ప్రధాన మంత్రి కార్యాలయం
“అరుణ్ జైట్లీ తొలి స్మారకోపన్యాసానికి” హాజరైన ప్రధానమంత్రి
“రాబోయే కొన్ని సంవత్సరాల కాలం పాటు భారతీయుల హృదయాల్లో షింజో అబే నిలిచి ఉంటారు”.
“అరుణ్ జైట్లీ వ్యక్తిత్వం వైవిధ్యభరితమైనది, ఆయన అందరితో స్నేహపూర్వకంగా ఉండే వారు. ఆయన లేని లోటు ప్రతీ ఒక్కరిలోనూ ఉంది”.
“సమ్మిళితత్వం లేకుండా వాస్తవ వృద్ధి; వృద్ధి లేకుండా సమ్మిళితత్వ లక్ష్యం సాధ్యం కావన్నది ప్రభుత్వాధినేతగా నా 20 సంవత్సరాల అనుభవ సారం”.
“గత 8 సంవత్సరాల్లో జరిగిన సమ్మిళితత్వ వేగం, పరిధి అసాధారణం”
“నిర్బంధంతో సంస్కరణల కన్నా నిర్ణయాత్మకంగా సంస్కరణలు చేపట్టడానికి దోహదపడే విధంగా రాబోయే 25 సంవత్సరాల కాలానికి రోడ్ మ్యాప్ ను ఇప్పుడు భారతదేశం సిద్ధం చేస్తోంది”.
“సంస్కరణలు తప్పని దుశ్చర్యగా కాకుండా ఉభయతారకమైన విజయానికి మార్గంగా మేం పరిగణిస్తాం”.
“ప్రజానాడే మా విధాన నిర్ణయాలకు పునాది”
“జనాకర్షక ఒత్తిడులు మా విధానాలపై పడడాన్ని మేం అంగీకరించం”
“ప్రైవేటు రంగాన్ని ప్రగతిలో భాగస్వామి అయ్యేలా ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమయింది. మేం ఆ దిశగానే ముందుకు నడుస్తున్నాం”.
Posted On:
08 JUL 2022 9:12PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సింగపూర్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రి థర్మన్ షణ్ముగ రత్నం ఇచ్చిన తొలి “అరుణ్ జైట్లీ స్మారకోపన్యాసానికి” (ఎజెఎంఎల్) హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి కూడా మాట్లాడారు.
శుక్రవారంనాడు మరణించిన జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబేతో తనకు గల సన్నిహిత మైత్రిని ఈ సందర్భంగా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. అబేకు శ్రద్ధాంజలి ఘటిస్తూ తనకు ఇది కోలుకోలేని నష్టమని, అత్యంత బాధాకరమని అన్నారు. అబేను భారతదేశానికి వాస్తవ స్నేహితునిగా అభివర్ణిస్తూ అబే అధికార సమయంలో ఉభయ దేశాల మధ్య వారసత్వ భాగస్వామ్యం ఆధారంగా ద్వైపాక్షిక సంబంధాలు విస్తరించాయన్నారు. జపాన్ సహాయంతో చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా రాబోయే కాలంలో అబే భారత ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారని చెప్పారు.
తన మరో స్నేహితుడు శ్రీ అరుణ్ జైట్లీని కూడా ప్రధానమంత్రి ఎంతో ప్రేమపూర్వకంగా గుర్తు చేసుకున్నారు. “పాత రోజులు గుర్తు చేసుకున్నట్టయితే ఎన్నోఅంశాలు, సంఘటనలు నా మనసులో మెదులుతాయి. ఆయన వాగ్ధాటి అందరికీ తెలిసిందే. ఆయన వ్యక్తిత్వం పూర్తిగా వైవిధ్యభరితమైనది, ఎవరితోనైనా ప్రేమపూర్వకంగా వ్యవహరించే స్వభావం ఆయనది” అని ప్రధానమంత్రి చెప్పారు. శ్రీ అరుణ్ జైట్లీ ఏకవాక్య భావ వ్యక్తీకరణలు కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. శ్రీ అరుణ్ జైట్లీకి నివాళి అర్పిస్తూ ప్రతి ఒక్కరూ ఆయన లేని లోటును గుర్తు చేసుకుంటారని ప్రధానమంత్రి చెప్పారు.
తొలి అరుణ్ జైట్లీ స్మారకోపన్యాసం ఇస్తున్నందుకు సింగపూర్ ప్రభుత్వం సీనియర్ మంత్రి థర్మన్ షణ్ముగరత్నానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆయనకు గల లోతైన మేథస్సును, పరిశోధనను, పరిశోధనలో స్థానిక స్పర్శను ప్రధానమంత్రి కొనియాడారు. స్మారకోపన్యాసానికి ఎంచుకున్న టాపిక్ “సమ్మిళితత్వం ద్వారా వృద్ధి, వృద్ధి ద్వారా సమ్మిళితత్వం” అన్నదే తమ ప్రభుత్వ అభివృద్ధి విధానానికి పునాది అని చెప్పారు. “తేలికపాటి మాటల్లో చెప్పాలంటే సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అన్నదే ఈ థీమ్” అని ఆయన వివరించారు.
