ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కీలక ప్రభుత్వ పథకాల అమలుపై వివిధ జిల్లాల డీఎంలతో ప్రధాని చర్చాసమీక్ష


“ఇతరుల ఆకాంక్షలు మీవిగా మారినపుడు… ఇతరుల కలలను నెరవేర్చడమే
మీ విజయానికి కొలబద్ద అయినపుడు ఆ కర్తవ్య మార్గం చరిత్ర సృష్టిస్తుంది”;

“ప్రగతికాముక జిల్లాలు ఇవాళ దేశ ప్రగతికి అవరోధాలను తొలగిస్తూ.. వేగనిరోధకాల్లా కాకుండా వేగ వర్ధకాలుగా మారుతున్నాయి”;

“నేడు స్వాతంత్ర్య అమృత మహోత్సవాల నేపథ్యంలో సేవలు.. సౌకర్యాల
కల్పనకు సంబంధించి 100 శాతం సంతృప్త స్థాయి సాధనే భారత్ లక్ష్యం”;

“డిజిటల్ ఇండియా రూపేణా దేశం నిశ్శబ్ద విప్లవాన్ని చవిచూస్తోంది..
ఈ విషయంలో ఏ ఒక్క జిల్లా కూడా వెనుకబడి పోరాదు”;

Posted On: 22 JAN 2022 1:53PM by PIB Hyderabad

   దేశవ్యాప్తంగా కీలక పథకాల అమలుపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ జిల్లాల డీఎం(కలెక్టర్)లతో చర్చాసమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక సూచీల ప్రాతిపదికన తమ పరిధిలోని జిల్లాల పనితీరు మెరుగుపడటంపై తమ అనుభవాలను డీఎంలు ప్రధానితో పంచుకున్నారు. ఆయా జిల్లాల్లో సత్ఫలితాలకు తావిచ్చిన చర్యలతోపాటు ఈ కృషిలో ఎదురైన సమస్యల గురించి  ప్రధాని వారినుంచి నేరుగా తెలుసుకోగోరారు. మునుపటితో పోలిస్తే ప్రగతికాముక జిల్లాల కార్యక్రమం కింద పనిచేయడంలో వారి అనుభవాలు తెలపాల్సిందిగానూ కోరారు. కాగా, తాము సాధించిన విజయం వెనుక ప్రజా భాగస్వామ్యం ఎంత కీలకంగా నిలిచిందీ వారు ప్రధానితో చర్చించారు. అలాగే తమ జట్టు సభ్యులలో తాము చేస్తున్నది ఉద్యోగం కాకుండా సేవా కార్యక్రమమనే స్ఫూర్తి నింపుతూ ఏ విధంగా ముందుకెళ్లిందీ వారు తెలిపారు. ప్రభుత్వ విభాగాల మధ్య పెరిగిన సమన్వయంతోపాటు గణాంకాధారిత పాలన ప్రయోజనాల గురించి కూడా వారు చర్చించారు.

   ప్రగతి కాముక జిల్లాల కార్యక్రమం అమలు-ప్రగతి గురించి ‘నీతి ఆయోగ్‌’ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) ప్రధానమంత్రికి స్థూల వివరణ ఇచ్చారు. భారత జట్టు స్ఫూర్తి చోదకంగా పోటీతత్వం, సహకారాత్మక సమాఖ్య తత్వాలను ఈ కార్యక్రమం ఏ విధంగా వెలికితెచ్చిందీ ఆయన వివరించారు. ప్రతి కొలబద్దకూ అనుగుణంగా ఈ జిల్లాలు మెరుగైన పనితీరు కనబరచడానికి ఈ కృషి దారితీసిందని పేర్కొన్నారు. ఇది సాక్షాత్తూ అంతర్జాతీయ నిపుణులు స్వతంత్రంగా గుర్తించిన వాస్తవమని  తెలిపారు. విద్యాబోధన కోసం బీహార్‌లోని బంకా జిల్లాలో ‘స్మార్ట్‌ క్లాస్‌రూమ్‌’, బాల్య వివాహాల నిరోధం కోసం ఒడిషాలోని కోరాపుట్‌ జిల్లాలో చేపట్టిన ‘అపరాజిత’ వంటి విధానాలు ఈ కృషిలో భాగం కాగా, ఇతర జిల్లాలు కూడా  వీటిని యథాతథంగా అమలు చేశాయని చెప్పారు. ఆయా జిల్లాల పనితీరు, అక్కడి కీలక అధికారుల పదవీకాలం తదితరాలపైనా ఈ చర్చా సమీక్ష కింద విశ్లేషించారు.

   ప్రగతికాముక జిల్లాల్లో నిర్దిష్టంగా దృష్టి సారించిన పనుల పురోగతి కొలబద్దగా దేశంలో ఎంపికచేసిన 142 జిల్లాల సముద్ధరణ లక్ష్యంపై గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సవివర ప్రదర్శన ఇచ్చారు. ఈ జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కృషి చేస్తాయి. ఇందుకోసం 15 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సంబంధించిన 15 రంగాలతోపాటు వాటి పరిధిలో ‘కీలక పనితీరు సూచీ’(కేపీఐ)లను కూడా గుర్తించారు. రాబోయే ఏడాది కాలంలో ఎంపిక చేసిన జిల్లాలు రాష్ట్ర ప్రగతి సగటును అధిగమించడం ప్రభుత్వ లక్ష్యం. అంతేకాకుండా రెండేళ్ల వ్యవధిలో జాతీయ సగటు స్థాయికి సమాన పురోగతి సాధించాల్సి ఉంటుంది. జిల్లాల ఎంపికకు ప్రాతిపదిక అయిన ‘కేపీఐ’ల ఆధారంగా సంబంధిత ప్రతి మంత్రిత్వశాఖ/విభాగం తమ పరిధిలోని ‘కేపీఐ’లను గుర్తించాయి. దీనికి సంబంధించి భాగస్వామ్య సంస్థలన్నిటి సమష్టి కృషితో ఆయా జిల్లాలో వివిధ పథకాల అమలును సంతృప్త స్థాయికి చేర్చడం దీని లక్ష్యం. ఈ నేపథ్యంలో సదరు లక్ష్యాల సాధనలో తమ కార్యాచరణ ప్రణాళికలను వివిధ మంత్రిత్వశాఖల కార్యదర్శులు, విభాగాలు అధికారులు నివేదించారు.

   ధికారుల వివరణల అనంతరం ప్రధానమంత్రి స్పందిస్తూ- “ఇతరుల ఆకాంక్షలు మీవిగా మారినపుడు… ఇతరుల కలలను నెరవేర్చడమే మీ విజయానికి కొలబద్ద అయినపుడు ఆ కర్తవ్య నిర్వహణ మార్గం ఒక చరిత్రను సృష్టిస్తుంది” అన్నారు. ఆ మేరకు దేశంలోని ప్రగతికాముక జిల్లాలు సృష్టించిన చరిత్రను దేశం ప్రత్యక్షంగా చూస్తున్నదని పేర్కొన్నారు. ప్రగతికాముక జిల్లాలు గతంలో వెనుకబడిపోయే పరిస్థితి ఏర్పడటానికి అనేక అంశాలు కారణమయ్యాయని ప్రధానమంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో సర్వతోముఖాభివృద్ధి దిశగా ప్రగతికాముక జిల్లాలను చేయిపట్టి నడిపించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు. దీంతో నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, ప్రగతికాముక జిల్లాలు దేశాభివృద్ధికిగల అవరోధాలను తొలగిస్తున్నాయని చెప్పారు. ఆ మేరకు ప్రగతికాముక జిల్లాలు ఇవాళ వేగనిరోధకాల్లా కాకుండా వేగ వర్ధకాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. ప్రగతికాముక జిల్లాల్లో కార్యకలాపాలతో చోటుచేసుకున్న విస్తరణ, నవరూప కల్పనలను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగ సంస్కృతికి నిర్దిష్ట రూపుదిద్దిందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల సమష్టి కృషే ఈ విజయానికి ప్రాతిపదిక అని ప్రధాని అన్నారు.

