ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆరోగ్య బడ్జెట్ లో కేంద్ర స్థానాన్ని ఆక్రమించిన సాంకేతికత
డిజిటల్ ఇండియా దిశగా మరొక కీలక అడుగువేస్తూ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో భాగంగా జాతీయ డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థకు నూతన విస్త్రత వేదిక
అత్యుత్తమ 23 టెలి మానసిక ఆరోగ్య కేంద్రాల నెట్‌వర్క్‌తో జాతీయ టెలి మానసిక ఆరోగ్య కార్యక్రమం త్వరలో ప్రారంభం
Posted On:
01 FEB 2022 1:07PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో ఆరోగ్య రంగంలో సాంకేతికత కేంద్ర స్థానాన్ని ఆక్రమించింది. దేశవ్యాప్తంగా ఆరోగ్య, వైద్య సంరక్షణను విస్తరింపచేయడంలో డిజిటల్ టెక్నాలజీ పోషిస్తున్న కీలక పాత్రను సూచించే, డిజిటల్‌గా మద్దతునిచ్చే రెండు నూతన పథకాలను ప్రకటించారు.
కోవిడ్-19 మహమ్మారి ముద్రలు నేటి ప్రకటనలలో ప్రతిఫలించాయి. మహమ్మారి ఫలితంగా ఏర్పడిన ఆరోగ్య, ఆర్థిక దుష్పరిణామాలను ఎదుర్కొన్నవారి పట్ల కేంద్ర ఆర్థిక మంత్రి ముందుగా సానుభూతిని వ్యక్తం చేశారు. గత రెండేళ్ళల్లో ఆరోగ్యరంగ మౌలికసదుపాయాలను వేగంగా మెరుగుపరచడం వల్ల సవాళ్ళను ఎదుర్కొనగల బలమైన స్థితిలో దేశం ఉందని ఆమె ఉద్ఘాటించారు. మహమ్మారిపై పోరాటంలో మన టీకాకరణ వేగవంతమైన ప్రచారం, కవరేజీ అన్నవి ఎంతో తోడ్పడ్డాయని తన బడ్జెట్ ఉపన్యాసంలో ఆమె అంగీకరించారు. అందరి కృషి, సహకారంతో (సబ్‌కా ప్రయాస్) బలమైన వృద్ధి దిశగా మన ప్రయాణాన్ని కొనసాగించగలమనే విశ్వాసం తనకు ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు.
గత ఏడాది బడ్జెట్‌లో చేపట్టిన చొరవలు చెప్పుకోదగిన పురోగతిని సాధించాయని పట్టి చూపుతూ, ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా వాటికి తగినంత కేటాయింపులు చేసినట్టు శ్రీమతి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, టీకాకరణ కార్యక్రమ వేగవంతమైన అమలు, మహమ్మారి తాజా వేవ్‌కు దేశవ్యాప్తంగా బలమైన స్పందన అన్నవి అందరికీ సుస్పష్టమని పేర్కొన్నారు.
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్
జాతీయ డిజిటల్ ఆరోగ్య వాతావరణ వ్యవస్థ కోసం నూతన బహిరంగ వేదికను ప్రారంభించనున్నారు. ఆరోగ్య సంరక్షకులు, ఆరోగ్య సౌకర్యాలు, ప్రత్యేక ఆరోగ్య గుర్తింపు, సమ్మతి చట్రానికి సంబంధించిన డిజిటల్ రిజిస్ట్రీలను సమగ్రంగా కలిగి ఉండడమే కాక ఆరోగ్య సౌకర్యాలకు సార్వత్రిక అందుబాటును కల్పిస్తుంది.
జాతీయ టెలి మానసిక ఆరోగ్య కార్యక్రమం (టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్)
అన్ని వయసుల వారిలోనూ మహమ్మారి మానసిక ఆరోగ్య సమస్యలను పెంచిన విషయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి అంగీకరించారు. నాణ్యత కలిగిన మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్, సంరక్షణ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు నేడు జాతీయ టెలి మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని మంత్రి ప్రకటించారు. ఇందులో 23 అత్యుత్తమ టెలి మానసిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా, నిమ్‌హాన్స్ నోడల్ కేంద్రంగా ఉంటుంది. ది ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - బెంగళూరు (ఐఐఐటిబి) సాంకేతిక తోడ్పాటును అందిస్తుంది.
***
(Release ID: 1794258)
Visitor Counter : 368
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam