భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక-2022. (16వ ఉపరాష్ట్రపతి ఎన్నిక)

Posted On: 29 JUN 2022 4:55PM by PIB Hyderabad

   ఉపరాష్ట్రపతిగా ఎం. వెంకయ్య నాయుడు పదవీకాలం 2022, ఆగస్టు 10 వతేదీతో ముగుస్తోంది. భారత రాజ్యాంగంలోని 68వ అధికరణం ప్రకారం ఉపరాష్ట్రపతి పదవికి ఏర్పడే ఖాళీని భర్తీ చేసేందుకు నిర్వహించే ఎన్నిక ప్రక్రియ,.. ప్రస్తుత ఉపరాష్ట్రపతి పదవీకాలం ముగిసేలోగా పూర్తికావలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ అధ్యక్షతన ఈ రోజు ఎన్నికల కమిషన్ సమావేశమైంది.  ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను కమిషన్ ఈ సమావేశంలో ఖరారు చేసింది. ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే ఈ సమావేశానికి హాజరయ్యారు.

 

 2. రాజ్యాంగంలోని 324వ ఆర్టికల్,.. 1952వ సంవత్సరపు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక చట్టం, 1974వ సంవత్సరపు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల నిబంధనల ప్రకారం,.. ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణాధికారం తదితర అంశాలు భారత ఎన్నికల కమిషన్‌కు దఖలుపడి ఉన్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ఎన్నికల కమిషన్ త్పప్పనిసరిగా స్వేచ్ఛగా, సజావుగా నిర్వహించాల్సి ఉంది. తనకు దఖలు పడిన రాజ్యాంగబద్ధమైన ఈ బాధ్యతను నిర్వర్తించేందుకు అవసరమైన అన్ని చర్యలనూ ఎన్నికల కమిషన్ తీసుకుంటోంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ను ఈ రోజు ప్రకటించడం, తనకు దక్కిన గౌరవంగా భారత ఎన్నికల కమిషన్ భావిస్తోంది. 1952వ సంవత్సరపు, రాష్ట్రపతి, ఉపరాష్ట్ర పతి ఎన్నిక చట్టంలోని 4(3)వ సెక్షన్ ప్రకారం, ప్రస్తుత ఉపరాష్ట్రపతి తన గడువు ముగిసి పదవినుంచి వైదొలగేందుకు 16రోజులు ఉండగా, ఎన్నిక నోటిఫికేషన్ వెలువరించేందుకు వీలుంటుంది.

 

 3. భారత రాజ్యాంగంలోని 66వ అధికరణం ప్రకారం ఉపరాష్ట్రపతిని ఎలెక్ట్రోరల్ కాలేజీ సభ్యులు ఎన్నుకుంటారు. పార్లమెంటు ఉభయసభల సభ్యులు, దామాషా ప్రాతినిథ్య పద్ధతికి అనుగుణంగా ఈ ఎలెక్ట్రోరల్ కాలేజీలో సింగిల్ ట్రాన్ఫరబులు వోటు ప్రాతిపదికన సభ్యత్వం కలిగి ఉంటారు. 2022వ సంవత్సరంలో ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఎలెక్ట్రోరల్ కాలేజీలో ఈ దిగువ సభ్యులు సభ్యత్వం కలిగి ఉంటారు.

   

రాజ్యసభలోని 233 మంది ఎన్నికైన సభ్యులు,

రాజ్యసభలోని 12 మంది నామినేటెడ్ సభ్యులు,

లోక్‌సభలోని 543 మంది ఎన్నికైన సభ్యులు ఉంటారు.

 

ఎలెక్ట్రోరల్ కాలేజీలో పార్లమెంటు ఉభయసభలకు చెందిన 788మంది సభ్యులకు ప్రాతినిధ్యం ఉంటుంది. ఎన్నుకునే ఎలెక్టర్లు అంటే, వోటర్లంతా పార్లమెంటు ఉభయసభల సభ్యులేకాబట్టి ప్రతి పార్లమెంటు సభ్యుడి వోటు విలువ అలాగే  ఉంటుంది. (అంటే, 1గా ఉంటుంది.)

