ప్రధాన మంత్రి కార్యాలయం
యూపీలోని బలరాంపూర్‌లో సరయూ కాలువ జాతీయ ప్రాజెక్టుకు ప్రధాని ప్రారంభోత్సవం
"జనరల్ బిపిన్ రావత్ మృతి ప్రతి భారతీయుడు.. ప్రతి దేశభక్తుడికీ తీరని లోటే”;
మనం కోల్పోయిన వీరుల కుటుంబాలకు దేశం యావత్తూ అండగా ఉంది;
“ఆలోచనల్లో నిజాయితీ ఉంటే.. పని కూడా పటిష్టమేననడానికి
సరయూ కాలువ జాతీయ ప్రాజెక్ట్ పూర్తికావడమే నిదర్శనం”;
“సరయూ కాలువ ప్రాజెక్టులో 5 దశాబ్దాలపాటు చేసినదానితో పోలిస్తే 5 ఏళ్లలోపే
ఎక్కువ పనులు చేశాం.. ఇదీ జోడు ఇంజన్ల ప్రభుత్వం.. పనుల్లో దాని వేగం”
Posted On:
11 DEC 2021 3:29PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో సరయూ కాలువ జాతీయ ప్రాజెక్టును ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- తొలుత భారత తొలి త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్‌కు నివాళి అర్పించారు. ఆయన మరణం ప్రతి భారతీయుడికీ, ప్రతి దేశభక్తుడికీ తీరని లోటేనని పేర్కొన్నారు. “దేశ బలగాలకు స్వావలంబన దిశగా జనరల్ బిపిన్ రావత్ గారు చేస్తూ వచ్చిన కృషికి దేశం మొత్తం సాక్షిగా ఉంది” అని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో బాధను అనుభవిస్తూ దేశం యావత్తూ విషాదంలో మునిగినప్పటికీ మనం మన వేగాన్ని లేదా పురోగమనాన్ని నిలువరించలేమన్నారు. ఆ మేరకు భారత్ ఆగే ప్రసక్తే లేదని, ముందడుగు వేస్తూనే ఉంటుందని చెప్పారు. త్రివిధ దళాల మధ్య సమన్వయ బలోపేతం సహా దేశ సాయుధ బలగాలకు స్వావలంబన కల్పించే కృషి నిరంతరం కొనసాగుతూనే ఉంటుందన్నారు.
రానున్న రోజుల్లో తన దేశం సరికొత్త సంకల్పాలతో ముందంజ వేయడాన్ని జనరల్ బిపిన్ రావత్ తప్పక చూస్తారని ప్రధాని పేర్కొన్నారు. దేశ సరిహద్దుల భద్రత మెరుగుకు కృషి, సరిహద్దు మౌలిక సదుపాయాల బలోపేతం చేసే కార్యకలాపాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా వాస్తవ్యుడైన గ్రూప్ కెప్టెన్ వరుణ్‌సింగ్ ప్రాణాలు రక్షించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారని ప్రధాని తెలిపారు. “ఆయన ప్రాణాలు కాపాడాలని ఈ సందర్భంగా పటేశ్వరి మాతను ప్రార్థిస్తున్నాను. దేశం యావత్తూ నేడు వరుణ్ సింగ్ గారి కుటుంబానికి, మనం కోల్పోయిన ఇతర వీరుల కుటుంబాలకూ అండగా ఉంది” అని ప్రధానమంత్రి అన్నారు.
దేశంలోని నదీ జలాలను సక్రమంగా సద్వినియోగం చేసుకోవడంతోపాటు రైతుల పొలాలకు సరిపడా నీరందించడం ప్రభుత్వ ప్రాథమ్యాలలో ఒకటని ప్రధానమంత్రి అన్నారు. ఆలోచనల్లో నిజాయితీ ఉంటే.. పని కూడా పటిష్టమేననడానికి సరయూ కాలువ జాతీయ ప్రాజెక్ట్ పూర్తి కావడమే నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమైనప్పుడు దీని అంచనా వ్యయం రూ.100 కోట్ల లోపేనని ప్రధాని వెల్లడించారు. కానీ, నేడు దాదాపు రూ.10 వేల కోట్లు వెచ్చించి పూర్తిచేయాల్సి వచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి దేశం ఇప్పటికే 100 రెట్లు అధికమూల్యం చెల్లించిందన్నారు. “సొమ్ము ప్రభుత్వానిది అయినప్పుడు నేనెందుకు పట్టించుకోవాలి? అనే ఆలోచనే దేశం సమతౌల్యంతోపాటు సర్వతోముఖాభివృద్ధికి అతిపెద్ద అవరోధంగా మారింది. ఈ ఆలోచన ధోరణి ఫలితంగానే సరయూ కాలువ ప్రాజెక్టు పనులు కూడా అర్థంతరంగా స్తంభించాయి” అన్నారు. అలాగే “సరయూ కాలువ ప్రాజెక్టుకు సంబంధించి 5 దశాబ్దాలలో చేసిన దానికన్నా ఐదేళ్ల లోపే ఎక్కువ పనులు చేశాం. ఇది జోడు ఇంజన్ల ప్రభుత్వం.. పనుల్లో దాని వేగం ఇలాగే ఉంటుంది.. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికే మేం మా ప్రాధాన్యమిస్తాం” అని ప్రధాని ప్రకటించారు.
