ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

200 ఏళ్ల నిరంతర వార్తాస్రవంతి- ‘ముంబై సమాచార్’ పత్రిక ద్విశతాబ్ది మహోత్సవాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి


"ముంబై సమాచార్” భారత తత్వశాస్త్రం.. భావ వ్యక్తీకరణలకు ప్రతీక”

“స్వాతంత్ర్య ఉద్యమం నుంచి నవ భారత నిర్మాణందాకా…
పార్సీ సోదర-సోదరీమణుల సహకారం ఎంతో గొప్పది”

“మాధ్యమాలకు విమర్శించే హక్కు ఎంత ప్రధానమో…
సానుకూల వార్తల ప్రచురణ బాధ్యత కూడా అంతే ముఖ్యం”

“మహమ్మారిపై పోరులో భారత మాధ్యమాల సానుకూల
సహకారం దేశానికి ఎంతగానో సహాయం చేసింది”

Posted On: 14 JUN 2022 7:58PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముంబై నగరంలో ఇవాళ “ముంబై సమాచార్‌” పత్రిక ద్విశతాబ్ది మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక స్మారక తపాలా బిళ్లను కూడా ఆయన ఆవిష్కరించారు. అలాగే ఈ చారిత్రక పత్రిక 200 వార్షికోత్సవం నేపథ్యంలో దాని పాఠకులకు, పాత్రికేయులకు, సిబ్బందికి ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

  ఈ రెండు శతాబ్దాల నిరంతర వార్తా స్రవంతిలో ఎన్నో తరాల జీవితాలకు, వారి సమస్యలకు ముంబై సమాచార్ గళంగా మారిందని ఆయన కొనియాడారు. అదేవిధంగా స్వాతంత్ర్యోద్యమ నినాదంతోనూ ‘ముంబై సమాచార్’ గొంతు కలిపిందని, అటుపైన 75 ఏళ్ల స్వతంత్ర భారతాన్ని అన్ని వయోవర్గా పాఠకులకు చేరువ చేసిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భాషా మాధ్యమం గుజరాతీ అయినా, ఆందోళన జాతీయమని ఆయన వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ కూడా చాలా సందర్భాల్లో ‘ముంబై సమాచార్‌’ను ఉటంకించేవారని గుర్తుచేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75వ సంవత్సరంలో ప్రవేశించిన తరుణంలో ఈ ద్విశతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకోవడాన్ని సంతోషకరమైన యాదృచ్చిక సంఘటనగా ప్రధాని పేర్కొన్నారు. “కాబట్టి, ఈ రోజున.. ఈ సందర్భంగా మనం భారతదేశ పాత్రికేయ ఉన్నత ప్రమాణాలను, దేశభక్తి ఉద్యమానికి సంబంధించిన పాత్రికేయాన్ని వేడుక చేసుకోవడమేగాక ఇది ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవాల’కు జోడింపు కావడం ముదావహం” అని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరంతోపాటు ఎమర్జెన్సీ చీకటికాలం తర్వాత ప్రజాస్వామ్య పునరుద్ధరణలో జర్నలిజం అందించిన అద్భుత సహకారాన్ని కూడా ప్రధానమంత్రి గుర్తుచేశారు.

   విదేశీయుల ప్రభావంతో ఈ నగరం ‘బొంబాయి’గా మారినప్పటికీ ‘ముంబై సమాచార్’ తన స్థానిక బంధాన్ని మూలాలతో అనుబంధాన్ని వీడలేదని ప్రధాని గుర్తుచేశారు. ఆనాడు ముంబైలోని సామాన్యుల  వార్తాపత్రికగా ఉండేదని, ఆ మూలాలను పదిలంగా కాపాడుకుంటూ నేటికీ అదే- ‘ముంబై సమాచార్’గా కొనసాగుతున్నదని కొనియాడారు. ‘ముంబై సమాచార్’ ఒక వార్తా మాధ్యమం మాత్రమే కాదని, వారసత్వ సంపదని ఆయన పేర్కొన్నారు. ఈ పత్రిక భారత తత్వశాస్త్రం… భావ వ్యక్తీకరణకు ప్రతీకగా నిలిచిందని తెలిపారు. మన దేశం ఎంతటి తుఫానులను ఎదుర్కొని ఎలా నిలదొక్కుకున్నదీ ‘ముంబై సమాచార్‌’ ప్రతిబింబిస్తుందని తెలిపారు. ‘ముంబై సమాచార్‌’ పత్రిక మొలకెత్తేనాటికి దేశంలో బానిసత్వ అంధకారం గాఢంగా పరచుకుంటున్నదని ప్రధానమంత్రి చెప్పారు. అటువంటి పరిస్థితుల నడుమ ‘ముంబై సమాచార్‌’ వంటి పత్రిక భారతీయ భాష గుజరాతీలో వెలువడటం సులభసాధ్యమేమీ కాలేదన్నారు. ముంబై సమాచార్‌ పత్రిక ఆ కాలంలోనే ప్రాంతీయ భాషా పాత్రికేయానికి బాటలు వేసిందని గుర్తుచేశారు.

