ప్రధాన మంత్రి కార్యాలయం

2020 జనవరి 26వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ 2.0’ (‘మనసు లో మాట 2.0’) కార్యక్రమం 8వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 26 JAN 2020 6:35PM by PIB Hyderabad

నా ప్రియమైన దేశప్రజలారా, నమస్కారం! ఇవాళ జనవరి 26వ తేదీ. మన గంతంత్ర దినోత్సవం సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలు. 2020లో ఇది మన మొదటి ’మన్ కీ బాత్’. ఈ నూతన సంవత్సరంలోనే కాక ఈ దశాబ్దంలోనే మొదటి ’మన కీ బాత్ ’ కార్యక్రమం ఇది. మిత్రులారా, ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల కారణంగా మీతో జరిపే ’మన్ కీ బాత్ ’ కార్యక్రమం సమయంలో మార్పులు చేస్తే మంచిదనిపించింది. అందుకని ఇవాళ మరొక సమయాన్ని నిర్ణయించి , మీతో ’మన్ కీ బాత్ ’ మాట్లాడుతున్నాను. మిత్రులారా, రోజులు మారతాయి. వారాలు మారతాయి. నెలలు గడిచిపోతాయి. సంవత్సరాలే మారిపోయాయి. కానీ మన భారతదేశ ప్రజల ఉత్సాహం మారదు. మనం ఏమాత్రం తక్కువ కాదు, మనం కూడా ఏదో ఒకటి సాధిస్తాం - ’can do’ అన్న భావం అది. ఈ ’can do’ అనే భావన ఒక సంకల్పంగా మారుతోంది. దేశం కోసం, సమాజం కోసం ఏదైనా చెయ్యాలనే భావన ప్రతి రోజూ అంతకు ముందు కన్నా, మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది. మిత్రులారా, కొత్త కొత్త విషయాలపై చర్చించేందుకు, దేశప్రజలు సాధించే కొత్త కొత్త విజయాలను తెలుసుకుని దేశమంతటా సంబరాలు జరుపుకోవడానికీ ఈ ’మన్ కీ బాత్ ’ వేదికపై మనందరము మరొక్కసారి సమావేశమయ్యాము. పంచుకోవడానికీ, నేర్చుకోవడానికీ, కలిసి ఎదగడానికీ - ’మన్ కీ బాత్ ’ కార్యక్రమం - ఒక చక్కని, సహజమైన వేదికగా మారింది. ప్రతి నెలా వేల సంఖ్యలో ప్రజలు తమ సూచనలను, తమ ప్రయత్నాలనూ, తమ అనుభవాలను పంచుకుంటారు. వాటిల్లో నుంచి సమాజానికి ప్రేరణను ఇచ్చే విషయాలను, కొందరు ప్రజల అసాధారణ ప్రయత్నాలనూ ఇక్కడ చర్చించుకునే అవకాశం ’మన్ కీ బాత్ ’ ద్వారా మనకు లభిస్తోంది.

ఎవరో అలా చేసి చూపించారుట - మనం కూడా చెయ్యగలమా? అలాంటి ఒక ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా మరొకసారి చేసి ఒక గొప్ప మార్పుని మనమూ తీసుకురాగలమా? ఆ మార్పుని, సమాజంలో ఒక సాధారణ అలవాటుగా మార్చి, ఆ మార్పుని  శాశ్వతం చెయ్యగలమా? ఇలాంటి కొన్ని ప్రశ్నలను వెతుకుతూ వెతుకుతూ, ప్రతి నెలా ’ మన్ కీ బాత్’ లో కొన్ని విన్నపాలు , కొన్ని ఆహ్వానాలూ, ఏదో సాధించాలనే సంకల్పాల పరంపర మొదలైంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా మనం ఎన్నో చిన్న చిన్న సంకల్పాలను చేసుకుని ఉంటాము. "సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకూడదు" , "ఖాదీనీ, దేశీ వస్తువులనూ కొనాలి", "పరిశుభ్రత పాటించాలి" , "ఆడబిడ్డలను గౌరవించాలి, వారి విజయాలకు గర్వపడాలి" , "less cash economy లాంటి కొత్త అంశాలు, వాటిని బలపరచడం" - మొదలైన అనేకమైన సంకల్పాలన్నీ మన ఈ తేలికపాటి మన్ కీ బాత్ కబుర్ల ద్వారానే జన్మించాయి.

నాకొక ముచ్చటైన ఉత్తరం వచ్చింది. బీహార్ నుంచి శ్రీ శైలేశ్ గారి నుంచి. అయితే వారు ఇప్పుడు బీహార్ లో నివసించట్లేదు. ఇప్పుడు ఆయన ఢిల్లీలోని ఒక ఎన్.జీ.ఓ లో పని చేస్తున్నారు. శ్రీ శైలేశ్ గారు ఏం రాశారంటే, "మోదీ గారూ, మీరు ప్రతి మన్ కీ బాత్ లోనూ ఏదో ఒక కొత్త విషయాన్ని ప్రస్తావిస్తారు. వాటిల్లో ఎన్నో పనులను నేను చేశాను. ఈ చలికాలంలో నేను ప్రజల వద్ద నుండి పాత బట్టలు సేకరించి, వాటి అవసరం ఉన్నవారికి పంచాను. ’మన్ కీ బాత్” నుండి ప్రేరణ పొంది ఎన్నో పనులను నేను చేయడం మొదలుపెట్టాను. కానీ నెమ్మదిగా నేను కొన్ని విషయాలను మర్చిపోయాను. కొన్ని నాకు సాధ్యపడలేదు. కొత్త సంవత్సరంలో నేనొక ప్రణాళికను తయారు చేసాను. నూతన సంవత్సరంలో ప్రజలు new year resolutions చేసుకున్నట్లు, నేను చేయాలనుకున్న పనులన్నింటి జాబితాను నేను తయారు చేశాను. మోది గారూ, ఈ కొత్త సంవత్సరంలో ఇది నా social resolution! ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కానీ పెద్ద పెద్ద మార్పులను తీసుకురాగలవని నాకు అనిపిస్తోంది. నా ఈ ప్రణాళిక మీద మీరు ఆటోగ్రాఫ్ చేసి, నాకు తిరిగి పంపగలరా?"

