ప్రధాన మంత్రి కార్యాలయం
"మా అమ్మ చాలా సున్నితమైనది, అసాధారణమైనది" : తన తల్లి వందవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగ స్పందన
Posted On:
18 JUN 2022 8:29AM by PIB Hyderabad
తమ తల్లి వందవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగంతో కూడిన బ్లాగ్ ను రాశారు. ఆయన, చిన్ననాటి నుండి తన తల్లి తో గడిపిన కొన్ని ప్రత్యేకమైన క్షణాలను గుర్తు చేసుకున్నారు. తాను పెద్దవుతున్న కొద్దీ, తన తల్లి చేసిన అనేక త్యాగాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
“ఈ రోజు, నా తల్లి శ్రీమతి హీరాబా మోడీ వందో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఈ విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా, అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఆమె జన్మ శతాబ్ది సంవత్సరం." అని ప్రధానమంత్రి మోదీ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
దృఢత్వానికి ప్రతీక
తన చిన్నతనంలో తన తల్లి ఎదుర్కొన్న కష్టాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తుచేసుకుంటూ, “నా తల్లి ఎంత సరళమైనదో, అంత అసాధారణమైనది. అందరి తల్లుల్లాగే.”, అని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే, ప్రధానమంత్రి మోదీ తల్లి, ఆమె తల్లిని కోల్పోయిన విషయాన్ని తెలియజేస్తూ, “ఆమెకు మా అమ్మమ్మ ముఖం లేదా ఆమె ఒడిలో ఉన్న మధుర క్షణాలు కూడా గుర్తులేవు. ఆమె తన బాల్యం మొత్తాన్ని తల్లి తోడు లేకుండా గడిపారు." అని వివరించారు.
తన చిన్నతనంలో, తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి నివసించిన వాద్ నగర్ లోని మట్టి గోడలు, మట్టి పలకల పైకప్పు తో ఉన్న చిన్న ఇంటిని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తన తల్లి ఎదుర్కొని, విజయవంతంగా అధిగమించిన అసంఖ్యాకమైన రోజువారీ ప్రతికూలతలను ఆయన వివరించారు.
తన తల్లి తన ఇంటి పనులన్నీ స్వయంగా చేసుకోవడం తో పాటు, స్వల్పంగా ఉండే ఇంటి ఆదాయానికి తగ్గట్టు పని చేసేవారని, ఆయన పేర్కొన్నారు. ఆమె కొన్ని ఇళ్లలో పాత్రలు కడగడం తో పాటు, ఇంటి ఖర్చులకు సహాయం చేయడానికి ఖాళీ సమయాల్లో చరఖాను తిప్పేవారని, ఆయన చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన గత స్మృతులను నెమరువేసుకుంటూ, “వర్షాకాలంలో, మా ఇంటి పైకప్పు నుంచి నీళ్ళు కారేవి. ఇంట్లో వరదలు వచ్చినట్లు ఉండేది. వర్షపు నీరు పడే చోట, మా అమ్మ బకెట్లు, వంట పాత్రలు ఉంచేది. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా తల్లి దృఢత్వానికి ప్రతీకగా ఉంటుంది”, అని చెప్పారు.
పరిశుభ్రతలో నిమగ్నమైన వారి పట్ల హృదయ పూర్వక గౌరవం
పరిశుభ్రత పట్ల తన తల్లి ఎప్పుడూ చాలా ప్రత్యేకంగా ఉండేవారని, ప్రధానమంత్రి మోదీ చెప్పారు. తన తల్లి పరిశుభ్రతను కాపాడుకోవడంలో చాలా ప్రత్యేక శ్రద్ధతో ఉండేవారన్న విషయాన్ని తెలియజేయడానికి, ఆయన పలు సందర్భాలను ఉదహరించారు.
పరిశుభ్రత, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించే వారి పట్ల తన తల్లి ఎంతో గౌరవంతో వ్యవహరించేవారని, ప్రధానమంత్రి మోదీ తెలిపారు. వాద్‌నగర్ లోని తమ ఇంటి పక్కనే ఉన్న మురుగునీటి కాలువను శుభ్రం చేయడానికి ఎవరైనా వచ్చినప్పుడల్లా, అతని తల్లి వారికి టీ ఇవ్వకుండా వెళ్ళ నిచ్చేవారు కాదని, ఆయన చెప్పారు.