 

   4.  రాజ్యాంగంలోని 66(1)వ అధికరణం నిర్దేశించినట్టుగా, ఈ ఎన్నిక దామాషా ప్రాతినిథ్య వ్యవస్థలో సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ వోటు ద్వారా జరుగుతుంది. వోటు వేసే విధానం కూడా రహర్య బ్యాలెట్ రూపంలో జరుగుతుంది. ఈ పద్ధతి ప్రకారం వోటు హక్కు వినియోగించుకునే వోటరు వివిధ అభ్యర్థులకు ప్రాధాన్యతా క్రమంలో వోటు వేయాల్సి ఉంటుంది. రోమన్ ఫార్మాట్‌లో ఉండే అంకెల రూపంలోగానీ, లేదా ఏదైనా గుర్తింపు పొందిన భారతీయ భాషల్లో గానీ తమ ప్రాధాన్యతా క్రమాన్ని సూచించవలసి ఉంటుంది.  ప్రాధాన్యతా క్రమాన్ని మాత్రం కేవలం అంకెలరూపంలోనే సూచించాల్సి ఉంటుంది. పదాల రూపంలో సూచించరాదు. పోటీచేసే అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో వోటరు ఎన్ని ప్రాధాన్యతా క్రమాలనైనా సూచించవచ్చు. బ్యాలెట్ పేపరు చెల్లుబాటు కావాలంటే మొదటి ప్రాధాన్యతా క్రమాన్ని మాత్రం తప్పనిసరిగా సూచించాల్సి ఉంటుంది. మిగతా ప్రాధాన్యతల విషయంలో మాత్రం వారు తమ ఇష్టంమేరకు వ్యవహరించవచ్చు.

 

  5. వోటు వేసేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేకమైన పెన్నులను సరఫరా చేస్తుంది. ఈ పెన్నును వోటరుకు పోలీంగ్ కేంద్రంలోనే, నిర్దేశిత అధికారి అందిస్తారు. బ్యాలెట్ పత్రాన్ని ఇచ్చినపుడే పెన్ను కూడా ఇస్తారు. తమకు ఇచ్చిన ప్రత్యేకమైన పెన్నుతోనే వోటరు తమ వోటును ముద్రించాల్సి ఉంటుంది. మరే ఇతర పెన్నుతోనూ వోటు వేయడానికి వీలులేదు. ఆలా వేరే పెన్నుతో వోటు ముద్రిస్తే, వోట్ల లెక్కింపు సమయంలో సదరు వోటును చెల్లని వోటుగా పరిగణిస్తారు.

 

  6. లోక్‌సభ, రాజ్యసభల ప్రధాన కార్యదర్శుల్లో ఒకరిని రిటర్నింగ్ అధికారిగా రొటేషన్ పద్ధతిలో ఎన్నికల కమిషన్ నియమిస్తుంది. కేంద్రప్రభుత్వంతో సంప్రదింపుల ద్వారానే ఎన్నికల కమిషన్ ఈ నియామకం జరుపుతుంది. రొటేషన్ పద్ధతికి అనుగుణంగా, ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం లోక్‌సభ ప్రధానకార్యదర్శిని రిటర్నింగ్ అధికారిగా నియమించనున్నారు. రిటర్నింగ్ అధికారికి తన విధుల్లో తగిన సహకారం అందించేందుకు పార్లమెంటు హౌస్ (లోక్‌సభ విభాగం)లో సహాయ రిటర్నింగ్ అధకారులను ఎన్నికల కమిషన్ నియమిస్తుంది. 

 

7. 1974వ సంవత్సరపు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల నిబంధనల్లోని 8వ రూల్  ప్రకారం, పోలింగ్‌ను పార్లమెంటు భవనంలో నిర్వహిస్తారు. పోలింగ్ అవసరమైన పక్షంలో న్యూఢిల్లీలోని పార్లమెంటు భవనం మొదటి అంతస్థులో గల 63వ నెంబరు గదిలో పోలింగ్ ప్రక్రియను చేపడతారు. 