శైలేశ్ గారూ, మీకు అనేకానేక అభినందనలు, శుభాకాంక్షలు. "మన్ కీ బాత్ ప్రణాళిక" అనే మీ నూతన సంవత్సర resolution ఎంతో సృజనాత్మకంగా ఉంది. దీనిపై నేను తప్పకుండా అభినందనలు అని రాసి మీకు తిరిగి పంపిస్తాను. మిత్రులారా, ఈ ”మన్ కీ బాత్ ప్రణాళిక" ను చదువుతుంటే, ఇన్ని రకాల విషయాలు ఉన్నాయా? ఇన్ని రకాల హేష్ ట్యాగ్ లా? అని ఆశ్చర్యం కలిగింది. మనందరమూ కలిసి ఎన్నో పనులు కూడా చేశాము. ఒకసారి మనము "సందేశ్ టూ సోల్డ్జర్ల్స్" పేరుతో ఒక ప్రచారాన్ని నడిపాము. తద్వారా మన భారతసైనికుల మనసులకు మరింత చేరువగా వెళ్ళి వారితో బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ’మన్ కీ బాత్ ’ కార్యక్రమం ద్వారా ఒక ప్రచారాన్ని నడిపాము.

‘Khadi for Nation - Khadi for Fashion’ నినాదంతో ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలకు ఒక కొత్త స్థాయి ఏర్పడింది. ‘buy local’ అనే మంత్రాన్ని సొంతం చేసుకున్నాం. हम फिट तो इंडिया फिट’ అంటూ శారీరిక ధృఢత్వం పట్ల అప్రమత్తత పెంచాము. ‘My Clean India’ లేదా ‘Statue Cleaning’ మొదలైన ప్రయత్నాలతో పరిశుభ్రతను ఒక సామూహికోద్యమంగా తయారుచేశాము.  హేష్ ట్యాగ్ No to drugs(#NoToDrugs,), హేష్ ట్యాగ్  భారతలక్ష్మి (#BharatKiLakshami), హేష్ ట్యాగ్  Self for Society (#Self4Society), హేష్ ట్యాగ్  StressFreeExam (#StressFreeExams), హేష్ ట్యాగ్  సురక్షా బంధన్ (#SurakshaBandhan), హేష్ ట్యాగ్  డిజిటల్ ఎకానమీ (#DigitalEconomy), హేష్ ట్యాగ్  రోడ్ సేఫ్టీ (#RoadSafety), చెప్పుకుంటూ పోతే ఇలాంటివి కోకొల్లలు!

శైలేశ్ గారూ, మీరు తయారు చేసిన ఈ ’మన్ కీ బాత్ ప్రణాళిక’ ను చూస్తే అర్థమైంది, ఇది చాలా పెద్ద జాబితా అని. రండి, మనందరమూ ఈ ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఈ ’మన్ కీ బాత్ ప్రణాళిక’ నుండి మనకు నచ్చిన ఏదో ఒక అంశాన్ని ఎన్నుకుని దానిపై పనిచేద్దాం. హేష్ ట్యాగ్ ను ఉపయోగించి అందరితోనూ మన వంతు తోడ్పాటును పంచుకుందాం.స్నేహితులను, కుటుంబసభ్యులను, అందరికీ ప్రేరణను అందిద్దాం. ప్రతి భారతీయుడూ ఒక్కో అడుగూ వేస్తూంటే మన భారతదేశం 130 కోట్ల అడుగులు ముందుకు వెళ్తుంది. అందుకే "చరైవేతి,చరైవేతి,చరైవేతి" అంటే "పదండి ముందుకు, పదండి ముందుకు, పదండి ముందుకు" అనే మంత్రంతో మన ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉందాం.

నా ప్రియమైన దేశప్రజలారా, మనం ’మన్ కీ బాత్ ప్రణాళిక’ ను గురించి మాట్లాడుకున్నాం. పరిశుభ్రత తర్వాత ప్రజల సహకార భావన, అంటే participative spirit, నేడు మరొక రంగంలో వేగవంతమవుతోంది. అదే ’నీటి సంరక్షణ’. ’నీటి సంరక్షణ’ కోసం ఎన్నో విస్తృతమైన, సరికొత్త ప్రయత్నాలు దేశవ్యాప్తంగా , దేశం నలుమూలల్లోనూ జరుగుతున్నాయి. క్రితం వర్షాకాలంలో మనం మొదలుపెట్టిన "జల్ శక్తి అభియాన్" - ప్రజల సహకారంతో అత్యంత వేగంగా విజయపథం వైపుకి అడుగులు వేస్తోంది. పెద్ద సంఖ్యలో జలాశయాల, చెరువుల నిర్మాణం జరిగింది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలూ ఈ ప్రచారంలో తమ వంతు సహకారాన్ని అందించారు. రాజస్థాన్ లోని ఝాలోర్ జిల్లాలో రెండు చారిత్రాత్మిక దిగుడు బావులు చెత్తతోనూ, మురికి నీటితోనూ నిండిపోయాయి. భద్రాయు, థాన్వాలా పంచాయితీల నుండి వందలాది ప్రజలు "జల్ శక్తి అభియాన్" ద్వారా ఈ దిగుడు బావులను పునర్జీవితం చేసే ప్రయత్నాలు చేపట్టారు. వర్షాలకు ముందుగానే వారందరూఈ దిగుడు బావుల్లో పేరుకుపోయిన చెత్తనీ , బురదనీ, మురికి నీటినీ తొలగించే పని ప్రారంభించారు. ఈ ప్రచారం కోసం కొందరు శ్రమదానం చేస్తే, కొందరు ధన సహాయం చేశారు. అందరి శ్రమ వల్లా ఇవాళ ఆ దిగుడు బావులు వాళ్లకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీ తాలూకూ కథ కూడా ఇంచుమించు ఇలాంటిదే. ఇక్కడ, 43 హెక్టార్ల ప్రాంతంలో వ్యాపించి ఉన్న

