ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘ముందస్తు ప్యాకింగ్-లేబుల్‌’ చేయబడిన వస్తువులపై జీఎస్టీ వర్తింపుమీద తరచూ తలెత్తే ప్రశ్నలు

Posted On: 18 JUL 2022 9:12AM by PIB Hyderabad

   వస్తుసేవల పన్ను మండలి (జీఎస్టీ కౌన్సిల్‌) 47వ సమావేశం సిఫారసుల మేరకు వస్తుసేవల పన్ను (జీఎస్టీ) విధింపు శాతాల్లో మార్పులు నేటి నుంచి… అంటే- 2022 జూలై 18 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ మార్పులలో నమోదిత బ్రాండుగల నిర్దిష్ట వస్తువులపై జీఎస్టీ విధింపు కూడా ఒకటిగా ఉంది. ఈ మేరకు  నమోదిత బ్రాండుతోగల లేదా “ముందస్తు ప్యాకింగ్‌, లేబుల్‌ కలిగి ఉన్న” వస్తువులపై జీఎస్టీ విధింపునకు సంబంధించి అమలు చేయదగిన హక్కు లేదా చర్య తీసుకోదగిన అంశాలపై కోర్టులో అభ్యర్థన దాఖలుకు వీలున్నపుడు ఆయా వస్తువులపై జీఎస్టీ వర్తిస్తుంది.

   ముఖ్యంగా (పన్ను నిబంధనల్లోని 1 నుంచి 21వరకుగల అధ్యాయాల పరిధిలోకి వచ్చే నిర్దిష్ట వస్తువులు) పప్పులు, పిండి, తృణధాన్యాలు వగైరాలపై 2022 జూలై 13 నాటి నం.6/2022-కేంద్ర పన్ను (శాతం) నోటిఫికేషన్‌తోపాటు ఎస్‌జీఎస్టీ, ఐజీఎస్టీ నోటిఫికేషన్ల ద్వారా తెలియబరచిన ఈ మార్పు పరిధిపై స్పష్టత కోరుతూ కొన్ని వినతులు అందాయి.

   ఈ నేపథ్యంలో ఇవాళ… 2022 జూలై 18 నుంచి అమల్లోకి వచ్చిన “ముందస్తు ప్యాకింగ్‌-లేబుల్‌” చేయబడిన వస్తువులపై జీఎస్టీ విధింపు మీద తలెత్తే కొన్ని సందేహాలు/ప్రశ్నలకు స్పష్టీకరణలను దిగువన చూడవచ్చు:

సం.

ప్రశ్న

స్పష్టీకరణ

1.

‘ముందస్తు ప్యాకింగ్‌-లేబుల్‌ చేయబడిన’ వస్తువులపై 2022 జూలై 18 నుంచి అమలులోకి వచ్చిన పన్ను విధింపు పద్ధతి మార్పు ఏమిటి?

