ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
జెనీవాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 75వ సదస్సులో ప్రసంగించిన కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
"భారత ప్రధాని సూచించిన విధంగా వ్యాక్సిన్‌లు మరియు ఔషధాలు అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు వ్యాక్సిన్‌లు మరియు వైద్య చికిత్సల ఆమోదం కోసం అనుసరిస్తున్న ఆమోదం ప్రక్రియను క్రమబద్ధీకరించి, ప్రపంచ స్థాయిలో ఆరోగ్య భద్రత కల్పించేందుకు అవసరమైన వ్యవస్థ నిర్మాణం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు తీసుకోవాలి"
భారతదేశం చట్టబద్ధమైన సంస్థ ప్రచురించిన దేశ నిర్దిష్ట ప్రామాణిక సమాచారాన్ని పక్కన పెట్టి అన్ని కారణాల వల్ల చోటుచేసుకుంటున్న మరణాలను ఎక్కువ చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ చూపడం పట్ల ఆశ్చర్యం, అభ్యంతరం వ్యక్తం చేసిన భారతదేశం
భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య మంత్రిత్వ శాఖలు సభ్యులుగా ఉన్న సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏకగ్రీవంగా ఆమోదించిన అసంతృప్తి తీర్మానాన్ని ప్రస్తావించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
ఈ సంవత్సరం శాంతి మరియు ఆరోగ్యాన్ని కలిపే ఇతివృత్తంగా ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన భారత్
నిర్ణయం సమయానుకూలంగా, సంబంధితంగా ఉంది. శాంతి లేకుండా సుస్థిర అభివృద్ధి , సార్వత్రిక ఆరోగ్యం శ్రేయస్సు ఉండదు అని భారతదేశం విశ్వసిస్తోంది: డాక్టర్ మన
Posted On:
23 MAY 2022 9:33PM by PIB Hyderabad
ప్రపంచ స్థాయిలో సుస్థిరమైన ఆరోగ్య వ్యవస్థ నిర్మాణానికి భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయన, ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. జెనీవాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 75వ సదస్సులో డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రసంగించారు. సదస్సులో మాట్లాడిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రపంచ ఆరోగ్య సంస్థను మరింత బలోపేతం చేయాల్సి ఉందని అన్నారు. "భారత ప్రధాని సూచించిన విధంగా వ్యాక్సిన్‌లు మరియు ఔషధాలు అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు వ్యాక్సిన్‌లు మరియు వైద్య చికిత్సల ఆమోదం కోసం అనుసరిస్తున్న ఆమోదం ప్రక్రియను క్రమబద్ధీకరించి, ప్రపంచ స్థాయిలో ఆరోగ్య భద్రత కల్పించేందుకు అవసరమైన వ్యవస్థ నిర్మాణం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు తీసుకోవాలి" అని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ప్రపంచ స్థాయిలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు బాధ్యతాయుతమైన సభ్య దేశంగా భారతదేశం పూర్తి సహాయ సహకారాలు అందించి కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
"శాంతి లేకుండా స్థిరమైన అభివృద్ధి,సార్వత్రిక ఆరోగ్యం, శ్రేయస్సు ఉండదు. ఈ సంవత్సరం శాంతి మరియు ఆరోగ్యాన్ని కలిపే ఇతివృత్తంగా ఆమోదించడం సమయానుకూలంగా, సంబంధితంగా ఉంది" అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
ఇటీవల భారతదేశంలో అన్ని రకాల కారణాల వల్ల భారతదేశంలో సంభవించిన మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల చేపట్టిన అధ్యయనం పట్ల సమావేశంలో భారత్ ఆశ్చర్యం వ్యక్తం చేసి అభ్యంతరం తెలిపింది. ఈ అంశంలో భారతదేశం చట్టబద్ధమైన సంస్థ ప్రచురించిన దేశ నిర్దిష్ట ప్రామాణిక సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోలేదని భారత్ పేర్కొంది. మరణాల గణనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుసరించిన విధానం, పద్ధతిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అన్ని రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య మంత్రిత్వ శాఖలు సభ్యులుగా ఉన్న సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏకగ్రీవంగా ఆమోదించిన అసంతృప్తి తీర్మానాన్ని సదస్సు దృష్టికి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తీసుకుని వచ్చారు.