   ప్రగతికాముక జిల్లాల అభివృద్ధి దిశగా పాలన యంత్రాంగం-ప్రజల మధ్య అనుసంధానానికి  ప్రత్యక్ష, భావోద్వేగ సంబంధాలు అత్యవసరమని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. తదనుగుణంగా ఉన్నతస్థాయినుంచి కిందికి-కింది నుంచి ఉన్నతస్థాయికి పాలన వ్యవహారాల ప్రవాహం సాగాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో ప్రధానాంశాలని ఆయన చెప్పారు. ఈ మేరకు సాంకేతికత, ఆవిష్కరణల సద్వినియోగంతో పౌష్టికాహారం, రక్షిత మంచినీరు, టీకాలకు సంబంధించి అత్యుత్తమ ఫలితాలు సాధించిన జిల్లాల గురించి ప్రధాని ప్రస్తావించారు. అలాగే ప్రగతికాముక జిల్లాల అభివృద్ధిలో దేశం విజయం సాధించడానికి సమష్టి కృషి కూడా ఒక ప్రధాన కారణమని ప్రధాని గుర్తుచేశారు. అన్నింటా వనరులు, ప్రభుత్వం యంత్రాంగం, అధికారులు మొత్తం ఒకేవిధంగా ఉన్నప్పటికీ ఫలితాలు మాత్రం భిన్నంగా ఉండటాన్ని ఆయన ఎత్తిచూపారు. జిల్లాను ఒకే ప్రాంతంగా పరిగణించడంద్వారా తాను చేయాల్సిన అపారమైన కృషి గురించి సంబంధిత అధికారికి అవగాహన కలుగుతుందన్నారు. ఆ మేరకు జీవిత పరమార్థం, అర్థవంతమైన మార్పు తేవడంలో కలిగే సంతృప్తి ఎలాంటివో అవగతం కాగలవని పేర్కొన్నారు.

   డచిన నాలుగేళ్లలోనే దాదాపు ప్రతి ప్రగతికాముక జిల్లాలోనూ జన్‌ధన్‌ ఖాతాలు 4 నుంచి 5 రెట్లు పెరిగాయని ప్రధానమంత్రి అన్నారు. అలాగే రమారమి ప్రతి కుటుంబానికీ మరుగుదొడ్డి సదుపాయం కలిగిందని, ప్రతి గ్రామానికీ విద్యుత్తు సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. ఇవన్నీ కలిసి ప్రజా జీవనంలో కొత్తశక్తిని నింపాయని ఆయన పేర్కొన్నారు. ప్రగతికాముక జిల్లాల్లో కఠిన జీవన పరిస్థితుల కారణంగా ప్రజలు మరింత కష్టజీవులుగా, సాహసవంతులుగా, ముప్పును ఎదుర్కొనగల ధీరులుగా రూపొందారని ప్రధాని పేర్కొన్నారు. మనం ముఖ్యంగా ఈ ప్రజాశక్తిని గుర్తించాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు.

   థకాల అమలులో అగడ్తల్లాంటి వ్యవస్థల తొలగింపుతోపాటు వనరులు సద్వినియోగమైనపుడు ముందడుగు సాధ్యమేనని ప్రగతికాముక జిల్లాలు నిరూపించాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ సంస్కరణ వల్ల సమకూరిన అద్భుత ఫలితాల గురించి ఆయన నొక్కిచెప్పారు. అగడ్తలు మాయమైతే లభించే ఫలితం 1+1=2 కాకుండా 11 కాగలదని ఆయన అన్నారు. ఈ మేరకు ఇవాళ ప్రగతికాముక జిల్లాల్లో ఈ సమష్టి శక్తి పోషిస్తున్న పాత్రను మనం చూస్తున్నామని చెప్పారు. ప్రగతికాముక జిల్లాల్లో పాలన విధానం గురించి వివరిస్తూ- తమ సమస్యలేమిటో గుర్తించడంపై ప్రజలతో సంప్రదించడం ఇందులో మొదటి అంశమని ప్రధాని చెప్పారు. రెండోది… ప్రగతికాముక జిల్లాల్లో అనుభవాలు, అంచనా వేయదగిన సూచీలు, ప్రగతిపై నిత్య పర్యవేక్షణ, జిల్లాల మధ్య ఆరోగ్యకర పోటీ, ఉత్తమాచరణల అనుసరణ వగైరాల ప్రాతిపదికగా మన పనితీరును మలచుకోవడమని చెప్పారు. మూడోది… అధికారులు నిర్ణీతకాలం కొనసాగేలా చూడటం వంటి సంస్కరణల ద్వారా సమర్థ జట్లను సృష్టించడాన్ని ప్రోత్సహించాలన్నారు. దీనివల్ల పరిమిత వనరులు ఉన్నప్పటికీ భారీ ఫలితాలు సాధ్యమయ్యాయని చెప్పారు. ఈ క్రమంలో సముచిత అమలు, పర్యవేక్షణ దిశగా క్షేత్రస్థాయి సందర్శనలు, తనిఖీలు, రాత్రి బస వగైరాల కోసం తగు మార్గదర్శకాలు రూపొందించాలని ప్రధాని కోరారు.

   ‌వ భార‌తం ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పువైపు దృష్టి మళ్లించాల్సిందిగా అధికారులకు ప్రధాని సూచించారు. నేడు స్వాతంత్ర్య అమృత మహోత్సవాల నేపథ్యంలో సేవలు, సౌకర్యాల కల్పనకు సంబంధించి 100 శాతం సంతృప్త స్థాయి సాధనే భారతదేశానికి లక్ష్యంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. అంటే- ఇప్పటిదాకా సాధించిన మైలురాళ్లతో పోలిస్తే మనమింకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని, అది మరింత భారీ స్థాయిలో సాగాలని స్పష్టం చేశారు. ఆయా జిల్లాల్లోని అన్ని గ్రామాలకూ రహదారులు, ఆయుష్మాన్ భవ  కార్డులు, ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా, ఉజ్వల గ్యాస్ కనెక్షన్, బీమా, ప్రతి ఒక్కరికీ పింఛను, ఇళ్లు తదితరాలకు కాలవ్యవధిలో కూడిన నిర్దిష్ట లక్ష్యాలు ఉండాలని ఆయన నొక్కి చెప్పారు.  ఆ మేరకు ప్రతి జిల్లాకూ రెండేళ్ల దార్శనికత ఉండాలని సూచించారు. తదనుగుణంగా సామాన్యుల జీవన సౌలభ్యం మెరుగు దిశగా రాబోయే 3 నెలల్లో పూర్తిచేయాల్సిన 10 పనులను గుర్తించాలని ఆయన ఆదేశించారు. అలాగే ఈ చారిత్రక యుగంలో చారిత్రక విజయ  సాధన కోసం 5 పనులను స్వాతంత్ర్య అమృత మహోత్సవాలతో ముడిపెట్టాల్సిందిగా కోరారు.

   డిజిటల్ ఇండియా రూపేణా దేశం నేడు నిశ్శబ్ద విప్లవాన్ని చవిచూస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఈ విషయంలో ఏ ఒక్క జిల్లా కూడా వెనుకబడి పోరాదని స్పష్టం చేశారు. ఇంటి ముంగిట సేవలు, సౌకర్యాలు అందించడంలో ప్రతి గ్రామానికీ డిజిటల్‌ మౌలిక వసతుల విస్తరణ ప్రాముఖ్యాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఇందుకోసం జిల్లా మేజిస్ట్రేట్ల మధ్య నిరంతర సంప్రదింపులకు తగిన విధానం రూపొందించాల్సిందిగా నీతి ఆయోగ్‌ను ఆయన కోరారు. అలాగే ఆయా జిల్లాల్లోగల సమస్యల సమగ్ర జాబితా రూపొందించాల్సిందిగా కేంద్ర మంత్రిత్వ శాఖలను ఆదేశించారు.

   ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు తయారుచేసిన జాబితా మేరకు దేశంలోని 142 జిల్లాలు అభివృద్ధిలో వెనుకబడకపోయినా, ఒకటిరెండు సూచీల విషయంలో బలహీనంగా ఉన్నాయని ప్రధానమంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రగతికాముక జిల్లాల తరహాలోనే వీటి విషయంలోనూ సమష్టి కృషికి శ్రీకారం చుట్టాలని ప్రధాని నొక్కిచెప్పారు. “ఇది కేంద్ర, రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వాలతోపాటు జిల్లా పాలన మండళ్లు, పరిపాలన యంత్రాంగాలకు ఇదొక సరికొత్త సవాలు. దీనిపై విజయసాధనలో మనమంతా కలసికట్టుగా నడవాలి” అని శ్రీ మోదీ ఉద్బోధించారు. దేశానికి సేవ చేయాలన్న తొలి రోజులనాటి  తపనను సివిల్‌ సర్వీసుల అధికారులు గుర్తుకు తెచ్చుకోవాలని ప్రధానమంత్రి కోరారు. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో ముందంజ వేయాల్సిందిగా ప్రధాని వారికి సూచించారు.

***

DS/AK


(Release ID: 1791864) Visitor Counter : 175