నేటి విధానకర్తలు ఎదుర్కొంటున్న సవాళ్లు, సందిగ్ధాలను ఈ థీమ్ ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. “సమ్మిళితత్వం లేకుండానే సరైన వృద్ధి సాధ్యమా, సరైన వృద్ధి లేకుండా సమ్మిళితత్వం సాధ్యమా” అని ప్రశ్నిస్తూ “సమ్మిళితత్వం లేకుండా వాస్తవ వృద్ధి సాధ్యం కాదు. వాస్తవ వృద్ధి లేకుండా సమ్మిళితత్వం సాధ్యం కాదు అనేదే ప్రభుత్వాధినేతగా తన 20 సంవత్సరాల అనుభవ సారం అని ప్రధానమంత్రి చెప్పారు. అందుకే మేం సమ్మిళితత్వం ద్వారా వృద్ధి బాటను ఎంచుకున్నాం, ప్రతీ ఒక్కరినీ కలిపేందుకు కృషి చేస్తున్నాం” అని సమాధానం చెప్పారు.
గత 8 సంవత్సరాల కాలంలో తాము సాధిస్తున్న సమ్మిళితత్వం వేగం, పరిధి ప్రపంచంలోనే అసాధారణమని ఆయన తెలిపారు. 9 కోట్ల మంది పైగా మహిళలకు గ్యాస్ కనెక్షన్లు, 10 కోట్ల మంది పైగా పేదలకు మరుగుదొడ్లు, 45 కోట్లకు పైబడిన జన్ ధన్ ఖాతాలు, పేదలకు 3 కోట్ల పక్కా గృహాలే అందుకు ఉదాహరణ అని ఆయన అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 50 కోట్ల మంది పైగా ప్రజలకు రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తున్న విషయం తెలియచేస్తూ గత 4 సంవత్సరాల కాలంలో 3.5 కోట్ల మందికి పైగా ఈ సదుపాయం ఉపయోగించుకుని ఉచిత చికిత్స పొందారని చెప్పారు. సమ్మిళితత్వానికి ఇస్తున్న ప్రాధాన్యంతో డిమాండు పెరిగిందని, మరింత మెరుగైన వృద్ధి సాధ్యమయిందని, భారత జనాభాలో సుమారు మూడింట ఒక వంతు మంది నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ పరిధిలోకి వచ్చారని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ దేశంలో ఆరోగ్య రక్షణ రంగాన్ని పరివర్తింపచేసిందంటూ దేశంలో జరుగుతున్న ఆరోగ్య రక్షణ మౌలిక వసతుల విస్తరణ గురించి వివరించారు. “2014 సంవత్సరానికి ముందు 10 సంవత్సరాల కాలంలో సగటున 50 వైద్య కళాశాలల ఏర్పాటు జరిగితే గత 7-8 సంవత్సరాల కాలంలోనే 209 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి” అని ప్రధానమంత్రి వెల్లడించారు. దీనికి తోడు “గత 7-8 సంవత్సరాల కాలంలో అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యా సీట్లు 75% పెరిగాయి. ఇప్పుడు వైద్యవిద్యా సీట్ల వార్షిక వృద్ధి రెట్టింపవుతోంది” అని వివరించారు. దీన్ని బట్టి సంబంధిత రంగంలో వృద్ధిపై సమ్మిళితత్వ పథకం ప్రభావం ఎంత ఉందో ఈ గణాంకాలు తెలుపుతాయి అన్నారు.
5 లక్షల కామన్ సర్వీస్ కేంద్రాలు, యుపిఐ, పిఎం స్వనిధి పథకం ద్వారా వీధి వ్యాపారులను చేర్చడం ద్వారా సమ్మిళితత్వం పరిధిని పెంచామని ప్రధానమంత్రి అన్నారు. అలాగే ఆకాంక్షాపూరిత జిల్లాలు, ఎన్ఇపిలోమాతృభాషలో విద్య, ఉడాన్ పథకం ద్వారా విమానయానం అందరికీ అందుబాటులోకి తేవడం వంటి చర్యలన్నీసమ్మిళితత్వానికి వృద్ధికి దోహదపడుతున్నాయి అని చెప్పారు. హర్ ఘర్ జల్ ద్వారా 6 కోట్ల కుళాయి కనెక్షన్లు అందించడం, స్వమిత్ర పథకం ద్వారా సమాజంలో నిరాదరణకు గురవుతున్న వర్గాలవారికి ఆస్తి హక్కుల కల్పన వంటి చర్యల ద్వారా జరిగిన భారీ సమ్మిళితత్వం గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇప్పటికే 80 లక్షలకు పైబడిన ప్రాపర్టీ కార్డులు ఇవ్వడం జరిగిందని, వాటి సహాయంతో వారికి రుణసదుపాయం అందుబాటులోకి వచ్చిందని ఆయన అన్నారు.
