ప్రధాన మంత్రి కార్యాలయం
కెనడాలోని అంటారియోలో ‘సనాతన్ మందిర్ కల్చరల్ సెంటర్’ను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం ఈ కేంద్రం ప్రాంగణంలో సర్దార్ పటేల్ విగ్రహావిష్కరణ నిర్వహించారు;
“సర్దార్ పటేల్ విగ్రహం మన సాంస్కృతిక విలువలను బలోపేతం
చేయడమేగాక రెండు దేశాల మధ్య సంబంధాలకు చిహ్నం కాగలదు”;
“భారత్ ఒక దేశం మాత్రమే కాదు; ఒక దృక్పథం.. ఒక సంస్కృతి కూడా”;
“ఇతరులకు నష్టంద్వారా తన ప్రగతి గురించి భారత్ కలలోనైనా ఆకాంక్షించదు”;
“భారతదేశం ఆధునికం.. ప్రగతిశీలం మాత్రమేగాక తన దృక్పథం..
తాత్త్వికత.. మూలాలతో లోతుగా ముడిపడి ఉండాలని
మన స్వాతంత్ర్య సమరయోధులు కలలుగన్నారు”;
“వెయ్యేళ్ల వారసత్వాన్ని గుర్తుచేసేందుకే సర్దార్ పటేల్
సోమనాథ్ ఆలయాన్ని పునరుద్ధరించారు”;
“సర్దార్ పటేల్ కలలుగన్న నవ భారతం సృష్టించే ప్రతిజ్ఞకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా మనల్ని మనం పునరంకితం చేసుకుంటున్నాం”;
“భారత అమృతోత్సవ ప్రతినలు అంతర్జాతీయంగా
విస్తరిస్తూ ప్రపంచాన్ని సంధానిస్తున్నాయి”;
“మన కఠోర పరిశ్రమ మన కోసం మాత్రమే కాదు…
విశ్వమానవ సంక్షేమం భారత ప్రగతితో ముడిపడి ఉంది”
Posted On:
01 MAY 2022 9:10PM by PIB Hyderabad
కెనడాలోని అంటారియో రాష్ట్ర పరిధిలోగల మార్ఖం నగరంలో ‘సనాతన్ మందిర్ సాంస్కృతిక కేంద్రం’ (ఎస్‌ఎంసీసీ) ప్రాంగణంలో సర్దార్ పటేల్ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఇందులో భాగంగా తొలుత స్వాతంత్ర్య అమృత్ మహోత్సవాలు, గుజరాత్ ఆవిర్భావ దినోత్సవాల నేపథ్యంలో ప్రవాస భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. కెనడాలో 2015నాటి పర్యటన సందర్భంగా సనాతన్ మందిర్ సాంస్కృతి కేంద్రం సానుకూల ప్రభావం తన అనుభవంలోకి వచ్చిందని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఆ సమయంలో భారతీయ సంతతి ప్రవాస ప్రజానీకం చూపిన ప్రేమానురాగాలు తన మనసును కదిలించాయని గుర్తు చేసుకున్నారు. అలాగే “సర్దార్ పటేల్ విగ్రహం మన సాంస్కృతిక విలువలను బలోపేతం చేయడమేగాక రెండు దేశాలమధ్య స్నేహ సంబంధాలకు చిహ్నం కాగలదు” “సనాతన్ మందిర్‌లోని సర్దార్ పటేల్ విగ్రహం మన సాంస్కృతిక విలువలను బలోపేతం చేయడమే కాకుండా రెండు దేశాల మధ్య సంబంధాలకు ప్రతీకగానూ రూపొందుతుంది” అని ప్రధానమంత్రి అన్నారు.
ప్రవాస భారతీయులలో లోతుగా ప్రస్ఫుటమయ్యే నైతికత, విలువల గురించి వివరిస్తూ- భారతీయులు ప్రపంచంలో ఎక్కడైనా, ఎన్ని తరాలపాటైన జీవించినప్పటికీ వారిలో భారతీయత, భారతదేశంపట్ల విధేయత ఎన్నడూ ఇసుమంతైనా తగ్గవని ప్రధాని సగర్వంగా వ్యాఖ్యానించారు. భారతీయులు ఏ దేశంలో ఉన్నా తాము నివసించే ప్రాంతం ప్రగతి కోసం పూర్తి అంకితభావం, నిజాయితీ, నిబద్ధతలతో పని చేస్తారని ప్రశంసించారు. వారెక్కడికి వెళ్లినా ప్రజాస్వామ్య విలువలను, కర్తవ్య పరాయణతను వీడరని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఎందుకంటే- “భారత్ ఒక దేశం మాత్రమే కాదు; ఒక దృక్పథం.. ఒక సంస్కృతి కూడా… భారతదేశమంటేనే ‘వసుధైక కుటుంబకం’ అనే సమున్నత ఆలోచన ధోరణిగలది. ఇతరులకు నష్టంద్వారా తన ప్రగతి గురించి భారత్ కలలోనైనా ఆకాంక్షించదు” అని స్పష్టం చేశారు.