సరాహీ సరస్సు తన అవసాన దశలో ఉంది. కానీ అక్కడి గ్రామీణ ప్రజలు తమ సంకల్పశక్తితో ఈ సరస్సుకు కొత్త ఊపిరిని అందించారు. ఇంత పెద్ద లక్ష్యాన్ని నెరవేర్చే దారిలో వాళ్ళు ఏ ఆటంకాన్నీ రానివ్వలేదు. ఒకదాని తర్వాత మరొక గ్రామాన్ని కలుపుకుంటూ అంతా ఒకటిగా నిలిచారు. వారంతా కలిసి సరస్సుకి నలువైపులా ఒక మీటరు ఎత్తు గట్టుని కట్టారు. ఇప్పుడా సరస్సు నీటితో నిండి ఉంది. చుట్టుపక్కల వాతావరణం పక్షుల కలరవాలతో ప్రతిధ్వనిస్తోంది.                                                                                      

ఉత్తరాఖండ్ లోని అల్మోరా -హల్ద్వానీ హైవే ను ఆనుకుని ఉన్న సునియాకోట్ గ్రామం నుండి కూడా ప్రజా భాగస్వామ్యం తాలూకూ ఒక ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. గ్రామంలో నీటి ఎద్దడి నుంచి బయటపడడానికి, తామే స్వయంగా నీటిని గ్రామం వరకూ తెచ్చుకోవాలనే సంకల్పాన్ని చేపట్టారు. ప్రజలు చందాలు వేసుకుని, డబ్బు పోగుచేసి, శ్రమదానం చేసి, దాదాపు ఒక కిలోమీటర్ దూరం నుంచి తమ గ్రామం వరకూ గొట్టాలు వేసుకున్నారు. పంపింగ్ స్టేషన్ ఏర్పరుచుకున్నారు. ఇంకేముంది, చూస్తూండగానే రెండు దశాబ్దాల నుంచీ ఇబ్బంది పెడుతున్న సమస్య శాశ్వతంగా సమసిపోయింది. వర్షపు నీటి సంరక్షణకోసం బోరుబావిని వాడే సృజనాత్మక ఆలోచన ఒకటి తమిళనాడు నుంచి వెలుగులోకి వచ్చింది.నీటి సంరక్షణకు సంబంధించిన ఇటువంటి కథనాలు దేశవ్యాప్తంగా ఎన్నో వినవచ్చాయి. న్యూ ఇండియా సంకల్పానికి ఇవి బలాన్ని ఇస్తాయి. మన జలశక్తి ఛాంపియన్స్ గురించిన కథలు వినడానికి యావత్ దేశం ఉత్సుకత చూపెడుతోంది. నీటి సేకరణకు, ఇంకా నీటి సంరక్షణకు సంబంధించి మీ చుట్టుపక్కల జరుగుతున్న ప్రయత్నాలను, వాటి తాలూకూ కథనాలనూ ఫోటోలనూ, వీడియోలనూ హేష్ ట్యాగ్ (#)jalshakti4India లో షేర్ చేయండి.

నా ప్రియమైన దేశప్రజలారా, ముఖ్యంగా నా యువ మిత్రులారా,  "ఖేలో ఇండియా" కు అందించిన అద్భుతమైన ఆతిధ్యానికి గానూ అస్సాం ప్రభుత్వానికీ, అస్సాం ప్రజలకూ, ఇవాళ మన్ కీ బాత్ మాధ్యమం ద్వారా నేను అనేకానేక అభినందనలు తెలుపుతున్నాను. మిత్రులారా, గౌహతీలో జరిగిన మూడవ "ఖేలో ఇండియా క్రీడలు" జనవరి 22వ తేదీన పూర్తయ్యాయి. ఆ పోటీలలో రకరకాల రాష్ట్రాలకు చెందిన దాదాపు ఆరువేల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ ఆటల పోటీలలో ఎనభై పాత రికార్డులను బద్దలుకొట్టారని వింటే మీరు ఆశ్చర్యపోతారు. అందులోనూ 56 రికార్డులను మన ఆడబిడ్డలు తిరగరాసారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఇది కేవలం ఆడబిడ్డల వల్లే సాధ్యపడింది. విజేతలతో పాటూ, ఈ ఆటలపోటీల్లో పాల్గొన్న క్రీడాకారులందరికీ నేను అభినందనలు తెలుపుతున్నాను.                                                                               

                                                                                        