 

  8. ఎన్నిక షెడ్యూల్ ప్రకారం, పోటీలో ఉన్న అభ్యర్థి తన నామినేషన్ పత్రాన్ని న్యూఢిల్లీలో రిటర్నింగ్ అధికారికి అందించవలసి ఉంటుంది. తనకు ఎక్కడ నామినేషన్ అందించాలన్న విషయాన్ని రిటర్నింగ్ అధికారి ఒక బహిరంగ నోటీస్ ద్వారా తెలియజేస్తారు. (రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక నిబంధనల ప్రకారం ఫారం-వన్‌లో ఈ నోటీస్ వెలువరిస్తారు.) చట్టం ప్రకారం, ఫార్మ్-3 ప్రకారం ఉన్న నామినేషన్ పత్రాన్ని అభ్యర్థే స్వయంగా  కానీ, లేదా అభ్యర్థిని బలపరిచిన, లేదా మద్దతు ఇచ్చిన వారుగానీ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఉదయం 11గంటలనుంచి సాయంత్రం 3గంటల్లోగా నామినేషన్ సమర్పించాల్సి ఉంటుంది. సెలవు దినాల్లో నామినేషన్ దాఖలుచేయడానికి వీల్లేదు. ఒక అభ్యర్థి దాఖలు చేసే నామినేషన్ పత్రంపై కనీసం 20మంది మద్దతుదార్లైన ఎలెక్టర్లు,  కనీసం మరో 20మంది బలపరిచిన వారు సంతకాలు చేయాల్సి ఉంటుంది.  ఒక్కో ఎలెక్టరు కేవలం ఒక నామినేషన్ పత్రంపై మాత్రమే ప్రపోజర్‌గా కానీ, బలపరిచే వ్యక్తిగా గానీ సంతకం చేయాల్సి ఉంటుంది. 1952వ సంవత్సరపు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం నిబంధనల్లోని 5బి (5)వ సెక్షన్‌లో పేర్కొన్నట్టుగా ఈ ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలో పోటీచేసే ఒక్కో అభ్యర్థి గరిష్టంగా నాలుగు నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చు. ఈ ఎన్నికకు సెక్యూరిటీ దరావతు మొత్తం రూ. 15,000/- (అక్షరాలా పదిహేను వేల రూపాయలు మాత్రమే). ఈ సెక్యూరిటీ డిపాజిట్ మొత్తాన్ని నామినేషన్ పత్రం దాఖలు చేసినపుడే, అక్కడిక్కడే చెల్లించాల్సి ఉంటుంది. లేదా,..రిజర్వ్ బ్యాంకు, ప్రభుత్వ ఖజానాలో సంబంధిత హెడ్ అకౌంట్స్ ద్వారా నామినేషన్ దాఖలుకు ముందే దరావతు సొమ్మును అభ్యర్థి చెల్సించాల్సి ఉంటుంది.  

 

9. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల నిబంధల్లోని 40వ రూల్ ప్రకారం, ఉపరాష్ట్రపతి ఎన్నికకోసం  ఎన్నికల కమిషన్ ఎలెక్ట్రోరల్ కాలేజీ సభ్యుల జాబితాను నిర్వహిస్తుంది.  66వ అధికరణంలో పేర్కొన్నట్టుగా వారి చిరునామాలను తాజాగా ఉండేలా చూస్తుంది. ఎన్నికల కమిషన్ నిర్వహించే ఎలెక్ట్రోరల్ కాలేజీ సభ్యుల జాబితా కమిషన్ కార్యాలయం ఆవరణలో ప్రారంభించిన కౌంటర్‌లో అందుబాటులో ఉంటుంది. ఒక్కో జాబితాను రూ. 50 చొప్పున చెల్లించి తీసుకోవచ్చు. ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఈ ఎలెక్ట్రోరల్ కాలేజీ జాబితా ప్రతిని పొందుపరుస్తున్నారు. అయితే, వివిధ రాష్ట్రాల మండలిలోని ఎన్నికైన 51మంది సభ్యుల పేర్లు, రాష్ట్రాల మండలికి చెందిన ఏడుగురు నామినేటెడ్ సభ్యుల పేర్లతో నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఈ జాబితాను నవీకరించాల్సి ఉంటుంది. (వారిని ఎన్నికల ప్రక్రియ సంయంలో భర్తీ చేసిన పక్షంలో). అంటే, అవసరమైనపుడల్లా ఎలెక్ట్రోరల్ కాలేజీ సభ్యులతో కూడిన అనుబంధ జాబితాలను ప్రచురిస్తారు. 

 

10. పోటీచేసే ప్రతి అభ్యర్థీ పోలింగ్ కేంద్రంలో, వోట్లలెక్కింపు కేంద్రంలో తన ప్రతినిధిగా ఒక వ్యక్తి హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వవచ్చు. ఇందుకు సంబంధించి ఆథరైజేషన్ ప్రక్రియను అభ్యర్థి లిఖితపూర్వకంగా ఇవ్వవలసి ఉంటుంది.

 

11. ఉపరాష్ట్రపతి ఎన్నిక రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరగాలని రాజ్యాంగం ప్రస్పుటంగా నిర్దేశించింది. అందువల్ల ఎలెక్టర్లు అంటే వోటింగ్‌లో పాల్గొనే వారంతా వోటింగులో గోప్యతను పాటించాల్సి ఉంటుంది. ఈ ఎన్నికలో బహరంగ వోటింగ్ అనే పద్ధతిగానీ, ఎవరికైనా బ్యాలెట్‌ను చూపించే పద్ధతిగానీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈ పద్ధతిని పూర్తిగా నిషేధించారు. 1974వ సంవత్సరపు నిబంధనల ప్రకారం, వోటింగ్ ప్రక్రియకు ప్రత్యేక నిబంధనలను విధించారు. ఎలెక్టరు తన వోటు వేసిన తర్వాత, బ్యాలెట్ పత్రాన్ని మడిచేసి బ్యాలెట్ పెట్టెలో వేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి ఉల్లంఘన జరిగినా, సదరు బ్యాలెట్ పత్రాన్ని ప్రిసైడింగ్ అధికారి రద్దు చేస్తారు. ఐదవ పేరాలో ఇదివరకే సూచించినట్టుగా ప్రిసైడింగ్ అధికారి స్వయంగా పోలింగ్ కేంద్రంలో అందించిన ప్రత్యేకమైన పెన్నుతోనే వోటును ముద్రించాల్సి ఉంటుంది.

 

  12. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి రాజకీయ పార్టీలేవీ తమ ఎం.పి.లకు ఎలాంటి విప్‌నూ జారీచేయడానికి వీలులేదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల నిబంధనల్లోని 18వ సెక్షన్ ప్రకారం, భారత శిక్షా స్మృతిలోని 171 బి, 171 సి సెక్షన్ల నిర్వచించినట్టుగా లంచం, అనుచిత ప్రభావానికి గురిచేస్తే అలాంటి ప్రభావంతో జరిగిన ఎన్నికను చెల్లనేరదని గౌరవ సుప్రీంకోర్టు ఎన్నికల పిటిషన్‌లో ప్రకటిస్తుంది.

 

 13. ఎన్నిక నిర్వహణలో, బ్యాలెట్ పెట్టెలను, సంబంధిత పోలింగ్ సామగ్రిని ఎన్నికల కమిషన్‌నుంచి పార్లమెంటు భవనానికి, పోలింగ్ తర్వాత అక్కడనుంచి తిరిగి ఎన్నికల కమిషన్‌కు రవాణా చేయడంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, రిటర్నింగ్ అధికారికి సహకారం అందిస్తారు.

 

 14. ఎన్నిక స్వేచ్ఛగా, సజావుగా జరిగేలా చూసేందుకు పోలింగ్ జరిగే ప్రాతంలో ప్రభుత్వ సీనియర్ అధికారులను కూడా పరిశీలకులుగా ఎన్నికల కమిషన్ నియమిస్తుంది.

 

 15. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అన్ని దశల్లోనూ కోవిడ్-19 సంబంధిత నిబంధనలను, రక్షణలను చేపడతారు. పోలింగ్ రోజున ఎన్నికల ప్రక్రియలోనూ, ఆ తర్వాత వోట్ల లెక్కింపు సమయంలోనూ ఈ నిబంధనలను అమలు చేస్తారు.

 

 16. ఎన్నికల ప్రక్రియను పర్యావరణహితంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే వస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతున్నందున బహిరంగంగా ఎన్నికల ప్రచారం ఉండబోదు. సంప్రదాయ పద్ధతి ఎన్నికల్లోలాగా బ్యానర్లు, పోస్టర్ల ప్రదర్శన తదితరాలు ఉండవు. అయినప్పటికీ, ఈ ఎన్నిక ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకున్న ఎన్నికల కమిషన్ రిటర్నింగ్ అధికారికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక ప్రక్రియలో పర్యావరణ హితమైన, బయోడిగ్రేడబుల్ సామగ్రినే వాడాలని, నిషిద్ధ ప్లాస్టిక్ సామగ్రికి వాడకానికి తావియ్యరాదని కమిషన్ ఆదేశించింది.

 

17. వోట్ల లెక్కింపు ప్రక్రియ న్యూఢిల్లీలోనే రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో జరుగుతుంది. వోట్లలెక్కింపు పూర్తికాగానే, ఎన్నికల ఫలితాన్ని (రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల నిబంధనల్లోని ఫార్మ్7 ప్రకారం) రిటర్నింగ్ అధికారి సంతకంలోనే విడుదల చేస్తారు.

 

 18. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల నిబంధనల్లోని 4వ సెక్షన్‌కు చెందిన ఒకటవ సబ్ సెక్షన్‌కు అనుగుణంగా, ఎన్నిక కార్యక్రమాన్ని ఎన్నికల కమిషన్ నిర్దేశించింది. అనుబంధం-1 ప్రకారం ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ భర్తీ కోసం ఈ ఎన్నిక ప్రక్రియను కమిషన్ నిర్దేశించింది.  

 

19. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన అన్ని అంశాలు, గతంలోని 15మంది ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన అంశాలు, తరచూ తలెత్తే ప్రశ్నలూ తదితర అంశాలన్నింటినీ ఎన్నికల కమిషన్ అధీకృత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

: https://eci.gov.in/vice-presidential-election2022/index/ అనే లింక్ ద్వారా వాటిని చూడవచ్చు. ఇదే సమాచారం పొందుపరిచిన పుస్తకం ప్రతిని కూడా ఎవరైనా 25 రూపాయలు చెల్లించి, ఎన్నికల కమిషన్ సేల్ కౌంటర్‌లో  పొందవచ్చు.

 

*****

 

ANNEXURE-I

Election to the Office of the Vice-President of India, 2022 (16th Vice-Presidential Election)

    

(i)

Issue of Election Commission’s notification calling the election

5.07.2022

(Tuesday)

(ii)

Last date of making nominations

19.07.22

 (Tuesday)

(iii)

Date for the Scrutiny of nominations

20.07.2022

(Wednesday)

(iv)

Last date for the withdrawal of candidatures

22.07.2022

(Friday)

(v)

Date on which a poll shall, if necessary, be taken

06.08.2022

(Saturday)

(vi)

Hours of poll

10am to 05pm

(vii)

Date on which counting, if required, shall be taken

06.08.2022

(Saturday)

 


(Release ID: 1838113) Visitor Counter : 3302