2022 జూలై 18కి ముందు నిర్దిష్ట వస్తువులను ఒక యూనిట్ కంటైనర్‌లో ప్యాకింగ్‌ చేసి.. వాటికి ఒక నమోదిత బ్రాండ్ పేరు కలిగి ఉన్నపుడు లేదా బ్రాండ్ పేరు కలిగి ఉన్నప్పుడు వాటిపై జీఎస్టీ వర్తించేది. దీనికి సంబంధించి అమలు చేయదగిన హక్కు లేదా చర్య తీసుకోదగిన అంశాలపై కోర్టులో అభ్యర్థన దాఖలుకు వీలున్నపుడు ఆయా వస్తువులపై జీఎస్టీ వర్తించేది. ఈ నేపథ్యంలో 2022 జూలై 18 నుంచి అమలులోకి వచ్చిన నిబంధన మేరకు ఇందులో మార్పు వస్తుంది. తదుపరి ప్రశ్నలకు ఇచ్చిన వివరణల ప్రకారం విధంగా ‘లీగల్ మెట్రాలజీ చట్టం’లోని నిబంధనల పరిధిలోకి వచ్చే “ముందస్తు ప్యాకింగ్‌-లేబుల్‌ చేయబడిన” వస్తువులపై జీఎస్టీ వర్తిస్తుంది. ఉదాహరణకు, పప్పులు, బియ్యం, గోధుమలు, పిండి (ఆటా) తృణధాన్యాలు వంటి వస్తువులు బ్రాండ్‌ రూపంలో, యూనిట్ కంటైనర్‌లో ప్యాక్ చేసినప్పుడు (పైన పేర్కొన్న విధంగా) గతంలో 5 శాతం వంతున జీఎస్టీ విధించబడేది. అయితే, 18.7.2022 నుంచి కొత్త నిబంధన అమలులోకి వచ్చినందున ఈ వస్తువులు ఇతరత్రా ప్యాకింగ్‌, లేబుల్‌ చేయబడితే ఇకపై జీఎస్టీ విధింపు పరిధిలోకి వస్తాయి. అంతేకాకుండా “ముందస్తు ప్యాకింగ్‌-లేబుల్‌ చేయబడిన” పెరుగు, లస్సీ, పేలాలు (పాప్‌కార్న్‌) తదితర కొన్ని ఇతర వస్తువులు కూడా 2022 జూలై 18 నుంచి 5శాతం జీఎస్టీ విధింపు పరిధిలోకి వస్తాయి.

   ముఖ్యంగా బ్రాండ్‌ గుర్తింపుగల నిర్దిష్ట వస్తువులపై జీఎస్టీకి సంబంధించి “ముందస్తు ప్యాకింగ్‌-లేబుల్‌ చేయబడిన” వస్తువులపై పన్ను విధింపు పద్ధతిలో మార్పు ఇదే.

   [దయచేసి నం.6/2022-కేంద్ర పన్ను (శాతం) నోటిఫికేషన్‌తోపాటు ఎస్‌జీఎస్టీ, ఐజీఎస్టీ చట్టాల కింద సంబంధిత నోటిఫికేషన్లను చూడండి]

2.

పప్పులు, తృణధాన్యాలు, పిండి వంటి ఆహార పదార్థాలపై జీఎస్టీ విధింపు నిమిత్తం “ముందస్తు ప్యాకింగ్‌- లేబుల్‌ చేయబడిన” నిర్వచన పరిధి ఏమిటి?

జీఎస్టీ విధింపు నిమిత్తం  “ముందస్తు ప్యాకింగ్‌- లేబుల్‌ చేయబడిన” అంటే- ‘లీగల్ మెట్రాలజీ చట్టం-2009 సెక్షన్ 2లోని క్లాజ్ (l)లో నిర్వచించబడిన ముందస్తు ప్యాకింగ్- లేబుల్‌ చేయబడిన వస్తువు అని అర్థం. ఈ మేరకు ప్యాకింగ్‌ లేదా లేబుల్‌ చేయబడిన సదరు వస్తువు ప్యాకింగ్‌ మీద ‘లీగల్ మెట్రాలజీ చట్టంలోని నిబంధనలు- సంబంధిత నియమాలు నిర్దేశిస్తున్న విధంగా వివరాల ప్రకటన తప్పనిసరిగా ఉండాలి.

 

లీగల్ మెట్రాలజీ చట్టంలోని సెక్షన్ 2లోగల క్లాజ్ (l) కింది విధంగా పేర్కొంటోంది:

(l) “ముందస్తు ప్యాకింగ్‌ చేయబడిన” అంటే- సీలు చేసిందా కాదా అన్నదానితో నిమిత్తం లేకుండా కొనుగోలుదారు పరోక్షంలో నిర్దిష్ట పరిమాణంతో ఏ రూపంలోనైనా ముందస్తు ప్యాకింగ్‌ చేసిన వస్తువు అని అర్థం.

   ఆ మేరకు కింది రెండు లక్షణాలు ఉన్నట్లయితే జీఎస్టీ వర్తిస్తుంది:

  1.  ముందుగా ప్యాకింగ్‌ చేయబడటం; అలాగే
  2.  లీగల్‌ మెట్రాలజీ చట్టం-2009 (1 ఆఫ్ 2010) దానికింద రూపొందిన నిబంధనల ప్రకారం నిర్దిష్ట ప్రకటన ముద్రించబడిదిగా ఉండాలి.

   అయితే, లీగల్ మెట్రాలజీ చట్టం 2009 (1 ఆఫ్ 2010) ప్రకారం డిక్లరేషన్(లు)/నిబంధనానుసరణ(లు) అవసరం లేని ప్యాకేజీలో నిర్దిష్ట వస్తువులు సరఫరా చేసినా, సదరు ప్యాకింగ్‌ను జీఎస్టీ విధింపు వర్తించే “ముందస్తు ప్యాకింగ్‌-లేబుల్‌ చేయబడిన”దిగా పై చట్టం, దానికింద రూపొందిన నియమాలు పరిగణించవు.

   ఆహార పదార్థాల (పప్పులు, బియ్యం, గోధుమలు, పిండి, తృణధాన్యాలు వగైరా) విషయంలో- 25 కిలోలు (25 లీటర్లు) పరిమాణంలోగల వస్తువులు ప్యాకింగ్‌-లేబుల్‌ చేయబడితే... లీగల్‌ మెట్రాలజీ చట్టం-2009, దానికింద రూపొందిన ఇతర నిబంధనలతోపాటు లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) రూల్స్-2011లోని నిబంధన 3(ఎ).. తదుపరి రూపొందిన నియమాల ప్రకారం.. అవి “ముందస్తు ప్యాకింగ్‌-లేబుల్‌ చేయబడిన” వస్తువుల పరిధిలోకి వస్తాయి.

3.

లీగల్‌ మెట్రాలజీ చట్టం, దానికింద రూపొందిన ఇతరత్రా నియమాల కింద కల్పించిన వివిధ మినహాయింపులను పరిగణనలోకి తీసుకుంటే జీఎస్టీ వర్తింపు పరిధి ఎంతవరకూ ఉంటుంది?

ఆహార పదార్థాల (పప్పులు, బియ్యం, గోధుమలు, పిండి, తృణధాన్యాలు వగైరా) విషయంలో- లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) నిబంధ‌న‌లు-2011లోని అధ్యాయం-IIలోగ‌ల నియ‌మం 3 (ఎ) మేరకు...  25 కిలోలు లేదా 25 లీటర్లకు మించి వస్తువు ప్యాకింగ్‌ చేసినప్పుడు 6వ నిబంధన ప్రకారం డిక్లరేషన్ చేయవలసిన అవసరం లేదు. దీని ప్రకారం, 25 కిలోలు లేదా అంతకన్న తక్కువ పరిమాణంలో ముందస్తు ప్యాకింగ్‌-లేబుల్ చేయబడిన నిర్దిష్ట వస్తువులకు జీఎస్టీ విధింపు వర్తిస్తుంది.

   ఉదాహరణ: వినియోగదారుకు నేరుగా విక్రయించే ముందస్తు ప్యాకింగ్‌ చేసిన అటాపై జీఎస్టీ విధింపు వర్తిస్తుంది. అయితే, అదే వస్తువు 30 కిలోల ప్యాకింగ్‌లో సరఫరా చేయడంపై జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంటుంది.

   ఈ విధంగా 25 కిలోలు/25 లీటర్లకు మించిన పరిమాణంలో ఈ వస్తువులు [తృణధాన్యాలు, పప్పులు, పిండి వగైరా] ఒకే ప్యాకింగ్‌ద్వారా సరఫరా చేయబడితే అది ముందస్తు ప్యాకింగ్‌-లేబుల్ చేయబడిన వస్తువుల పరిధిలోకి రాదని, కాబట్టి జీఎస్టీ విధింపు ఉండదని స్పష్టం చేయబడింది.