 ఇంకా, "ఖేలో ఇండియా గేమ్స్" ను విజయవంతంగా నిర్వహించినందుకు దీనికి సంబంధించిన అందరు వ్యక్తులకూ, శిక్షకులకూ, సాంకేతిక అధికారులకూ నా కృతజ్ఞతను తెలుపుతున్నాను. మనందరమూ సంతోషించాల్సిన విషయం ఏమిటంటే ఏడాది ఏడాదికీ కృతజ్ఞతా  ఈ "ఖేలో ఇండియా క్రీడలు " లో పాల్గొనే క్రీడాకారుల సంఖ్య పెరుగుతోంది. దీనిని బట్టి పాఠశాల స్థాయిలో పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి ఎంతగా పెరుగుతోందో గమనించవచ్చు. 2018లో ’ఖేలో ఇండియా క్రీడలు’ మొదలైనప్పుడు ఇందులో ముఫ్ఫై ఐదు వందల క్రీడాకారులు పాల్గొన్నారు. కానీ మూడేళ్లల్లో క్రీడాకారుల సంఖ్య ఆరువేలకంటే ఎక్కువకు పెరిగింది. అంటే దాదాపు రెట్టింపు సంఖ్య! అంతేకాదు కేవలం మూడేళ్ళలో ’ఖేలో ఇండియా క్రీడలు’ మాధ్యమం ద్వారా ముఫ్ఫై రెండు వందల ప్రతిభావంతులైన పిల్లలు తయారైయ్యారు. ఇందులో చాలామంది పిల్లలు లేమి లోనూ, పేదరికం లోనూ పెరిగిపెద్దైనవారూ ఉన్నారు. ’ఖేలో ఇండియా క్రీడలు’ లో పాల్గొన్న పిల్లల, వారి తల్లిదండ్రుల ధైర్యం, ధృఢ సంకల్పం తాలూకూ కథనాలు ప్రతి భారతీయుడికీ ప్రేరణను అందిస్తాయి. గౌహతీ కు చెందిన పూర్ణిమా మండల్ నే తీసుకోండి, ఆమె గౌహతీ నగరపాలికసంస్థలో ఒక పారిశుధ్య కార్మికురాలు (స్వీపర్). కానీ వారి అమ్మాయి మాళవిక ఫుట్బాల్ పై పట్టుదల పెడితే, అబ్బాయి సుజీత్ ఖో ఖోపై దృష్టి పెట్టాడు. వారి ఇంకో అబ్బాయి ప్రదీప్ అస్సాం హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

గర్వంతో నిండిన ఇటువంటి మరొక కథనం తమిళనాడులోని యోగానందం గారిది. తమిళనాడులో బీడీలు తయారుచేసే పని ఆయనది. కానీ ఆయన కుమార్తె పూర్ణిమ వెయిట్ లిఫ్టింగ్ లో స్వర్ణ పతకాన్ని సంపాదించుకుని అందరి మనసులను దోచుకుంది. నేను డేవిడ్ బెఖెమ్ పేరు తలవగానే మీరంతా ప్రఖ్యాత అంతర్జాతీయ ఫుట్బాల్ ఆటగాడు అంటారు. కానీ ఇప్పుడు మన దగ్గర కూడా ఒక డేవిడ్ బెఖెమ్ ఉన్నాడు. ఇప్పుడు అతడు కూడా గౌహతీ లోని యూత్ గేమ్స్ లో స్వర్ణ పతకాన్ని సాధించాడు. అది కూడా  200 మీటర్ల సైక్లింగ్ పోటీ తాలూకూ Sprint Event లో.

                                                                                                

కార్-నికోబార్ ద్వీపానికి చెందిన డేవిడ్ చిన్నతనంలోణే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. అతడిని పెంచిన బాబాయి అతడిని ఫుట్ బాల్ ఆటగడిగా చూడాలనుకుని, అతడికి పేరును కూడా ప్రఖ్యాత ఫుట్ బాల్ ఆటగాడి పేరునే పెట్టాడు. కానీ డేవిడ్ మనసు సైకింగ్ పై ఉండేది. నాకు సంతోషాన్ని కలిగించిన మరొక విషయం ఏమిటంటే, ఖేలో ఇండియా పథకం లో భాగంగా ఈయన ఎన్నికయి, ఇవాళ సైక్లింగ్ లో ఒక కొత్త కీర్తికిరిటాన్ని అధిరోహించాడు. భివానీకి చెందిన ప్రశాంత్ సింహ్ కన్హైయ్యా Pole vault ఈవెంట్ లో తన సొంత రికార్డ్ ను తానే బద్దలుకొట్టాడు. 19ఏళ్ల ప్రశాంత్ ఒక రైతు కుటుంబానికి చెందిన వాడు. ప్రశాంత్ తన Pole vault ప్రాక్టీసుని మట్టిలోనే చేసేవాడని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది తెలిసిన తర్వాత ఆయన కోచ్ కు, ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో అకాదమీ నడిపించడానికి క్రీడా విభాగం సహాయం చేసింది. ఇవాళ ప్రశాంత్ అక్కడ శిక్షణ పొందుతున్నాడు.