సదస్సులో కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రసంగం పూర్తి పాఠం:
శాంతి మరియు ఆరోగ్యాన్ని కలిపే ఈ సంవత్సరం ఇతివృతం సమయానుకూలంగా, సంబంధితమైన అంశంగా ఉంది. శాంతి లేకుండా స్థిరమైన అభివృద్ధి, సార్వత్రిక ఆరోగ్యం, శ్రేయస్సు లభించవని భారతదేశం విశ్వసిస్తోంది.
లక్ష్యం మరియు ఫలితాల ఆధారిత పద్ధతిలో అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యాన్ని సాధించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన పాత్ర పోషిస్తుందని భారతదేశం దృఢంగా విశ్వసిస్తోంది. సమకాలీన వాస్తవాల ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యాల మేరకు పని చేసేలా చూసే అంశంలో సమిష్టి ప్రయత్నాలు జరగాలి, సభ్య దేశాల ఆకాంక్షలను ప్రతిబింబించేలా, సభ్య దేశాల పర్యవేక్షణలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పనిచేసేలా చూసేందుకు భారతదేశం ఎల్లప్పుడూ నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తోంది.
అయితే, ఇటీవల భారతదేశం మరణాల సంఖ్యను ఎక్కువగా చూపిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక భారతదేశానికి ఆశ్చర్యం కలిగించి ఆందోళనకు గురిచే శాయి. దీనిపై భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారతదేశంలో చట్టబద్ధమైన సంస్థ ప్రచురించిన దేశ నిర్దిష్ట ప్రామాణికమైన సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిగణనలోకి తీసుకోలేదు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 263 ప్రకారం భారతదేశంలో అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రుల ప్రాతినిధ్య సంస్థగా ఏర్పాటైన సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఈ అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుసరించిన విధానం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ అంశంపై తమ అభ్యంతరాలు, అసంతృప్తిని తెలియజేయాలని తీర్మానంలో నన్ను కోరారు.
ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ నిర్మాణంలో ప్రపంచ ఆరొగ్య సంస్థ వ్యవహారాలు కేంద్రీకృతంగా జరగాల్సి ఉంటుంది. దీనికోసం దశలవారీగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు సభ్య దేశాలు అందిస్తున్న సహకారాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అయితే అది జవాబుదారీతనం, డబ్బు కోసం విలువ మరియు సభ్య దేశాలతో కలిసి పనిచేసే అంశాలకు అనుసంధానించబడి జరగాలి.
మేధో సంపత్తి కి సంబంధించిన అంశాలతో సహా వైద్యపరమైన అన్ని అంశాలు, తక్కువ ఖర్చుతో పరిశోధన , సాంకేతికత బదిలీ, ప్రాంతీయ ఉత్పాదక సామర్థ్యాలు పెంపు లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని భారతదేశం కోరుతోంది. ప్రతి ఒక్కరికి వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రావాలని భారతదేశం ప్రధాన లక్ష్యం.
టీకాలు మరియు ఔషధాలు అందరికీ అందుబాటులోకి వచ్చేలా చూసేందుకు ప్రపంచ వ్యాప్త వ్యవస్థ అభివృద్ధి చెందాలని భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భావిస్తున్నారు. వ్యాక్సిన్‌లు మరియు ఔషధాలు అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు వ్యాక్సిన్‌లు మరియు వైద్య చికిత్సల ఆమోదం కోసం అనుసరిస్తున్న ఆమోదం ప్రక్రియను క్రమబద్ధీకరించి, ప్రపంచ స్థాయిలో ఆరోగ్య భద్రత కల్పించేందుకు అవసరమైన వ్యవస్థ నిర్మాణం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు తీసుకోవాలి. ప్రపంచ స్థాయిలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు బాధ్యతాయుతమైన సభ్య దేశంగా భారతదేశం పూర్తి సహాయ సహకారాలు అందించి కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది.
***
(Release ID: 1827781)
Visitor Counter : 180