ప్రధాన మంత్రి కార్యాలయం
గాంధీనగర్ లో వివిధ సహకార సంస్థల నాయకుల సెమినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
కలోల్ లో ఇఫ్కో నిర్మించిన నానో యూరియా ప్లాంట్ ప్రారంభించిన ప్రధానమంత్రి
“గ్రామాల స్వయంసమృద్ధికి మంచి మాధ్యమం సహకారం, ఆత్మనిర్భర్ భారత్ శక్తి అందులో ఉంది”
“అధిక ధరలు; మహమ్మారి, యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్ లేకపోవడం వంటి ప్రతికూలతలేవీ రైతును ఇబ్బంది పెట్టలేదు”
“గత ఏడాది రూ.1.60 లక్షల కోట్లు ఎరువుల సబ్సిడీగా కేంద్రప్రభుత్వం అందించింది; ఈ ఏడాది ఈ సబ్సిడీ రూ.2 లక్షల కోట్లు”
“రైతుల ప్రయోజనం కోసం ఏవేవి కావాలో అవి చేశాం, మేం దేశంలో రైతు మరింత బలపడేలా చేస్తూనే ఉంటాం”
“దేశం ఎదుర్కొంటున్న అనేక కష్టాలకు పరిష్కారం స్వయం-సమృద్ధి. సహకారం స్వయం-సమృద్ధికి చక్కని నమూనా”
“అమృత కాల స్ఫూర్తితో సహకార స్ఫూర్తిని అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది”
Posted On:
28 MAY 2022 6:00PM by PIB Hyderabad
గాంధీనగర్ లోని మహాత్మా మందిర్ వద్ద “సహకార్ సే సమృద్ధి” కార్యక్రమం సందర్భంగా వివిధ సహకార సంస్థల నాయకుల సెమినార్ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కలోల్ లో ఇఫ్కో నిర్మించిన నానో యూరియా (లిక్విడ్) ప్లాంటును కూడా ఆయన ప్రారంభించారు. గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, కేంద్ర మంత్రులు శ్రీ అమిత్ షా, డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ, పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, గుజరాత్ ప్రభుత్వ మంత్రులు, సహకార రంగానికి చెందిన నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.
మహాత్మా మందిర్ వద్దకు వచ్చిన వేలాది మంది రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గ్రామాల స్వయం-సమృద్ధికి సహకారం ఒక అద్భుతమైన మాధ్యమమన్నారు. పూజ్య బాపూ, పటేల్ ఇద్దరూ గ్రామాలకు స్వయం-సమృద్ధి తెచ్చే మార్గం చూపించారని ఆయన చెప్పారు. నేడు తాము అదే బాటలో పయనిస్తూ గ్రామ సహకార నమూనా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సహకార సంబంధిత కార్యకలాపాలన్నీ అమలుపరిచేందుకు గుజరాత్ లోని ఆరు గ్రామాలను ఎంపిక చేసినట్టు తెలిపారు.
కలోల్ లో ఇఫ్కో నిర్మించిన నానో యూరియా (లిక్విడ్) ప్లాంట్ను ప్రారంభించడం పట్ల ప్రధానమంత్రి ఆనందం ప్రకటించారు. ఒక పూర్తి బస్తా యూరియా ఇప్పుడు అరలీటర్ బాటిల్ గా మారిందని, దీని వల్ల రైతుకు రవాణా, నిల్వ భారం తగ్గిందని ఆయన చెప్పారు. ఈ ప్లాంట్ రోజుకి 500 ఎంఎల్ పరిమాణం గల 1.5 లక్షల సీసాలు ఈ ప్లాంట్ ఉత్పత్తి చేస్తుందంటూ రాబోయే కాలంలో దేశంలో అలాంటి ప్లాంట్ లు మరో 8 నిర్మాణం కానున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. “ఇది యూరియాపై మన విదేశీ ఆధారనీయతను తగ్గిస్తుంది. ఎంతో విలువైన ధనం కూడా ఆదా అవుతుంది. ఈ ఇన్నోవేషన్ యూరియాకు మాత్రమే పరిమితం కాదన్న నమ్మకం నాకుంది. భవిష్యత్తులో మన రైతులకు ఇతర నానో ఎరువులు కూడా అందుబాటులోకి వస్తాయి” అన్నారు.
భారతదేశం ప్రపంచంలో రెండో పెద్ద యూరియా వినియోగదారు, మూడో పెద్ద ఉత్పత్తిదారు అని ప్రధానమంత్రి తెలిపారు. 2014లో తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 100% వేపపూత పూసిన యూరియా ప్రభుత్వం సిద్ధం చేసిందని, దాని వల్ల రైతులు అవసరమైనంతగా యూరియా అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. అలాగే ఉత్తర్ ప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ రాష్ర్టాల్లో మూతపడిన 5 ఎరువుల ఫ్యాక్టరీలను పునఃప్రారంబించే ప్రక్రియ కూడా చేపట్టామన్నారు. యుపి, తెలంగాణ ఫ్యాక్టరీలు ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించగా మిగతా మూడు ఫ్యాక్టరీలు కూడా త్వరలో ఉత్పత్తిని ప్రారంభించబోతున్నట్టు తెలిపారు.
యూరియా, ఫాస్ఫేట్, పోటాష్ ఆధారిత ఎరువుల కోసం దిగుమతి ఆధారనీయత గురించి ప్రస్తావించిన ప్రధానమంత్రి మహమ్మారి, యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లో వాటి లభ్యత తగ్గిందన్నారు. ఆ విషయం గ్రహించిన ప్రభుత్వం ఆ కష్టాలు రైతులకు చేరకుండా చూసిందని, క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దేశంలో యూరియా సంక్షోభం తలెత్తకుండా చూసిందని ప్రధానమంత్రి చెప్పారు. రూ.3500అయ్యే యూరియా బస్తా ధర రూ.300కే అందిస్తూ ప్రభుత్వం రూ.3200 భరిస్తున్నదన్నారు. అలాగే ఒక్కో డిఏపి ఎరువు బస్తాపై గత ప్రభుత్వం రూ.500 భరించగా తమ ప్రభుత్వం రూ.2500 భరిస్తున్నదని చెప్పారు. గత ఏడాది ఎరువులపై రూ.1.60 లక్షల కోట్లు సబ్సిడీ ఇచ్చామని, ఈ ఏడాది ఆ వ్యయం రూ.2 లక్షల కోట్లు కన్నా పైనే ఉండబోతోందని ప్రధానమంత్రి తెలియచేశారు. రైతాంగం ప్రయోజనాలు కాపాడేందుకు ఏం చేయవలసివస్తే అది చేస్తామని, రైతును బలంగా నిలబెట్టే కృషి కొనసాగిస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.
గత 8 సంవత్సరాలుగా ప్రభుత్వం దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు మధ్యకాలిక, దీర్ఘకాలిక పరిష్కారాలపై కృషి చేసిందని ప్రధానమంత్రి చెప్పారు. భవిష్యత్తులో ఎలాంటి మహమ్మారి విరుచుకుపడినా దీటుగా ఎదుర్కొనేందుకు ఆరోగ్య మౌలిక వసతులు మెరుగుపరచడం నుంచి వంట నూనెల సమస్య పరిష్కారానికి మిషన్ ఆయిల్ పామ్; చమురు పరిష్కారానికి బయో-ఇంధనాలు, హైడ్రోజెన్ ఇంధనం; ప్రకృతి వ్యవసాయం, నానో టెక్నాలజీ వంటివెన్నో ఈ వైఖరి ఫలితంగా వచ్చినదేనన్నారు. భారతదేశం ఎదుర్కొంటున్న పలు కష్టాలకు స్వయం-సమృద్ధిలో ఒక పరిష్కారం ఉన్నదని చెప్పారు. స్వయం-సమృద్ధికి చక్కని నమూనా సహకారమని ఆయన అన్నారు.
పూజ్య బాపూ, సర్దార్ సాహెబ్ వంటి వారి నాయకత్వం లభించడం గుజరాత్ అదృష్టమని ప్రధానమంత్రి చెప్పారు. సహకారం ద్వారా స్వయం-సహాయం అనే పూజ్య బాపూ మార్గాన్ని దిగువ స్థాయికి తేవడానికి సర్దార్ సాహెబ్ కృషి చేశారన్నారు. పాడి పరిశ్రమలో సహకార నమూనా మన కళ్ల ముందున్నఉదాహరణ అని చెబుతూ నేడు గుజరాత్ పాల ఉత్పత్తిలో ప్రధాన వాటాతో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నదని చెప్పారు. పాడి పరిశ్రమ రంగం గత కొద్ది సంవత్సరాల కాలంలో వేగంగా పెరుగుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పెద్ద వాటా అందిస్తున్నదని తెలిపారు. అలాగే ప్రభుత్వ నియంత్రణలు అతి తక్కువగా ఉన్న కారణంగా గుజరాత్ పాడి ఆధారిత పరిశ్రమలు సువిశాలంగా విస్తరించాయని చెప్పారు. గుజరాత్ లో ప్రభుత్వం సౌకర్యాల కల్పనకే పరిమితం అయిందని, మిగతా అంతా సహకార వ్యవస్థ లేదా రైతులే చేసుకుంటారని ఆయన తెలిపారు.
అమృతకాల స్ఫూర్తితో సహకార స్ఫూర్తిని అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని ప్రధానమంత్రి తెలిపారు. ఈ లక్ష్యంతోనే కేంద్రంలో సహకార మంత్రిత్వ శాఖ కూడా ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. దేశంలో సహకార ఆధారిత ఆర్థిక నమూనాను ప్రోత్సహించేందుకు కూడా ప్రయత్నం జరుగుతున్నట్టు చెప్పారు. “విశ్వాసం, సహకారం, ఉమ్మడి బలంపై సంస్థను నిర్మించగల సామర్థ్యాలు సహకార వ్యవస్థకు గల పెద్ద బలం. అమృత కాలంలో భారతదేశ విజయానికి హామీ ఇదే” అని ఆయన అన్నారు. అతి చిన్నవి, తక్కువగా అంచనా వేసినవి అయిన పనులనే ప్రభుత్వం అమృత కాలంలో పెద్ద ఎత్తున చేపట్టింది. నేడు చిన్న కారు రైతులను అన్ని విధాలుగానూ సాధికారం చేస్తున్నారు. అలాగే చిన్న తరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఇలను భారత స్వయం-సమృద్ధ సరఫరా వ్యవస్థలో శక్తివంతమైన భాగస్వాములుగా చేయడం జరుగుతోంది. “సహకారం మన లక్ష్యాలను సాధించేందుకు సహాయపడుతుంది. భారతదేశం విజయం, సుసంపన్నత బాటలో ముందుకు సాగుతుంది అనే ప్రగాఢ నమ్మకం నాకుంది” అంటూ ప్రధానమంత్రి ముగించారు.
(Release ID: 1839215)
Visitor Counter : 143
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam