వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

పిఎం గతిశక్తిపై తన తొలి బడ్జెట్‌ అనంతర వెబినార్‌ను నిర్వహించనున్న డిపిఐఐటి


ప్రభుత్వ, పరిశ్రమ, విద్యారంగాలను ఒక వేదికపైకి తీసుకురానున్న వెబినార్‌

గతిశక్తి లక్ష్యాలను, 2022 కేంద్ర బడ్జెట్‌లో కల్పించిన ప్రాధాన్యతను తన ప్రసంగంలో ప్రతినిధులకు వివరించనున్న ప్రధానమంత్రి

Posted On: 27 FEB 2022 11:31AM by PIB Hyderabad

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ లో ప్రకటించిన పిఎం గతిశక్తి జాతీయ ప్రాజెక్డుపై పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ), కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖలు  2022 ఫిబ్రవరి 28 (సోమవారం) వెబినార్‌ నిర్వహించనున్నది. పిఎం గతిశక్తి ప్రాధాన్యతను వివరించి వేగవంతమైన ఆర్ధిక పురోభివృద్ధి సాధించేందుకు కల్పించవలసిన చర్యలను చర్చించే లక్ష్యంతో డీపీఐఐటీ, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖలు తమ బడ్జెట్‌ అనంతర తొలి వెబినార్‌ను నిర్వహిస్తున్నాయి.  

వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, విద్యారంగ నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులు వెబినార్‌లో పాల్గొంటారు. దేశ రవాణా రంగ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అనుసరించవలసిన వ్యూహాన్ని వెబినార్‌లో చర్చించడం జరుగుతుంది.  

గతిశక్తి ప్రాజెక్టు ప్రాధాన్యతను, భవిష్యత్‌ ప్రణాళికను, కేంద్ర బడ్జెట్‌లో దీనికి సంబంధించి పొందుపరిచిన అంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివరిస్తారు. ముగిఐపు సమావేశానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్‌ గోయల్‌ అధ్యక్షత వహిస్తారు. వివిధ అంశాలపై జరిగిన చర్చల వివరాలను నిపుణులు ముగింపు సమావేశంలో మరో సారి చర్చించి, నిర్ణయాలను అమలు చేసేందుకు అనుసరించవలసిన కార్యాచరణ కార్యక్రమాలు ఖరారు చేస్తారు.  

ప్రధానమంత్రి ప్రసంగం ముగిసిన తర్వాత ప్రతినిధులు అయిదు బృందాలుగా విడిపోయి, భారతదేశ రవాణా రంగానికి సంబంధించిన వివిధ అంశాలను లోతుగా చర్చిస్తారు.

'దేశం మొత్తానికి ఒకే విధమైన ప్రణాళిక' అనే అంశంపై డీపీఐఐటీ, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అనురాగ్‌ జైన్‌ అధ్యక్షతన చర్చలు జరుగుతాయి. పథకం సమగ్ర ప్రణాళిక, దీనిని అమలు చేసేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికఫై చర్చలు జరుగుతాయి. ఈ సదస్సు భాస్కరాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్ జియో-ఇన్ఫర్మేటిక్స్ అభివృద్ధి చేసిన గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ పోర్టల్‌పై దృష్టి సారిస్తుందిడైనమిక్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇంటర్‌ఫేస్ ద్వారా పనిచేసే ఈ వ్యవస్థ తాజా భౌగోళిక సమాచారాన్ని వాటాదారులకు అందిస్తుంది.

' సహకార సమాఖ్య స్ఫూర్తి మరియు మౌలిక సదుపాయాల కల్పనకు మరిన్ని పెట్టుబడులు' అనే అంశంపై రెండవ సదస్సు జరుగుతుంది. డీపీఐఐటీ, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ రవాణా ప్రత్యేక కార్యదర్శి శ్రీ అమిత్‌ లాల్‌ మీనా అధ్యక్షతన సదస్సు జరుగుతుంది. భారీ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల రూపకల్పన, నిర్మాణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం అనే అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. బడ్జెట్‌లో కేటాయించిన నిధులు, ప్రాజెక్టులను చేపట్టేందుకు అందుబాటులో ఉన్న నిధుల అంశాన్ని కూడా చర్చిస్తారు.

'రవాణా రంగ సామర్థ్య పెంపుదలకు గల అవకాశాలు' అనే అంశంపై రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ గిరిథర్‌ అర్మేనే నేతృత్వంలో చర్చలు జరుగుతాయి. సాగరమాల, పర్వతమాల, జాతీయ రహదారుల బృహత్తర ప్రణాళిక తో పాటు పిఎం గతిశక్తి ప్రాజెక్టు మల్టీ-మోడల్ కార్గో టెర్మినల్స్‌పై దృష్టి సారించి చర్చలు జరుగుతాయి.  

'రవాణా రంగ సిబ్బంది అవసరాలు-నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు' అనే అంశంపై కేంద్ర నైపుణ్యాభివృద్థి, ప్రోత్సాహక మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ రాజేష్‌ నేతృత్వంలో చర్చలు జరుగుతాయి. పీఎం గతిశక్తి ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు అవసరమైన మానవ వనరులను అభివృద్ధి చేసేందుకు అమలు చేయాల్సిన కార్యక్రమాలను ఈ సదస్సులో చర్చిస్తారు.

భారత రవాణారంగంలో యులిప్‌ ద్వారా విప్లవాత్మక మార్పులుఅనే అంశంపై నీతి ఆయోగ్‌ సిఈఓ శ్రీ అమితాబ్‌ కాంత్‌ అధ్యక్షతన తుది సదస్సు జరుగుతుంది. ఆత్మ నిర్భర్‌ భారత్‌ సాధనలో రవాణా రంగం కీలకంగా ఉంటుంది. ఆత్మ నిర్భర్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధించేందుకు కీలకమైన రవాణా రంగాన్ని పటిష్టం చేయవలసి ఉంటుంది. దీనికోసం రవాణా రంగంతో సంబంధం ఉన్న అన్ని వర్గాల మధ్య సమన్వయం సాధించాల్సి ఉంటుంది. దీనిని సాధించేందుకు యునిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్‌ఫేస్ ప్లాట్‌ఫారమ్ (యులిప్‌అనే డిజిటల్ వ్యవస్థను అభివృద్థి చేయడం జరుగుతుంది.  సరకు రవాణా వ్యవస్థలో యునిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్‌ఫేస్ ప్లాట్‌ఫారమ్ ఏకగవాక్ష విధానంగా అమలు జరుగుతుంది. ఈ ప్రాజెక్టు అమలులో ఇంతవరకు సాధించిన ప్రగతిని సదస్సులో చర్చిస్తారు.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రవాణా రంగ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలన్న లక్ష్యంతొ పిఎం గతిశక్తి ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. రవాణా రంగంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించి ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రజలు, వాహనాలు ప్రయాణం సాగించేందుకు అవసరమైన సౌకర్యాలను ఈ ప్రాజెక్టు ద్వారా కల్పించడం జరుగుతుంది. సులభతర వాణిజ్యం, సౌలభ్య జీవన సౌకర్యాలను కల్పించి, ఎటువంటి అంతరాయం లేకుండా రవాణా వ్యవస్థ సాగేలా చూసేందుకు చేపట్టిన పనులను తక్కువ ఖర్చుతో వేగంగా అమలు చేయాలనే లక్ష్యఃతో జాతీయ ప్రాజెక్టుగా పిఎం గతిశక్తి ప్రాజెక్ట్ అమలు జరుగుతుంది. 

***



(Release ID: 1801630) Visitor Counter : 139