ఇతరుల సంతోషంలో ఆనందాన్ని గుర్తించడం
తన తల్లి ఇతరుల సంతోషంలో ఆనందాన్ని గుర్తిస్తారని, విశాల హృదయంతో ఉంటారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ, తన చిన్ననాటి ఒక సంఘటనను, ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
“మా నాన్నగారికి సన్నిహిత మిత్రుడు ఒకరు సమీపంలోని గ్రామంలో ఉండేవారు. ఆయన అకాల మరణం చెందడంతో, అబ్బాస్ అనే తన స్నేహితుని కుమారుడ్ని, మా నాన్న మా ఇంటికి తీసుకువచ్చారు. ఆ అబ్బాయి మా దగ్గరే ఉంటూ తన చదువు పూర్తి చేశాడు. మా తోబుట్టువులు అందరితో సమానంగా అబ్బాస్ పట్ల కూడా, మా అమ్మ ప్రేమగా, శ్రద్ధగా వ్యవహరించేవారు. ప్రతి సంవత్సరం ఈద్ రోజున ఆమె అతనికి ఇష్టమైన వంటకాలు తయారు చేసేవారు. పండుగలప్పుడు, ఇరుగుపొరుగు పిల్లలు మా ఇంటికి రావడం, అమ్మ ప్రత్యేక వంటకాలను ఆస్వాదించడం సర్వసాధారణంగా ఉండేది.” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరించారు.
ప్రధానమంత్రి మోదీ గారి మాతృమూర్తి కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే ఆయనతో కలిసి బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొన్నారు
తన తల్లి, తనతో కలిసి బహిరంగ కార్యక్రమాలకు వచ్చిన రెండు సందర్భాలను, ప్రధానమంత్రి మోదీ, తన బ్లాగ్ లో ప్రధానంగా పేర్కొన్నారు.
ఏక్తా యాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా లాల్ చౌక్ లో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం శ్రీనగర్ నుండి తిరిగి వచ్చిన సందర్భంగా అహ్మదాబాద్ లో నిర్వహించిన ఒక బహిరంగ సభలో ఆమె ఆయన నుదుటిపై తిలకం దిద్దినప్పుడు ఒక సారి, ఆ తర్వాత, 2001 సంవత్సరంలో, గుజరాత్ ముఖ్యమంత్రి గా నరేంద్ర మోదీ తొలిసారి పదవీ స్వీకార ప్రమాణం చేసినప్పుడు రెండో సారి, తన తల్లి, తనతో కలిసి బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ప్రధానమంత్రి వివరించారు.
ప్రధానమంత్రి మోదీకి తల్లి నేర్పిన జీవిత పాఠం
అధికారికంగా చదువుకోకపోయినా, నేర్చుకోవడం సాధ్యమవుతుందని తన తల్లి తనకు అర్థమయ్యేలా చేశారని, ప్రధానమంత్రి మోదీ రాశారు. తనకు అతి పెద్ద గురువైన తన తల్లితో సహా తన ఉపాధ్యాయులందరినీ బహిరంగంగా గౌరవించాలని కోరుకున్నప్పుడు జరిగిన ఒక సంఘటనను ఆయన ఈ సందర్భంగా పంచుకున్నారు. అప్పుడు, తన కోరికను ఆమె నిరాకరిస్తూ, "చూడు, నేను ఒక సాధారణ వ్యక్తిని, నేను నీకు జన్మనిచ్చి ఉండవచ్చు, కానీ, సర్వశక్తిమంతుడైన భగవంతుడే నీకు అన్ని విషయాలు బోధించి, పోషించాడు." అని సున్నితంగా తన తల్లి తిరస్కరించిన విషయాన్ని, ఆయన వివరించారు.
ఆ కార్యక్రమానికి తన తల్లి హాజరు కానప్పటికీ, తనకు చిన్నతనంలో అక్షరాలు నేర్పించిన, స్థానిక ఉపాధ్యాయుడైన జెతాభాయ్ జోషి జీ కుటుంబం నుంచి ఎవరినైనా పిలిచి, సత్కరించే విధంగా తన తల్లి నిర్ధారించుకున్నారని, ప్రధానమంత్రి మోదీ తెలియజేశారు. "ఇటువంటి ఆమె ఆలోచనా విధానం, దూరదృష్టి నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉండేవి." అని కూడా ఆయన చెప్పారు.