4.

ఏదైనా ఒక ప్యాకేజీలో చిల్లర విక్రయానికి ఉద్దేశించిన వస్తువు అనేక ప్యాకెట్లు ఉంటే- ఉదాహరణకు… 10 కిలోల వంతున పిండి ప్యాకెట్లు ఒక పెద్ద ప్యాకింగ్‌లో ఉన్నపుడు జీఎస్టీ వర్తిస్తుందా?

 

వర్తిస్తుంది… వినియోగదారుకు నేరుగా విక్రయానికి ఉద్దేశించిన ఒక్కొక్కటి 10 కిలోలుగల 10 ప్యాకెట్లను ఒకే ప్యాకింగ్‌ కింద సరఫరా చేస్తే జీఎస్టీ విధించబడుతుంది. ఒక్కొక్కటి 10 కిలోలున్న ఈ ప్యాకెట్లు వినియోగదారుకు నేరుగా విక్రయించేవే అయినా, ఆ ప్యాకెట్లుగల పెద్ద ప్యాకేజీని తయారీదారు తన పంపిణీదారు ద్వారా విక్రయించి ఉండవచ్చు.

   అయితే, ఒకవేళ 50 కిలోల బియ్యం ఒకే సంచిలో ప్యాకింగ్‌ చేసినపుడు- అది లీగల్‌ మెట్రాలజీ (ప్యాకేజ్డ్‌ కమాడిటీస్‌) రూల్స్‌-2011లోని 24వ నిబంధన మేరకు డిక్లరేషన్‌ చేయాల్సినదే అయినప్పటికీ... అలాంటి టోకు విక్రయ ప్యాకేజీ ముందస్తు ప్యాకింగ్‌-లేబుల్‌ చేయబడి, జీఎస్టీ విధించాల్సిన వస్తువు కిందకు రాదు.

5.

అటువంటి సరఫరాలపై ఏ దశలో జీఎస్టీ వర్తిస్తుంది.. అంటే- చిల్లర విక్రేతకు అమ్మే టోకు వర్తకుడికి తయారీ/ఉత్పత్తిదారు సరకు అమ్మినపుడు వర్తిస్తుందా?

అటువంటి వస్తువులను ఎవరైనా వ్యక్తి సరఫరా చేసినప్పుడల్లా జీఎస్టీ వర్తిస్తుంది… అంటే-  తయారీదారు నుంచి పంపిణీదారుకు; పంపిణీదారు నుంచి టోకు/చిల్లర వర్తకుడికి, వారిద్వారా వినియోగదారుకు సరఫరా చేసినపుడు వర్తిస్తుంది. అలాగే సరఫరాదారులు తమపై విధించిన జీఎస్టీలోని ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ పొందడానికి తయారీదారు/టోకు వర్తకుడు/చిల్లర విక్రేతలు అర్హులే.

   నిర్దిష్ట మినహాయింపు లేదా కంపోజిషన్ స్కీమ్‌ పరిధిలోగల సరఫరాదారు సాధారణ పద్ధతిలో మినహాయింపునకు లేదా సమ్మిశ్రిత పన్ను శాతాలలో ఏది వర్తించేదైతే దానికి అర్హులవుతారు.

6.

ఒక చిల్లర వర్తకుడు 25 కిలోలు/లీటర్ల పరిమాణంగల ప్యాకేజీలలో కొనుగోలు చేసి, ఆ వస్తువులను ఏదైనా కారణంతో వాటిని తన దుకాణంలో మరింత చిన్న పరిమాణాల్లో విక్రయిస్తే పన్ను చెల్లించాల్సి ఉంటుందా?

అటువంటి వస్తువులు ముందస్తు ప్యాకింగ్‌-లేబుల్‌ చేయబడిన ప్యాకెట్లలోనివైతే వాటిని విక్రయించినప్పుడు జీఎస్టీ వర్తిస్తుంది. ముందస్తు ప్యాకింగ్‌-లేబుల్‌ చేయబడిన ప్యాకేజీని చిల్లర విక్రేతకు పంపిణీదారు/తయారీదారు విక్రయించినప్పుడు జీఎస్టీ వర్తిస్తుంది. అయితే, ఏదైనా కారణం చేత, రిటైలర్ అటువంటి ప్యాకేజీ నుంచి వస్తువును వేరుచేసి, లూజుగా సరఫరా చేస్తే జీఎస్టీ విధింపు పరిధిలోకి రాదు.

7.

అటువంటి ముందస్తు ప్యాకింగ్‌-లేబుల్‌ చేయబడిన వస్తువులను పారిశ్రామిక వినియోగదారులు లేదా సంస్థాగత వినియోగదారుల వాడకం కోసం సరఫరా చేస్తే పన్ను చెల్లించాలా?

లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) రూల్స్-2011లోని అధ్యాయం-IIలోని నిబంధన 3 (సి) ప్రకారం పారిశ్రామిక వినియోగదారు లేదా సంస్థాగత వినియోగదారుల వాడకానికి సంబంధించిన ముందస్తు ప్యాకింగ్‌-లేబుల్‌ చేయబడిన వస్తువులను లీగల్ మెట్రాలజీ చట్టం పరిధి నుంచి మినహాయించారు. కాబట్టి పైన పేర్కొన్న నిబంధన 3(సి) కింద మినహాయింపు వర్తించే తరహాలో సరఫరా చేస్తే జీఎస్టీ విధించదగిన ముందస్తు ప్యాకింగ్‌-లేబుల్‌ చేయబడిన వస్తువులుగా పరిగణించబడవు.

8.

‘ఎక్స్‌’ అనే వ్యక్తి ఒక రైస్‌ మిల్లు యజమాని. అతడు లీగల్ మెట్రాలజీ చట్టం, తదనుగుణ నిబంధనల ప్రకారం  ప్రకటన ఏదీ చేయకుండా (అలా చేయాలని సదరు చట్టం నిర్దేశిస్తున్నప్పటికీ) 20 కిలోల బియ్యం ప్యాకెట్లను విక్రయించేట్లయితే వాటిని ముందస్తు ప్యాకింగ్‌-లేబుల్‌ చేయబడిన వస్తువులుగా పరిగణించి, జీఎస్టీ విధించవచ్చా?

విధించవచ్చు. అటువంటి ప్యాకేజీలు జీఎస్టీ విధించదగిన ముందస్తు ప్యాకింగ్‌-లేబుల్‌ చేయబడిన వస్తువులుగా పరిగణించబడతాయి, ఎందుకంటే లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) రూల్స్-2011 (నిబంధన 6) ప్రకారం డిక్లరేషన్ తప్పనిసరి. కాబట్టి ‘ఎక్స్‌’ అనే రైస్‌ మిల్లు యజమాని సదరు బియ్యం ప్యాకేజీ(ల) సరఫరాపై జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

9.

దీనిపై ఇతరత్రా అంశాలేవైనా ఉన్నాయా?

లీగల్ మెట్రాలజీ చట్టం, తదనుగుణంగా రూపొందిన నిబంధనలన్నీ మినహాయింపు నిమిత్తం (పైన పేర్కొన్నట్లు) నిర్దిష్ట  ప్రమాణం(లు) నిర్దేశించాయి. అలాగే  లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) రూల్స్-2011లోని 26వ నిబంధన ప్రకారం కొన్ని మినహాయింపులు లభిస్తాయి. కాబట్టి వీటికి అనుగుణంగా మినహాయింపు పొందేటట్లుగా సరఫరా చేస్తే ఆ వస్తువులు జీఎస్టీ విధించదగిన ముందస్తు ప్యాకింగ్‌-లేబుల్‌ చేయబడినవిగా పరిగణనలోకి రావని స్పష్టం చేయబడింది.

***(Release ID: 1842459) Visitor Counter : 185