ముంబయ్ కు చెందిన కరీనా శన్క్తా(Kareena Shankta ) కథ, ఎట్టి పరిస్థితి లోనూ ఓటమిని ఒప్పుకోని ఆమె పట్టుదల ప్రతి ఒక్కరికీ ప్రేరణను అందిస్తుంది. కరీనా 100మీటర్ల Breaststroke పోటీలో, అండర్ 17 విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించి, ఒక సరికొత్త జాతీయ రికార్డుని నెలకొల్పింది. పదవ తరగతి చదువుతున్న కరీనాకి ఒకసారి మోకాలికి దెబ్బ తగిలిన కారణంగా ట్రైనింగ్ ని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ కరీనా, ఆమె తల్లి ధైర్యాన్ని కోల్పోలేదు. దానికి పరిణామం ఇవాళ మీ ముందర ఉంది. క్రీడాకారులందరి ఉజ్వల భవిష్యత్తుని నేను కోరుకుంటున్నాను. దానితో పాటుగా దేశప్రజలందరి తరఫునా వీరందరి తల్లిదండ్రులకి నేను నమస్కరిస్తున్నాను. వారంతా తమ పేదరికాన్ని పిల్లల భవిష్యత్తుకి అవరోధంగా కానివ్వలేదు. జాతీయ ఆటల పోటీల మాధ్యమం ద్వారా క్రీడాకారులకు తమ ప్రతిభను కనబరిచే అవకాశమే కాకుండా ఇతర రాష్ట్రాల సంస్కృతిని తెలుసుకునే అవకాశం కూడా లభిస్తుంది. అందుకని "ఖేలో ఇండియా యూత్ గేమ్స్" నమూనాలోనే ప్రతి ఏడాదీ "ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్" ను నిర్వహించాలనే నిర్ణయాన్ని తీసుకున్నాము.

                                                                                        

మిత్రులారా, రాబోయే నెల ఫిబ్రవరీ 22 నుండీ మార్చ్ 1 వరకూ ఒరిస్సా కు చెందిన కటక్, ఇంకా భువనేశ్వర్ లోనూ ""ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్" ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో పాల్గొనడానికి మూడు వేలకు పైగా క్రీడాకారులుఎంపికయ్యారు.

నా ప్రియమైన దేశప్రజలారా, పరీక్షల సమయం వచ్చేసింది. కాబట్టి విద్యార్థులందరూ తమ తమ చదువుల సన్నహాలు పూర్తిచేసుకునే స్థితిలో ఉండిఉంటారు. దేశంలోని కోట్ల మంది విద్యార్థి మిత్రులతో "పరీక్షా పే చర్చ" జరిపిన తరువాత దేశ యువత ఆత్మవిశ్వాసంతో ఉందని, ఏ సవాలునైనా ఎదుర్కొనే స్థాయిలో ఉన్నారని నేను నమ్మకంగా చెప్పగలుగుతున్నాను.

మిత్రులారా, ఒక పక్క పరీక్షలు ఉన్నాయి. మరో పక్క చలికాలం. ఈ రెండిటి మధ్యా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిందని నేను కోరుతున్నాను. కాస్తంత కసరత్తు చెయ్యండి. కాస్తంత ఆడుకోండి, గెంతులు వెయ్యండి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆటపాటల్లో నిమగ్నమవ్వడం కూడా ముఖ్యం. "ఫిట్ ఇండియా"లో భాగంగా ఎన్నో కొత్త కార్యక్రమాలు జరగడం నేను ఈమధ్య గమనిస్తున్నాను. జనవరి 18న దేశవ్యాప్తంగా యువత cyclothon ని ప్రారంభించారు. అందులో పాల్గొన్న లక్షల కొద్దీ దేశప్రజలు ఫిట్నెస్స్ ని గురించి సందేశాలు ఇచ్చారు. మన న్యూ ఇండియా పూర్తిస్థాయిలో ఫిట్ గా ఉండడానికి , అన్నివైపుల నుండీ జరుగుతున్న ప్రయత్నాలు ఉత్సాహాన్నీ, ఉత్సుకతనీ నింపేవిగా ఉంటున్నాయి. గత ఏడాది నవంబర్ లో మొదలైన "ఫిట్ ఇండియా స్కూల్" ప్రచారం కూడా ఇప్పుడు ఊపందుకుంది. ఇప్పటిదాకా 65000 కంటే ఎక్కువ పాఠశాలలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తీసుకుని "ఫిట్ ఇండియా స్కూల్" సర్టిఫికెట్ ని పొందాయని తెలిసింది.  ఫిజికల్ ఏక్టివిటీ నీ, ఆటలనూ స్కూలు పాఠాలతో కలిపి " ఫిట్ స్కూల్" గా తప్పక మారాలని దేశంలోని మిగిలిన పాఠశాలలవారిని కూడా నేను కోరుతున్నాను. ఇంతేకాక దేశప్రజలందరినీ నేను కోరేది ఏమిటంటే, మీరందరూ కూడా మీ దినచర్యలో ఫిజికల్ ఏక్టివిటీ కి ఎక్కువ అవకాశం ఇవ్వండి. మనం ఫిట్ గా ఉంటే ఇండియా ఫిట్ గా ఉంటుందని రోజూ మీకు మీరే గుర్తుచేసుకోండి.