కర్తవ్యం పట్ల విధేయత గల పౌరురాలు
విధేయత గల పౌరురాలిగా తన తల్లి పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఇంతవరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో ఓటు వేసినట్లు, ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు.
అత్యంత సాధారణ శైలితో జీవనం సాగిస్తున్నారు
తన తల్లి కొనసాగిస్తున్న అత్యంత సాధారణ జీవనశైలి గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, ఈ రోజు కి తన తల్లి పేరిట ఎలాంటి ఆస్తులు లేవని స్పష్టం చేశారు. “ఆమె బంగారు ఆభరణాలు ధరించడం నేను ఎప్పుడూ చూడలేదు. వాటి పట్ల ఆమెకు ఆసక్తి కూడా లేదు. మునుపటిలాగే, ఇప్పుడు కూడా, ఆమె తన చిన్న గదిలో చాలా సరళమైన జీవనశైలిని కొనసాగిస్తున్నారు." అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ప్రస్తుత పరిణామాలకు అనుగుణంగా మద్దతు
ప్రపంచంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలకు తన తల్లి అండగా ఉంటోందని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. ఇదే విషయాన్ని, ఆయన తన బ్లాగ్ ద్వారా తెలియజేస్తూ, “ఇటీవల, నేను ఆమెను ప్రతిరోజూ ఎంతసేపు టీవీ చూస్తుంటావని, అడిగాను. దానికి, ఆమె బదులిస్తూ, టీవీలో చాలా మంది వ్యక్తులు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడంలో బిజీగా ఉంటారనీ, అందువల్ల, తాను ప్రశాంతంగా వార్తలు చదివి, వాటిని వివరించే వారిని మాత్రమే చూస్తాననీ చెప్పారు. దాంతో, మా అమ్మ చాలా విషయాలను ఎప్పటికప్పుడు వివరంగా తెలుసుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది." అని పేర్కొన్నారు.
పెద్ద వయసు లో ఉన్నప్పటికీ పదునైన జ్ఞాపకశక్తి
2017 సంవత్సరంలో, ప్రధానమంత్రి మోదీ నేరుగా కాశీ నుంచి ఆమెను కలవడానికి వెళ్లి, ఆమె కోసం ప్రసాదాన్ని తీసుకెళ్లారు. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ తన తల్లి చురుకుదనాన్ని ప్రదర్శించే ఆ నాటి మరో ఉదాహరణను ప్రధానమంత్రి మోదీ పంచుకున్నారు.
“నేను మా అమ్మను కలిసినప్పుడు, కాశీ విశ్వనాథ్ మహాదేవ్ కు నమస్కరించావా అని వెంటనే నన్ను అడిగారు. అమ్మ ఇప్పటికీ పూర్తి పేరు “కాశీ విశ్వనాథ్ మహాదేవ్” అని అంటారు. అప్పుడు ఆమె మాట్లాడుతూ - ఎవరి ఇంటి ఆవరణలోనో గుడి ఉన్నట్లు కాశీ విశ్వనాథ ఆలయానికి వెళ్లే దారులు ఇప్పటికీ అలాగే ఉన్నాయా? అని ఆమె నన్ను అడిగారు. అప్పుడు నేను ఆశ్చర్యపోయి, ఆలయాన్ని ఎప్పుడు సందర్శించావని అమ్మను అడిగాను. తాను చాలా ఏళ్ల క్రితమే కాశీకి వెళ్లానని చెప్పగా, ఆమెకు అన్నీ గుర్తున్నాయని తెలుసుకుని. నేను చాలా ఆశ్చర్యపోయాను." అని ప్రధానమంత్రి మోదీ వివరించారు.
ఇతరుల అభీష్టాలను గౌరవించడం
తన తల్లి ఇతరుల ఎంపికలను గౌరవించడం తో పాటు, తన ఇష్టాయిష్టాలను ఇతరులు ఆమోదించాలని పట్టు పట్టే వారు కాదని ప్రధానమంత్రి మోదీ వివరించారు. “ముఖ్యంగా నా స్వంత విషయంలో, ఆమె నా నిర్ణయాలను గౌరవించారు. ఎప్పుడూ ఎటువంటి అడ్డంకులూ సృష్టించకుండా నన్ను ప్రోత్సహించారు. చిన్నప్పటి నుంచి, నాలో ఒక విభిన్నమైన మనస్తత్వం కొనసాగుతున్నట్లు ఆమె గుర్తించారు." అని, ప్రధానమంత్రి మోదీ ప్రస్తావించారు.