కెనడాలోని సనాతన్ మందిర్ సాంస్కృతిక కేంద్రం లేదా ఇటువంటి సంస్థలు ఏ దేశంలోనైనా ఆ దేశపు విలువలను కూడా సుసంపన్నం చేస్తాయని ప్రధానమంత్రి అన్నారు. కెనడాలో స్వాతంత్ర్య అమృత మహోత్సవాల నిర్వహణ ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలకు ప్రతీక కాగలదని ఆయన అన్నారు. “కెనడా ప్రజలు భారతదేశానికి మరింత సన్నిహితం కావడంలో భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాల నిర్వహణ ఒక అవకాశం కాగలదని నేను విశ్వసిస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు. ఆ ప్రదేశం, అక్కడ సర్దార్ పటేల్ విగ్రహం నవ భారత విశాల చిత్రణకు సంకేతాలని ఆయన అభివర్ణించారు. భారతదేశం ఆధునికం.. ప్రగతిశీలం మాత్రమేగాక తన దృక్పథం.. తాత్త్వికత.. మూలాలతో లోతుగా ముడిపడి ఉండాలని మన స్వాతంత్ర్య సమరయోధులు కలలుగన్నారని గుర్తుచేశారు. కాబట్టే నవ స్వతంత్ర భారతం ఏర్పాటు కాగానే వేల యేళ్ల మన వారసత్వాన్ని సంసర్మించుకోవడంలో భాగంగా సర్దార్ పటేల్ సోమనాథ్ ఆలయాన్ని పునరుద్ధరించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో “సర్దార్ పటేల్ కలలుగన్న నవ భారతం సృష్టించే ప్రతిజ్ఞకు స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్భంగా మనల్ని మనం పునరంకితం చేసుకుంటున్నాం. ఈ దిశగా ‘ఐక్యతా విగ్రహం’ మనకు ఎనలేని ప్రేరణనిస్తుంది” అని ప్రధాని నొక్కిచెప్పారు. సనాతన్ మందిర్ సాంస్కృతిక కేంద్రంలో ‘ఐక్యతా విగ్రహం’ నమూనా ఏర్పాటు చేయడమంటే- భారత అమృతకాల ప్రతిజ్ఞలు దేశ సరిహద్దులకే పరిమితం కాదని, ప్రపంచం మొత్తాన్నీ సంధానిస్తూ ఈ ప్రతిజ్ఞ విశ్వవ్యాప్తం అవుతుండటమేనని ఆయన అన్నారు.
అమృత వాగ్దానాల్లోని అంతర్జాతీయ కోణాన్ని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. మనం స్వయం సమృద్ధ భారతం గురించి మాట్లాడటమంటే ప్రపంచ ప్రగతికి కొత్త అవకాశాలు కల్పించడం గురించి మాట్లాడటమేనని అన్నారు. అదేవిధంగా యోగాపై ప్రచారంలో ప్రతి ఒక్కరూ వ్యాధిరహితులేనన్న భావన అంతర్లీనంగా ఉంటుందని చెప్పారు. సుస్థిర ప్రగతి, వాతావరణ మార్పు వంటి అంశాలపై కృషిలో మొత్తం మానవాళికి భారత్ ప్రాతినిధ్యం వహిస్తోందన్నారు. “మన కఠోర పరిశ్రమ మన కోసం మాత్రమే కాదు… విశ్వమానవ సంక్షేమమే భారత ప్రగతితో ముడిపడి ఉంది” అన్నారు. ఈ సందేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భారత ప్రవాసులు మరింత మెరుగైన పాత్ర పోషించాలన్న తన పిలుపును పునరుద్ఘాటిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.
DS
(Release ID: 1822007)
Visitor Counter : 209
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam