా మార్చాలనే ప్రధానమంత్రి స్పష్టమైన పిలుపుకు ప్రతిస్పందనగా, కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం.ఓ.హెచ్.యు.ఏ) బొమ్మల తయారీ రంగాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తోంది.  ఇందులో భాగంగా, బొమ్మల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక కింద, కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం.ఓ.హెచ్.యు.ఏ), వ్యర్థాలను బొమ్మలుగా మార్చేందుకు వినూత్న ఆలోచనల కోసం, "స్వచ్ఛ్-టాయ్‌-కాథాన్‌" పేరుతో ఒక పోటీ ని ప్రారంభించింది.   'స్వచ్ఛ అమృత్ మహోత్సవ్' కింద 2022 సెప్టెంబర్ 17వ తేదీ, సేవా దివస్ నుండి, 2022 అక్టోబర్, 2వ తేదీ స్వచ్ఛతా దివస్ వరకు పక్షం రోజుల పాటు స్వచ్ఛతను ప్రోత్సహించడానికి చేపట్టిన కార్యకలాపాలలో భాగంగా, ఈ పోటీ నిర్వహించడం జరుగుతోంది. 

కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం.ఓ.హెచ్.యు.ఏ) కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి "మై-గోవ్' పోర్టల్‌ లో ఆన్‌-లైన్ వేదికను ఆవిష్కరించి, టూల్‌-కిట్‌ ను విడుదల చేయడం ద్వారా, "స్వచ్ఛ్-టాయ్‌-కాథాన్‌" ను ప్రారంభించారు.  బొమ్మల రూపకల్పన లేదా తయారీలో వ్యర్థాలను ఉపయోగించడం కోసం పరిష్కారాలను అన్వేషించడానికి ఈ పోటీ ప్రయత్నిస్తుంది.

ఈ సందర్భంగా శ్రీ మనోజ్ జోషి మాట్లాడుతూ, ఒకవైపు బొమ్మల కోసం పెరుగుతున్న డిమాండ్‌ ను తీర్చడంతో పాటు, మరోవైపు ఘన-వ్యర్థాల ప్రభావాలను పరిష్కరించడానికి వినూత్న పరిష్కారాలతో, సృజనాత్మక వ్యక్తులు ముందుకు రావాలని కోరారు.

ఐ.ఐ.టీ. గాంధీనగర్‌ కు చెందిన ప్రొఫెసర్ ఉదయ్ అథ్వాంకర్, ప్రొఫెసర్ మనీష్ జైన్, టాయ్ బ్యాంకు కు చెందిన శ్రీమతి విద్యున్ గోయెల్, ఈ సందర్భంగా మాట్లాడుతూ, టాయ్-గేమ్స్ డిజైన్ మరియు కాగ్నిటివ్ సైన్స్ గురించి, బొమ్మల పరిశ్రమపై వాటి ప్రభావం గురించి, వారి అభిప్రాయాలను వివరించారు. 

ప్రొఫెసర్ ఉదయ్ అథవంకర్, (ఐ.ఐ.టి. బొంబాయి కి చెందిన ఇండస్ట్రియల్-డిజైన్-సెంటర్ లో రిటైర్డ్ ప్రొఫెసర్ మరియు హెడ్) ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆటలు ఆడటం ద్వారా పిల్లల సృజనాత్మక ప్రక్రియలను పెంపొందించడం గురించి ప్రధానంగా వివరించారు. టెక్నాలజీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పిల్లలకు బోధించే విధానంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. 

ప్రో. మనీష్ జైన్, (గాంధీనగర్‌ లోని ఐ.ఐ.టి. కి చెందిన సెంటర్-ఫర్-క్రియేటివ్-లెర్నింగ్ లో ప్రధాన సమన్వయ కర్త) మాట్లాడుతూ పిల్లల ఊహా ప్రపంచానికి అనుగుణంగా బొమ్మల తయారీ ప్రారంభిస్తే, అవి వారికి ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ కలిగిస్తాయని అన్నారు.   ఇంట్లోని వ్యర్థ పదార్థాలను పిల్లలకు సైన్స్‌ లోని ప్రాథమిక సూత్రాలను బోధించే బొమ్మలుగా మార్చవచ్చని ఆయన సోదాహరణంగా వివరించారు.

అట్టడుగు వర్గాల పిల్లలకు 'ఆడుకునే హక్కు' ని నిర్ధారించడం కోసం పాత, పడవేసిన బొమ్మలను తిరిగి ఉపయోగించడానికి వీలుగా తయారుచేయడంలో తమ సంస్థ చేస్తున్న కృషి గురించి, టాయ్‌-బ్యాంకు వ్యవస్థాపకురాలు శ్రీమతి విద్యున్ గోయెల్ తెలియజేశారు. 

"స్వచ్ఛ్-టాయ్‌-కాథాన్" ఫ్రేమ్‌-వర్క్‌ గురించి,  కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం.ఓ.హెచ్.యు.ఏ) సంయుక్త కార్యదర్శి, శ్రీమతి రూపా మిశ్రా మాట్లాడుతూ,  సమగ్రమైన విధానంతో పాటు పోటీ తర్వాత ముందుకు వెళ్లే మార్గాన్ని నొక్కి చెప్పారు.  పోటీలో పాల్గొనే పద్ధతులను వివరించే టూల్‌-కిట్‌ గురించి కూడా ఆమె తెలియజేశారు. 

కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం.ఓ.హెచ్.యు.ఏ) కి నాలెడ్జ్-పార్టనర్ గా ఉన్న గాంధీనగర్ లోని ఐ.ఐ.టి. కి చెందిన సెంటర్-ఫర్-క్రియేటివ్-లెర్నింగ్, బోధన మరియు సృజనాత్మకత యొక్క అంశాలపై మద్దతునిస్తుంది. 

"స్వచ్ఛ్-టాయ్‌-కాథాన్" అనే ఈ జాతీయ స్థాయి పోటీలో వ్యక్తులతో పాటు, బృందాలు కూడా పాల్గొనవచ్చు.   ఇది విస్తృతమైన మూడు ఇతివృత్తాల పై ఆధారపడి ఉంటుంది.  (i)  వినోదం మరియు నేర్చుకోడానికి వీలుగా, ఇల్లు, కార్యాలయాలు, పరిసరాల్లోని వ్యర్థాల నుండి బొమ్మల రూపకల్పనతో పాటు, ప్రారంభ నమూనా కోసం ఆలోచనలు;  (ii)  ఉపయోగించుకునిఆనందించడానికి వీలుగా, వ్యర్థాలతో తయారు చేయబడిన పార్కు / బహిరంగ ప్రదేశాలలో ఆడటానికి ఉపయోగించే ఆటల రూపకల్పన, నమూనాల కోసం ఆలోచనలు; (iii)  నూతన మరియు పాత  బొమ్మల కోసం పరిష్కారాలు / పని నమూనాల కోసం ఆలోచనలు.  వ్యర్థాలు మరియు పునర్వినియోగ పదార్ధాలను ఉపయోగించి బొమ్మలు, ప్లే-జోన్‌ ల డిజైన్లు, పర్యావరణ అనుకూలమైన బొమ్మలు,  ప్యాకేజింగ్‌ ల నమూనాలతో పాటు, బొమ్మల పరిశ్రమను పునరాలోచింప చేసే ఇతర వినూత్న ఆలోచనలతో కూడిన ఎంట్రీలను ఈ పోటీకి పంపవచ్చు. 

ఆసక్తిగల అభ్యర్థులు 2022 సెప్టెంబర్, 26వ తేదీ నుంచి 2022 నవంబర్, 11వ తేదీ మధ్య కాలంలో https://innovateindia.mygov.in/swachh-toycathon/  వెబ్‌ సైట్ ద్వారా తమ దరఖాస్తులను నమోదు చేసుకోవచ్చు.   దరఖాస్తుదారులు (i) ఫన్ & లెర్న్;  (ii) యూజ్ & ఎంజాయ్; (iii) న్యూ ఫ్రమ్ ఓల్డ్ అనే మూడు ఇతివృత్తాలలో ఒక దానికి లేదా అన్నింటికీ దరఖాస్తులను సమర్పించవచ్చు. 

పోటీకి అర్హత కలిగిన దరఖాస్తుల ఎంపిక 2022 నవంబర్, 30వతేదీ నాటికి పూర్తవుతుంది.  కాగా, 2022 డిసెంబర్ నాటికి తుది జాబితా పూర్తికాగలదని భావిస్తున్నారు.  (i) ఆలోచనల్లో నూతనత్వం; (ii) రూపకల్పన; (iii) భద్రత; (iii) వ్యర్థ పదార్థాల వినియోగం; (iv) స్కేలబిలిటీ మరియు రెప్లిబిలిటీ (v) భవిష్యత్ వ్యర్థాలు, వాతావరణం, సామాజిక చిక్కులు వంటి అంశాలపై ఎంపిక ప్రమాణాలు ఆధారపడి ఉంటాయి.

ప్రతి కేటగిరీ మరియు నేపథ్య ప్రాంతం నుండి మొదటి మూడు ఎంట్రీలకు జాతీయ స్థాయిలో ధృవీకరణ అందించబడుతుంది.  ఎంపికైన వారికి గాంధీనగర్‌ లోని ఐ.ఐ.టి. లో సృజనాత్మక అభ్యాస వర్క్‌-షాప్‌ లు సులభతరం చేయబడతాయి.  గెలుపొందిన అంకురసంస్థలకు / వ్యక్తులకు కాన్పూర్ లోని ఐ.ఐ.టి. ద్వారా ఇంక్యుబేషన్-సపోర్ట్ అందించబడుతుంది.  అలాగే అవార్డు పొందిన ప్లే-జోన్-డిజైన్లను అమలు చేయడానికి పట్టణ స్థానిక సంస్థలతో అనుసంధానంతో పాటు, అవార్డు పొందిన డిజైన్లను ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి బొమ్మల పరిశ్రమతో అనుసంధానం చేయడం జరుగుతుంది. 

మరిన్ని వివరాల కోసం https://innovateindia.mygov.in/swachh-toycathon/  వెబ్-సైట్ ను సందర్శించండి:

*****


(Release ID: 1862390) Visitor Counter : 154