చాలా కాలంనుంచీ స్తంభించిపోయిన బాన్ సాగర్ ప్రాజెక్టు, అర్జున్ సహాయక్ నీటిపారుదల ప్రాజెక్టు, ‘ఎయిమ్స్’, గోరఖ్‌పూర్‌లో ఎరువుల కర్మాగారం వంటి పనులన్నిటినీ ఈ జోడు ఇంజన్ల ప్రభుత్వం దిగ్విజయంగా పూర్తి చేసిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అలాగే కెన్ బెత్వా లింగ్ ప్రాజెక్టు కూడా ఈ ప్రభుత్వ అంకితభావానికి ఉదాహరణ అని పేర్కొన్నారు. గత మంత్రిమండలి సమావేశం సందర్భంగా రూ.45000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు ఆమోద ముద్ర పడిందన్నారు. నీటి సమస్య నుంచి బుందేల్‌ఖండ్ ప్రాంతానికి విముక్తి కల్పించడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. చిన్న రైతులను తొలిసారిగా ప్రభుత్వ పథకాలకు అనుసంధానిస్తున్నామని ప్రధాని చెప్పారు. ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, మత్స్య/పాడి పరిశ్రమ, తేనెటీగల పెంపకంతో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు, ఇథనాల్ సంబంధిత అవకాశాలు వంటి కొన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గడచిన నాలుగున్నరేళ్లలో రూ.12000 కోట్ల విలువైన ఇథనాల్‌ను ఉత్తరప్రదేశ్ నుంచే కొనుగోలు చేశామని ప్రధాని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం, జీరో బడ్జెట్ సాగు గురించి డిసెంబర్ 16న నిర్వహించే కార్యక్రమానికి రావాల్సిన రైతులను ప్రధాని ఆహ్వానించారు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా కుటుంబాలు ‘పీఎంఏవై’ కింద పక్కా గృహాలు పొందాయని, వాటిలో అధికశాతం ఆయా కుటుంబాల్లోని మహిళల పేరుమీదనే ఉన్నాయని తెలిపారు. స్వామిత్వ యోజన వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా ఆయన వివరించారు.
కరోనా కాలంలో పేదలు పస్తులతో పడుకోవాల్సిన దుస్థితి రాకుండా చిత్తశుద్ధితో కృషి చేశామని ప్రధాని చెప్పారు. ఇప్పటికీ ‘పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ కింద ఉచిత రేషన్ అందించబడుతోందని, ఈ పథకాన్ని హోలీ పండుగ తర్వాతి వరకూ పొడిగించామని తెలిపారు. లోగడ రాష్ట్రంలో మాఫియాకు రక్షణ ఉండేదని, నేడు ఆ మాఫియానే నిర్మూలిస్తున్న కారణంగా నేటి పరిస్థితులలో స్పష్టమైన తేడా కనిపిస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇంతకుముందు బలవంతులకే ప్రోత్సాహం లభించేదని, ఇవాళ యోగి గారి ప్రభుత్వం పేద, అణగారిన, వెనుకబడిన వర్గాలతోపాటు గిరిజనులకు సాధికారత కల్పించడంలో నిమగ్నమై ఉందని పేర్కొన్నారు. అందుకే పరిస్థితులలో స్పష్టమైన తేడా కనిపిస్తున్నట్లు యూపీ ప్రజలు అంటున్నారని తెలిపారు. లోగడ మాఫియా భూమి దురాక్రమణకు పాల్పడటం ఆనవాయితీ కాగా, నేడు యోగి గారి ప్రభుత్వం అలాంటి ఆక్రమణలపై బుల్డోజర్ నడుపుతున్నదని చెప్పారు. అందుకే తేడా తమకు స్పష్టంగా కనిపిస్తున్నట్లు యూపీ ప్రజలు అంటున్నారని ప్రధాని పునరుద్ఘాటించారు.
(Release ID: 1780627)
Visitor Counter : 177
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam