ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు తన అధికార నివాసం నంబర్ 7, లోక కల్యాణ్ మార్గ్ లో సిక్కు ప్రతినిధివర్గానికి ఆతిథ్యం ఇచ్చారు. విభిన్న రంగాలకు చెందిన ప్రజలు ఈ బృందంలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ సింగ్ పురి కూడా ఉన్నారు.
సిక్కు సమాజంతో తనకు గల దీర్ఘకాలిక అనుబంధాన్ని ఈ సందర్భంగా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. “గురుద్వారాలకు వెళ్లడం, సేవలో పాల్గొనడం, లంగర్ సేవించడం, సిక్కు కుటుంబాలతో వారి ఇళ్లలో కలిసి గడపడం నా జీవితంలో ఒక భాగం. సిక్కు గురువుల పాదాలు అప్పుడప్పుడూ ప్రధానమంత్రి నివాసంలో తారాడుతూ ఉంటాయి, వారి సాంగత్యం పొందే భాగ్యం నాకు కలిగింది” అని ప్రధానమంత్రి చెప్పారు. తాను విదేశాలు సందర్శించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కు వైభవంతో ముడిపడి ఉన్న ప్రదేశాలు సందర్శిస్తూ ఉంటానని ఆయన తెలిపారు.
“మన గురువులు సాహసం, సేవాభావాన్ని మనకు బోధించారు. భారత ప్రజలు ప్రపంచంలోని భిన్న ప్రాంతాలకు ఎలాంటి వనరులు లేకుండా వెళ్లి శ్రమశక్తితో విజయం సాధించారు. నవభారతం స్ఫూర్తి కూడా ఇదే” అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
నవభారత మనోభావాలను ప్రధానమంత్రి ప్రశంసిస్తూ నవభారతం కొత్త శిఖరాలు అధిరోహిస్తూ ప్రపంచం అంతటా తన గుర్తును వ్యాపింపచేస్తోందన్నారు. ఇందుకు కరోనా మహమ్మారి కాలమే పెద్ద ఉదాహరణ అని చెప్పారు. మహమ్మారి ప్రారంభ సమయంలో పాత కాలం నాటి ఆలోచనా ధోరణులున్న వారు భారతదేశం పట్ల ఆందోళన వెలిబుచ్చుతూ వచ్చారు. కాని ఇప్పుడు మహమ్మారిని ఎంత దీటుగా ఎదుర్కొనగలమన్న విషయంలో ప్రజలు ఒక ఉదాహరణను అందించారు. భారతదేశ భారీ జనాభాను చూసి అంతకు ముందు ఆ ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. అలాగే భారతదేశంలో తయారైన వ్యాక్సిన్ల విషయంలో కూడా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని నేను ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ తయారీ దేశంగా భారత్ నిలిచింది అన్నారు. “మన మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్లతోనే 99 శాతం వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి కావడం పట్ల మీరందరూ గర్వపడతారు” అని కూడా ప్రధానమంత్రి చెప్పారు.
ప్రస్తుత కష్టకాలంలో భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థగా కూడా మారిందని ప్రధానమంత్రి అన్నారు. “దేశంలో యునికార్న్ ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. పెరుగుతున్న భారతదేశం ప్రతిష్ఠ, విశ్వసనీయత భారత సంతతి ప్రజలకు ఎంతో సంతృప్తిని, గర్వాన్ని అందిస్తోంది” అని చెప్పారు. “నేనెప్పుడూ మన భారత సంతతి ప్రజలను భారతదేశానికి రాష్ట్రదూతలుగా పరిగణిస్తాను. మీరంతా మా భారతికి బలమైన గొంతుగా, అతి పెద్ద గుర్తింపుగా నిలిచారు” అన్నారు. భారతదేశం అందుకుంటున్న శిఖరాలు చూసి భారత సంతతి కూడా గర్వపడుతుందని ప్రధానమంత్రి తెలిపారు. “మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా “ఇండియా ఫస్ట్” అనేది మన ప్రాథమిక విశ్వాసం కావాలి” అని సూచించారు.
సిక్కు గురువులు అందించిన సేవలు, త్యాగానికి ప్రధానమంత్రి శిరసు వంచి అభివాదం తెలుపుతూ గురు నానక్ దేవ్ జీ ఏ విధంగా జాతిని చైతన్యవంతం చేసి అంధకారం నుంచి వెలుపలికి లాగారో, వెలుగుబాట చూపారో గుర్తు చేశారు. “గురువులు భారతదేశం అంతటా పర్యటించారు. ఎక్కడకు వెళ్లినా వారు తమ గుర్తులు, స్ఫూర్తి వదిలారు” అని చెప్పారు. అలాగే గురువుల పట్ల దేశం అంతటా గౌరవ, విశ్వాసాలున్నాయన్నారు. గురువుల పాదాలు భారతదేశాన్ని పవిత్రం చేయడంతో పాటు ప్రజలకు స్ఫూర్తిమంతంగా నిలిచాయని చెప్పారు. “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” సాంప్రదాయానికి సజీవ నిదర్శనం సిక్కు సాంప్రదాయం అని ప్రధానమంత్రి చెబుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలోను, స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత కూడా సిక్కు జాతి అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. “సాహసం, శక్తి, శ్రమించి పని చేయడానికి సిక్కు సమాజం పర్యాయపదం” అన్నారు.
భారతదేశ స్వాతంత్ర్య పోరాటంపై తన విజన్ ను ప్రధానమంత్రి మరోసారి వివరించారు. ఈ పోరాటం కొంత కాలానికే పరిమితం కాదు, సంవత్సరాల చైతన్యం, ఆదర్శాలు, ఆధ్యాత్మిక విలువలు, “తపస్య”కు అదొక చిహ్నం అన్నారు.
గురు తేజ్ బహదూర్ 400వ ప్రకాశ్ పూరబ్, గురు నానక్ దేవ్ జీ 550వ ప్రకాశ్ పూరబ్, గురు గోవింద్ సింగ్ జీ 350వ పవిత్ర పూరబ్ వంటి పవిత్ర వేడుకల్లో పాల్గొనే అదృష్టం తనకు కలగడం పట్ల ప్రధానమంత్రి ఆనందం ప్రకటించారు. అలాగే కర్తార్ పూర్ కారిడార్ నిర్మాణం, లంగర్ ను పన్ను రహితం చేయడం, హర్ మందిర్ సాహిబ్ కు ఎఫ్ సిఆర్ఏ అనుమతి ఇవ్వడం, గురుద్వారాల పరిసరాల పరిశుభ్రత వంటివన్నీ ఈ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని చెప్పారు.