   వేల ఏళ్ల భారతదేశ చరిత్ర మనకు ఎంతో నేర్పుతున్నదని ప్రధానమంత్రి అన్నారు. ఈ భూమికిగల  స్వాగతించే స్వభావాన్ని ప్రధాని నొక్కిచెప్పారు. ఈ గడ్డపై ఎవరు పాదం మోపినా తల్లి భారతి తన ఒడిలో వర్ధిల్లే అవకాశాలను అందరికీ పుష్కలంగా ప్రసాదించిందని పేర్కొన్నారు. ఇందుకు ‘అత్యుత్తమ ఉదాహరణ పార్సీ సమాజంకన్నా మెరుగైనదేముంటుంది?” అని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర ఉద్యమం నుంచి నవ భారతం నిర్మాణందాకా పార్సీ సోదరసోదరీమణులు ఎనలేని సహకారం అందించారని కొనియాడారు. ఈ సంఘం సంఖ్యాపరంగా దేశంలోనే అతి చిన్నది.. ఒక విధంగా సూక్ష్మ-మైనారిటీయే అయినా, సామర్థ్యం,  సేవాప్రదానం పరంగా చాలా పెద్దదని అభివర్ణించారు. వార్తాపత్రికలు, ప్రసార మాధ్యమాల పని వార్తలు అందించడం, ప్రజలకు అవగాహన కల్పించి, సమాజంలో/ప్రభుత్వంలోగల లోపాలను తెరపైకి తేవడం వాటి ప్రధాన బాధ్యతని ప్రధాని వ్యాఖ్యానించారు. విమర్శించే హక్కు మీడియాకు ఎంత ఉందో, సానుకూల వార్తలను తెరపైకి తెచ్చే బాధ్యత కూడా అంతే ముఖ్యమైన బాధ్యతని చెప్పారు.

   త రెండేళ్ల కరోనా కాలంలో దేశ ప్రయోజనాల కోసం జర్నలిస్టులు కర్మయోగులలా పనిచేసిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రధాని అన్నారు. 100 సంవత్సరాల ఈ అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో భారతదేశ మీడియా యొక్క సానుకూల సహకారం భారతదేశానికి ఎంతో సహాయపడిందన్నారు. డిజిటల్ చెల్లింపులు, స్వచ్ఛభారత్ అభియాన్ వంటి కార్యక్రమాలను ప్రోత్సహించడంలో మీడియా పోషించిన సానుకూల పాత్రను కూడా ఆయన ప్రశంసించారు. చర్చలు, ఇష్టాగోష్ఠుల మాధ్యమాలతో ముందుకు సాగే సంప్రదాయాన్ని ఈ దేశం అలవరచుకున్నదని ప్రధాని పేర్కొన్నారు. “వేల ఏళ్లుగా మనం సామాజిక వ్యవస్థలో భాగంగా ఆరోగ్యకరమైన చర్చ, ఆరోగ్యకరమైన విమర్శ, సరైన తార్కికతను నిలబెట్టుకుంటూ వచ్చాం. ఆ మేరకు చాలా క్లిష్టమైన సామాజిక అంశాలపై బహిరంగ, ఆరోగ్యకర చర్చల్లో కూడా పాల్గొన్నాం. ఇది భారతదేశం అనుసరించే విధానం… దీన్ని మనం బలోపేతం చేయాలి” అని ఆయన అన్నారు.

   “ముంబై సమాచార్‌” వారపత్రికగా 1822 జూలై 1న శ్రీ ఫర్దుంజీ మార్జ్‌బాంజీ దీన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1832లో ఇది దినపత్రికగా రూపుమారింది. ఏదిఏమైనా ఈ వార్తాపత్రిక 200 సంవత్సరాలుగా నిరంతరం కొనసాగుతూనే ఉంది.



(Release ID: 1834161) Visitor Counter : 189