మంత్రిమండలి

కొన్ని ఖనిజాలకు సంబంధించి రాయల్టీ రేటును సవరిస్తూ గనులు మరియు ఖనిజాల (అభివృద్ధి మరియు నియంత్రణ) చట్టం, 1957(ఇక ముందు 'చట్టం'గా వ్యవహరించబడుతుంది) రెండో షెడ్యూల్ కు ప్రతిపాదించిన సవరణలు ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం

Posted On: 09 MAR 2022 1:29PM by PIB Hyderabad

కొన్ని ఖనిజాలకు సంబంధించి రాయల్టీ రేటును సవరించేందుకు అవకాశం కల్పించే విధంగా గనులు మరియు ఖనిజాల (అభివృద్ధి మరియు నియంత్రణ) చట్టం, 1957 రెండో షెడ్యూల్కు సవరణలు చేయాలన్న ఖనిజ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.  గ్లాకోనైట్, పొటాష్, ఎమరాల్డ్, ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్ (పిజిఎం ), అండలూసైట్, సిల్లిమనైట్ మరియు మాలిబ్డినంలకు సంబంధించి రాయల్టీ రేటును  సవరించాలని ప్రతిపాదించారు.

మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం వల్ల  గ్లాకోనైట్, పొటాష్, ఎమరాల్డ్, ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్ (PGM), అండలూసైట్, సిల్లిమనైట్ మరియు మాలిబ్డినం గనులను వెళ్ళాం వేసేందుకు వీలవుతుంది. దీనివల్ల ఈ ఖనిజాల దిగుమతులు తగ్గుతాయి. దిగుమతులు తగ్గడంతో పాటు ఖనిజ రంగంతో పాటు ఉత్పత్తి రంగంలో  ఉపాధి అవకాశాలు పెరిగి సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. ఖనిజ రూపంలో లభించే అండలూసైట్, సిల్లిమనైట్ మరియు కైనైట్‌లకు రాయల్టీ రేటు అదే స్థాయిలో ఉంచబడుతుంది.

మంత్రివర్గం తెలిపిన ఆమోదం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ సమగ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఖనిజాల దిగుమతులు గణనీయంగా తగ్గుతాయి. దిగుమతులు తగ్గితే విలువైన విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది.  ఖనిజాల స్థానిక ఉత్పత్తి పెరగడం వల్ల వీటి అవసరాల కోసం విదేశాలపై ఎక్కువగా ఆధారపడాల్సి ఉండదు.  దేశంలోనే తొలిసారిగా గ్లాకోనైట్, పొటాష్, ఎమరాల్డ్, ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్, అండలూసైట్ మరియు మాలిబ్డినమ్‌లకు సంబంధించి మినరల్ బ్లాక్‌లను  వేలం వేసేందుకు మంత్రివర్గ నిర్ణయం దోహదపడుతుంది.

పారదర్శకంగా, వివక్షకు తావులేకుండా దేశ ఖనిజ సంపదను వేలం పద్ధతిలో కొన్ని మినహాయింపులతో కేటాయించేందుకు వీలు కల్పించే విధంగా 2015లో చట్టానికి సవరణలు చేయడంతో దేశంలో నూతన అధ్యాయం ప్రారంభమయింది.  2015లో ప్రారంభమైన వేలం విధానం పరిపక్వత సాధించింది. ఖనిజ రంగానికి మరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో 2021లో చట్టంలో మరికొన్ని సవరణలు చేయడం జరిగింది. సంస్కరణల అమలులో భాగంగా  ఖనిజ బ్లాకుల వేలం, ఉత్పత్తిని పెంచడం, దేశంలో వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడం లాంటి చర్యలను అమలు చేసిన ప్రభుత్వం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఖనిజ రంగం కీలక పాత్ర పోషించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ సాధన పిలుపును స్ఫూర్తిగా తీసుకున్న గనుల శాఖ దేశంలో ఖనిజ నిక్షేపాలను వెలికి తీసేందుకు కృషి ప్రారంభించింది. దీనితో వేలం వేసేందుకు మరిన్ని గనులు అందుబాటులోకి వచ్చాయి. ఇనుప ఖనిజం, బాక్సైట్, సున్నపురాయి వంటి సాంప్రదాయ ఖనిజాల కోసం మాత్రమే కాకుండా, దిగుమతి చేసుకుంటున్న  ఖనిజాలు, ఎరువుల ఖనిజాలు, క్లిష్టమైన ఖనిజాలు మరియు ఖనిజాలను వెలికి తీసేందుకు అన్వేషణ కార్యకలాపాలు పెరిగాయి.