                                                                                        

నా ప్రియమైన దేశప్రజలారా, రెండు వారాల క్రితం భారతదేశ విభిన్న ప్రాంతాలలో రకరకాల పండుగలు జరిగాయి. లోరీ తాలూకూ ఉత్సాహమూ, వెచ్చదనంతో పంజాబ్  నిండిపోయింది. తమిళనాడులోని సోదర సోదరీమణులు పొంగల్ పండుగను, తిరువళ్ళువర్ జయంతినీ జరుపుకున్నారు. అస్సాంలో బిహు తాలూకూ మనోహరమైన వర్ణం చూశాము. గుజరాత్ లో ప్రతి చోటా ఉత్తరాయణ పుణ్యకాలపు ఉత్సవంతో పాటూ ఆకాశం గాలిపటాలతో నిండిపోయింది. ఇటువంటి సమయంలో ఢిల్లీ ఒక చారిత్రాత్మక ఘటనకు సాక్షిగా నిలిచింది. ఢిల్లీలో ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దానితో పాటుగా దాదాపు 25 ఏళ్ల ఒక బాధాకరమైన అధ్యాయం - Bru Reang refugee crisis - అంతమయ్యింది. ఎప్పటికీ ముగిసిపోయింది. మీ పండుగ సంబరాల మధ్యన ఈ ఒప్పందం గురించి మీరు వివరంగా తెలుసుకోలేకపోయి ఉండవచ్చు. అందుకని మన్ కీ బాత్ లో దీని గురించి తప్పకుండా చర్చించాలని నేను అనుకున్నాను. ఈ సమస్య 90లలో ఏర్పడింది. 1997లో జాతీయ ఉద్రిక్తత కారణంగా Bru Reang తెగకు చెందిన ప్రజలకు మిజోరమ్ నుండి వేరుపడి త్రిపుర లో శరణు తీసుకోవాల్సివచ్చింది. ఈ శరణార్థులను ఉత్తర త్రిపుర(North Tripura)లోని కంచన్ పూర్ లోఉన్న అస్థాయీ కెంప్స్ లో ఉంచారు. Bru Reang సముదాయపు ప్రజలు ఇలా శరణార్థులుగా జీవిస్తూ తమ జీవితంలోని ముఖ్యమైన భాగాన్ని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. అలా కేంపుల్లో జీవించడం అంటే తమ ప్రాధమిక సౌకర్యాలను కోల్పోవడమే!  23 ఏళ్ల పాటు ఇల్లు లేదు, భూమి లేదు, కుటుంబం లేదు, అనారోగ్యానికి పరిష్కారం లేదు, పిల్లలకు చదువు లేదు , వారికి ఏ రకమైన సౌకర్యమూ లేదు. ఒక్కసారి ఆలోచించండి 23 ఏళ్లపాటు కేంపుల్లో కఠిన పరిస్థితుల్లో జీవనాన్ని సాగించడం వాళ్లకు ఎంత కష్టంగా ఉండిఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. జీవితంలో ప్రతి క్షణం, ప్రతి రోజూ ఒక అనిశ్చిత భవిష్యత్తుతో ముందుకు నడవడం ఎంత కష్టమయమో కదా!  ప్రభుత్వాలు వచ్చాయి వెళ్పోయాయి. కానీ వీళ్ళ దు:ఖానికి పరిష్కారాన్ని మాత్రం అందించలేకపోయాయి. కానీ ఇన్ని కష్టతర పరిస్థితుల్లో కూడా భారతీయ రాజ్యాంగం, సంస్కృతి పట్ల వారి విశ్వాసం ధృఢంగా ఉంది. ఇదే విశ్వాసం వల్ల వారి జీవితాల్లో ఇవాళ ఒక కొత్త వెలుగు కనబడింది.                                                                       

ఒప్పందం ప్రకారం ఇప్పుడు వారికి ఒక గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి మార్గం ఏర్పడింది. ఆఖరికి ఈ 2020 కొత్త శతాబ్దపు ప్రారంభం , Bru Reang సముదాయపు ప్రజలకు ఒక కొత్త ఆశనూ, ఆశా కిరణాలనూ తీసుకువచ్చింది. దాదాపు 34000 Bru Reang శరణార్థులకు త్రిపురలో నివసాలు ఏర్పడతాయి. ఇంతేకాక, వారి పునర్నివాసానికీ, సంపూర్ణ అభివృధ్ధికీ కేంద్ర ప్రభుత్వం దాదాపు ఆరువందల కోట్ల రూపాయిల సహాయాన్ని కూడా ఇవ్వబోతోంది.

ప్రతి ఒక్క నిరాశ్రిత కుటుంబానికీ స్థలాలు మంజూరు చెయ్యబడతాయి. ఇళ్ళు కట్టుకోవడానికి సహాయం కూడా అందించబడుతుంది. దానితో పాటుగా వారికి అన్నసామాగ్రి కూడా ఇవ్వబడుతుంది. వారు ఇప్పుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల జన సంక్షేమ పథకాలలో భాగస్థులవుతారు. వాటిని ఉపయోగించుకోగలుగుతారు. ఈ ఒప్పందం ఎన్నో రకాలుగా ఎంతో ప్రత్యేకమైనది. Co-operative Federalism భావనని ఈ ఒప్పందం చూపెడుతుంది. ఈ ఒప్పందం కోసం మిజోరం, త్రిపుర, ఉభయ రాజ్యాల ముఖ్యమంత్రులూ హాజరైయ్యారు. ఈ ఒప్పందం ఉభయ రాష్ట్రాల ప్రజల ఒప్పుదల, ఇంకా అభినందనల వల్లనే సాధ్యపడింది. అందువల్ల నేను ఈ రెండు రాష్ట్రాల ప్రజలకూ, అక్కడి ముఖ్యమంత్రులకూ ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలుపుతున్నాను. ఈ ఒప్పందం భారతీయ సంస్కృతిలో నిక్షిప్తమైన కరుణా భావాన్ని, సహృదయతనీ ప్రకటితం చేస్తుంది. అందరినీ ’మనవారు’ అనుకోవడం, ఐకమత్యంతో జీవించడం, ఈ పుణ్యభూమి సంస్కారంలోనే ఇమిడి ఉంది. మరొక్కసారి ఈ ఉభయ రాజ్యాల ప్రజలకూ, Bru Reang సముదాయానికీ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను.

                                                                          

నా ప్రియమైన దేశప్రజలారా, ఖేలో ఇండియా గేమ్స్ లాంటి సఫలవంతమైన ఆటలపోటీలను నిర్వాహించిన అస్సాంలో మరొక పెద్ద పని జరిగింది. మీరు కూడా వార్తల్లో చూసే ఉంటారు. కొద్ది రోజుల క్రితం అస్సాంలో ఎనిమిది వేరు వేరు మిలిటెంట్ గ్రూప్ లకు సంబంధించిన 644 సభ్యులు తమ ఆయుధాలతో పాటూ లొంగిపోయారు. ఇంతకు ముందు హింసామార్గం వైపుకి వెళ్పోయినవారు తమ విశ్వాసాన్ని శాంతిమార్గం వైపుకి మళ్ళించి, దేశ అభివృధ్ధికి భాగస్వాములు అవ్వాలనే నిర్ణయాన్ని తీసుకుని, జనజీవన స్రవంతిలోకి వెనక్కు వచ్చారు. గత ఏడాది త్రిపురలో కూడా ఎనభై కంటే ఎక్కువ మంది హింసామార్గాన్ని విడనాడి, జనజీవన స్రవంతిలోకి తిరిగి వచ్చారు. హింసతోనే సమస్యలకు పరిష్కారాన్ని వెతకవచ్చు అనుకుని ఆయుధాలను పట్టుకున్నవారంతా; శాంతి, ఐకమత్యాల వల్లనే ఏ సమస్య అయినా పరిష్కారమౌతుంది. అదే ఏకైక మార్గం అని బలంగా నమ్మారు. దేశప్రజలారా, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదం చాలామటుకు తగ్గింది. దీనికి అతి పెద్ద కారణం ఏమిటంటే, ఈ ప్రాంతంతో ముడిపడి ఉన్న ప్రతి సమస్యనూ శాంతితోనూ, నిజాయితీ తోనూ, చర్చించి పరిష్కరించడం జరిగితోంది. ఇప్పుడు కూడా దేశంలో ఏ మూలనైనా హింస, అయుధాల ద్వారా సమస్యలకు సమాధానాలు వెతుకుతున్న వారితో ఇవాళ్టి పవిత్రమైన గణతంత్ర దినోత్సవ సందర్భంగా నేను అభ్యర్థించేది ఏమిటంటే, వారంతా జనజీవన స్రవంతిలోకి వెనక్కు రావాలని.
సమస్యలను శాంతిపూర్వకంగా పరిష్కరించడంలో తమ పైన, ఈ దేశ సామర్థ్యం పైనా నమ్మకం ఉంచాలని కోరుతున్నాను. జ్ఞాన విజ్ఞానాలు, ప్రజాస్వామ్య యుగమైన ఇరవై ఒకటవ శతాబ్దంలో మనం ఉన్నాము. హింస వల్ల జీవితాలు బాగుపడిన ప్రాంతం ఏదానా ఉందని మీకు తెలుసా అసలు? శాంతి, సద్భావాలు జీవితానికి ఆటంకాలుగా ఉన్న ప్రాంతం గురించి మీరెప్పుడైనా విన్నారా? ఏ సమస్యకూ హింస సమాధానం కాదు. ప్రపంచంలోని ఏ సమస్యకూ మరొక వేరే సమస్యను పుట్టించడం వల్ల పరిష్కారం లభించదు. సమస్యకు వీలయినన్ని సమాధానాలు వెతకడం వల్ల సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. రండి, మనందరమూ కలిసి, అన్ని ప్రశ్నలకూ శాంతిమార్గమే సమాధానం అయ్యేలాంటి నవ భారత నిర్మాణానికి నడుం కడదాం.                                                            

ఐకమత్యం ద్వారా ప్రతి సమస్యకూ సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ప్రతి విభజననూ, విభజన ప్రయత్నాలనూ మనలోని సోదరభావం నిర్వీర్యం చేయాలి.
నా ప్రియమైన దేశప్రజలారా, పవిత్ర గణతంత్ర దినోత్సవ సందర్భంగా గగన యాన్ మిషన్ గురించి చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. దేశం ఆ వైపుగా ముందుకు అడుగేస్తోంది. 2022 నాటికి మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75ఏళ్ళు పూర్తవుతాయి. ఈ సందర్భంగా మనం గగన్ యాన్ మిషన్ ద్వారా ఒక భారతీయుడిని అంతరిక్షం లోకి తీసుకువెళ్ళే మన సంకల్పాన్ని సాధించాల్సిఉంది. 21వ శతాబ్దపు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో "గగన్ యాన్" భారతదేశానికి ఒక చారిత్రాత్మక విజయం గా నిలుస్తుంది. ఈ ప్రయోగం భారతదేశానికి ఒక మైలురాయిగా నిలుస్తుంది.
మిత్రులారా, మీకు తెలిసే ఉంటుంది, ఈ మిషన్ లో వ్యోమగామి అంటే అంతరిక్ష యాత్రికులుగా నలుగురు అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగుతుంది. ఈ నలుగురు యువ భారతీయ వాయుసేన తాలూకూ పయలెట్లు. ఈ ప్రతిభావంతులైన యువకులు, భారతదేశ నైపుణ్యం, ప్రతిభ, సామర్థ్యం, సాహసం, ఇంకా భారతదేశ స్వప్నాలకూ ప్రతీకలు. మన నలుగురు మిత్రులూ, రాబోయే రోజుల్లో తమ శిక్షణ కోసం రష్యా వెళ్లబోతున్నారు. భారత రష్యా దేశాల మధ్య మైత్రీభావానికి, సహకారానికీ ఈ శిక్షణ మరొక సువర్ణావకాశంగా నిలుస్తుందని నాకు నమ్మకం. వీరికి ఒక ఏడాది పైగా శిక్షణ ఇవ్వబడుతుంది. ఆ తర్వాత భారతదేశ ఆశలనూ, ఆకాంక్షలనూ అంతరిక్షం దాకా తీసుకువెళ్ళాల్సిన బృహత్తర బాధ్యత వీరిలో ఒకరిపై ఉంటుంది. నేటి గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంలో ఈ నలుగురు యువకులకూ, ఈ మిషన్ తో ముడిపడిన భారత, రష్యా దేశపు శాస్త్రవేత్తలనూ, ఇంజనీర్లనూ నేను అభినందిస్తున్నాను.
నా ప్రియమైన దేశ ప్రజలారా, గత మార్చ్ లో ఒక వీడియో, మీడియాలోనూ ,సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశం అయ్యింది. చర్చ దేనిపైనంటే, 107 సంవత్సరాల ఒక వయోవృధ్ధురాలు,
రాష్ట్రపతి భవన వేడుకలలో ప్రోటోకాల్ ని దాటుకుని వచ్చి ఎలా రాష్ట్రపతిని ఆశీర్వ్దించగలదు? కర్నాతకలో వృక్ష మాత పేరుతో ప్రసిధ్ధి చెందిన ఆమె పేరు సాలూమరదా తిమ్మక్క. అవి పద్మ పురస్కారాల వేడుకలు.                               

చాల సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన తిమ్మక్క చేసిన అసాధారణ సేవను దేశం గుర్తించి, అర్థం చేసుకుని ఆమెకు తగిన గౌరవాన్ని ఇచ్చింది. ఆమెకు పద్మశ్రీ పురస్కారం లభించింది.
మిత్రులారా, నేడు భారతదేశం ఇటువంటి మహనీయులను చూసి గర్వపడుతుంది. భుమితో సంబంధం ఉన్న ఇటువంటి గొప్ప వారిని సన్మానించి దేశం గర్వపడుతుంది. ప్రతి ఏడాది లాగనే, నిన్నటి సాయంత్రం పర్మ పురస్కారాల ప్రకటన జరిగింది. మీరందరూ కూడా ఈ పురస్కార గ్రహీతలు అందరి గురించి తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. వీరందరూ చేసిన సేవా కార్యక్రమాల గురించి మీ కుటుంబంతో చర్చించాలని కోరుతున్నాను. 2020లో పద్మ పురస్కారాల కోసం 46 వేల అభ్యర్థనలు నమోదు అయ్యాయి. 2014తో పోలిస్తే ఈ సంఖ్య 20 రెట్లు కన్నా ఎక్కువే. ఈ సంఖ్య పద్మ పురస్కారాలు ఇప్పుడు people's award గా మారాయన్న ప్రజల నమ్మకాన్ని చూపెడుతుంది. పద్మ పురస్కారాల ప్రక్రియ అంతా ఇప్పుడు ఆన్లైన్ లోనే జరిగుతోంది. ఇంతకు ముందు కొద్దిమంది ప్రజల చేతుల్లో ఉండే ఈ నిర్ణయాలు ఇప్పుడు పూర్తిగా ప్రజల చేతుల్లో ఉంటున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, పద్మ పురస్కారాలను గురించి ఇప్పుడు ప్రజల్లో ఒక కొత్త నమ్మకం, గౌరవం ఏర్పడ్డాయి. ఈ పురస్కారాలను అందుకునే వ్యక్తులు అందరూ ఎలాంటివారంటే, పరిశ్రమతోనూ, కష్టంతో పైకి వచ్చినవారు. పరిమిత అవకాశాలతో, చుట్టుపక్కల ఉన్న చీకటిని చీల్చుకుని ముందుకు నడిచినవారు. ఒక రకంగా చెప్పాలంటే వారి బలమైన ఇఛ్చాశక్తి, సేవా భావన, నిస్వార్థ భావం, మనందరికీ ప్రేరణాదాయకం. పద్మ పురస్కార గ్రహీతలందరికీ నేను మరోసారి అభినందనలు తెలుపుతున్నాను. మీరంతా కూడా వీరి గురించి చదివి, వారి గురించి వీలయినంత ఎక్కువ సమాచారాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వారి జీవితాల గురించిన అసాధారణ కథనాలు సమాజానికి సరైన మార్గంలో ప్రేరణను ఇవ్వగలవు.
నా ప్రియమైన దేశప్రజలారా, మరోసారి గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు. ఈ దశాబ్దం అంతా మీ జీవితాలలో, భారతదేశ చరిత్రలో కొత్త సంకల్పాలు ఏర్పడాలనీ, అవి నెరవేరాలనీ కోరుతున్నాను.

                                                                              

ప్రపంచం భారతదేశం నుంచి ఏదైతే ఆశిస్తోందో, అవన్నీ సంపూర్ణం చేసుకునే సామర్థ్యం భారతదేశం సంపాదించుకోవాలి. ఇదే నమ్మకంతో రండి, కొత్త దశాబ్దపు ప్రారంభాన్ని ఆహ్వానిద్దాం. కొత్త సంకల్పాలతో, భరతమాత కోసం ఐకమత్యంతో కలసి ఉందాం. అనేకానేక ధన్యవాదాలు. నమస్కారం.

 

***

 



(Release ID: 1790061) Visitor Counter : 114