ఆయన తన ఇంటిని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రధానమంత్రి మోదీ కి ఆమె తల్లి పూర్తి మద్దతు ఇచ్చారు. అతని అభీష్టాన్ని అర్థం చేసుకున్న, ఆయన తల్లి "నీ మనసు చెప్పినట్టు చెయ్యి " అని ఆశీర్వదించారు.
"గరీబ్ కళ్యాణ్" పై ప్రత్యేక దృష్టి
దృఢ సంకల్పంతో గరీబ్ కళ్యాణ్ పై దృష్టి పెట్టడానికి తన తల్లి తనను ఎక్కువగా ప్రేరేపించిందని ప్రధానమంత్రి మోదీ తెలియజేశారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నియమితులయిన సందర్భంలో జరిగిన ఒక సంఘటనను ఆయన పంచుకున్నారు. అప్పుడు, గుజరాత్ చేరుకున్న వెంటనే, ప్రధానమంత్రి నేరుగా తన తల్లిని కలిసేందుకు వెళ్లారు. ఆమె చాలా పారవశ్యం చెంది, ఆయనతో మాట్లాడుతూ, "ప్రభుత్వంలో నీవు చేసే పని నాకు అర్థం కాదు కానీ, నీవు ఎప్పుడూ లంచం తీసుకోకూడదని నేను కోరుకుంటున్నాను." అని చెప్పారు.
తాను, ఎటువంటి ఇబ్బంది కలుగజేయనని కుమారునికి హామీ ఇస్తూ, ఇంతకంటే పెద్ద బాధ్యతలపై దృష్టి కేంద్రీకరించాలని ఆయన తల్లి సూచించారు. ఆయన తన తల్లితో మాట్లాడినప్పుడల్లా, ఆమె, "ఎవరికీ తప్పు లేదా చెడు చేయవద్దు. పేదల కోసం పని చేస్తూ ఉండాలి." అని హిత బోధ చేసేవారు.
జీవిత మంత్రం - కఠోర పరిశ్రమ
నిజాయితీ, ఆత్మగౌరవం తన తల్లిదండ్రుల అతిపెద్ద సుగుణాలని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. పేదరికం, దానితో పాటు ఎదురయ్యే సవాళ్లతో పోరాడుతున్న సమయంలో కూడా, తమ తల్లిదండ్రులు ఎప్పుడూ నిజాయితీ మార్గాన్ని వదిలిపెట్టలేదనీ, వారి ఆత్మగౌరవం పై రాజీపడలేదనీ , ప్రధానమంత్రి మోదీ తెలియజేశారు. ఎలాంటి సవాలునైనా అధిగమించేందుకు నిరంతర కృషే వారు అనుసరించిన మహా మంత్రమని, ఆయన పేర్కొన్నారు.
మాతృ శక్తి కి ఒక ప్రతీక
“నా తల్లి జీవిత కథలో, భారతదేశ మాతృశక్తి యొక్క తపస్సు, త్యాగం, సహకారం వంటి లక్షణాలను నేను చూస్తున్నాను. నేను, నా తల్లితో పాటు, ఆమె వంటి కోట్లాది మంది మాతృమూర్తులను చూసినప్పుడల్లా, భారతీయ స్త్రీలు సాధించలేనిది ఏదీ లేదని నేను భావిస్తాను.", అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు
ప్రధానమంత్రి మోదీ తన తల్లి స్ఫూర్తిదాయకమైన జీవిత కథను కొన్ని మాటల్లో పొందుపరిచారు.
"ప్రతి లేమి కథను మించినది, ఒక తల్లి యొక్క అద్భుతమైన కథ.
ప్రతి పోరాటం కంటే చాలా ఉన్నతమైనది, తల్లి యొక్క దృఢ సంకల్పం."
*****
(Release ID: 1835241)
Visitor Counter : 239
Read this release in:
Punjabi
,
Kannada
,
Malayalam
,
Gujarati
,
Odia
,
Urdu
,
English
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Marathi
,
Bengali
,
Tamil