గత 4-5 సంవత్సరాలలో, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వంటి కేంద్ర సంస్థలు అన్వేషణ సాగించి ఇంతవరకు వెలికి తీయని గనులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు సమర్పించాయి. దేశ అవసరాల కోసం ఇంతవరకు  గ్లాకోనైట్, పొటాష్, ఎమరాల్డ్, ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్, అండలూసైట్ మరియు మాలిబ్డినమ్‌లను పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతోంది. ఖనిజ రంగంలో స్వావలంబన సాధించేందుకు అవకాశం కల్పించే విధంగా గ్లాకోనైట్, పొటాష్, ఎమరాల్డ్, ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్, అండలూసైట్ మరియు మాలిబ్డినమ్‌ గనులను వేలం వేసేందుకు  అంగీకరించాయి. అయితే, గ్లాకోనైట్, పొటాష్, ఎమరాల్డ్, ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్, అండలూసైట్ మరియు మాలిబ్డినమ్‌లకు రాయల్టీ రేటును విడిగా నిర్ణయించక పోవడంతో వీటిని వెలికి తీసేందుకు అవసరమైన సహకారం అందలేదు. 

దీనిని గుర్తించిన గనుల శాఖ వేలం లో ఎక్కువ మంది పాల్గొనేలా చూసేందుకు   సహేతుకమైన రాయల్టీ రేట్లు ప్రతిపాదించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం వీటికి ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలతో విస్తృతంగా చర్చలు జరిపిన తరువాత ఈ  రేట్లు   ఖరారు చేయడం జరిగింది. ఈ ఖనిజాలకు సంబంధించి బ్లాకులను వేలం వేసేందుకు అవసరమైన సరాసరి అమ్మకం ధరను నిర్ణయించేందుకు గనుల శాఖ అవసరమైన సహకారం అందిస్తుంది. 

రాష్ట్ర ప్రభుత్వాల  సహకారంతో దేశంలో 145 మినరల్ బ్లాక్‌లు విజయవంతంగా వేలం వేయబడ్డాయి. 2021 సంవత్సరంలో చట్టానికి చేసిన సవరణల ద్వారా అమల్లోకి వచ్చిన  సంస్కరణలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం తో   2021-22 ఆర్థిక సంవత్సరంలో 146 బ్లాకులకు పైగా వేలానికి ఉంచబడ్డాయి. వీటిలో  34 బ్లాకుల వేలం ప్రక్రియ  ఈ ఆర్థిక సంవత్సరంలో విజయవంతంగా పూర్తయింది.   గ్లాకోనైట్/పొటాష్, ఎమరాల్డ్, ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్ , అండలూసైట్ మరియు మాలిబ్డినం వంటి ఖనిజాల కోసం రాయల్టీని నిర్ణయించి సరాసరి అమ్మకం ధరలు ఖరారు చేయడం వల్ల  వేలం కోసం వచ్చే  బ్లాక్‌ల సంఖ్యను పెంచుతుంది. 

గ్లాకోనైట్ మరియు పొటాష్ వంటి ఖనిజాలను వ్యవసాయంలో ఎరువుగా ఉపయోగిస్తారు. వివిధ పరిశ్రమలు మరియు  వినూత్న అవసరాల కోసం ఉపయోగించే  ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్  అధిక విలువ కలిగిన మెటల్. అండలూసైట్, మాలిబ్డినం వంటి ఖనిజాలు పారిశ్రామిక అవసరాలకు  ఉపయోగించే ముఖ్యమైన ఖనిజాలు. 

దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దేశంలో ఈ ఖనిజాల ఉత్పత్తిని ప్రోత్సహించడం వల్ల  పొటాష్ ఎరువులు మరియు ఇతర ఖనిజాల దిగుమతులను తగ్గించడానికి వీలవుతుంది. గనుల మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ చర్య మైనింగ్ రంగంలో ఉపాధి అవకాశాలను  కూడా పెంచుతుందని భావిస్తున్నారు. అనుబంధ  పరిశ్రమలు మరియు వ్యవసాయానికి అవసరమైన   ఖనిజాల లభ్యతను కూడా ప్రభుత్వ చర్య మెరుగు పరుస్తుంది. 

***(Release ID: 1804416) Visitor Counter : 153