“నిర్బంధంతో సంస్కరణలకు బదులు కట్టుబాటుతో సంస్కరణలు ధ్యేయంతో రాబోయే 25 సంవత్సరాల కాలానికి సంస్కరణల రోడ్ మ్యాప్ భారతదేశం తయారుచేస్తోంది. ప్రభుత్వానికి ఏ ఇతర మార్గాంతరం లేనప్పుడే గత ప్రభుత్వాలు భారీ సంస్కరణలు చేపట్టేవి. కాని మేం సంస్కరణను తప్పనిసరి దుశ్చర్యగా కాకుండా ఉభయతారకమైన చర్యగా పరిగణిస్తాం; మాకు జాతి ప్రయోజనం, ప్రజా ప్రయోజనమే ప్రదానం” అన్నారు. “సంస్కరణలపై ప్రభుత్వ వైఖరిని ఆయన వివరిస్తూ ప్రజల నాడే మా విధాన నిర్ణయాలకు పునాది. మేం ఎక్కువ మంది ప్రజల మాట వింటాం; వారి అవసరాలు, ఆకాంక్షలు తెలుసుకుంటాం. అందుకే జనాకర్షక ఒత్తిడులు మా విధానాలపై ప్రసరించడాన్ని మేం అనుమతించం” అని చెప్పారు.
కనిష్ఠ ప్రభుత్వం, గరిష్ఠ పాలన వైఖరి అద్భుత ఫలితాలు ఇస్తోంది అని ప్రధానమంత్రి తెలిపారు. “కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అందుకు ఉదాహరణగా చూపారు. మన దేశంలో ప్రైవేటు కంపెనీలు అద్భుతమైన కృషి చేశా యి. కాని పురోగతిలో భాగస్వామ్య వైఖరితో ప్రభుత్వ యంత్రాంగం యావత్తు వారి వెనుక ఉంది. అలాగే నేడు ప్రపంచంలో అత్యాధునిక అంతరిక్ష సేవలందించే దేశాల్లో భారతదేశం ఒకటిగా నిలిచింది. ఈ విభాగంలో కూడా ప్రైవేటు రంగం చాలా చక్కని కృషి చేస్తోంది. వారి వెనుక కూడా “పురోగతిలో భాగస్వామ్య” వైఖరితో ప్రభుత్వం సంపూర్ణ శక్తిని అందిస్తోంది” అన్నారు. “నేడు ప్రైవేటు రంగం లేదా ప్రభుత్వ రంగానికి మాత్రమే ఆధిపత్యం ఉన్న నమూనాలు అంతరించిపోతున్నాయి. పురోగతిలో భాగస్వామిగా ప్రైవేటు రంగాన్ని ప్రభుత్వం వారిని ప్రోత్సహించే సమయం ఇది, ఆ దిశగానే మేం ముందడుగేస్తున్నాం” అని చెప్పారు.
పర్యాటకం గురించిన ఆలోచన కూడా ఇప్పుడు దేశం అంతా విస్తరిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. 75 చారిత్రక ప్రాధాన్యం గల ప్రదేశాల్లో ఇటీవల జరిగిన యోగా దినోత్సవ వేడుకలు కూడా కొత్త పర్యాటక ప్రదేశాలను ప్రజలకు పరిచయం చేశాయని ఆయన చెప్పారు.
ఆజాదీ కా అమృత్ కాలం కూడా దేశం ముందుకు ఎన్నో అవకాశాలు అందుబాటులోకి తెచ్చింది, లక్ష్యం సాధించాలనే మా సంకల్పం చెక్కు చెదరనిది అన్నారు.
“సమ్మిళితత్వం ద్వారా వృద్ధి; వృద్ధి ద్వారా సమ్మిళితత్వం” థీమ్ తో జరిగిన అరుణ్ జైట్లీ తొలి స్మారకోపన్యాసం సింగపూర్ ప్రభుత్వ సీనియర్ మంత్రి థర్మన్ షణ్ముగరత్నం ఇచ్చారు. ఆ ఉపన్యాసం అనంతరం జరిగిన ప్యానెల్ గోష్ఠిలో మథియాస్ కార్మన్ (ఒఇసిడి సెక్రటరీ-జనరల్), అర్వింద్ పనగడియా (ప్రొఫెసర్, కొలంబియా విశ్వవిద్యాలయం) పాల్గొన్నారు.
జాతికి స్వర్గీయ అరుణ్ జైట్లీ అందించిన సేవలకు గుర్తింపుగా ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ తొలి “ఆరుణ్ జైట్లీ స్మారకోపన్యాసం” నిర్వహించాయి.
జూలై 8 నుంచి 10 వరకు నిర్వహించిన కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్ లో (కెఇసి) పాల్గొన్న ప్రతినిధులతో కూడా ప్రధానమంత్రి సంభాషించారు.
(Release ID: 1840548)
Visitor Counter : 153
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam